విద్యాసాగర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా, రుక్సార్ దిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. ఎన్నో అంచనాల మధ్య ఆసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలే పెంచేసింది. మరి ఈసినిమా ఆ అంచనాలను అందుకుందా.. విశ్వక్ సేన్ కు మంచి హిట్ అందించిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ, కాదంబరి కిరణ్ తదితరులు
దర్శకత్వం.. విద్యా సాగర్
సమర్పణ.. బీవీఎస్ఎన్ ప్రసాద్
బ్యానర్..శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్
నిర్మాతలు.. బాపినీడు, సుధీర్
సంగీతం.. జయ ఫణి
సినిమాటోగ్రఫి.. పవి కె పవన్
కథ..
అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్) వయసు 30 దాటినా ఇంకా పెళ్లి అవ్వదు. తమ కులంలో అమ్మాయిలు దొరకడం లేదని, వేరే కులంలో ఉన్న అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అవుతాడు. అలా గోదావరి జిల్లా అమ్మాయి మాధవి (రుక్సార్ థిల్లాన్) తో పెళ్లి నిశ్చయమవుతుంది. నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అమ్మాయి ఇంటికి వెళతారు. మొదటి రోజు బస్ ప్రాబ్లమ్, ఆ తర్వాత కరోనా కారణంగా కర్ఫ్యూ వల్ల అర్జున్ తోపాటు కుటుంబసభ్యులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక అక్కడే ఉన్న అర్జున్ అమ్మాయికి దగ్గర అవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే పెళ్లికి ముందు అమ్మాయి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. అమ్మాయి ఎందుకు లేచిపోయింది? ఆ తర్వాత కూడా అమ్మాయి ఇంట్లో ఉండాల్సి రావడంతో అబ్బాయి ఫ్యామిలీ ఎలా ఫీల్ అయ్యింది? చివరికి, అర్జున్ కుమార్ ఏం చేశాడు? అతడికి పెళ్లి అయ్యిందా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ..
పెళ్లి అనే కార్యాన్ని మనం ఎంత పవిత్రంగా భావిస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. ఒకప్పుడు చాలా తక్కువ వయసులో పెళ్లిళ్లు జరిగేవి. రాను రాను పరిస్థితుల్లో మార్పులు రావడంతో పాతికేళ్లు దాటక పెళ్లిళ్లు జరిపేవారు. కాని ఇప్పుడు అలా కాదు. పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా యువత తన జీవితంలో సెటిల్ అయి పెళ్లిళ్లు చేసుకోవాలంటే చాలాటైమ్ పడుతుంది. అలా అని వారు సెటిల్ అయ్యేవరకూ ఏజ్ ఉంటుందా అంటే అది పెరిగిపోయి 30 ఏళ్లు దాటిపోతుంది. అందలోనూ నచ్చిన అమ్మాయి దొరకాలి.. అబ్బాయి దొరకాలి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన కథే ఈ సినిమా. మూడు పదుల వయసు దాటినా పెళ్లి కాని అబ్బాయిల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈసినిమాతో చూపించాడు డైరెక్టర్.
ఇక ఈమధ్య కొత్త కొత్త యంగ్ డైరెక్టర్లు తమ టాలెంట్ ను చూపించుకోవడానికి టాలీవుడ్ ఎలాగైతే అవకాశాలు అందిస్తూ ప్రోత్సహిస్తుందో అలాగే వాళ్లు కూడా తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇక దర్శకుడు విద్యాసాగర్ కు ఈ సినిమా డెబ్యూ అయినా కూడా చాలా చక్కగా ఈసినిమాను తెరకెక్కించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. క్యారెక్టర్లను మ్యానేజ్ చేయడంలో .. కథ బోర్ కొట్టకుండా కామెడీ సీన్స్ యాడ్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఒక క్లీన్ ఫ్యామిలీ సినిమాను చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బోల్డ్ గా మాట్లాడం కూడా విశ్వక్ సేన్ కు యూత్ లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక మొదటిసినిమాతోనే మంచి మాస్ హీరోగా పేరుతెచ్చుకున్న విశ్వక్ సేన్ ఆ తరువాత కూడా దాదాపు చాలా వరకూ రఫ్ పాత్రల్లోనే నటించాడు. అయితే మొదటిసారి అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో క్లాస్ పాత్రతో పాటు కంపోజ్డ్ క్యారెక్టర్ లో నటించాడు. ఎప్పుడూ అగ్రెసివ్ గా మాత్రమే కాదు సెటిల్డ్ గా కూడా నటించగలరని ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడే నటులు నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పాత్రే విశ్వక్ సేన్ కు ఈసినిమాతో వచ్చిందని చెప్పొచ్చు. ఈసినిమాలో అమాయకుడిగా కనిపించి, నటించి అందరినీ మెప్పించాడు.
ఇక హీరోయిన్ గా చేసిన రుక్సార్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. తనతో పాటు రుక్సార్ చెల్లెలు పాత్రలో నటించిన రితికా నాయక్ పాత్ర కూడా ఆకట్టుకుంది. పక్కింటి అమ్మాయిలా ఉండే ఆమె క్యారెక్టరైజేషన్.. ఆ పాత్రలో రితికా నాయక్ నటన ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్ ఎప్పటిలాగే తన కామెడీతో నవ్వించారు. విద్య శివలెంక, కాదంబరి కిరణ్, గోపరాజు రమణ తదితరులు తమ పాత్రలు మేర నటించారు.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే జయ్ క్రిష్ పాటలు సినిమా రిలీజ్ ముందే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బావుంది. గోదావరి అందాలను బాగా తెరకెక్కించారు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ఓవరాల్ గా చెప్పాలంటే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ఒక సింపుల్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ సరదాగా నవ్వుకునే సినిమా కాబట్టి ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.