2018లో తెలుగు క‌థానాయిక‌ల జోరు

Overview of Tollywood Heroines in 2018,2018 Telugu Heroines List,Tollywood Actresses 2018,2018 Top Heroines in Tollywood,Latest Telugu Movies News,List of Telugu Heroines in 2018,List of Tollywood Heroines in 2018,Overall View of Telugu Heroines in 2018,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Cinema Updates,Tollywood Actresses Overview 2018
Overview of Tollywood Heroines in 2018

క‌థానాయిక లేని సినిమాని ఊహించ‌లేం. ఎందుకంటే… సినిమా అంటేనే గ్లామ‌ర్‌. మ‌రి ఆ గ్లామ‌ర్ కి కేరాఫ్ అడ్ర‌స్ లాంటి హీరోయిన్ లేకుండా సినిమాని ఊహించ‌డం క‌ష్ట‌మే క‌దా! ఈ ఏడాది కూడా ప‌లువురు టాప్ హీరోయిన్స్‌, సీనియ‌ర్ హీరోయిన్స్‌, మీడియం రేంజ్ హీరోయిన్స్ తెర‌పై సంద‌డి చేశారు. మ‌రి… వారిలో ఏ ఏ హీరోయిన్ ఎన్నెన్ని సినిమాల‌తో ఈ ఏడాది సంద‌డి చేశారు? వాటిలో విజ‌యం అందుకున్న సినిమాలేంటి? నిరాశ ప‌రిచిన సినిమాలేంటి? ఇలాంటి విష‌యాల‌తో… 2018 జ్ఞాప‌కాలను నెమ‌రువేస్తూ… వారు సాగిన తీరుని గుర్తు చేసుకుందాం…

అనుష్క‌:


 

`అరుంధ‌తి`తో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ లా నిల‌చిన క‌థానాయిక అనుష్క‌. గ‌తేడాది `బాహుబ‌లి – ది కంక్లూజ‌న్‌`లో దేవ‌సేన‌గా అల‌రించిన ఈ బెంగ‌ళూరు బ్యూటీ… ఈ ఏడాది `భాగ‌మ‌తి`లో న‌ట విశ్వ‌రూపాన్ని చూపింది. మ‌రో మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ `సైలెన్స్‌` అనే ద్విభాషా చిత్రంలో న‌టిస్తోంది.

న‌య‌న తార‌:


 

ఇటీవ‌ల కాలంలో పాత్ర న‌చ్చితేనే సినిమాలు చేస్తున్న కేర‌ళ‌కుట్టి న‌య‌న‌తార‌… ఈ ఏడాది కూడా అదే బాట ప‌ట్టింది. సంక్రాంతికి విడుద‌లైన `జై సింహా`లో అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌లో క‌నిపించి అల‌రించింది. అలాగే అనువాద చిత్రాలు `క‌ర్త‌వ్యం`, `కో కో కోకిల‌`తో న‌టిగా తనేమిటో మ‌రోసారి చెప్ప‌క‌నే చెప్పింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చిరంజీవికి జోడీగా `సైరా న‌ర‌సింహారెడ్డి`లో న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

స‌మంత‌:


 

పెళ్ళ‌యినా దూకుడు కొన‌సాగిస్తోంది చెన్నై బ్యూటీ స‌మంత‌. ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి`, `అభిమ‌న్యుడు` చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ఈ అక్కినేని వారి కోడ‌లు… ద్వితీయార్ధంలో తొలిసారిగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో ప‌ల‌క‌రించింది.`యూట‌ర్న్` పేరుతో విడుద‌లైన ఈ రీమేక్ చిత్రం సామ్ కు న‌టిగా మంచి మార్కులే వేసింది. మొత్త‌మ్మీద‌… రామ‌ల‌క్ష్మీ (రంగ‌స్థ‌లం), మ‌ధుర‌వాణి (మ‌హాన‌టి), ర‌చ‌న (యూట‌ర్న్)గా మూడు వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో క‌నిపించే అవ‌కాశాన్ని సామ్ కి ఈ ఏడాది క‌ల్పించింది. వ‌చ్చే ఏడాది కూడా ఇదే జోష్ తో `మ‌జిలీ’ (ప్ర‌చారంలో ఉన్న పేరు) `ఓ బేబీ… ఎంత స‌క్క‌గున్నావే` (ప్ర‌చారంలో ఉన్న పేరు) సినిమాల్లోనూ అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో క‌నిపించనుంది.

కాజ‌ల్‌:


 

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ ఈ ఏడాది ముచ్చ‌ట‌గా మూడు తెలుగు చిత్రాల్లో ద‌ర్శ‌న‌మిచ్చింది. `అ!`, `ఎం.ఎల్‌.ఎ`, `క‌వ‌చం` పేర్ల‌తో రిలీజైన ఈ సినిమాలు కాజ‌ల్ కి ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేదు. అయితే… `అ!`లో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ తేజ రూపొందిస్తున్న `సీత‌` (ప్ర‌చారంలో ఉన్న పేరు) తో పాటు క‌మ‌ల్ హాస‌న్ – శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న‌`ఇండియ‌న్ 2`లో న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో న‌టిస్తోంది.

ర‌కుల్ ప్రీత్ సింగ్‌:


 

గ‌తేడాది నాలుగు తెలుగు చిత్రాల‌తో అల‌రించిన ఉత్త‌రాది సోయ‌గం ర‌కుల్ ప్రీత్ సింగ్‌… ఈ ఏడాది ఒక్క తెలుగు చిత్రంలోనూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే… వ‌చ్చే ఏడాదిలో ర‌కుల్ చెప్పుకోద‌గ్గ స్థాయిలో సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌నుంది. `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ లో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. అలాగే `వెంకీ మామ‌`లో నాగ‌చైత‌న్య‌కి జోడీగానూ… సూర్య `ఎన్జీకే`, కార్తి `దేవ్‌`లోనూ ర‌కుల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సో… 2019లో ర‌కుల్ వ‌రుస చిత్రాల‌తో మెస్మ‌రైజ్ చేయ‌నుంద‌న్న‌మాట‌.

శ్రియా సరన్ :


 

ప‌దిహేడేళ్ళుగా క‌థానాయిక‌గా రాణిస్తోన్న ఢిల్లీ డాళ్ శ్రియ‌… ఈ ఏడాది కూడా రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల్లో భాగ‌మైంది. `గాయ‌త్రి`, `వీర‌భోగ‌వ‌సంత రాయ‌లు` సినిమాల్లో శ్రియ… న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో మెరిసింది. అయితే… ఈ రెండు సినిమాలూ క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. కాగా… సంక్రాంతికి రానున్న `య‌న్టీఆర్‌` బ‌యోపిక్ లో అతిథిగానూ… `వెంకీ మామ‌`లో వెంకీకి జోడీగానూ శ్రియ సంద‌డి చేయ‌నుంది.

కీర్తి సురేష్‌:


హీరోయిన్ ఆఫ్ ది ఇయ‌ర్… ఎవ‌రంటే నిస్సందేహంగా చెప్పాల్సిన పేరు ఈ కేర‌ళ‌కుట్టిదే. సంఖ్యా ప‌రంగానూ, అభిన‌యం ప‌రంగానూ కీర్తికి మంచి కీర్తినే ఆర్జించి పెట్టింది 2018. అభినేత్రి సావిత్రి బ‌యోపిక్ గా తెర‌కెక్కిన `మ‌హాన‌టి`లో సావిత్రిగా జీవించేసి… న‌టిగా ఎన్నో రెట్లు ఎదిగింది. ఇంకా చెప్పాలంటే… `మ‌హాన‌టి`కి ముందు… `మ‌హాన‌టి`కి త‌రువాత అన్న‌ట్లుగా ఆమె కెరీర్ ఉంటుంద‌నడంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. `మ‌హాన‌టి`తో పాటు `అజ్ఞాత‌వాసి`లోనూ క‌థానాయిక‌గా న‌టించిన కీర్తి… త‌మిళ అనువాద చిత్రాలు `గ్యాంగ్, సామి, పందెం కోడి 2, స‌ర్కార్‌`ల్లోనూ సంద‌డి చేసింది. మొత్త‌మ్మీద‌… అర‌డ‌జ‌ను చిత్రాల‌తో సంఖ్యా ప‌రంగానూ… `మ‌హాన‌టి`తో న‌టిగానూ కీర్తి 2018లో త‌న హ‌వా కొన‌సాగించి ‘హీరోయిన్ ఆఫ్ ది ఇయ‌ర్’ అనిపించుకుంది.

పూజా హెగ్డే:


 

అందాల తార పూజా హెగ్డేకి ఈ ఏడాది గుర్తుండిపోతుంది. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ `రంగ‌స్థ‌లం`లో చేసిన జిగేల్ రాణి పాట‌తో మాస్ ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేసిన పూజ‌… ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన సూప‌ర్ హిట్ మూవీ `అర‌వింద స‌మేత‌`లో అర‌వింద‌గా కెరీర్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్‌తో అల‌రించింది. అలాగే `సాక్ష్యం`లోనూ త‌న అంద‌చందాల‌తో క‌వ్వించింది. ప్ర‌స్తుతం ఈ స్ట‌న్నింగ్ బ్యూటీ మ‌హేష్ బాబుకి జోడీగా `మ‌హ‌ర్షి`, ప్ర‌భాస్ కు జోడీగా `జిల్‌` రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రంలోనూ న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాలు తెర‌పైకి రానున్నాయి. సో… ఇదే ఫామ్‌తో పూజ మ‌రో రెండు ఘ‌న‌విజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకుంటుందేమో చూడాలి.

సాయిప‌ల్ల‌వి:


 

హైబ్రిడ్ పిల్ల సాయిప‌ల్ల‌వి ఈ ఏడాది వేస‌విలో ద్విభాషా చిత్రం `క‌ణం`తో ప‌ల‌క‌రించింది. న‌టిగా ఈ సినిమా మంచి పేరు తీసుకువ‌చ్చినా… క‌మ‌ర్షియ‌ల్ గా మాత్రం వ‌ర్క‌వుట్ అవ‌లేదు. ఇక నెలలో `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`, `మారి 2`తో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాల్లోనూ త‌న శైలి న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసింది ప‌ల్ల‌వి.

త‌మ‌న్నా:


 

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ సంవ‌త్స‌రం రెండు తెలుగు చిత్రాల్లో సంద‌డి చేసింది. విశేషంగా… ఆ రెండు సినిమాలు కూడా ప్రేమ‌క‌థా చిత్రాలే కావ‌డం విశేషం. `నా నువ్వే`, `నెక్ట్స్ ఏంటి?` పేర్ల‌తో విడుద‌లైన ఈ సినిమాలు త‌మ్ము కెరీర్‌కి ప్ల‌స్ కాలేక‌పోయాయి. ప్ర‌స్తుతం ఈ తేనె క‌ళ్ళ సుంద‌రి… `ఎఫ్ 2`లో విక్ట‌రీ వెంక‌టేష్ కి జోడీగానూ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `సైరా న‌ర‌సింహారెడ్డి`లోనూ న‌టిస్తోంది. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ `ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి`లోనూ యాక్ట్ చేస్తోంది. వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ మూడు చిత్రాలతోనైనా… త‌మ‌న్నా తిరిగి స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌స్తుందేమో చూడాలి.

రాశి ఖ‌న్నా:


ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా… మూడు తెలుగు చిత్రాల్లో ద‌ర్శ‌న‌మిచ్చింది. వీటిలో `తొలిప్రేమ‌` మంచి విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా న‌టిగా మంచి పేరు కూడా తీసుకురాగా… `ట‌చ్ చేసి చూడు, శ్రీ‌నివాస క‌ళ్యాణం` నిరాశ ప‌రిచాయి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉంది.

ర‌ష్మిక‌:


 

`ఛ‌లో`తో ఈ ఏడాది తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ర‌ష్మిక‌… మొద‌టి సినిమాతోనే కుర్రకారు మ‌దిని దోచేసింది. ఇక రెండో చిత్రం `గీత గోవిందం`తో కెరీర్ బెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంది. అలాగే మ‌ల్టీస్టార‌ర్ `దేవ‌దాస్‌`లోనూ సంద‌డి చేసింది. పరిచ‌య‌మైన ఏడాదిలో మూడు చిత్రాల‌తో సంద‌డి చేసి… అందులో ఒక భారీ విజ‌యాన్ని అందుకుని… `సెన్సేష‌న‌ల్ హీరోయిన్ ఆఫ్ ది ఇయ‌ర్‌` గా నిల‌చింది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం ఈ క‌న్న‌డ బ్యూటీ `డియ‌ర్ కామ్రేడ్‌`తో బిజీగా ఉంది.

అను ఇమ్మాన్యుయేల్‌:


 

ఈ ఏడాది అను ఇమ్మాన్యుయేల్ ముచ్చ‌ట‌గా మూడు సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది. వీటిలో రెండు చిత్రాలు (`అజ్ఞాత‌వాసి`, `నాపేరు సూర్య‌`) అగ్ర హీరోల సినిమాలు కాగా… మ‌రొక‌టి `శైల‌జారెడ్డి అల్లుడు`. అయితే ఇవేవీ అను కెరీర్ కి ప్ల‌స్ కాలేక‌పోయాయి. అయితే… అతిథి పాత్ర‌లో మెరిసిన `గీత‌గోవిందం` కాస్త ఊర‌ట‌నిచ్చింది.

మెహ‌రీన్‌:


 

హ్యాట్రిక్ హీరోయిన్ మెహ‌రీన్‌… ఈ ఏడాది `పంతం`, `నోటా`, `క‌వ‌చం` చిత్రాల్లో సంద‌డి చేసింది. క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమాలేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. ప్ర‌స్తుతం ఈ స్ట‌న్నింగ్ బ్యూటీ… `ఎఫ్ 2`లో న‌టిస్తోంది. సంక్రాంతికి రానున్న ఈ చిత్రంతో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చే అవ‌కాశం పుష్క‌లంగా ఉంది.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌:


 

మ‌రో హ్యాట్రిక్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా మెహ‌రీన్ బాట‌లోనే మూడు చిత్రాల‌తో ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. `కృష్ణార్జున యుద్ధం`, `తేజ్ ఐ ల‌వ్ యు` నిరాశ‌ప‌రిచినా… `హ‌లో గురు ప్రేమ కోస‌మే` ఊర‌ట‌నిచ్చింది. ప్ర‌స్తుతం ఈ కేర‌ళ‌కుట్టి ఓ క‌న్న‌డ చిత్రంలో న‌టిస్తోంది.

అదితి రావ్ హైద‌రీ:


టాలెంటెడ్ బ్యూటీ అదితిరావ్ హైద‌రీ… ఈ ఏడాది జూన్ లో విడుద‌లైన `స‌మ్మోహ‌నం`తో చూప‌రుల‌ను స‌మ్మోహ‌న‌ప‌రిచింది. ఇక డిసెంబ‌ర్ 21 విడుదలయిన `అంత‌రిక్షం`లోనూ న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌లో మెరిసింది.

లావ‌ణ్య త్రిపాఠి:


 

తెలుగు తెర అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి… ఈ ఏడాది ఆరంభంలో `ఇంటిలిజెంట్‌`తో ప‌లక‌రించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో.. ఈ శుక్రవారం (డిసెంబ‌ర్ 21) విడుదలయిన `అంత‌రిక్షం` పైనే త‌న ఆశ‌ల‌ను పెట్టుకుంది. కాకపోతే ఈ సినిమా పూర్తిగా మంచి టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది. గ‌త ఐదు చిత్రాల‌తో నిరాశ‌ప‌డ్డ లావ‌ణ్య‌కి… బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫామ్ లో ఉన్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ అయినా హిట్ ఇచ్చి ఆదుకుంటాడేమో చూడాలి. మరి ఈ చిత్రం ఏ మేరకు నిలదొక్కుకుంటోందో చూడాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి. ఇక లవణ్య త్రిపాఠి నటించిన మరో సినిమా ముద్ర. నిఖిల్ తో జోడి గా నటించిన ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

ఇలియానా:

 

ఇలియానా… ద‌శాబ్దం కింద‌ట తెలుగునాట ఓ సంచ‌ల‌నం. వ‌రుస విజ‌యాల‌తో… భారీ పారితోషికంతో అప్ప‌ట్లో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయిన ఈ గోవా పాల‌కోవా… ఇటీవ‌ల కాలంలో బాలీవుడ్ కే ప‌రిమిత‌మైంది. దాదాపు ఆరేళ్ళ త‌రువాత ఈ సుంద‌రి… `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని`తో తెలుగువారిని ప‌ల‌క‌రించింది. అంతేకాదు… త‌న సొంత గొంతుని వినిపించి అభిమానుల‌ను మురిపించింది. అయితే… ఈ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో… మ‌ళ్ళీ బాలీవుడ్ వైపే దృష్టి పెట్టింది.

(ఎల్లుండి డిసెంబ‌ర్ 24న కెప్టెన్ ఆఫ్ ది షిప్స్ (డైరెక్ట‌ర్స్‌) జ‌యాప‌జ‌యాల గురించి విశ్లేష‌ణ‌)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=G1ioJoJfGxM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here