
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శృతి హాసన్, రుహానీ శర్మ, నాజర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, శ్వాసిక, ప్రవీణ్ తదితరులు.
దర్శకత్వం: పవన్ సాధినేని.
నిర్మాణం: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: సుజీత్ సారంగ్
ఎడిటింగ్: ప్రవీణ్ కే ఎల్
టాలీవుడ్లో ఎమోషనల్, ఇన్స్పిరేషనల్ కథలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. దర్శకుడు పవన్ సాధినేని, దుల్కర్ సల్మాన్, కొత్త నటి సాత్విక వీరవల్లి కలయికలో తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ థియేటర్లలోకి వచ్చింది. ఒక మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనే కలను, ఆమెకు వెన్నెముకలా నిలిచే భర్త ప్రయాణాన్ని అత్యంత నిజాయితీగా, హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కనీస వసతులు కూడా లేని మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి) చిన్ననాటి నుంచే అంతరిక్షంలోకి వెళ్లాలని, ఆస్ట్రోనాట్ కావాలని బలంగా కలలు కంటుంది. కష్టపడి చదివి పదో తరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచినప్పటికీ, కుటుంబ పరిస్థితుల రీత్యా ఆమెకు పెళ్లి చేస్తారు. కల్పన ఆశయాన్ని తెలుసుకున్న భర్త కృష్ణ (దుల్కర్ సల్మాన్), తన భార్య కలను ఎలాగైనా నిజం చేయాలని నిర్ణయించుకుని ఆమె కోసం ఏం చేశాడు? రాకెట్ ప్రయోగంలో ఎదురైన సవాళ్లు, ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అధినేత రోహిణి (శృతి హాసన్) ఎంట్రీ, గుజరాతీ అమ్మాయి బిజిలీ (రుహానీ శర్మ) పాత్రలు కథను ఎలాంటి మలుపులు తిప్పాయి? చివరకు కల్పన అంతరిక్ష కల నెరవేరిందా లేదా అన్నదే మిగతా కథ.
విశ్లేషణ :
ఒక బలమైన, స్పష్టమైన కలను నెరవేర్చుకునే ప్రయాణాన్ని ఎంచుకున్న దర్శకుడు పవన్ సాధినేని, ఎక్కడా అనవసరపు మలుపులకు తావివ్వకుండా కథను హృద్యంగా మలిచారు. భావోద్వేగాలు, ఆశయాల మధ్య సమతూకం పాటిస్తూ, ప్రతి సన్నివేశంలోనూ ఆత్మవిశ్వాసం, నిజాయితీ కనిపించేలా కథనాన్ని నడిపించారు.
కల్పన నేపథ్యం, పెళ్లి, ఆమె కలను అర్థం చేసుకున్న కృష్ణ ఇచ్చే అండ చుట్టూ ప్రథమార్థం ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా అనిపించినా, కృష్ణ-కల్పన మధ్య బాండింగ్, తండ్రీకూతుళ్ల సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే మిషన్ ఫెయిల్యూర్ ఎపిసోడ్ సెకండాఫ్‌పై భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.
ద్వితీయార్థంలో కథ వేగం పుంజుకుంటుంది. శృతి హాసన్ పాత్ర ప్రవేశంతో కథలో కొత్త జోష్, ఎనర్జీ వస్తాయి. దుల్కర్, సాత్విక, శృతి హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, చివరి 20 నిమిషాల భావోద్వేగ సన్నివేశాలు, క్లైమాక్స్ ప్రేక్షకుల కళ్లను తడి చేస్తూ, చప్పట్లు, విజిల్స్ కొట్టించేలా ఉన్నాయి.
నటీనటుల పెర్ఫామెన్స్ :
కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి, భార్య కల కోసం తపించే నిజాయితీ గల భర్తగా అద్భుతంగా నటించారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా కృష్ణ పాత్ర గురించి మాట్లాడుకునేలా ఆయన నటన నిలిచింది. ఈ చిత్రానికి అసలైన సర్ప్రైజ్, హైలైట్ సాత్విక వీరవల్లి. తొలి చిత్రమే అయినా ఎక్కడా తడబాటు లేకుండా, కల్పన పాత్రలోని అమాయకత్వం, పట్టుదల, ఆవేదనను అద్భుతంగా పలికించి దుల్కర్‌తో పోటీపడి నటించింది. శక్తివంతమైన పాత్రలో శృతి హాసన్ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో మెప్పించగా, రుహానీ శర్మ, నాజర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, శ్వాసిక తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం:
ప్రతి డిపార్ట్మెంట్ ఈ సినిమాకు బలంగా నిలిచింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. సుజీత్ సారంగ్ కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా, రిచ్‌గా చూపించింది. గుణ్ణం గంగరాజు, వసంత్ జుర్రుల స్క్రీన్‌ప్లే, మనసును హత్తుకునే డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం. ప్రవీణ్ కే ఎల్ ఎడిటింగ్, నిర్మాణ సంస్థల ప్రొడక్షన్ వాల్యూస్ ఈ ఎమోషనల్ జర్నీని ఉన్నతంగా నిలబెట్టాయి.
చివరగా కలలు కనడం, వాటిని నిజం చేసుకునేందుకు తోడుగా నిలబడటం అనే బలమైన సందేశంతో వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ ఒక అద్భుతమైన ఫీల్-గుడ్ ఎమోషనల్ డ్రామా. దుల్కర్, సాత్విక, శృతి హాసన్‌ల అద్భుత నటన, జీవీ ప్రకాష్ సంగీతం, సుజీత్ సారంగ్ విజువల్స్, పవన్ సాధినేని నిజాయితీతో కూడిన దర్శకత్వం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. కుటుంబ సమేతంగా తప్పక చూడాల్సిన అద్భుతమైన చిత్రమిది.









