రివ్యూ: జనక అయితే గనక

Janaka Aithe Ganaka Movie Review in Telugu

నటీనటులు: సుహాస్‌, సంగీర్త‌న, రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: కోదాటి పవన్‌ కల్యాణ్‌
నిర్మాణం: దిల్‌రాజు ప్రొడక్షన్స్‌
నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి
దర్శకత్వం: సందీప్‌ రెడ్డి బండ్ల

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ సుహాస్‌ ప్రధానపాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’. దిల్‌రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మార్కెట్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

ఈ నేపథ్యంలో ద‌స‌రా కానుకగా ‘జనక అయితే గనక’ నేడు విడుద‌లయింది. అయితే ఈ సినిమాతో సుహాస్ మరో హిట్ అందుకున్నాడా? కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినాసరే పెద్ద హిట్ అవుతుంది అని భావించే నిర్మాత దిల్ రాజు నమ్మకం నిజమైందా? ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

కథానాయకుడు ప్రసాద్ (సుహాస్‌) ఒక మిడిల్ క్లాస్ యువ‌కుడు. జీవితం పట్ల భయంతోపాటు మంచి క్లారిటీ కలిగివుంటాడు. ఏదయినా ఖర్చు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే మధ్యతరగతి వ్యక్తిత్వం. ఈ క్రమంలో అతడికి హీరోయిన్ (సంగీర్తన)తో పెళ్లి అవుతుంది. అతని నెలవారీ సంపాదన రూ. 30,000గా ఉంటుంది.

అయితే ప్రతిదానికీ అతిగా ఆలోచించే హీరో, పిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువవుతాయనే ఉద్దేశంతో ఏకంగా పిల్లలే వద్దనుకుంటాడు. ఎందుకంటే..? అతను తన పిల్లలకు ప్రతి విషయంలో ఉత్తమమైన వాటిని ఇవ్వాలని అనుకుంటాడు. కానీ, తనకు వచ్చే సంపాదనతో అది అసాధ్యం కనుక పిల్లలను కనకూడదని నిర్ణయించుకుంటాడు.

దీని గురించి భార్య (సంగీర్తన విపిన్)తో చర్చించి తనని కూడా అందుకు ఒప్పిస్తాడు. ఆమె అతడి ఆలోచనలను అర్థం చేసుకుంటుంది. అయితే అతడి నిర్ణయం ఇంట్లో వాళ్ళని షాక్‌కి గురిచేస్తుంది. అతడి తల్లిదండ్రులు, బామ్మ సహా అందరూ వీరికి పిల్లలు కలగాలని కోరుకుంటుంటారు. ఈ విషయమై హీరోకి నచ్చచెబుతుంటారు. అయితే వారి మాటలను అతడు పట్టించుకోడు.

ఇదిలా సాగుతుండగా, ఒకరోజు స‌డెన్‌గా అత‌డి భార్య తాను గ‌ర్భ‌వ‌తినని చెబుతుంది. దీంతో హీరో అవాక్కవుతాడు. పిల్లలు కలుగకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలా జరగడం అతడిని ఆందోళనకు గురిచేస్తుంది. తీవ్రంగా ఆలోచించిన పిమ్మట దీనికి కారణం తాను వాడిన కండోమ్ అని, దాని వ‌ల‌నే ఇలా అయ్యిందని తనకు తానే ఒక నిర్ధారణకు వస్తాడు.

ఆ కోపంతో నాసిర‌కం కండోమ్‌ల‌ను స‌ప్ల‌య్ చేస్తోందంటూ ఆ కంపెనీపై కేసు పెడ‌తాడు. అయితే హీరో ఆరోపణలో నిజమెంత? ఈ కేసు హీరో జీవితంలో ఎలాంటి మలుపు తీసుకువ‌చ్చింది? అసలు ఆ కేసు గెలిచాడా? లేదంటే భార్య చెప్పిందే నిజమవుతుందా? చివరకు ఏమైంది? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

ఇటీవల వరుస హిట్స్ మీదున్న సుహాస్ మరోసారి కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రంలో నటించి మెప్పించాడని చెప్పొచ్చు. కథలో సెన్సిబుల్ పాయింట్ ఉన్నా.. చెప్పాలనుకున్న విషయాన్ని దర్శకుడు సందీప్‌ రెడ్డి బండ్ల ఎక్కడా తడబడకుండా చెప్పడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. చాలా సున్నితమైన అంశాన్ని ఎలాంటి వల్గారిటీ లేకుండా డీల్ చేయడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం.

సినిమా ప్రారంభం లోనే కథానాయకుడి పాత్ర తీరుతెన్నులను పరిచయం చేశాడు దర్శకుడు. అక్కడినుంచి చూసే ప్రేక్షకుడు కూడా అతడితో ప్రయాణం చేస్తుంటాడు. అతడు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. హీరో పిల్లలు వద్దనుకున్న తర్వాత ఆ విషయాన్ని భార్యకు చెప్పడం, ఆ తర్వాత ఇతర కుటుంబ సభ్యులకు తెలియజేయడం, ఫస్ట్‌ హాఫ్‍ అంతా ఇలా ఫన్నీ సన్నివేశాలతో నడుస్తుంది.

అలా సరదాగా సాగుతున్న కథ ఇంటర్వెల్‌ సమయానికి ఒక సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌తో సెకండాఫ్‍పై ఆసక్తి క్రియేట్ చేస్తుంది. తన సమస్యకు కారణమైన కంపెనీపై హీరో కేసు వేయడంతో కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఆ తర్వాత నుంచి ఇరువురి మధ్య కోర్టులో వాదోపవాదాలు, ఈ క్రమంలో హీరో తరపున వాదించే లాయర్‌గా వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ గా ఉంటాయి. ఇక క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఓ ట్విస్ట్‌తో ముగుస్తుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే, సుహాస్ గురించి ప్రేక్షకుల్లో ఒక ఫీల్ గుడ్ భావన ఉంది. దీనికి కారణం ఇప్పటివరకూ అతను చేసిన సినిమాలే. నటనలో ఈజ్‌తో పాటు తనకి నప్పే కథలను జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇదేకోవలో తాజాగా ఈ సినిమా కూడా అతని కథల ఎంపికలో ఉండే వైవిధ్యత ఏంటో మరోసారి నిరూపించింది.

ఈ సినిమాలో సుహాస్‌ని చూస్తుంటే మనకి హీరోలా అనిపించడు. మన పక్కింటి అబ్బాయి లాగా, నిజమైన ఒక మధ్య తరగతి కుర్రాడిలాగా అనిపిస్తాడు. తన పాత్రలో అంత సహజంగా ఒదిగిపోయాడు. హాస్య సన్నివేశాల్లో ఎంతగా నవ్వించాడో.. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అంతే బాగా నటించాడు. ఈ చిత్రం తనకి బెస్ట్ మూవీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ఇక హీరోయిన్ సంగీర్తన తన పాత్రకు న్యాయం చేసింది. కథ ప్రకారం, ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా ఉన్నంతలో బాగా నటించింది. లాయర్ పాత్రలో వెన్నెల కిషోర్, జడ్జి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ తమ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ఇక సుహాస్ తండ్రి పాత్రలో గోపరాజు రమణ, బామ్మ పాత్రలో తెనాలి శకుంతల నటన అలరిస్తుంది. అలాగే మురళీశర్మ, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి తమ పాత్రల పరిధిమేరకు బాగా నటించారు.

ఇక టెక్నిషియన్స్ విషయానికొస్తే.. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. మూవీ విడుదలకు ముందే ‘నా ఫెవరేట్ నా పెళ్ళామే’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానితోపాటు మిగిలిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది.

అలాగే కోదాటి పవన్‌ కల్యాణ్‌ ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టిన ఫీల్ కలుగజేయనీయదు. ఇక దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ నుండి వచ్చే చిత్రం అంటే నిర్మాణం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. ఈ సినిమా నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. చిన్న సినిమానే అయినా ఖర్చుకు ఎక్కడా రాజీపడలేదని అర్ధమవుతుంది.

ఓవరాల్‌గా జనక అయితే గనక ఆడియెన్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం అని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌లో వుంటూనే ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో సాగుతుంది. ముఖ్యంగా ఫామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మొత్తానికి ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.