నటీనటులు : సుమంత్ ప్రభాస్ , నిధి ప్రదీప్ , జగపతి బాబు , రాజీవ్ కనకాల
సంగీతం : నాగవంశీ కృష్ణ
నిర్మాత : అభినవ్ రావ్
దర్శకత్వం : సుభాష్ చంద్ర
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మేం ఫేమస్ చిత్రంతో ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్, మూడేళ్ళ విరామం తర్వాత ‘గోదారి గట్టుపైన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎంఆర్ ప్రొడక్షన్స్‌లో షార్ట్ ఫిలిమ్స్ తీసిన సుభాష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, లైలా, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు.మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
రాజు (సుమంత్ ప్రభాస్) ఒక ఆటో డ్రైవర్. తన చెల్లెలి క్లాస్ మేట్ మాయ (నిధి ప్రదీప్)తో ప్రేమలో పడతాడు. మాయ తండ్రి శ్యాంబాబు (జగపతి బాబు) ఒక సెక్యూరిటీ గార్డ్. కూతురంటే ప్రాణమిచ్చే ఆయన వ్యక్తిత్వం చూసి ఊరి జనాలు భయపడుతుంటారు. ఈ క్రమంలో రాజుకు, మాయకు మధ్య ఏర్పడిన బంధం, పోలీసు కేసుల వరకు వెళ్లడం, శ్యాంబాబు తీసుకున్న నిర్ణయాల చుట్టూ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది. చివరకు రాజు, మాయ ఒక్కటయ్యారా ? అనేది మిగితా కథ.
విశ్లేషణ :
సినిమా మొదటి సగం అంతా చాలా ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా సాగుతుంది.గోదావరి తీరంలోని పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి యువకుల అల్లరిని దర్శకుడు చాలా సహజంగా చూపించారు. సుమంత్ ప్రభాస్ మరియు అతని స్నేహితుల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు థియేటర్‌లో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా హీరో ఆటో డ్రైవర్ అయినప్పటికీ, తనకున్న మెచ్యూరిటీ మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనతో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాడు. హీరోయిన్‌తో సాగే ప్రేమకథ కూడా సరదాగా సాగిపోతూ, ఒక ఆసక్తికరమైన మలుపుతో విరామం పడుతుంది.
రెండో సగంలో కథ కొంచెం సీరియస్‌గా మారుతుంది. ఇక్కడ వినోదం కంటే భావోద్వేగాలకు మరియు కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా జగపతి బాబు మరియు సుమంత్ ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే సంఘర్షణ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదించినట్లు అనిపించినా, క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ ఎమోషన్స్ బాగా పండాయి. చివరగా ఒక మంచి సందేశంతో సినిమా ముగుస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో అతిపెద్ద సర్ప్రైజ్ హీరో పాత్ర. సాధారణంగా సినిమాల్లో ఆటో డ్రైవర్లను మాస్ గా, అల్లరి చిల్లరగా చూపిస్తారు. కానీ ఇందులో రాజు చాలా సంస్కారవంతుడు, బాధ్యత గల వ్యక్తి. ఒక మర్యాదాపురుషోత్తముడిలా తన కుటుంబాన్ని, ప్రేమికురాలిని గౌరవించే విధానం నేటి యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉంది. ఇక ఈ పాత్రలో సుమంత్ ప్రభాస్ సహజంగా నటించాడు. గోదావరి యాస కూడా బాగానే పలికాడు. హీరోయిన్ గా చేసిన నిధి ప్రదీప్ తన పరిధి మేర చక్కగా నటించి మెప్పించింది.
జగపతి బాబు ఒక తండ్రిగా పండించిన భావోద్వేగాలు సినిమాకు ప్రాణం పోశాయి. తన కూతురి భవిష్యత్తు కోసం ఆరాటపడే ప్రతి తండ్రికి ఈ పాత్ర కనెక్ట్ అవుతుంది. లైలా, రాజీవ్ కనకాల వంటి నటులు తమ అనుభవంతో సినిమాకు నిండుదనం తెచ్చారు.సినిమాలో సుదర్శన్ రోల్ హైలైట్ గా నిలిచింది. తన కామెడీ సినిమాకు బిగ్ రిలీఫ్.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచింది. గోదావరి అందాలను ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా చూపించారు. అలాగే ‘బంగారు బొమ్మ’ వంటి పాటలు వినడానికి, చూడటానికి చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా క్వాలిటీ గా సినిమాను నిర్మించారు.
మొత్తంగా చెప్పాలంటే, ఎటువంటి అశ్లీలత లేని ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. పల్లెటూరి వాతావరణాన్ని, స్వచ్ఛమైన ప్రేమను, కుటుంబ విలువలను ఇష్టపడే వారు ఈ సినిమాను ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. ఒక ఆహ్లాదకరమైన అనుభూతి కోసం ఈ వీకెండ్ లో చూడదగ్గ చక్కని చిత్రం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























