ఆంధ్రప్రదేశ్ కంటే ముందుగా అమెరికాలో విడుదలైన తెలుగు సినిమా కథాకమామీషు

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 39,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 39

(రీక్యాప్)
( మొత్తానికి పెళ్లీడు పిల్లలు అన్నపూర్ణ సంస్థ కు ఆర్థిక నష్టాన్ని కలిగించకపోయినా హార్థికంగా కొంత మనోక్లేశాన్ని తెచ్చిపెట్టింది)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

ఒక తెలుగు సినిమా ఆంధ్రాలో కంటే ముందుగా అమెరికాలో విడుదలవుతుందా? అవుతుంది- అయింది కూడా.
ఏదా చిత్రం?
ఏమిటా కథ?
ఆ చిత్రం “అమెరికా అబ్బాయి”.
ఇక కథ ఏమిటో చూద్దాం.

ఆశ్చర్యకరమైన ఆ కథలో ఆసక్తిదాయకమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి.
అమెరికాలో స్థిరపడిన మధుసూదనరావు బంధువులు కొందరు తెలుగులో ఒక సినిమా నిర్మించాలనే కుతూహలాన్ని కనబరిచారు. ఆ చిత్రనిర్మాణానికి సారథ్యం వహించవలసిందిగా మధుసూదరావును కోరారు. అప్పటికే తెలుగులో చిత్ర నిర్మాణ ధోరణులు చాలా అధ్వానంగా తయారయ్యాయి.

” ఎన్నో ఏళ్లుగా చిత్ర నిర్మాణంలో ఉన్న మేమే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలు తీయటానికి సాహసించలేక పోతున్నాం. ఏదో అమెరికా వెళ్లి చక్కగా సంపాదించుకున్న డబ్బును సినిమాల్లో తగలబెట్టటం ఎందుకు? అలాంటి ఆలోచనలేవీ పెట్టుకోకండి” అంటూ వారిని నిరుత్సాహపరిచారు మధుసూదనరావు.
అమెరికాలోని ప్లింట్ నగరంలో వెలసిన ” అమెరికానా ఫిలిమ్స్” అనే సంస్థ వారు ఒక తెలుగు సినిమాను అమెరికాలో నిర్మించి దాని ఓవర్సీస్ రైట్స్ తమకు ఇచ్చినట్లయితే లక్ష రూపాయలు డాలర్ల రూపంలో ఇస్తామని, అమెరికాలో నిర్మాణం జరపడానికి అయ్యే ఖర్చులు తామే భరిస్తామని ముందుకు వచ్చారు. వారి దగ్గర నుండి ఆ ఆఫర్ వచ్చే సమయానికి ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీ రామచంద్రమూర్తి రాసిన కథ ఒకటి మధుసూదనరావు వద్ద సిద్ధంగా ఉంది.

అయితే అమెరికాలో సినిమా నిర్మించాలంటే భారత రిజర్వు బ్యాంకు మరియు భారత ప్రభుత్వం అనుమతి కావాలి. ఈ విషయంలో రిజర్వు బ్యాంక్ ను, భారత ప్రభుత్వాన్ని సమ్మతింప చేయటానికి చాలా ఫార్మాలిటీస్ పూర్తిచేయవలసి ఉంటుంది.అమెరికానా ఫిలిమ్స్ వారు లక్ష రూపాయలు ఓవర్సీస్ రైట్స్ నిమిత్తం డాలర్స్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్న దృష్ట్యా ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఈ ప్రతిపాదనకు తమ ఆమోదాన్ని తెలిపాయి.ప్రభుత్వపరంగా ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోవటంతో అమెరికానా ఫిలిమ్స్ , అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లే యూనిట్ మొత్తానికి రాను పోను విమాన టిక్కెట్లు, అక్కడ వారి బస, భోజన సదుపాయాలు, స్థానికంగా అక్కడ షూటింగ్ సమయంలో అయ్యే ఇతర ఖర్చులను అమెరికానా ఫిలిమ్స్ వారు భరించాలి.

ఇక నటీనటులు, సాంకేతిక బృందం యొక్క పారితోషికం, ఫిలిం కొనుగోలు, డబ్బింగ్, రికార్డింగ్, రీరికార్డింగ్ మొదలగు సమస్త ఖర్చులు అన్నపూర్ణ సంస్థ భరించేటట్లు ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం బడ్జెట్ వేశారు. ఆ బడ్జెట్ లో తమ వంతుకు పాతిక లక్షలు పైగా అయ్యేలా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెట్టుబడి పెట్టడం సాధ్యమా?
ఈ విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలో- గతంలో సినిమా తీయాలని కుతూహలపడిన
బంధుమిత్రులు ఇప్పుడు ముందుకు వచ్చారు.వారితోపాటు ఆంధ్రలో ఉన్న వారి బంధువులు మరికొందరు ముందుకు వచ్చారు. వారంతా కలిసి హైదరాబాదులో” జయలక్ష్మి ఫిలిమ్స్”
అనే సంస్థను ప్రారంభించారు.

జయలక్ష్మీ ఫిలిమ్స్ కొత్త సంస్థ కాబట్టి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారే సినిమా నిర్మించి వారికి హక్కులన్నీ రాసి ఇచ్చేటట్లు, అన్నపూర్ణ సంస్థ పేరును ఉపయోగించుకున్నందుకు గాను లక్ష రూపాయలు గుడ్ విల్ కింద ఇచ్చేటట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అమెరికాలో షూటింగ్ జరపాలంటే ఓకే బంచ్ గా నెల రోజుల కాల్షీట్స్ ఇచ్చే నటీనటులు కావాలి. ఇక్కడ లాగా షూటింగ్ లేని రోజున మద్రాస్ వెళ్లి వస్తామంటే కుదరదు. కాబట్టి ఒకసారి వచ్చినవాళ్లు షూటింగ్ పూర్తయ్యే వరకు తిరుగుప్రయాణం అవకూడదు.ఆ మేరకు నటీనట సాంకేతిక బృందం అందరి దగ్గర డేట్స్ తీసుకున్నారు.

చిత్ర దర్శకుడుగా సింగీతం శ్రీనివాసరావు ను ఎంపిక చేసుకున్నారు. ఆయన అన్నపూర్ణ సంస్థకు చిరకాల మిత్రులు. అన్నపూర్ణవారి తొలిచిత్రం దొంగరాముడుకు కె.వి. రెడ్డి గారి వద్ద అసిస్టెంట్ గా చేశారు సింగీతం శ్రీనివాసరావు. ఇక ఛాయాగ్రహకుడు హరి అనుమోలు. సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు. జీడిగుంట శ్రీరామచంద్ర మూర్తి రాసిన కథకు ప్రముఖ నాటక రచయిత, నాటక కళా పరిషత్తులో ఎన్నో బహుమతులు పొంది న్యాయ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆర్. వి. ఎస్. రామస్వామి సంభాషణలు సమకూర్చారు. సినిమాలోని మొత్తం ఆరు పాటల్లో మూడు ఆరుద్ర రాయగా, మూడు డాక్టర్ సి.నారాయణరెడ్డి రాశారు.అమెరికా ప్రయాణానికి ముందే ఆరు పాటలను రికార్డు చేయించారు.

 

రాజశేఖర్, అశ్విని, చరణ్ రాజ్, రాధిక, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, అమెరికా అబ్బాయి టైటిల్ పాత్రధారి మాస్టర్ శ్రవణ్, అతిధి పాత్రలో చంద్రమోహన్ – ఇది ప్రధాన నటీనటవర్గం.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని యూనిట్ మొత్తం అమెరికా ప్రయాణం అయ్యారు. పిక్చర్ నెగిటివ్ ఇక్కడే కొనుగోలు చేసి తీసుకువెళ్లాలి అనే నిబంధన ఒకటి ఉంది. ప్రభుత్వం వారు పెట్టే అనవసర రూల్స్ లో ఇదొకటి. అమెరికాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడే ఫిలిం కొనటానికి అనుమతిచ్చి ఆ మేరకు పన్ను విధించవచ్చు. కానీ ఇక్కడి నుండే ఫిలిం తీసుకువెళ్లాలి అనే నిబంధన తలనొప్పిగా తయారైంది.

యూనిట్ మొత్తం అమెరికాలో లాండ్ అయింది. ఎయిర్ ఇండియా కార్గో సర్వీసులో బుక్ చేసిన పిక్చర్ నెగిటివ్ కస్టమ్స్ వారి కష్టాలనుండి బయటపడి ఆరు రోజులు ఆలస్యంగా చేరింది. యూనిట్ మొత్తం ఈ ఆరు రోజులు ఖాళీగా ఉన్నారు.ఇంతలో పిడుగుపాటు లాంటి వార్త ఒకటి తెలిసింది.సినిమా కథలో 80 శాతం అమెరికాలో జరిగినట్లుగా ఉంటేనే అమెరికానా ఫిలిమ్స్ వారు ఇన్కమ్ టాక్స్ క్లెయిమ్ చేయటానికి వీలుపడుతుందట. ఈ వార్త తెలియడంతో పెద్ద సంకట స్థితి ఎదురైంది. ఇప్పుడు ఏమి చేయాలి?
80 శాతం కథ అమెరికాలో జరిగినట్లుగా కథను మార్చాలి. ఆ మేరకు డైలాగులు మార్చాలి. కథా రచయితగాని, సంభాషణల రచయితగాని అమెరికాలో లేరు. వారిని ఇండియా నుండి పిలిపించడం సాధ్యపడే పనికాదు.

అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావులే రచయితలుగా మారి మూల కథను మార్చారు… సంభాషణలు రాశారు.
ఈ మార్చిన కథ ప్రకారం షూటింగ్ 80% అమెరికాలోనే చేయాలి అంటే అందుకు చాలినన్ని డేట్స్ లేవు. దానికి తోడు చరణ్ రాజ్, రాధికలకు ఇండియాలో తమ షూటింగులు పూర్తి కాలేదు. అనుకున్న సమయానికి అమెరికా రాలేకపోయారు.ఇన్ని అవరోధాలను, అడ్డంకులను తట్టుకొని ఎలాగోలా షూటింగ్ పూర్తి చేశారు. క్లైమాక్స్ లో కొంత భాగం మాత్రం మిగిలింది.కథలో జరిగిన అనేక మార్పుల వల్ల
క్లైమాక్స్ ఎలా ఉండాలి? అన్నది చర్చనీయాంశమైంది. రెండు రకాల క్లైమాక్స్ లు ఆలోచించారు. రాధిక భర్త చరణ్ రాజ్. దుర్మార్గుడైన ఆ భర్త బారినుండి తన కొడుకును రక్షించుకోవడం కోసం ఆమె భర్తను కాల్చి చంపడం అనేది ఒక క్లైమాక్స్.భర్త తన కొడుకును కాల్చగా తన బిడ్డను కాపాడేందుకు అడ్డు వెళ్తే బుల్లెట్ తగిలి ఆమె చనిపోవడం, చరణ్ రాజ్ ను అమెరికన్ పోలీసులు కాల్చి చంపడం రెండవ క్లైమాక్స్.

అదే సమయంలో కేన్సర్ వ్యాధికి చికిత్స నిమిత్తం అమెరికాలో ఉన్న అప్పటి సంచలన యువ దర్శకుడు
టీ.కృష్ణ కు కథ మొత్తం వివరించి క్లైమాక్స్ విషయంలో సలహా అడిగారు మధుసూదనరావు. రాధిక భర్తను చంపటమే రివల్యూషనరీగా ఉంటుందని కృష్ణ చెప్పారు. అయితే జయ లక్ష్మీ సంస్థ పార్ట్నర్స్ కుటుంబాల్లోని కొందరు ఆడవాళ్లు రాధిక భర్తను చంపటం కంటే కొడుకును రక్షించుకోబోయి ఆమె ప్రాణాలు అర్పించినట్లుగా తీస్తే బాగుంటుందని సూచించారు. భార్య భర్తను చంపితే ఆడవాళ్లకు నచ్చదని వాళ్ళ అభిప్రాయం. అమెరికాలో ఉంటున్నా కూడా భారతీయ స్త్రీలు మన సెంటిమెంట్స్ ను విడవలేరు అనటానికి ఇది ఒక ఉదాహరణ.

సరే, రెండూ తీసి ఏది బాగుంటే అది ఉంచుదాం అనుకొని ముందు రాధికను చరణ్ రాజు చంపటం, చరన్ రాజ్ ను పోలీసులు చంపటం తీశారు.ఇక మొదట అనుకున్నట్లుగా చరణ్ రాజ్ ను రాధిక చంపే క్లైమాక్స్ తీయటానికి డేట్స్ ప్రాబ్లం అవరోధమైంది.ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రత్యామ్నాయ పతాక సన్నివేశాన్ని ఇండియాలో తీద్దాంలే అనుకొని యూనిట్ మొత్తం ప్యాకప్ చేసుకుని ఇండియాకు తిరుగుముఖం పట్టింది.ఇండియా వచ్చాక రెండవ క్లైమాక్స్ తీయటానికి ఆర్టిస్టుల కాంబినేషన్ దొరక్కపోవడంతో అది సాధ్యపడలేదు. ఈ విషయం తెలియక అమెరికాలో డెట్రాయిట్ లో థియేటర్ ఫిక్స్ చేసి రిలీజ్ డేట్ ప్రకటించారు అమెరికానా ఫిలిమ్స్ వారు.వెంటనే ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్ వంటి తుది మెరుగులు పూర్తిచేసి ఫస్ట్ కాపీ సిద్ధమవుతుండగానే ఓవర్సీస్ రైట్స్ తీసుకున్న అమెరికానా ఫిలింస్ వారు తొందర చేయటం ప్రారంభించారు.

ఫస్ట్ కాపీ రాగానే సెన్సార్ పూర్తి చేసి ప్రింట్ అమెరికా పంపారు.1986 డిసెంబర్ 18న అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో” అమెరికా అబ్బాయి” విడుదలైంది.అక్కడ చిత్రం బాగా ఉందని టాక్ వచ్చింది. ఆ టాక్ ఇండియా వచ్చేసరికి మారిపోయింది. కొందరు అసూయాపరులు పిక్చర్ అమెరికాలో రిలీజ్ అయిందని, బాగాలేదని టాక్ వచ్చిందని బ్యాడ్ ప్రాపగాండా చేయటంతో ఇక్కడ అమెరికా అబ్బాయిని కొనడానికి ముందుకు వచ్చిన బయ్యర్స్ వెనుకంజ వేశారు.దానితో ఈ చిత్రాన్ని మయూరి ఫిలిమ్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయించి 1987 జనవరి 21న విడుదల చేశారు.

అన్నపూర్ణ సంస్థ కు ఉన్న పేరు దృష్ట్యా,అమెరికాలో షూటింగ్ జరిపి భారీగా చిత్రీకరణ జరిపి ఉండటంవల్ల ఓపెనింగ్స్ బాగా వస్తాయన్న ఉద్దేశంతో అన్ని కేంద్రాల్లో పెద్ద పెద్ద థియేటర్లలో విడుదల చేశారు మయూరి ఫిలిమ్స్ వారు.అసలే సినిమా కొంచెం క్లాస్ గా ఉన్న కారణంగానూ, శ్లాబ్ విధానం మూలంగానూ, పెద్ద థియేటర్లలో ఎక్కువ రెంటల్స్ కారణంగానూ ” అమెరికా అబ్బాయి” పరాజయాన్ని చవిచూసింది. అయితే ఆ పరాజయం వల్ల జయ లక్ష్మీ ఫిలింస్ కు ఆర్థికంగా ఎలాంటి నష్టమూ కలుగకపోగా కొద్దిపాటి లాభాలను చవిచూసింది. అమెరికాలోని ‘అమెరికానా ఫిలిమ్స్’ సంస్థ మాత్రం కొంత నష్టాన్ని భరించక తప్పలేదు.
మధుసూదనరావు విశ్లేషణ ప్రకారం ‘ అమెరికా అబ్బాయి’ తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోవడానికిగల కారణం ఏమిటంటే ” చిత్రంలో మొదటి నుండి సానుభూతిని పొందుతూ వచ్చిన రాధిక పాత్ర క్లైమాక్స్ లో చచ్చిపోవటంతో ఆ సానుభూతి వృధా అవడం జరిగింది. అలా కాకుండా రాధిక పాత్ర చరణ్ రాజ్ ను చంపి ఉంటే విప్లవాత్మకమైన ఆ ముగింపు ప్రేక్షకుల ఆదరణకు నోచుకునేది” అంటారు మధుసూదనరావు.

ఏది ఏమైనా అత్యధిక వ్యయ ప్రయాసలకోర్చి రూపొందించిన
” అమెరికా అబ్బాయి” మంచి ఫలితాన్ని అందించలేకపోయింది.

సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు కలిగిన ఈ సినిమా ఆర్థికంగా ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయినా ఇందులో నటించిన బాలనటుడు మాస్టర్ శ్రవణ్ కు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులలో “ఉత్తమ బాలనటుడు” అవార్డు రావటం కొంత సంతృప్తినిచ్చింది.

ఇదే అఖండ విజయాల అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆఖరి చిత్రం. చిత్ర నిర్మాణ రంగంలో కాకలు తీరిన యోధునిగా గుర్తింపును, గౌరవాన్ని సంపాదించుకున్న అన్నపూర్ణ సంస్థ మూలస్తంభమైన దుక్కిపాటి మధుసూదనరావు తన సుదీర్ఘ చలనచిత్ర జీవితాన్ని ఒక పరాజయ చిత్రంతో ముగించవలసి రావటం నిజంగా దురదృష్టకరం.

ఆ బాధ, అసంతృప్తి ఆయన చివరి క్షణాల వరకు వెంటాడుతూనే ఉందిఅమెరికా అబ్బాయి తో చిత్ర సన్యాసం చేసినప్పటికీ చిత్ర నిర్మాణం పట్ల, చిత్ర పరిశ్రమ సంక్షేమం పట్ల ఆ సినీ దిగ్గజానికి ఎనలేని ఆపేక్ష ఉండేది.అందుకే ఆ అనుభవశాలి అనుభవాలను, అభిప్రాయాలను ఈ సీరియల్ తరువాయి భాగంలో ఇంటర్వ్యూ రూపంలో అందిస్తున్నాను.

 

( సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి 2019 జనవరి 1 న చదవండి)

(అమెరికా అబ్బాయి చిత్రంలోని కొన్ని పాటలు మీకోసం)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here