అన్నపూర్ణ సంస్థకు హార్దిక నష్టాన్ని కలిగించిన “ పెళ్లీడు పిల్లలు”

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 38, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 38

(రీక్యాప్)

( మధుసూదనరావుకు వరుసగా రెండు ఘన విజయాలను అందించిన ఘనత కె.రాఘవేంద్రరావుకు దక్కింది)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

ప్రయోగాత్మకంగా ఒక లో బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనకు కార్యరూపం” పెళ్లీడు పిల్లలు”. కథాపరంగాను, నటీనటుల ఎంపిక పరంగానూ ఇదొక ఎక్స్పెరిమెంటల్ చిత్రం.

ఆర్టిస్టుల ఇమేజికి చిత్ర కథాంశానికి మధ్య సమతుల్యత కుదరకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఈ చిత్రం. ముందు కథా సంవిధానాన్ని పకడ్బందీగా రూపొందించుకుని అందుకు తగిన విధంగా నటీనటుల ఎంపిక చేసుకుని అన్ని విధాల అప్రమత్తంగా రంగంలోకి దిగటం అన్నపూర్ణ వారు ఆది నుండి అవలంభిస్తున్న విధానం. ఈ చిత్రం విషయంలో కూడా అలాగే జరిగింది. కానీ ఎక్కడో ఏదో అస్పష్టమైన లోపం జరుగుతుందని షూటింగ్ ప్రారంభం నుండి మనసు తొలుస్తుంది.


 

ఆ లోపం ఏమిటో , దాని ఫలితాలు ఏమిటో… తెలుసుకోవాలి అంటే కథ ఏమిటి? నటీనటుల ఎంపిక తరువాత చేసిన మార్పులు ఏమిటి? తెలుసుకోవటం అవసరం.

బాధ్యతలు పట్టని భర్త, చదువుకునే చెల్లెలు ఉన్న కుటుంబాన్ని నడుపు కొస్తున్న ఇల్లాలి కథ ఇది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆమె తన చెల్లెలిని తల్లి లాగా పెంచటం, ఆమె బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటం లక్ష్యంగా పెట్టుకుంది. చదువుసంధ్యలు లేకపోయినా ధైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడి జీవితంలో అనుకున్నది సాధించిన ఆదర్శప్రాయమైన ఒక స్త్రీ జీవితాన్ని కేంద్రబిందువుగా చేసుకుని మలచిన ఈ కథను తెరకెక్కించడానికి మధుసూదన రావు ఎంచుకున్న సాంకేతిక బృందం కూడా చాలా పటిష్టమైనదే.

ఈ చిత్రానికి దర్శకుడుగా బాపు, సంభాషణల రచయితగా ముళ్లపూడి వెంకటరమణ నియమితులయ్యారు.లో బడ్జెట్ చిత్రమైనా హై బడ్జెట్ చిత్రమైనా సృజనాత్మక, సాంకేతిక విలువల విషయంలో రాజీపడని మధుసూదనరావు ఈ చిత్రానికి ఇండియాలో ‘వన్ ఆఫ్ ద టాప్ కెమెరామెన్’ గా పేరుపొందిన ” బాబా ఆజ్మీ “( షబానా అజ్మీ సోదరుడు)ని ఛాయాగ్రహకుడిగా నియమించారు. ఇక తన సుమధుర సుస్వర సంగీత సుధతో యావత్ దక్షిణ భారతాన్ని ఉర్రూతలూగించిన సంగీత సామ్రాట్ ఎమ్మెస్ విశ్వనాథన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అన్నపూర్ణ సంస్థలో ఒక్క చిత్రానికైనా సంగీత దర్శకునిగా చేయాలన్నది ఎమ్మెస్ విశ్వనాథన్ కోరిక. అలాగే తమ సంస్థలో ఆయనతో ఒక చిత్రానికైనా మ్యూజిక్ చేయించాలన్నది మధుసూదనరావు అభిలాష. వీరిరువురి చిరకాలవాంఛ ఇది.


 

అన్నపూర్ణ సంస్థను స్థాపించిన తర్వాత దొంగరాముడు కథా చర్చలు జరుగుతున్న రోజుల్లో’ దేవదాసు’ చిత్ర సంగీత చర్చలకు సరదాగా వెళుతుండేవారు మధుసూదనరావు. ఆ చిత్రానికి సుబ్బరామన్ సంగీత దర్శకుడు. కానీ ఆయన అకాల మరణం పాలవటంతో అప్పటికి జంట దర్శకులుగా పేరొందిన” విశ్వనాథం- రామ్మూర్తి” ఆ చిత్రంలో ఒక పాటను

మిగిలిన రీ-రికార్డింగ్ వర్క్ ను పూర్తి చేశారు. బహుశా ఆ పాట” జగమే మాయ” అయి ఉండవచ్చు… అప్పటినుండి సుపరిచితులై తర్వాత కాలంలో సుప్రసిద్ధుడైన ఎమ్మెస్ విశ్వనాథన్ ను ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా ఎంచుకోవడంతో మా ఇద్దరి అభిలాష నెరవేరింది అంటారు మధుసూదనరావు.

ఈ విధంగా సాంకేతిక బృందం ఎంపిక అయిన పిమ్మట ముఖ్య పాత్రలో నటించే నటి ఎవరు అన్న విషయం పై చర్చలు జరిగాయి. ఆ పాత్రకు నటి సుజాత బాగుంటుందని అభిప్రాయపడి ఆమెను సంప్రదించారు. కానీ ఆమె అడిగిన పారితోషకం తమ లో బడ్జెట్ కంటే చాలా హై లెవల్ లో ఉంది. ప్రత్యామ్నాయ నటి ‘సంగీత’ ఈ బరువైన పాత్ర కు న్యాయం చేయగలదని భావించి ఆమెను ఎన్నుకున్నారు. అంతకుముందే బాపు దర్శకత్వంలో ఆమె నటించిన “ముత్యాల ముగ్గు” సూపర్ హిట్ అయింది. ఇక ఈ కథలోని మరొక ముఖ్య పాత్ర సంగీత మేనమామ.ఈ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవు. డబ్బు దర్పంతో కళ్ళు మూసుకుపోయిన ఆ మేనమామే ఈ చిత్రంలో ప్రతి నాయకుడు. అమరావతి పుణ్యక్షేత్రంలో ఒక పెద్ద హోటల్ నడిపిస్తుంటాడు ఆ మేనమామ. దానికి దగ్గరలో ఉన్న ఒక సత్రంలో ఆ మేనకోడలు ఉంటుంది. భర్త బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతుంటే కుటుంబ పోషణ నిమిత్తం చేతనైన ఒకే ఒక్క విద్య అయిన వంట చేయడాన్ని వృత్తిగా స్వీకరించి ఒక భోజన హోటల్ పెడుతుంది. యాత్రికులకు సొంత ఇంట్లో భోజనం చేసినంత రుచికరంగా వండి పెట్టడంతో ఆమె హోటల్ కు తక్కువ కాలంలోనే పేరు వస్తుంది. తన లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ హోటల్ లో బస చేసిన కస్టమర్లు కూడా ఈ హోటల్ నుండి క్యారేజ్ లు తేప్పించుకోవటం మేనమామకు కంటక ప్రాయంగా తయారైంది. ఎలాగైనా ఆమెను దెబ్బతీయాలని దుష్ట పన్నాగాలు ప్రారంభిస్తాడు.

ఇదిలా ఉండగా తన చెల్లెలు ఆ మేనమామ కొడుకు ప్రేమలో పడతారు. అనుక్షణం తమ పతనాన్ని కోరే మేనమామ కొడుకునే తన చెల్లెలు ప్రేమించడం ఈమెకు షాక్ అవుతుంది. కానీ తన చెల్లెలు కోరుకున్న వాడితోటే ఆమె పెళ్ళి చేయాలన్న మంచి లక్ష్యంతో సాహసించి వారిద్దరి పెళ్ళి జరిపిస్తుంది. మేనమామ నుండి వచ్చిన ప్రతిఘటనను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తుంది.


 

ఇది అసలు కథ.

ఇక ఈ మేనమామ పాత్రకు సరైన నటుడు ఎవరు అన్నది ప్రశ్న. రక రకాలుగా ఆలోచించి ఆ పాత్రకు జె.వి. సోమయాజులు అయితే ఒక కొత్తదనం, నిండుతనం చేకూరుతాయని అభిప్రాయపడ్డారు దర్శకుడు బాపు,రచయిత ముళ్ళపూడి. ఈ ప్రతిపాదనకు నిర్మాత మధుసూధనరావు కూడా సరే అన్నారు. కానీ అందరిలోనూ లోలోపల ఒకటే సందేహం.. “ఈ పాత్రలో జెవి సోమయాజులును ఎలా రిసీవ్ చేసుకుంటారు అని”- ఒకటికి రెండుసార్లు పునరాలోచనలు జరిగాయి.

అవి” శంకరాభరణం” విడుదలై అఖండ విజయం సాధించిన తొలి రోజులు. సోమయాజులు గారి పేరుకు ముందు ” శంకరాభరణం” ఇంటి పేరుగా స్థిరపడిన రోజులవి. ఆ సినిమా ద్వారా ఆయనకు అంత బలమైన ఇమేజ్ ఏర్పడి ఉంది. మరి అలాంటి ఇమేజ్ ఉన్న నటుడు దాదాపు విలన్ లక్షణాలు ఉన్న పాత్ర ధరిస్తే ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందా? అన్నది ప్రశ్న. అయితే గతంలో అలాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. ఎంత మంది నటులు హీరో పాత్రలు చేసి విలన్స్ గా కూడా మెప్పించలేదు.?

ప్రముఖ బెంగాలీ నటుడు “చాభీ బిస్వాస్ ” మాటేమిటి? ఆయన హీరోగా నటించిన చిత్రం ఒక దియేటర్లో, విలన్ గా నటించిన చిత్రం మరొక ధియేటర్లో ఆడుతుంటే రెండింటికీ సమానమైన ఆదరణ లభించలేదా ? అంతెందుకు? భార్యాభర్తలు, విచిత్రబంధం చిత్రాల్లో అక్కినేని పోషించిన పాత్రలు ఏమిటి? కాబట్టి కథా కథనాల్లో నవ్యత ఉంటే ఎవరు ఏ పాత్ర చేసినా ప్రేక్షకాదరణ తప్పక లభిస్తుంది అనే వాదన ఒకటి ఉంది. ఈ విషయాలన్నీ ఆలోచించి చివరకి ఆ పాత్రకు జెవి సోమయాజులును ఖాయం చేసుకుని ఆయనకు కథ చెప్పారు.


 

” ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్లో జనం నన్ను చూస్తారా ? సందేహం వెలిబుచ్చారు ఆయన. “మేము అవన్నీ ఆలోచించాము. మీకు అంగీకారమే కదా” అన్నారు మధుసూదనరావు.

” మీరందరూ ఓకే అనుకుంటే నాకు అభ్యంతరం ఏముంటుంది?- అన్నారు జెవి సోమయాజులు.

ఇక సంగీత చెల్లెలు పాత్ర లో యంగ్ హీరోయిన్ గా ఎవరిని పెట్టాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడే వర్ధమాన నటి గా ఎదుగుతున్న విజయశాంతి పేరు పరిశీలనకు వచ్చింది. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ విధంగా నేటి జాతీయ ఉత్తమ నటి విజయశాంతి ఫుల్ ఫ్లెడ్జిడ్ హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం” పెళ్లీడు పిల్లలు” అయింది.

జెవి సోమయాజులు కొడుకుగా యంగ్ హీరో పాత్రకు అప్పటికి వర్ధమాన దశలో ఉన్న సురేష్ పేరును అందరూ అంగీకరించారు. ఈ విధంగా ముఖ్య పాత్రల ఎంపిక పూర్తి కావడంతో మిగిలిన పాత్రల ఎంపిక తేలిగ్గా జరిగింది. కానీ దర్శక రచయితలకు, నిర్మాతకు మనసులో ఏదో అస్పష్టమైన సందేహం మెదులుతూనే ఉంది.

అదేమంటే ఎంత కాదనుకున్నా జెవి సోమయాజులు గారికి ఉన్న ఇమేజి ఆయన పూర్తిస్థాయి విలన్ పాత్రలో చూడనీయదు. కాబట్టి ఆ విలనిజం కూడా సానుభూతి పరమైనదిగా ఉంటే ఆర్టిస్టుల ఇమేజీ పరంగా సమతుల్యత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. అందుకోసం కథలో కొన్ని మార్పులు చేశారు. సోమయాజులు చేస్తున్న మేనమామ పాత్రను సంగీత చేస్తున్న మేనకోడలు పాత్ర డామినేట్ చేయకుండా ఉండేందుకు కథలో కొన్ని సవరణలు చేశారు. ఆ సవరణల ప్రకారం సోమయాజుల పాత్ర దుష్టకార్యాలు చేయబోయే ముందు

‘ అంతరాత్మ’ అతన్ని హెచ్చరిస్తూ ఉంటుంది.

స్వతహాగా అతనిలో కూడా మంచితనం ఉంది అని చెప్పటానికి తద్వారా విలన్ పై కూడా ప్రేక్షకుల్లో సానుభూతి కలగటానికి ఆ విధంగా ప్రయత్నించాడు దర్శకుడు బాపు. పతాక సన్నివేశంలో కూడా సోమయాజులే తన కొడుక్కి , మేనకోడలుకు పెళ్ళి చేస్తాడు. ఆ పెళ్ళి సంగీతకు ఇష్టం లేదు. చిత్రం ప్రారంభం నుండి విలన్ గా ఉన్న సోమయాజులు పాత్ర అర్థాంతరంగా మంచివాడుగా మారింది. మొదటి నుండి చెల్లెలుకు చక్కని భవిష్యత్తును ఆశించి పోరాడిన సంగీత పాత్ర మధ్యలో నెగిటివ్ గా మారింది.

తత్ఫలితంగా లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు కాస్త విలన్ ఓరియంటెడ్ సబ్జెక్టుగా మారిపోయింది. నటీనటులు ఇమేజ్ కోసం పాత్రల స్వభావ స్వరూపాలను మార్చవలసిన పరిస్థితి తొలిసారిగా అన్నపూర్ణ సంస్థకు ఎదురయింది.

కథలో ఈ మార్పులు, సవరణలు చేసుకుని షూటింగ్ కార్యక్రమాలకు ఉపక్రమించారు. కథ పరంగా ఈ చిత్రం షూటింగు ఒక యాత్రా స్థలం లో జరగవలసి ఉంది. అందుకుగాను మొదట “భద్రాచలం” అనుకున్నారు. కానీ అక్కడ గోదావరి నది దిగువ లో ఉండటంవలన గుడి- గోదావరి ఓకే బ్లాక్ లోకి రావటం లేదు. గోదావరి తీర ప్రాంతం లోని మరికొన్ని లొకేషన్స్ చూసి చివరకు అమరావతిలో షూటింగ్ జరపడానికి నిర్ణయించుకున్నారు.

యూనిట్ మొత్తం అమరావతికి తరలి వెళ్లింది. నిర్విఘ్నంగా షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. బాపు దర్శకత్వ ప్రతిభకు బాబా అజ్మీ కెమెరా పనితనం తోడై చిత్రంలోని ప్రతి ఫ్రేమూ అద్భుతంగా వచ్చింది. సంగీత, సాహిత్య, సాంకేతిక ప్రమాణాల దృష్ట్యా సినిమా చాలా ఉన్నతంగా రూపొందించబడింది.

నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని” పెళ్లీడు పిల్లలు” విడుదలయింది.

ఆర్టిస్టుల ఇమేజికనుగుణంగా కథలో చేసిన మార్పులు పరాజయం రూపంలో ప్రతిఫలించాయి. అటు సంగీత పాత్ర ఇటు సోమయాజుల పాత్ర రెండూ సానుభూతికి నోచుకోకపోవడంతో” పెళ్లీడు పిల్లలు” ఫెయిల్ అయింది.

ఈ సినిమా వల్ల అన్నపూర్ణ సంస్థకు ఒకే ఒక్క సంతృప్తి మాత్రం మిగిలింది. ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందిన సురేష్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కావడం, మేటి నటిగా వెలుగొందుతూ జాతీయ స్థాయికి ఎదిగిన విజయశాంతికి తొలిసారి హీరోయిన్ గా అవకాశం ఇవ్వటం అన్నపూర్ణ సంస్థకు దక్కిన క్రెడిట్స్.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లే చివరి రోజున విజయశాంతి గౌరవసూచకంగా మధుసూదన రావును కలవగా ఆయన ఆమెకు ఒక” సోనీ టూ ఇన్ వన్” బహుమతిగా అందజేస్తూ

” నీలో గొప్ప నటి కాగల లక్షణాలు నిండుగా ఉన్నాయి. పట్టుదలతో కృషి చేస్తే తప్పకుండా సావిత్రి లాగా టాప్ స్టార్ అవుతావు”- అని ఆశీర్వదించారు.

ఆ సమయంలో ఆ ఆశీర్వాదం ఏ తధాస్తు దేవతల చెవిన పడిందో..?

మొత్తానికి “పెళ్లీడు పిల్లలు” అన్నపూర్ణ సంస్థకు ఆర్థిక నష్టాన్ని కలిగించకపోయినా హార్థికంగా కొంత మనో క్లేశాన్ని తెచ్చిపెట్టింది.


( సశేషం)

(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 30న చదవండి)

( పెళ్లీడు పిల్లలు చిత్రంలోని కొన్ని పాటలు మీ కోసం)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here