ఆకాశంలో ఒక తార విడుదలకు రెడీ
Aakasamlo Oka Tara Completes Censor Formalities

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ విడుదలకు సంబంధించిన కీలక అడ్డంకిని అధిగమించింది. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో చిత్ర బృందం అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తూ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్, స్వాసిక, మురళీ శర్మ, రుహానీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వ్యోమగామి కావాలనే ఓ సాధారణ గ్రామీణ యువతి కలను సాకారం చేసే క్రమంలో జరిగే భావోద్వేగభరితమైన ప్రయాణంగా ఈ కథ సాగనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ మరియు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా, వైజయంతీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోవడంతో ఇక థియేట్రికల్ విడుదలకు రంగం సిద్ధమైంది. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 20న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.







