డీఎన్‌కే మూవీ రివ్యూ

DNK Telugu Movie Review

నటీనటులు: మౌళి తనుజ్ ప్రశాంత్, సుష్మితా శెట్టి, అలీ, రఘు బాబు, రజిత, ప్రియ, బబ్లూ, నందగోపాల్, భద్రం, గుండు సుదర్శన్, రమణ భార్గవ తదితరులు
దర్శకత్వం: శ్రీను కంబాల
సంగీతం: సింజిత్ ఎర్రమిల్లి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల తేదీ: నవంబర్ 13, 2026

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

90’s వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ హీరోగా నటించిన రెండో చిత్రం ‘దొంగ నా కొడుకు’ (సెన్సార్ నిబంధనలతో ‘డీఎన్‌కే’గా మార్చారు). అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహించారు. మౌళి గత విజయాల నేపథ్యంలో మంచి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:

ఈశ్వర్ (మౌళి) ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఖాళీగా తిరిగే ఒక బాధ్యతలేని యువకుడు. గుండు బాస్ (గుండు సుదర్శన్) వద్ద జ్యువెలరీ షాప్‌లో పని చేసే తండ్రి ఆదినారాయణ (అలీ), కొడుకును ప్రయోజకుడిగా చూడాలని ఆరాటపడుతుంటాడు. కానీ ఈశ్వర్ మాత్రం తండ్రి మాటలు పట్టించుకోకుండా, ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో పెడుతూ అప్పుల పాలవుతుంటాడు. ఆఖరికి తాను ప్రేమించిన దీప (సుష్మితా శెట్టి) ఉంగరాలను కూడా తాకట్టు పెట్టే స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో ఈశ్వర్ తన వ్యసనాల వల్ల ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు?జ్యువెలరీ షాప్‌లో జరిగిన భారీ దొంగతనం వెనుక అసలు నిజం ఏంటి? ఈశ్వర్ చివరకు తన తప్పును తెలుసుకుని తండ్రికి, ప్రేమించిన అమ్మాయికి ఎలా దగ్గరయ్యాడు? అనేదే మిగతా కథ.

విశ్లేషణ :

యూత్ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవడం, బాధ్యతలేని కొడుకు వల్ల తండ్రి పడే ఆవేదన అనే పాయింట్ చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.

సినిమా ప్రారంభం నుంచే మౌళి క్యారెక్టరైజేషన్, అతని సరదా వేషాలు, ఫ్రెండ్స్‌తో చేసే అల్లరితో కథ చాలా లైట్-హార్ట్‌గా మొదలవుతుంది. తండ్రీకొడుకుల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. హీరోయిన్ దీపతో లవ్ ట్రాక్, ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల ఎదురయ్యే చిన్నపాటి ఇబ్బందులతో ఫస్టాఫ్ డీసెంట్‌గా, టైమ్ పాస్ అయ్యేలా సాగుతుంది. ఇంటర్వెల్ వద్ద కథ ఒక కీలక మలుపు తిరుగుతుంది.

ఇంటర్వెల్ తర్వాత కథలో ఎమోషన్, డ్రామా పెరుగుతాయి. అయితే ఫస్టాఫ్‌లో ఉన్న ఫన్ సెకండాఫ్‌లో కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. హీరో చేసిన తప్పుల వల్ల వచ్చే పరిణామాలు, తండ్రి సెంటిమెంట్ సన్నివేశాలు కాస్త రొటీన్‌గా సాగుతాయి. కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించడం, ఊహించదగ్గ మలుపులు ఉండటంతో కథనం కాస్త నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లోనే ముగుస్తుంది.

నటీనటుల పనితీరు:

మౌళి తనుజ్ ప్రశాంత్ మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. పక్కింటి కుర్రాడిలాంటి బాడీ లాంగ్వేజ్, ఈజీ కామెడీ టైమింగ్‌తో ఈశ్వర్ పాత్రలో ఒదిగిపోయాడు. హీరో స్నేహితుడి పాత్రలో బబ్లూ మంచి సపోర్టింగ్ రోల్ పోషించాడు; మౌళి, బబ్లూల మధ్య వచ్చే కామెడీ సీన్లు బాగానే వర్కవుట్ అయ్యాయి. హీరోయిన్ సుష్మితా శెట్టి తన పరిధి మేరకు అందంగా, సహజంగా నటించింది. తండ్రి పాత్రలో సీనియర్ నటుడు అలీ అనుభవం తెరపై స్పష్టంగా కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన మెప్పించారు. గుండు సుదర్శన్, భద్రం, రఘు బాబు తమ కామెడీతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు శ్రీను కంబాల ఎంచుకున్న పాయింట్ నేటి తరం యువతకు కనెక్ట్ అయ్యేదే అయినా, కథనంలో మరింత కొత్తదనం చూపించి ఉంటే బాగుండేది. ఫస్టాఫ్‌ను డీసెంట్‌గా నడిపించిన ఆయన, సెకండాఫ్‌లో రొటీన్ డ్రామా వైపు వెళ్లారు. సింజిత్ ఎర్రమిల్లి అందించిన పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో మరికొంత కత్తెర వేయాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్‌గా ఉన్నాయి.

మొత్తంగా చూస్తే డీఎన్‌కే అంచనాలను అందుకొని మౌళి నటన ,కామెడీ సన్నివేశాల కోసం చూడదగ్గ ఒక డీసెంట్ వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వెళ్తే వీకెండ్‌లో సరదాగా టైమ్ పాస్ చేయవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.