
నటీనటులు: విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్ మరియు గెస్ట్ రోల్స్‌లో దర్శకులు
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
నిర్మాత : సృజన్ యరబోలు
టాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి భాగాన్ని తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, మొదటి భాగం సృష్టించిన నవ్వుల సందడిని, స్నేహం, సినిమా కలల ప్రయాణాన్ని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. మరి ఈసినిమా ఎలా వుందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
జాబ్ వదిలేసిన వివేక్ (విశ్వక్ సేన్), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి), ఉప్పు/ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను), కౌశిక్ (అభినవ్ గోమఠం) కలిసి తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో నలుగురి మధ్య దూరం పెరుగుతుంది. ఆ వైఫల్యంతో వివేక్ బయటి ప్రపంచానికి దూరంగా ఉండగా, కార్తీక్ సినిమాటోగ్రాఫర్‌గా, కౌశిక్ నటుడిగా, ఉప్పు చిన్న చిత్రాల ఎడిటర్‌గా తమదైన దారిలో ప్రయాణిస్తుంటారు. మరోవైపు మెడిసిన్ చదువుతున్న కీర్తనకు సినిమాపై ఆసక్తితో కార్తీక్ దగ్గర అసిస్టెంట్‌గా చేరుతుంది. కీర్తనను ప్రేమిస్తున్న కార్తీక్, ఆమె తండ్రి డాక్టర్ రావు నిశ్చయించిన పెళ్లిని స్నేహితుల సాయంతో ఆపేస్తాడు. దీంతో ఆగ్రహించిన డాక్టర్ రావు, పెళ్లి ఖర్చులు తిరిగి చెల్లించాలని లేదంటే జైలుకు పంపుతానని గ్యాంగ్‌ను హెచ్చరిస్తాడు. ఆ డబ్బును సమకూర్చుకోవడానికి మళ్లీ ఒక్కటైన స్నేహితులు సర్వైవల్ థ్రిల్లర్ తీయడానికి థాయ్‌లాండ్ వెళ్తారు. అక్కడ ఎదురైన సవాళ్లు, గొడవలు, ఈగోలను దాటుకుని డాక్టర్ రావు పెట్టిన షరతును ఎలా పూర్తి చేశారు, స్నేహితుల విలువను వివేక్ ఎలా అర్థం చేసుకున్నాడు అన్నదే మిగతా కథ.
విశ్లేషణ :
తొలి భాగం తరహాలోనే ఇందులోనూ స్నేహం, సినీ ఆసక్తి, ఆశలు వంటి అంశాలకు హాస్యాన్ని జోడించి తెరకెక్కించారు తరుణ్ భాస్కర్. ప్రథమార్థం సరదా సన్నివేశాలు, పాత్రల తీరుకు తగ్గ సంభాషణలతో సాఫీగా సాగుతుంది. మధ్యలో కొత్త పాత్రలను తీసుకుంటూ, సినిమా తీయాలనే తపనతో ఆ బృందం చేసే అల్లరి, దాని వల్ల తలెత్తే సమస్యలతో ఫస్ట్ హాఫ్ వినోదాన్ని పంచుతుంది.
ద్వితీయార్థం కూడా అదే నవ్వులతో మొదలవుతుంది. అయితే కథ ముందుకు సాగుతున్న కొద్దీ కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదించిన భావన కలుగుతుంది. కొన్ని చోట్ల కథనం కొంత తడబడినట్టు అనిపించినా, వెంటనే వచ్చే హాస్య సన్నివేశాలు మళ్లీ ప్రేక్షకులను కథలోకి లాక్కొస్తాయి, దాంతో ఆ కొద్దిపాటి నెమ్మదితనం పెద్దగా భారంగా అనిపించదు. గెస్ట్ రోల్స్‌లో కనిపించిన దర్శకులు, వారి సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి.
నటీనటుల పనితీరు :
వివేక్‌గా విశ్వక్ సేన్, కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి, కౌశిక్‌గా అభినవ్ గోమఠం, ఉపేంద్రగా వెంకటేష్ కాకుమాను తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయారు. నలుగురు స్నేహితుల మధ్య ఉన్న సమన్వయం, కెమిస్ట్రీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచి, తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్ సహా ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే, వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు కథా వాతావరణానికి తగ్గట్టుగా ఉన్నాయి. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. మరోసారి స్నేహితుల మధ్య సరదా మాటలు, హాస్యంతో వినోదం పంచే ప్రయత్నంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్క్ చూపించారు.
స్నేహం, సినిమా కలలు, నవ్వించే సన్నివేశాల కలయికతో ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రేక్షకులకు సరదా వినోదాన్ని అందిస్తుంది. సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడా కథనం నెమ్మదించినా, స్నేహితుల గ్యాంగ్ చేసే సందడి, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ మెప్పిస్తుంది.
వీడియోస్







