బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్-పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈసినిమాపై ముఖ్యంగా అఖిల్ తో పాటు ఆయన అభిమానులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. వరుసగా మూడు సినిమాల ఫ్లాప్స్ తరువాత అఖిల్ నుండి వస్తున్నసినిమా కావడంతో ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. మరి ఈసినిమా ఎలా ఉంది.. అఖిల్ కోరిక నెరవేరిందా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: అఖిల్, పూజా హెగ్డే, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, వి.జయప్రకాష్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తదితరులు
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
నిర్మాత: బన్నీవాసు, వాసు వర్మ
సమర్పణ: అల్లు అరవింద్
సంగీతం: గోపీ సుందర్
కథ
హర్ష (అఖిల్ అక్కినేని) అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా లేకుండా ఉంటాడు. అలాగే మ్యారేజ్ పై కూడా ఒక అవగాహక కలిగి ఉంటాడు. దీనిలో భాగంగానే మ్యారేజ్ లైఫ్ కోసం ముందే అన్నీ పక్కాగా సెట్ చేసుకుని పెట్టుకుంటాడు. అలాగే పెళ్లి చేసుకునే అమ్మాయిలో కూడా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా ముందే లిస్ట్ పెట్టుకుంటాడు. ఈ క్రమంలో పెళ్లి చూపులు మొదలుపెడతాడు. చాలా మంది అమ్మాయిలను చూస్తాడు కానీ ఎవరూ నచ్చరు. కానీ అదే పెళ్లి చూపులు ప్రాసెస్ లో ఉన్న విభావరి (పూజా హెగ్డే) ను చూసి ఇష్టపడతాడు. హర్షలాగే ఆమెకూ పెళ్లి విషయంలో.. రాబోయే జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అంచనాలుంటాయి. అయితే జాతకాలు కలవకపోవడంతో విభతో పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తారు హర్ష పేరెంట్స్. ఈ క్రమంలో పెళ్లి విషయంలో ఆమె అడిగిన కొన్ని ప్రశ్నలు.. హర్ష జీవితంలో పెను మార్పులకు కారణమవుతాయి. మరి ఆ ప్రశ్నలేంటి?తిరిగి విభ-హర్షలు ఎలా కలిశారు? అన్నది ఈసినిమా కథ.
విశ్లేషణ
ఈసినిమా అటు అఖిల్ కే కాదు ఒక రకంగా బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా చాలా ముఖ్యమైన సినిమా ఇది. హలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ ఇప్పటివరకూ మూడు సినిమాలు తీశాడు. కానీ ఇప్పటివరకూ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక మరోవైపు భాస్కర్ కూడా చాలా ఏళ్ల గ్యాప్ తరువాత వస్తున్నాడు. ‘ఒంగోలు గిత్త’ తర్వాత 8 ఏళ్ల విరామం తీసుకుని భాస్కర్ తెరకెక్కించిన చిత్రమిది. అందుకే ఈ సినిమా రిజల్ట్ ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్.
ఇక ఇదిలా ఉండగా సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి.. ఇకపై కూడా వస్తాయి. అయితే వాటిని ఎంత కొత్తగా.. ప్రెష్ గా చూపిస్తున్నారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా కూడా ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే.
ఇక భాస్కర్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమ, దాని ప్రాముఖ్యత దానితో పాటు ఎమోషన్స్ అలానే కాంప్రమైజ్ లు ఇలా అన్ని కోణాలు చూపిస్తూ అందమైన ప్రేమకథను చూపించడంలో తన ప్రత్యేకత వేరు. ఈసినిమాలో కూడా లవ్ అండ్ రిలేషన్ షిప్‌లో ఉండే ఎమోషన్స్‌ని కళ్లకి కట్టినట్టు చూపించాడు. పెళ్లికి కూడా ఎలిజిబులిటీ ఉండాలి అన్న నేపథ్యంలో ఈసినిమా తీశాడు భాస్కర్. పెళ్లి అంటే సర్దుకుపోవడం కాదు.. అర్ధం చేసుకుని జీవించడం అని ఈసినిమా ద్వారా చెప్పారు.
ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా వెళ్లిపోతుంది. ముందే పెళ్లికి ముహూర్తం పెట్టుకుని.. ఆ ముహూర్తం కల్లా పెళ్లి కూతురును సెలెక్ట్ చేసుకోవాలనుకోవడం.. ఇందుకోసం వరుసగా పెళ్లి చూపులకు వెళ్లడం.. ఈ క్రమంలో ఒకొక్కరి నుంచి అతనికెదుర్యే అనుభవాలతో కథనం సరదా సరదాగా సాగిపోతుంటుంది. విభా పరిచయం అయ్యాక.. హర్షతో వచ్చే ఎపిసోడ్లు.. పెళ్లికి కావాల్సిన అర్హతలేంటి? అంటూ ఆమె వేసే ప్రశ్నలు.. ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టే క్రమంలో అతను పడే ఇబ్బందులు ఆసక్తికరంగా సాగుతూనే నవ్వులు పూయిస్తుంటాయి. ఇక విభాకు దూరం అవ్వడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తూ.. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో మళ్లీ హీరోయిన్ ప్రేమను పొందడానికి హీరో ప్రయత్నించడం.. పెళ్లికి అసలైన ఎలిజిబులిటీ ఏంటీ అన్నది సెకండ్ హాఫ్ లో చూపించాడు.
ఇక ఇక్కడ చెప్పుకోవాల్సింది అఖిల్ గురించి. హర్ష పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంటాడు అఖిల్. అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేవరకూ నిద్రపోనని శపథం చేసిన అఖిల్.. ఈ చిత్రం తరువాత కాస్త రిలాక్స్ అయితే అవ్వొచ్చు. ఇక ఈసినిమాలో పూాజా హెగ్డే పాత్రనే ప్రధాన బలం. తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు భాస్కర్. దానికి తగ్గట్టే స్టాండప్ కమెడియన్‌గా విభావరి పాత్రలో పూజా హెగ్డే నటన అందరినీ అలరిస్తుంది.
రియల్ లైఫ్ కపుల్.. రాహుల్ రవీంద్రన్, చిన్మయి కూడా నటించారు. ఇక మురళీ శర్మ, జయప్రకాష్, ఆమని, ప్రగతి, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, ప్రగతి పాత్రలకు తగ్గట్లుగా నటించారు. వెన్నెల కిషోర్.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తమ కామెడీతో నవ్వించారు. నేహా శెట్టి.. ఈషా రెబ్బా.. ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రలో నటించారు.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పటికే పలు పాటలు శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. ప్రదీప్ వర్మ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా కాబట్టి దానికి తగ్గట్టే నిర్మాణ విలువలు ఉన్నాయి.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే అఖిల్ కు కాస్త రిలీఫ్ ఇచ్చే సినిమా అని చెప్పడంతో పాటు పెళ్లి గురించి కొత్త కాన్సెప్ట్ ను చూపించారు. మొత్తానికి ఈ బ్యాచ్ లర్ బాగానే అలరిస్తాడు.. అంతేకాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ని కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అని చెప్పొచ్చు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: