టాలీవుడ్ డైరెక్టర్స్ @2018

Overview of Tollywood Directors in 2018,2018 Telugu Directors List,2018 Top Directors in Tollywood,Latest Telugu Movies News,List of Telugu Directors in 2018,List of Tollywood Directors in 2018,Overall View of Telugu Directors in 2018,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Directors 2018,Tollywood Directors Overview 2018, Tollywood Cinema Updates
Overview of Tollywood Directors in 2018

ద‌ర్శ‌కుడు… సినిమాకు సంబంధించిన‌ మొత్తం 24 శాఖ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ దిశానిర్దేశం చేసేవాడు. అందుకే డైరెక్ట‌ర్‌ని “కెప్టెన్ ఆఫ్ ద షిప్” అంటారు. క‌థానాయ‌కుడు ఎంత‌టి స్టారాధిస్టార్ అయినా స‌రైన కెప్టెన్ లేక‌పోతే మాత్రం… ఆ సినిమా ప‌రిస్థితి దిక్సూచి లేని ప‌డ‌వ ప్ర‌యాణంలాంటిదే. ఇక ఈ ఏడాదిలోనూ ప‌లువురు సీనియ‌ర్ అండ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కులు త‌మ సినిమాల‌తోనూ, ప్ర‌తిభ‌తోను ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. వీరిలో బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించిన ద‌ర్శ‌కులు కొంద‌రైతే… పరాజయం పాలైన వారు మ‌రికొంద‌రు. గ‌తాన్ని కొంగ్రొత్త‌గా ఆవిష్క‌రించి మ‌రీ అల‌రించి `కెప్టెన్స్ ఆఫ్ ది ఇయ‌ర్` అనిపించుకున్న వాళ్ళు కొంద‌రు అయితే… న‌వ్య‌త‌తో ముందుకు సాగి `వావ్‌` అనిపించిన‌ నిర్దేశ‌కులు మ‌రికొంద‌రు. అలాగే త‌మ పరాజ‌యాన్ని విజ‌యంగా మార్చుకున్న వారు కొంత‌మంది. అలాగే… ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప‌ల‌క‌రించ‌ని ద‌ర్శ‌కులూ ఉన్నారు. ఇలా… మెస్మ‌రైజ్ చేసిన ద‌ర్శ‌కుల‌తో పాటు డిజ‌ప్పాయింట్ కు గురిచేసిన వారిని కూడా మెమ‌రైజ్‌ చేసుకుంటూ… 2018వ సంవ‌త్స‌రంలో టాలీవుడ్ డైరెక్టర్స్ సాగిన ప్ర‌యాణాన్ని ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం.

కె.రాఘ‌వేంద్ర‌రావు:


 

శ‌తాధిక చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్ర‌రావు… గ‌తేడాది `ఓం న‌మో వెంక‌టేశాయ‌`తో ప‌ల‌క‌రించారు. నాగార్జున హీరోగా రూపొందిన ఈ ఆధ్యాత్మిక చిత్రం… ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఇక ఈ ఏడాది ఏమో `నో రిలీజ్ ఇయ‌ర్‌` గా నిల‌చింది. మ‌రి… వ‌చ్చే ఏడాది అయినా త‌న కొత్త చిత్రంతో ప‌ల‌క‌రిస్తారేమో చూడాలి.

రాజ‌మౌళి:


 

అప‌జ‌య‌మంటూ ఎర‌గ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి… `బాహుబ‌లి` సిరీస్‌తో నేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. గ‌తేడాది `బాహుబ‌లి -ది కంక్లూజ‌న్‌`తో ఇండియ‌న్ సినిమా పాత రికార్డుల‌న్నింటిని భూస్థాపితం చేసి… కొత్త రికార్డుల‌ను సృష్టించాడు. అయితే… ఈ ఏడాది రాజ‌మౌళి సినిమా లేక‌పోవ‌డం ఆయ‌న అభిమానుల‌నే కాదు… యావ‌త్ భార‌తీయ ప‌రిశ్ర‌మ‌కు లోటే. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో `ఆర్ ఆర్ ఆర్‌` సినిమాని తీర్చిదిద్దే ప‌నిలో ఉన్నాడు ఈ మెగా డైరెక్ట‌ర్‌. సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సెన్సెష‌న‌ల్ ప్రాజెక్ట్‌… 2020లో తెర‌పైకి రానుంది. అంటే… వ‌చ్చే ఏడాది కూడా రాజ‌మౌళి సినిమా లేన‌ట్టే. మొత్తానికి రెండేళ్ళ పాటు ఆయ‌న అభిమానుల‌కు నిరీక్ష‌ణ త‌ప్ప‌దు అన్న‌మాట‌.

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌:

 


 

రాత‌లోనే కాదు… తీత‌లోనూ త‌న‌దైన ముద్ర వేసిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. ద‌ర్శ‌కుడిగా ప‌ద‌హారేళ్ళ ప్ర‌యాణంలో కేవ‌లం ప‌ది సినిమాల‌కే ప‌రిమిత‌మైన ఈ ఏస్ ఫిల్మ్ మేక‌ర్‌… త‌న కెరీర్‌లో ఎన్న‌డూ లేని విధంగా రెండు సినిమాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలే ‘అజ్ఞాత‌వాసి’, ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’. ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ కళ్యాణ్‌తో ‘జ‌ల్సా’, ‘అత్తారింటికి దారేది’ లాంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన త్రివిక్ర‌మ్‌… ముచ్చ‌ట‌గా మూడోసారి ‘అజ్ఞాత‌వాసి’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ ఏడాది సంక్రాంతికి ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా తీవ్ర నిరాశ‌కు గురిచేసి డిజాస్టర్‌గా నిలిచింది. అయితే… ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో విడుద‌లైన ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కేసాడు త్రివిక్ర‌మ్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మొద‌టిసారిగా సినిమా చేసిన త్రివిక్ర‌మ్… తార‌క్‌ను కొత్త‌గా ఆవిష్క‌రించ‌డంలో 100% స‌క్సెస్ అయ్యాడు. మొత్తం మీద ఒక డిజాస్ట‌ర్‌… ఒక బ్లాక్ బ‌స్ట‌ర్‌తో బ్యాలెన్స్ చేసేశాడు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌ కోసం క‌థ‌ను సిధ్ధం చేసే ప‌నిలో ఉన్నాడు ఈ ఏస్ డైరెక్ట‌ర్. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశం ఉంది.

సుకుమార్‌:


 

సృజ‌నాత్మ‌క‌త‌కు, న‌వ్య‌త‌కు పెద్ద పీట వేసే ద‌ర్శ‌కుల‌లో సుకుమార్ ఒక‌డు. అందుకే… త‌న సినిమాలంటే ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి. అయితే…. త‌న ప్ర‌తిభ‌కు త‌గ్గ మెగా విజ‌యాన్ని అందుకోలేక‌పోయిన ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్ కి… ఈ ఏడాది ఆ లోటు ఘ‌నంగానే తీరింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా 80ల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన పిరియాడిక్ డ్రామా ‘రంగ‌స్థ‌లం’… సుకుమార్ ఆలోచ‌నా స‌ర‌ళిని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించింది. ప్రేక్ష‌కుల‌ను గ‌తంలోకి తీసుకెళ్ళి మ‌రీ… బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. అంతేకాదు… వ‌సూళ్ళ ప‌రంగా `బాహుబ‌లి`సిరీస్ చిత్రాల త‌రువాతి స్థానంలో నిల‌చింది. సుకుమార్‌ని ‘డైరెక్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌’ గా కూర్చోబెట్టింది. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మహేష్ బాబుతో త‌న త‌దుప‌రి చిత్రం చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్న సుకుమార్‌… వ‌చ్చే ఏడాది చివ‌రిలో మ‌రోసారి మెస్మ‌రైజ్ చేసేందుకు గ‌ట్టిగానే ప్ర‌యత్నాలు చేస్తున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌.

కొర‌టాల శివ‌:


 

‘మిర్చి’, ‘శ్రీ‌మంతుడు’, ‘జ‌న‌తా గ్యారేజ్’ లాంటి భారీ విజ‌యాల‌ను సొంతం చేసుకుని హ్యాట్రిక్ ద‌ర్శ‌కుడు అనిపించుకున్నాడు కొర‌టాల శివ‌. ఈ నేప‌థ్యంలో… త‌న నాలుగో సినిమాని పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సూప‌ర్ స్టార్ మహేష్ బాబును ముఖ్య‌మంత్రిగా చూపిస్తూ ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాను రూపొందించాడు కొర‌టాల‌. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ‘శ్రీ‌మంతుడు’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఉండ‌డంతో… భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా కేవ‌లం టాలీవుడ్‌లోనే కాక ఓవ‌ర్సీస్‌లో కూడా మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్నారు ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ ఫిల్మ్ ప‌ట్టాలెక్కే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. `ఠాగూర్‌` త‌ర‌హాలో సాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో వ‌రుస‌గా ఐదో విజ‌యాన్ని కూడా త‌న ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

రామ్‌గోపాల్ వ‌ర్మ‌:


 

రామ్‌గోపాల్ వ‌ర్మ‌… భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఈ పేరే ఒక సంచ‌ల‌నం. జ‌యాప‌జయాల‌కు అతీత‌మైన ద‌ర్శ‌కుడు. సినిమాను త‌న స్టైల్‌లో తెరకెక్కించడంతో పాటు… దాన్ని మార్కెట్ చేసుకోవడంలో కూడా ప్రత్యేకమైన పంథాను అవలంబిస్తాడీ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌. మ‌ధ్య‌లో తెలుగు ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చిన వ‌ర్మ‌… మళ్ళీ తెలుగులో త‌న‌దైన మార్కు సినిమాల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది నాగార్జునతో క‌లిసి ‘ఆఫీస‌ర్‌’ను తెర‌కెక్కించాడు. నాగ్‌, వ‌ర్మ కాంబినేష‌న్ అంటేనే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్.‘శివ’ లాంటి ట్రెండ్ సెట్టింగ్‌ ఫిల్మ్ తో మెస్మ‌రైజ్ చేసిన ఈ కాంబో… చాలా కాలం త‌రువాత జ‌ట్టుక‌ట్ట‌డంతో అంచ‌నాలు పుట్టుకొచ్చాయి. అయితే పేల‌వ‌మైన క‌థ‌నంతో… `ఆఫీస‌ర్‌` ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

పూరి జ‌గ‌న్నాథ్‌:


 

ఒక‌ప్పుడు ఎన్నో సూప‌ర్ హిట్ల‌ను ఇండ‌స్ట్రీకి అందించిన ద‌ర్శ‌కుడు… ఇప్ప‌డు స‌రైన విజ‌యం కోసం ఎదురు చూస్తున్న ప‌రిస్థితి. అత‌నే పూరి జ‌గ‌న్నాథ్. 2015లో వ‌చ్చిన ‘టెంప‌ర్’ త‌ర్వాత పూరి తెర‌కెక్కించిన మ‌రే సినిమా కూడా విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. సినిమాల‌ను చాలా తొంద‌ర‌గా తెర‌కెక్కిస్తార‌ని మంచి పేరున్న పూరికి మాత్రం… 2018 ప్ర‌త్యేక‌మ‌నే చెప్పుకోవాలి. ఎందుకంటే… ఈ ఏడాది పూరి త‌న త‌న‌యుడు ఆకాష్‌ను హీరోగా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేస్తూ సినిమాను రూపొందించాడు. ఆ చిత్ర‌మే ‘మెహ‌బూబా’. ప్రేమ‌క‌థా చిత్రాల‌ను చాలా చ‌క్క‌గా మలిచే పూరి… ఈ సినిమాతో మ‌ళ్ళీ స‌క్సెస్ బాట ప‌డ‌తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే… ఈ సినిమా ఫ‌లితం కూడా పూరికి అనుకూలంగా రాలేదు. దీంతో మ‌ళ్ళీ విజ‌యం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే హీరోరామ్ తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ మూవీ జనవరి లో ప్రారంభమై మే నెలలో రిలీజ్ కానుంది. ఇది కాకుండా యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో వ‌చ్చే ఏడాది ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

వి.వి.వినాయ‌క్‌:


 

మాస్ సినిమాల‌ను తీయ‌డంలో డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ శైలే వేరు. కెరీర్ ఆరంభంలో ప‌లు విజ‌యాల‌ను అందుకున్న విన‌య్‌… గ‌త కొంత‌కాలంగా ట్రాక్ త‌ప్పాడు. అయితే… గ‌తేడాది మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఫిల్మ్ అయిన ‘ఖైదీ నంబ‌ర్ 150’ తో మ‌ళ్ళీ విజ‌యాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది మాత్రం ఆ స‌క్సెస్‌ను కంటిన్యూ చేయ‌లేక‌పోయాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కించిన ‘ఇంటిలిజెంట్‌’తో పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు. న‌ట‌సింహ‌ బాల‌కృష్ణ‌తో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ చేసే ప‌నిలో ఉన్న వినాయ‌క్‌… ఆ సినిమాతోనైనా మ‌ళ్ళీ విజ‌యాల బాట ప‌డ‌తాడేమో చూడాలి.

శ్రీ‌ను వైట్ల‌:


 

ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌డిగా దూసుకుపోయాడు శ్రీ‌ను వైట్ల‌. గ‌తంలో వ‌రుస విజ‌యాల‌తో మంచి దూకుడు చూపించిన ఈ దర్శకుడు… గత కొంతకాలంగా విజ‌యం కోసం పరిత‌పిస్తున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాల‌నే ఉద్దేశంతో ఈసారి త‌న‌కు అచ్చొచ్చిన హీరో ర‌వితేజ‌తో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాను తెర‌కెక్కించాడు. గ‌తంలో ఈ కాంబినేష‌న్‌ ‘నీకోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ లాంటి సినిమాల‌తో హ్యాట్రిక్ అందుకోవ‌డంతో… ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అయితే…ఎన్నో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డంలో ఫెయిల్ అవ‌డంతో శ్రీ‌ను వైట్ల‌ ఖాతాలో మ‌రో ప‌రాజ‌యం వ‌చ్చి చేరింది.

కృష్ణ‌వంశీ:


 

తెలుగుద‌నానికి ప‌ర్యాయ‌ప‌దంలా నిల‌చిన ద‌ర్శ‌కుల‌లో క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ఒక‌డు. స్టార్ హీరోల‌ను కూడా కొత్త‌గా ఆవిష్క‌రించిన ఘ‌న‌త ఆయ‌న‌కు ద‌క్కుతుంది. అయితే… గ‌త కొంత‌కాలంగా కృష్ణ‌వంశీ స్థాయికి త‌గ్గ విజ‌యాలు రాలేద‌నే చెప్పాలి. గ‌తేడాది విడుద‌లైన `న‌క్ష‌త్రం` ఆయ‌న అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఈ ఏడాది అయితే… నో రిలీజ్ ఇయ‌ర్ గా నిలిచిపోయింది. అయితే… వ‌చ్చే ఏడాది మాత్రం ఓ ఆస‌క్తిక‌ర‌మైన సినిమాతో రాబోతున్నాడు కృష్ణ‌వంశీ. మ‌రాఠిలో విజ‌యం సాధించిన `న‌ట సామ్రాట్‌` చిత్రాన్ని… త‌న ప్రియ‌మైన న‌టుడు ప్రకాష్ రాజ్ కాంబినేష‌న్‌లో చేయ‌బోతున్నాడు కృష్ణ‌వంశీ. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ మూవీ… వ‌చ్చే ఏడాది తెర‌పైకి రాబోతోంది. సో… ఆయ‌న అభిమానుల‌కు ఈ ప్రాజెక్ట్ ఎంతో స్సెష‌ల్ అన్న‌మాట‌.

బోయ‌పాటి శ్రీ‌ను:


 

మాస్ చిత్రాల‌ను తీయ‌డంలో బోయ‌పాటి శ్రీ‌ను శైలే వేరు. స్టార్ హీరోల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్న బోయ‌పాటికి… ఈ ఏడాది నో రిలీజ్ ఇయ‌ర్ గా నిల‌చింది. ప్ర‌స్తుతం రామ్‌ చ‌ర‌ణ్‌తో `విన‌య విధేయ రామ‌` చేస్తున్న బోయ‌పాటి… వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

శేఖ‌ర్ క‌మ్ముల‌:


 

ఫీల్ గుడ్ మూవీస్ ని అందించ‌డంలో శేఖ‌ర్ క‌మ్ముల శైలే వేరు. గ‌తేడాది `ఫిదా`తో సంచ‌లన విజ‌యాన్ని అందుకున్న ఈ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ కి ఈ సంవ‌త్స‌రం నో రిలీజ్ ఇయ‌ర్ గా నిల‌చింది. అయితే… వ‌చ్చే ఏడాది త‌న‌శైలి సినిమాతోనే… కొత్త తార‌ల కాంబినేష‌న్‌తో రాబోతున్నాడు క‌మ్ముల‌.

క్రిష్‌:


 

వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను రూపొందించే క్రిష్‌… గ‌తేడాది బాల‌కృష్ణ వందో చిత్రం `గౌత‌మీపుత్ర‌ శాత‌క‌ర్ణి`ని తెర‌కెక్కించి మెప్పించాడు. అయితే… ఈ ఏడాది మాత్రం ఆయ‌న‌కి నో రిలీజ్ ఇయ‌ర్‌గా నిల‌చింది. అయితే వ‌చ్చే ఏడాది ఆరంభంలో మూడు చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. య‌న్టీఆర్ రెండు భాగాలైన `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`, `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` తో పాటు.. హిందీ చిత్రం `మ‌ణిక‌ర్ణిక‌` నెల రోజుల గ్యాప్‌లో జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి నెల‌లో తెర‌పైకి రానున్నాయి. మ‌రి… ఈ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యం అందుకుంటారేమో చూడాలి.

అనిల్ రావిపూడి:


 

`ప‌టాస్‌`, `సుప్రీమ్‌`, `రాజా ది గ్రేట్‌` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న అనిల్ రావిపూడికి ఈ ఏడాది… నో రిలీజ్ ఇయ‌ర్‌గా నిల‌చింది. అయితే… వ‌చ్చే ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2`తో రాబోతున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. వెంకటేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించిన ఈ సినిమా కామిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది.

ప‌ర‌శురామ్‌:


 

ఓ ప‌క్క క‌మ‌ర్షియ‌ల్ మూవీని తెర‌కెక్కిస్తూనే… మ‌రోవైపు మాన‌వ‌తా విలువ‌ల‌నూ… భావోద్వేగ స‌న్నివేశాల‌ను హృద‌యానికి హ‌త్తుకునేలా చెప్ప‌గ‌లిగే అతి కొద్దిమంది ద‌ర్శ‌కుల‌లో ప‌ర‌శురామ్ ఒక‌డు. ‘యువ‌త‌’, ‘సోలో’, ‘శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు’ సినిమాల‌తో విజ‌యాల‌ను అందుకున్నా… ఇప్ప‌టివ‌ర‌కు త‌న టాలెంట్ కు త‌గ్గ సాలిడ్ హిట్‌ను మాత్రం అందుకోలేక‌పోయాడు. అయితే… ఈ ఏడాది అల్లు అర‌వింద్ నిర్మాణంలో తెర‌కెక్కిన ‘గీత గోవిందం’ తో ఆ లోటును కూడా తీర్చేసుకున్నాడు. అంతేకాదు.. 2018లో వ‌న్ ఆఫ్ ద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌గా ‘గీత గోవిందం’ నిల‌వ‌డంతో… త‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా మ‌ళ్ళీ ఇదే బ్యానర్‌లో చేయ‌డానికి సిద్ధపడుతున్నాడు ఈ డైరెక్టర్. మొత్త‌మ్మీద‌… ప‌దేళ్ళుగా ఎదురుచూస్తున్న మెగా హిట్‌ను అందుకోవ‌డమే కాకుండా… `సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌`గా నిలచాడు ప‌రశురామ్‌.

నాగ్ అశ్విన్‌:


 

‘ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం’తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమైన‌ నాగ్ అశ్విన్‌… మొద‌టి సినిమాతోనే సెన్సిబుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. రెండో సినిమాని కూడా అలాంటి స‌బ్జెక్ట్ తీస్తాడేమోన‌ని అంద‌రూ అనుకుంటే… త‌ను మాత్రం అందుకు భిన్నంగా పెద్ద సాహ‌స‌మే చేశాడు. ఆ సాహ‌సం పేరే… మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌. అల‌నాటి మేటి న‌టి సావిత్రి జీవితాన్ని ‘మహానటి’గా మలిచే బృహ‌త్ కార్యం చేప‌ట్ట‌డ‌మే కాదు… ఆ సినిమాని జ‌న‌రంజ‌కంగా తీర్చిదిద్ద‌డంలోనూ నాగ్ అశ్విన్ నూటికి నూరుపాళ్ళు విజ‌యం సాధించాడు. అలాగే… కీర్తి సురేష్ ని సావిత్రిగా మార్చేసి మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు… తెలుగునాట బ‌యోపిక్ ట్రెండ్ కు ఊపు తెచ్చాడు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళంలో కూడా విడుద‌లైన ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. అదే విధంగా… ఈ ఏడాది టాప్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ బ‌యోపిక్‌తో టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు నాగ్‌. అంతేకాదు… “బెస్ట్ డైరెక్ట‌ర్ ఆఫ్ ది ఇయర్” అనిపించుకున్నాడు. ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ త‌న తదుప‌రి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ప‌నుల్లో బిజీగా ఉన్నాడు.

కె.ఎస్‌.ర‌వికుమార్‌:


 

త‌మిళ‌నాట స్టార్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న కె.ఎస్‌.ర‌వికుమార్‌… తెలుగులోనూ కొన్ని ప్ర‌య‌త్నాలు చేశాడు. అయితే… అవేవీ ఆశించిన విజ‌యాన్ని అందించ‌లేదు. అయితే… ఈ ఏడాది విడుద‌లైన సినిమాతో ఆ లోటు కాస్త తీరిన‌ట్ల‌య్యింది. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవితో ‘స్నేహంకోసం’(1999)… కింగ్ నాగార్జున‌తో ‘బావ న‌చ్చాడు’(2001)… రాజ‌శేఖ‌ర్‌తో ‘విల‌న్‌’(2003) చిత్రాల‌ను తెర‌కెక్కించిన ర‌వికుమార్ కి… ఈ సినిమాలేవీ అత‌నికి అంత‌గా క‌ల‌సి రాలేదు. 15 సంవ‌త్స‌రాల గ్యాప్ త‌ర్వాత… ఈ ఏడాది మ‌రో స్టార్ హీరో బాల‌కృష్ణ కాంబినేష‌న్ లో ‘జై సింహా’తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా లాభాల బాట ప‌ట్ట‌డమే కాకుండా… దాదాపుగా 20 ఏళ్ళుగా ర‌వికుమార్‌కు అంద‌ని క‌ల‌గా మిగిలిన స్ట్ర‌యిట్ తెలుగు ఫిల్మ్ హిట్‌ను అందించింది.

జి.అశోక్‌:


 

‘పిల్ల జ‌మీందార్‌’ వంటి ఫీల్ గుడ్ మూవీతో అల‌రించిన‌ డైరెక్ట‌ర్ జి. అశోక్‌… ఆ త‌రువాత `సుకుమారుడు`తో నిరాశ‌ప‌రిచాడు. అయితే… ఈ ఏడాది రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ‘భాగ‌మ‌తి’తో మ‌ళ్ళీ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ఈ థ్రిల్ల‌ర్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది.

మేర్ల‌పాక గాంధీ:


 

‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో వ‌రుస‌గా రెండు విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న యువ ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ. హ్యాట్రిక్ ప్ర‌య‌త్నంగా… ఈ ఏడాది ‘కృష్ణార్జున యుధ్ధం’ సినిమాను తెర‌కెక్కించాడు. వరుస విజ‌యాల మీద ఉన్న హీరో నాని కాంబినేష‌న్‌తో… హ్యాట్రిక్ అందుకోవ‌డం న‌ల్లేరు మీద న‌డ‌కే అని అనుకున్నారంతా. కానీ రొటీన్ క‌థ కావ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. గాంధీ హ్యాట్రిక్ విజ‌యానికి అడ్డుక‌ట్ట వేయ‌డ‌మే కాదు… నాని స్పీడ్‌కి కూడా బ్రేక్ వేసింది.

క‌ళ్యాణ్ కృష్ణ‌:


 

‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాల‌తో వ‌రుస‌గా రెండు విజ‌యాల‌ను అందుకున్నాడు క‌ళ్యాణ్ కృష్ణ‌. మూడో చిత్రంగా మాస్ రాజా ర‌వితేజ కాంబినేష‌న్‌లో ‘నేల టిక్కెట్టు’ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమాతో మ‌రో స‌క్సెస్‌ను అందుకుని హ్యాట్రిక్ డైరెక్టర్ అనిపించుకోవాలని అనుకున్న క‌ళ్యాణ్ కృష్ణ‌కు నిరాశే ఎదురైంది. క‌థాక‌థ‌నాల్లో ఎలాంటి స‌రుకు లేక‌పోవ‌డంతో… బాక్సాఫీస్ వ‌ద్ద నేల‌బారు సినిమాగా మిగిలిపోయింది. ఈ నేప‌థ్యంలో… త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు కింగ్ నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ సీక్వెల్‌ను తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డాడు ఈ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం… స్క్రిప్ట్ ద‌శ‌లో ఉన్న‌ ఈ చిత్రం వ‌చ్చే ఏడాది పట్టాలెక్క‌నుంది.

మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి:


 

‘జెంటిల్‌మ‌న్‌’(2016), ‘అమీతుమీ’(2017)తో వ‌రుస సంవ‌త్స‌రాల్లో రెండు విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి. ఈ ఏడాది సుధీర్‌బాబు, అదితిరావ్ హైద‌రీ హీరోహీరోయిన్లుగా ‘స‌మ్మోహ‌నం’ను తెర‌కెక్కించాడు. పేరుకి త‌గ్గ‌ట్టే స‌మ్మోహ‌నంగా సాగిన ఈ సినిమా కూడా మంచి విజ‌యాన్ని అందించింది. దీంతో… వ‌రుసగా మూడు సంవ‌త్స‌రాల పాటు జూన్ నెల‌ల్లో విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడిగా నిలచాడు ఈ సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌.

త‌రుణ్ భాస్క‌ర్‌:


 

2016లో విడుద‌లైన‌ ‘పెళ్ళిచూపులు’ తో డైరెక్టర్‌గా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు త‌రుణ్ భాస్క‌ర్. ఈ చిత్రంతో భారీ విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాకుండా… ప‌లు అవార్డుల‌ను కూడా సొంతం చేసుకున్నాడు. దాదాపు రెండేళ్ళ గ్యాప్ త‌రువాత‌ త‌న రెండో చిత్రం ‘ఈ న‌గ‌రానికి ఏమైంది?’ తో ప‌ల‌క‌రించాడు త‌రుణ్‌. యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ… ఆశించిన ఫ‌లితాన్ని అయితే అందుకోలేక‌పోయింది ఈ సినిమా. త్వ‌ర‌లోనే త‌న మూడో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌.

ఎ. కరుణాక‌ర‌న్‌:


 

ఎ.కరుణాక‌ర‌న్‌… ప్రేమ‌క‌థా చిత్రాల రూపొందించ‌డంలో స్పెష‌లిస్ట్ గా నిల‌చిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. `తొలిప్రేమ‌`తో యువ‌త‌రాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఈ డైరెక్ట‌ర్‌… ‘డార్లింగ్’ త‌ర్వాత మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోలేక‌పోయాడు. ఈ నేప‌థ్యంలో… ఈ ఏడాది సాయిధ‌రమ్ తేజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా ‘తేజ్ ఐ ల‌వ్ యు’ను తెర‌కెక్కించాడు. బోరింగ్ స్క్రీన్ ప్లేతో సాగిన ఈ సినిమా… టార్గెట్ ఆడియ‌న్స్‌ను కూడా మెప్పించ‌లేక‌పోయింది. దీంతో… క‌రుణాక‌ర‌న్‌కి మ‌రోసారి నిరాశ‌త‌ప్ప‌లేదు.

భీమినేని శ్రీ‌నివాస‌రావు:


 

రీమేక్ స్పెష‌లిస్ట్ అయిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీ‌నివాస‌రావు.. ఈ ఏడాది `సిల్లీ ఫెలోస్‌`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. `సుడిగాడు` త‌రువాత `అల్ల‌రి`న‌రేష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కించిన ఈ సినిమా… భీమినేనికి ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేక‌పోయింది.

స‌తీష్ వేగేశ్న‌:


 

‘శ‌తమానంభ‌వ‌తి’తో అవార్డుల పంట పండించిన దర్శకుడు స‌తీష్ వేగేశ్న‌. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు ద‌గ్గరైన స‌తీష్ … త‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌నే టార్గెట్ చేస్తూ తెర‌కెక్కించాడు. ఆ చిత్ర‌మే ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’. పెళ్ళికున్న ప్రాముఖ్య‌త‌, దాని విలువ‌లను తెలియ‌జేస్తూ ఈ సినిమాని రూపొందించాడు. కుటుంబ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఈ సినిమా… బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఓ మోస్తరు విజ‌యాన్ని అందుకుంది. ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌లో బిజీగా ఉన్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌.

మారుతి:


 

మ‌నుషుల్లో ఉండే డిజార్డర్లను హైలైట్ చేస్తూ… దానికి త‌న‌శైలి కామెడీని జ‌త‌చేస్తూ సినిమాల‌ను రూపొందిస్తున్న ద‌ర్శ‌కుడు మారుతి. ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్’(2015), ‘బాబు బంగారం’(2016), ‘మ‌హానుభావుడు’(2017) చిత్రాలు ఈ కోవ‌కు చెందిన సినిమాలే. ఈ ఏడాది కాస్త భిన్నంగా ఇగోయిస్ట్‌ల క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు మారుతి. ఆ చిత్ర‌మే ‘శైల‌జారెడ్డి అల్లుడు’. ఇగో ఉన్న త‌ల్లీకూతుళ్ళ‌ను డీల్ చేసిన‌ హీరో క‌థ‌తో ఈ మూవీని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. అయితే గ‌త చిత్రాల మాదిరి ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ్యాజిక్ చేయ‌లేక‌పోయినా… యావ‌రేజ్ గ్రాస‌ర్ గా నిల‌చింది ఈ సినిమా. ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌లో బిజీగా ఉన్నాడు మారుతి.

శ్రీ‌రామ్ ఆదిత్య‌:


 

‘భ‌లే మంచి రోజు’, ‘శమంత‌క‌మ‌ణి’ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న యువ‌ ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య… మూడో చిత్రంగా ‘దేవ‌దాస్‌’ను రూపొందించాడు. నాగార్జున, నాని హీరోలుగా న‌టించిన ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. త్వ‌ర‌లోనే త‌న నాలుగో చిత్రానికి శ్రీ‌కారం చుట్టే ప‌నిలో ఉన్నాడు.

చందు మొండేటి:


 

‘కార్తికేయ‌’, ‘ప్రేమ‌మ్‌’తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న చందు మొండేటి… త‌న మూడో చిత్రాన్ని త‌న‌ ‘ప్రేమ‌మ్’ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌తోనే తెర‌కెక్కించాడు. అ చిత్ర‌మే ‘స‌వ్య‌సాచి’. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా… బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ర‌వాలేద‌నిపించుకుంది.

హ‌ను రాఘ‌వ‌పూడి:


 

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి స్టైలే వేరు. అయితే ఆ స్టైల్‌కి భిన్నంగా ‘లై’ సినిమాను తెర‌కెక్కించి కెరీర్‌లో తొలిసారి అప‌జ‌యాన్ని అందుకున్నాడు హ‌ను. కానీ ఈ ఏడాది మ‌ళ్ళీ త‌న‌కు క‌లిసొచ్చిన రొమాంటిక్ స‌బ్జెక్ట్‌తోనే ‘ప‌డి ప‌డి లేచె మ‌న‌సు’ని రూపొందించాడు. శర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 21 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్టాఫ్ ఓకే అనిపించినా… సెకండాఫ్ నిరాశ పరచడం తో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఏదేమైనా… మ‌రికొద్ది రోజుల్లో ఈ సినిమా ఫ‌లితంపై క్లారిటీ వ‌స్తుంది.

సంక‌ల్ప్ రెడ్డి:


 

‘ఘాజీ’ సినిమాతో జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి. తాజాగా ‘అంత‌రిక్షం 9000 కె.ఎం.పి.హెచ్’ మూవీని తెర‌కెక్కించాడు. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన‌ ఈ స్పేస్ థ్రిల్ల‌ర్ డిసెంబర్ 21 న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. తెలుగులో వ‌చ్చిన తొలి స్పేస్ థ్రిల్ల‌ర్ అయిన `అంత‌రిక్షం` టార్గెట్ ఆడియ‌న్స్ ను మెస్మ‌రైజ్ చేయ‌డంలో నూటికి నూరుపాళ్ళు స‌ఫ‌లీకృత‌మైంది. `వావ్‌` అనిపించేలా… థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చి మ‌రోసారి మెప్పించాడు ఈ వెల్ ఎడ్యుకేటేడ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. తొలి, మ‌లి చిత్రాల కోసం విభిన్న క‌థాంశాల‌ను ఎంచుకుని… తెలుగు సినిమా స్థాయిని మ‌రో రేంజ్‌కు తీసుకెళ్ళిన సంక‌ల్ప్…మూడో సినిమా కోసం ఎలాంటి స‌బ్జెక్ట్ ఎంచుకుంటాడో అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

జి.నాగేశ్వ‌ర్ రెడ్డి:


 

హాస్య చిత్రాల‌ను రూపొందించ‌డంలో జి.నాగేశ్వ‌ర‌రెడ్డి శైలే వేరు. ఆరంభంలో ప‌లు విజ‌యాల‌ను అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌… ఈ ఏడాది మంచు విష్ణు హీరోగా `ఆచారి అమెరికా యాత్ర‌` చేశాడు. అయితే… ఈ ప్ర‌యాణం అత‌నికి విజ‌యాన్నైతే ఇవ్వ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం.. ఈ కామెడీ స్పెష‌లిస్ట్ సందీప్ కిష‌న్ హీరోగా `తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్‌` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాతోనైనా మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

మ‌ద‌న్‌:


 

`పెళ్ళైన కొత్త‌లో` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి విజ‌యాన్ని అందుకున్న మ‌ద‌న్‌… ఆ త‌రువాత ఆ స్థాయి విజ‌యాన్ని అందుకోలేక‌పోయాడు. ఈ ఏడాది మోహ‌న్ బాబు, మంచు విష్ణు, శ్రియ ప్ర‌ధాన పాత్ర‌ల్లో `గాయ‌త్రి` చిత్రాన్ని రూపొందించాడు. అయితే… ఈ సినిమా ఈ ద‌ర్శ‌కుడికి ఏ మాత్రం ప్ల‌స్ కాలేక‌పోయింది.

చంద్ర‌ సిద్ధార్థ‌:


 

`ఆ న‌లుగురు`, `మ‌ధుమాసం`, `అంద‌రి బంధువ‌య` చిత్రాల‌తో సెన్సిబుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న చంద్ర‌ సిద్ధార్థ‌… చాలా కాలం గ్యాప్ త‌రువాత `ఆట‌గ‌ద‌రా శివ‌` సినిమాతో ప‌ల‌క‌రించాడు. ఓ కొత్త త‌ర‌హా క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా… ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

త్రినాథ రావు న‌క్కిన‌:


 

`సినిమా చూపిస్త మామ‌`, `నేను లోక‌ల్‌` చిత్రాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న త్రినాథ‌రావ్ న‌క్కిన‌… ఈ ఏడాది `హ‌లో గురు ప్రేమ కోస‌మే` చిత్రంతో ప‌ల‌క‌రించాడు. రామ్ హీరోగా న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్నే అందుకుంది. త్వ‌ర‌లోనే… ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్… విక్ట‌రీ వెంకటేష్ కాంబినేష‌న్‌లో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది.

ర‌విబాబు:


 

కొత్త త‌ర‌హా సినిమాల‌తో అల‌రించే ద‌ర్శ‌కుడు ర‌విబాబు. `అన‌సూయ‌`, `న‌చ్చావులే`, `అవును` వంటి సినిమాల‌తో ఆక‌ట్టుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌… ఈ ఏడాది పందిపిల్ల ప్ర‌ధాన పాత్ర‌లో `అదుగో` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. చాలా కాలంగా వాయిదాలు ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా… ఆశించిన ఫ‌లితాన్ని అందివ్వ‌లేక‌పోయింది.

శ్రీ‌వాస్‌:


 

`లక్ష్యం`, `లౌక్యం` చిత్రాల‌తో అల‌రించిన ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్‌… స్వ‌ల్ప విరామం త‌రువాత ఈ ఏడాది `సాక్ష్యం` సినిమాతో సంద‌డి చేశాడు. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా… ఎగ్జిక్యూష‌న్ విష‌యంలో మాత్రం నిరాశ‌ప‌రిచింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం… శ్రీ‌వాస్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని త‌న‌కు క‌లిసొచ్చిన క‌థానాయ‌కుడైన గోపీచంద్ కాంబినేష‌న్‌లో చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నాడు.

మొత్త‌మ్మీద‌… ఈ ఏడాది అటు సీనియ‌ర్ ద‌ర్శ‌కులు, ఇటు యువ ద‌ర్శ‌కులు బాక్సాఫీస్ వ‌ద్ద త‌మ‌దైన ముద్ర‌వేశారు. అయితే… ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన కొన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల సినిమాలు మాత్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. మ‌రి… వ‌చ్చే ఏడాది అయినా… ఈ ద‌ర్శ‌కులు మ‌ళ్ళీ ట్రాక్ లోకి వ‌స్తారేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here