కాలం చాలా విచిత్రమైంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు కూడా నిన్న మొన్నటి జ్ఞాపకాలుగా కళ్ల ముందు కదలాడుతాయి. అరే..! ఇది జరిగి అప్పుడే పాతికేళ్లు అయిపోయిందా? పదేళ్ళు గడిచిపోయాయా ? అనిపిస్తుంది. ఎవరి కెరీర్ లోనైనా, ఏ విషయంలో నైనా పదేళ్లు, ఇరవై ఏళ్లు , పాతికేళ్లు, యాభై ఏళ్ళు అనేవి ల్యాండ్ మార్కింగ్ ఇయర్స్ గా మిగిలిపోతాయి. కాలగర్భంలో కలిసిపోయిన ప్రతి సంవత్సరము ఎవరో ఒకరికి ఒక ల్యాండ్ మార్కింగ్ ఇయర్ గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో 2019 టాలీవుడ్ కు చెందిన చాలా మంది ప్రముఖులకు “ల్యాండ్ మార్కింగ్ ఇయర్” గా చరిత్రలో నిలిచిపోతుంది.
చరిత్రలో రికార్డ్స్ పర్పస్ గానే కాకుండా ఆయా వ్యక్తుల సుదీర్ఘ ప్రస్థానంలో మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయే ఆ “లాండ్ మార్కింగ్” వివరాలు, విశేషాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్టీ రామారావు:
* ఈ “ల్యాండ్ మార్కింగ్” విశేషాల వివరణకు వస్తే ముందుగా తలుచుకోవాల్సింది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావును. ఎందుకంటే ఈ సంవత్సరంతో ఆ మహానటుడి నట జీవిత ప్రస్థానం 70 వసంతాలు పూర్తి చేసుకుంటుంది.1949 నవంబర్ 24న విడుదలైన “మనదేశం” చిత్రంతో “ఎన్టీ రామారావు” నట జీవితం ప్రారంభమైంది. అంటే 2019 నవంబర్ 24 కు ఆ నట సార్వభౌముడు తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఏడు దశాబ్దాలు పూర్తవుతుంది.
ఇది వ్యక్తిగతంగా ఆ అభినయ ఘనాపాటికే కాదు.. యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకే ఒక ల్యాండ్ మార్కింగ్ డే అండ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. అలా 1949 లో “మన దేశం” చిత్రంతో ప్రారంభమమై
” 1993 అక్టోబర్ 21న విడుదలైన “శ్రీనాథ కవిసార్వభౌమ” చిత్రంతో ముగిసింది ఎన్టీ రామారావు సుదీర్ఘ నట జీవితం ప్రస్థానం.
శోభన్ బాబు:
* అందాల నటుడు శోభన్ బాబు నట జీవితానికి ఇది షష్టిపూర్తి సంవత్సరం. ఆయన వెండితెరకు పరిచయమైన తొలి చిత్రం “భక్త శబరి” అయినప్పటికీ ముందుగా రిలీజైన చిత్రం “దైవ బలం”.1959 సెప్టెంబర్ 17న విడుదలైన దైవ బలం చిత్రంలో ఎన్టీ రామారావు తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ప్రారంభమైన శోభన్ బాబు నట జీవితం 1996లో విడుదలైన “హలో గురు” చిత్రంతో ముగిసింది.2019 కి అందాల శోభన్ బాబుతో తెలుగువారి అనుబంధానికి 60 ఏళ్లు పూర్తవుతాయి.
ఆలీ:
* 1979 ఏప్రిల్ 12న విడుదలైన “ప్రెసిడెంట్ పేరమ్మ” చిత్రంతో “ఆలీ” బాల నటుడిగా పరిచయమై 40 ఏళ్లు పూర్తి అవుతుంది. అలాగే 1994 ఏప్రిల్ 28న ఆలీ హీరోగా నటించిన “యమలీల”చిత్రం విడుదలైంది. అంటే బాల నటుడిగా, హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా రెండు ల్యాండ్ మార్కింగ్ విక్టరీ లను సొంతం చేసుకున్నారు ఆలి.
జగపతిబాబు:
* శోభన్ బాబు తరువాత అతివల మనసు దోచుకున్న అందాల హీరోగా, ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరోగా
ప్రసిద్ధి పొందిన జగపతిబాబు కెరీర్ కు 2019 తో మూడు దశాబ్దాలు పూర్తి అవుతాయి.1989 ఫిబ్రవరి (డేట్ ?) లో విడుదలైన “సింహ స్వప్నం” తో ప్రారంభమైన జగతిబాబు సినీ కెరీర్ 2019 తో 30 వసంతాలను పూర్తి చేసుకుంది. హీరోగా వరుస పరాజయాలను ఎదుర్కొన్న జగపతిబాబు కు “శుభలగ్నం”చిత్రంతో శుభ ఘడియలు ప్రారంభమవగా అప్పటినుండి రెండున్నర దశాబ్దాలపాటు హీరోగా ఒక వెలుగు వెలిగి గత ఐదేళ్ల నుండి ప్రతినాయక పాత్రలను కూడా స్వాగతిస్తూ విజయవంతమైన నట జీవితాన్ని కొనసాగిస్తున్నారు జగపతిబాబు.
రామ్ గోపాల్ వర్మ:
* “శివ” చిత్రంతో సంచలన దర్శకుడు గా ప్రభంజన విజయాన్ని సాధించి దర్శక ప్రపంచంలోనే ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన రాంగోపాల్ వర్మ సినీ జీవితానికి ఈ సంవత్సరంతో మూడుపదులు నిండాయి. ఈయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం శివ 1989 అక్టోబర్ 5న విడుదల అయింది. అప్పటినుండి తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ సృష్టిస్తున్న ” రచ్చ రంబోలా ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్త గా చెప్పవలసింది ఏమీ లేదు. సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచే రామ్ గోపాల్ వర్మ మూడు దశాబ్దాల విజయవంతమైన, సంచలనాత్మకమైన, వివాదాస్పదమైన కెరీర్ ను కొనసాగించటం అభినందనీయం.
మహేష్ బాబు:
బాల నటుడిగా 1979లో విడుదలైన “నీడ” చిత్రం నుండి చూసుకుంటే మహేష్ బాబు కెరీర్ కు 2019 తో
4 దశాబ్దాలు పూర్తవుతాయి. అలా కాకుండా కేవలం హీరోగా చూసుకుంటే 1999 జులై 30న విడుదలైన “రాజకుమారుడు” తో 20 వసంతాల నిలువెత్తు హీరోయిజం కళ్ల ముందు కదలాడుతుంది.20 సంవత్సరాలలో 25 చిత్రాలు పూర్తిచేసుకుని ద మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ సెన్సేషనల్ హీరోగా మహేష్ బాబు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. Most adorable Star గా, మోడల్ గా, నిర్మాతగా, ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగిన మహేష్ బాబు 20 వసంతాల కెరీర్ కు 2019 ని నిజమైన ల్యాండ్ మార్కింగ్ ఇయర్ గా చెప్పుకోవాలి. బాల నటుడిగా 79 లో, హీరోగా 99 లో, 25 చిత్రాల సిల్వర్ జూబ్లీ స్టార్ గా 2019లో… ఈ ఆరోహణ క్రమాన్ని చూస్తుంటే what a graph and what a success అనిపిస్తుంది కదూ! ఇక ఇక్కడి నుండి రెండు దశాబ్దాల ల్యాండ్ మార్కింగ్ ను చేరుకున్న ప్రముఖుల విశేషాలు చూద్దాం.
దేవి శ్రీ ప్రసాద్:
* ప్రస్తుతం తెలుగు చలన చిత్ర సంగీత ప్రపంచంలో ఒక ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడుతున్న సంగీత కెరటం “దేవి శ్రీ ప్రసాద్” విషయానికి వస్తే- 1999 మార్చి 12న విడుదలైన ” దేవి” చిత్రంతో సంగీత దర్శకుడిగా ప్రారంభమైంది దేవిశ్రీప్రసాద్ కెరీర్. ఈ రెండు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీత సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, నటుడిగా, ప్రోగ్రాం ఆర్గనైజర్ గా వెరసి ఒక మల్టీ టాలెంటెడ్ రాక్ స్టార్ గా ఎదిగారు దేవి శ్రీ ప్రసాద్.92 కు పైగా తెలుగు చిత్రాలకు, దాదాపు పాతిక తమిళ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వందలాది స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి the icon of music గా సంచలనం సృష్టిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ కు 2019 నిజంగా ఒక గొప్ప ల్యాండ్ మార్కింగ్ ఇయర్ గా నిలిచిపోతుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్:
* మాటల రచయితగా, దర్శకుడిగా తెలుగు సినిమా పోకడలో, ధోరణిలో సెన్సిటివ్ సెన్సేషన్స్ క్రియేట్ చేసిన సెన్సిబుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రైటర్ గా కెరీర్ ప్రారంభించి 2019 తో రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి.1999 ఏప్రిల్ 22న విడుదలయిన “స్వయంవరం” చిత్రంతో మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ ప్రారంభమైంది. మాటల రచనలో సరికొత్త పోకడలకు శ్రీకారం చుట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా కూడా అద్భుత విజయాలను అందిపుచ్చుకున్నారు. మాటల రచనలో ఒక వినూత్న ఒరవడిని సృష్టించినందుకు అభినందనపూర్వకంగా “మాటల మాంత్రికుడు” అని అభినందిస్తుంటే ఈ ప్రపంచంలో నాకు నచ్చని మాట ఏదైనా ఉంది అంటే నన్ను ” మాటల మాంత్రికుడు” అనటమే అంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ ఆ ప్రి ఫిక్స్ ను వాడకుండా ఆయన పేరు రాయటాన్ని ఒక అసంపూర్ణ పద ప్రయోగంగా ఫీల్ అయ్యేంతగా ప్రాచుర్యం పొందింది ఆ పదం. ఇలా మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ 2 దశాబ్దాల ప్రస్థానానికి ల్యాండ్ మార్కింగ్ ఇయర్ గా నిలుస్తుంది 2019.
సుమంత్:
మహానటులు అక్కినేని నాగేశ్వరరావు మనుమడుగా, అక్కినేని నాగార్జున మేనల్లుడుగా పరిచయమైన సుమంత్ నట జీవితానికి 2019 తో రెండు దశాబ్దాలు పూర్తి అవుతుంది.1999 ఏప్రిల్ 16 న విడుదలైన” ప్రేమ కథ” తో హీరోగా సుమంత్ కెరీర్ ప్రారంభమైంది. అయితే ప్రారంభ ముహూర్తం మంచిది కాదో… ప్రారంభ చిత్రం గొప్పగా లేకపోవటమో … కారణం ఏమైనప్పటికీ సుమంత్ కెరీర్ తన అర్హతకు, ప్రతిభకు, అందచందాలకు తగిన స్థాయిలో ఫ్లరిష్ కాకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.” సత్యం, మధుమాసం, గౌరీ, గోల్కొండ హై స్కూల్, మళ్లీ రావా వంటి మంచి చిత్రాలు తన కెరీర్ లో ఉన్నప్పటికీ కమర్షియల్ గా ఆశించిన స్థాయి విజయాలు తనను వరించలేదు. అయినప్పటికీ ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతున్న సుమంత్ 2019 తో 2 దశాబ్దాల కెరీర్ పూర్తిచేసుకోవటం అభినందనీయం.
శ్రీను వైట్ల-ఆర్.పి.పట్నాయక్-రవితేజ:
* ఒకే సినిమాతో ఒకే సంవత్సరంలో ముగ్గురి కెరీర్ మలుపు తిరిగిన అరుదైన సందర్భం 1999 డిసెంబర్ 3న జరిగింది. దర్శకుడిగా శ్రీనువైట్ల, సంగీత దర్శకుడుగా ఆర్ పి పట్నాయక్, సోలో హీరోగా రవితేజ లకు బ్రేక్ ఇచ్చిన చిత్రం “నీ కోసం” రిలీజ్ అయిన రోజది.2019తో 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ ముగ్గురు తమ తమ కెరీర్స్ లో అద్భుత విజయాలను చూశారు… అనూహ్య పరాజయాలను చూశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు కొంత మేరకు తిరోగమన స్థితిలో ఉన్నప్పటికీ ఈ ముగ్గురు వారి వారి ఎరీనాలలో టాప్ పొజిషన్స్ కు చేరుకోవడం అభినందనీయం.
* మరికొన్ని ల్యాండ్ మార్క్స్ :
*2004 మే 7న “ఆర్య” చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన “సుకుమార్” 2019 తో 15సంవత్సరాల ల్యాండ్ మార్క్ నుపూర్తిచేసుకుంటారు.
*2004 మార్చి 25న విడుదలైన ‘జై’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన “అనూప్ రూబెన్స్” 15 సంవత్సరాల కెరీర్ ను పూర్తి చేసుకుంటారు.
* 2004 ఆగస్టు 6న విడుదలైన ” దొంగ దొంగది” చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించిన “మంచు మనోజ్” 2019 తో 15 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకుంటారు.
* 2009 మే 8న విడుదలయిన “కిక్” చిత్రంతో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన “తమన్” 2019 తో 10 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకుంటారు.
* 2009 సెప్టెంబర్ 5న విడుదలైన ” జోష్” చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించిన “అక్కినేని నాగ చైతన్య” 2019 తో దశాబ్దకాల నట జీవితాన్ని పూర్తి చేసుకుంటారు.
* 2009 సెప్టెంబర్ 16న విడుదలైన “బాణం” చిత్రం ద్వారా హీరోగా కెరీర్ ప్రారంభించిన ” నారా రోహిత్” 2019 తో 10 వసంతాల నట జీవితాన్ని పూర్తి చేసుకుంటారు.
ఇవి – 2019లో ల్యాండ్ మార్క్ ను చేరుకున్న కొందరు సినీ ప్రముఖుల వివరాలు విశేషాలు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతలోనే ఇంత జరిగిపోయిందా!? ఇన్నేళ్లు గడిచిపోయాయా!?
అనిపిస్తుంది… అదే కాలమహిమ… తన ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేక, అందుకోలేక వెనుకబడిన వాళ్లను వెక్కిరించుకుంటూ ముందుకు వెళ్లే కాల ప్రవాహా ఉదృతి ముందు ప్రతి ఒక్కరూ ప్రణమిల్లక తప్పదు కదూ!?
[youtube_video videoid=l5V7Sqj-0dg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: