నటీనటులు: సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్, క్లింటన్ సెరెజో
సినిమాటోగ్రఫీ: మృదుల్ సుజిత్ సేన్
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
నిర్మాణం: ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్
నిర్మాత: సమంత
దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఓ వైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘శుభం’. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె కూడా ఓ అతిథి పాత్రలో మెరిశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ సహా ఈ మూవీ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో శుభం సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకువచ్చింది.
అయితే స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకున్న సమంత, ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మొదటి సినిమాతో విజయం అందుకున్నారా? ప్రవీణ్ కండ్రేగుల తన దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? కొత్త ట్యాలెంట్‌ని ప్రోత్సహించడమే ధ్యేయంగా నిర్మాతగా మారిన సమంత.. ఈ ప్రయత్నంలో ఎంతమేరకు సఫలమయింది? వంటివి తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
2000 దశకంలో అప్పుడప్పుడే పల్లెల్లోకి DTH లు వస్తోన్న కాలం. విశాఖపట్నం లోని భీమిలి ప్రాంతంలో శ్రీనివాస్ (హర్షిత్ ఆర్) కేబుల్ టీవీ నడిపిస్తుంటాడు. ఫ్రెండ్స్ (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి) లతో సరదాగా గడుపుతుంటాడు. అయితే మరోవైపు డిష్ కుమార్ (వంశీధర్ గౌడ్) శ్రీనివాస్ వ్యాపారానికి పోటీగా గ్రామాల్లోకి DTH లను అలవాటు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో సినివాస్ తల్లిదండ్రులు సెట్ చేసిన పెళ్లి సంబంధానికి ఓకే చెప్పి శ్రీవల్లి (శ్రియా కొంతం)ని పెళ్లి చేసుకుంటాడు.
అయితే మొదటిరాత్రి రోజు సరిగ్గా 9 గంటలకి ఓ సీరియల్ చూస్తూ దయ్యం పట్టినట్టుగా ప్రవర్తిస్తుంది శ్రీవల్లి. దీంతో బెంబేలెత్తిన శ్రీనివాస్ బయటకి వచ్చి చూసేసరికి, ఈ సమస్య తనకే కాదు తన ఫ్రెండ్స్ కి కూడా జరుగుతుందని అర్ధమవుతుంది. వారి భార్యలు ఫరీదా (షాలిని కొండెపూడి), గాయత్రి (శ్రావణి లక్ష్మి)లు కూడా ఇలాగే వింతగా ప్రవర్తిస్తుంటారని తెలుసుకుంటాడు. ఆ తర్వాత వీరితోపాటు ఆ ఊరిలోని ఆడవాళ్ళంతా ఇదేమాదిరిగా వ్యవహరించడం గమనిస్తారు.
రాత్రి 9 అయ్యేసరికి టీవీలో ఈ సీరియల్ ప్రసారం అవుతుండగా.. ఆ టైమ్‌కి ఇళ్లల్లోని ఆడవాళ్లంతా వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. సంవత్సరాల తరబడి నడిచే ఈ సీరియల్‌కి భీమిలిలో ఉండే ఆడావాళ్లంతా అడిక్ట్ అయిపోతారు. ఈ క్రమంలో కొందరు క్లైమాక్స్ చూడకుండానే చనిపోతారు. దీంతో మరణించిన ముసలమ్మల ఆత్మలు సీరియల్స్ చూసే వాళ్ల ఇళ్లల్లోని మహిళల్లోకి ప్రవేశిస్తుంటాయి.
ఆ సీరియల్ చూసే టైమ్‌లో వారిని ఎవరైనా డిస్ట్రబ్ చేసినా, ఛానల్ మార్చినా, లేదా టీవీలు ఆఫ్ చేయాలని చూసినా.. మగాళ్లని ఇరగ కొడుతుంటారు ఆడవాళ్లు. దీంతో ఊరిలోని మగవాళ్ళంతా రాత్రి అయితే చాలు, బిక్కచచ్చిపోతుంటారు. ఈ తరుణంలో తమ సమస్యకు మాయ మాతా శ్రీ (సమంత) ఒక్కతే పరిష్కారం చూపగలదని ఆమెని ఆశ్రయిస్తారు మగవారు.
అయితే వీరి సమస్యకి మాయ ఎలాంటి పరిష్కారం చూపింది? ఇంతకూ ఆ సీరియల్ ఏంటి? అందులో ఏం ఉంటుంది? దయ్యాలు మహిళలను వదిలాయా లేదా? సీరియల్ వల్ల గ్రామంలో సతమతమవుతున్న వారి కాపురాలను ఏ విధంగా నిలబెట్టింది? ఆ సీరియల్‌కి ఏ విధంగా ‘శుభం’ కార్డ్ పడింది? చివరికి ఏం జరిగింది? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ:-
శుభం సినిమా కథ పరంగా చూస్తే కొంచెం కొత్తగానే వుంటుంది. అలాగని ఇంతకుముందెప్పుడూ చూడని సబ్జెక్ట్ ఏం కాదు. ఇలాంటి చిత్రాలను మనం చూసే ఉన్నాం. అయితే ఇక్కడే దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తన ట్యాలెంట్ చూపించాడు. కథకి బిగువైన కథనాన్ని జోడించాడు. తద్వారా మూవీ ఎక్కడా గాడి తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. చెప్పాలనుకున్నదానిని ఎలాంటి తడబాటు లేకుండా కథని నడిపించిన విధానం ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది.
సినిమా ప్రారంభంలో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్‌కి కొంచెం సమయం తీసుకున్నాడు దర్శకుడు. అయితే ఒక్కసారి పాత్రల పరిచయం అయిన తర్వాత కథ ఎక్కడా ఆగకుండా పరుగెడుతుంది. తొలిభాగం మొత్తం హిలేరియస్ గా వుంటుంది. ప్రతిరోజూ ఒకేసమయానికి ఊరిలోని ఆడవారంతా వింతగా ప్రవర్తిస్తుండటం, మగవారు భయపడి పరుగెత్తడం వంటి సీన్స్ అలరిస్తాయి. ఇక సెకండాఫ్ మరింత ఫన్ మోడ్ లో సాగుతుంది. క్లైమాక్స్‌లో ఒక మంచి మెసేజ్‌తో ముగుస్తుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. సమంత ఎంత గొప్ప నటో అందరికీ తెలిసిందే. ఇందులో ఆమె అతిథి పాత్రలో తళుక్కుమంది. తెరపై ఉండేది కొద్దిసేపే అయినా తన నటనతో కట్టిపడేసింది. సహజమైన నటనతో ఆడియెన్స్ మదిని దోచుకుంది సమంత. కథ అంతా హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షాలిని కొండేపూడి పాత్రల చుట్టూ తిరుగుతుంది. వీరితోపాటు వంశీధర్ గౌడ్ కూడా డీసెంట్‌గా నటించారు.
ఇక టెక్నికల్ పరంగా చూస్తే శుభం సినిమా ఉన్నతంగా వుంది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్ సంగీతం అందించడం గమనార్హం. ఇలాంటి కథలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ప్రధానమో తెలిసిందే. అందుకు అనుగుణంగానే వివేక్ సాగర్ అద్భుతమైన బీజీఎమ్ అందించగా.. క్లింటన్ సెరెజో కంపోజ్ చేసిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
అలాగే మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ మూవీకి మరో ఎస్సెట్. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది. ఇంకా ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉండి సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా చేసింది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా వున్నాయి. స్టోరీకి అవసరమైన మేరకు ఖర్చు పెట్టడానికి మేకర్స్ ఎక్కడా రాజీపడలేదని అర్ధమవుతుంది. పెట్టిన ప్రతి రూపాయి తెరపైన కనిపిస్తుంది.
ఓవరాల్‌గా శుభం సినిమా కమర్షియల్ ఫార్మాట్‌లో సాగే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. అయితే ఇది కేవలం యూత్ అనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం మెప్పించేలావుంది. ఈ సినిమాతో నిర్మాతగా సమంత సక్సెస్ అందుకున్నట్టే. అలాగే డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల సైతం హిట్ కొట్టాడని చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























