సొంత బ్యానర్“అన్నపూర్ణ కళానికేతన్” పై దుక్కిపాటి కొత్త చిత్రం – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 37,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 37

( రీక్యాప్)

( ఒకేసారి బెంగళూరు వంటి రాష్ట్రేతర ప్రాంతాలలో కూడా విడుదలైన ప్రేమ లేఖలు చిత్రానికి డెక్కన్ హెరాల్డ్ వంటి పత్రికలు ఎంతో ప్రోత్సాహకరమైన సమీక్షలు రాశాయి. ఈ చిత్రాన్ని కలర్లో తీసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది అంటారు మధుసూదన రావు)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

ఎప్పటికప్పుడు ఏ చిత్రానికి ఆ చిత్రంలో ఏదో ఒక నూతనత్వాన్ని, వైవిధ్యాన్ని చూపాలని తపనపడే మధుసూదనరావు తదుపరి ప్రయత్నంగా ఒక మనోజ్ఞమైన ప్రేమకథా చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. సంగీత, సాహిత్య, నృత్య, సాంకేతిక విషయాలలో ఉన్నత ప్రమాణాల ప్రదర్శనకు అనువైన కథాంశాన్ని ఎన్నుకుని ” రాధాకృష్ణ”
చిత్ర నిర్మాణానికి ఉద్యుక్తులయ్యారు మధుసూదనరావు.

 


 

తమ సంస్థకు” ప్రేమ లేఖలు” వంటి చక్కని చిత్రాన్ని అందించిన కె.రాఘవేంద్రరావునే రెండవసారి దర్శకుడుగా ఎన్నుకున్నారు. ఆయన సోదరుడు కె.ఎస్.ప్రకాష్ ఛాయాగ్రహకుడిగాను, సత్యానంద్ సంభాషణల రచయితగాను, ఎస్.రాజేశ్వరరావు సంగీత దర్శకుడు గాను నియమితులయ్యారు. ఆస్థాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కథను సమకూర్చారు.

అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తో సంబంధం లేకుండా ” అన్నపూర్ణ కళానికేతన్” పతాకంపై మధుసూదనరావు వ్యక్తిగతంగా నిర్మించిన చిత్రమిది. ప్రేమ, త్యాగం, ఆదర్శం వంటి ఉదాత్త భావాలు నిండినది ఈ చిత్ర కథ.ఇక కథాంశానికి వస్తే… రాధ కలవారి అమ్మాయి. కృష్ణ లేమికి ప్రతినిధి. అరమరికలు లేని స్వచ్ఛమైన వారి స్నేహం వారితో పాటే ఎదుగుతుంది.ప్రేమగా పరిణమిస్తుంది. డాక్టర్ కావాలన్న కృష్ణ జీవితాశయాన్ని తన నగలు అమ్మి సహాయపడటం ద్వారా నెరవేరుస్తుంది రాధ.

 


 

తన చదువు పూర్తి చేశాక ఆ అప్పు తీర్చే షరతుపై ఆ సహాయాన్ని స్వీకరించాడు ఆత్మాభిమానం గల కృష్ణ. కానీ అతను చదువు ముగించుకుని డాక్టర్ గా తిరిగి వచ్చేసరికి ఊహించని సంఘటనల పర్యవసానంగా రాధకు మరొకరితో పెళ్లి అవుతుంది. భర్తతో వేరే ఊరు వెళుతుంది. అనుకోని పరిస్థితుల్లో రాధా భర్త మరణిస్తాడు. మరికొన్ని ఎదురుచూడని పరిస్థితుల కారణంగా కృష్ణ డాక్టర్ గా చేస్తున్న హాస్పిటల్లోనే నర్స్ గా చేరుతుంది రాధ. ఇప్పటి దాకా సాగిన కథ బాగానే ఉంది. ఇక్కడి నుండి కథలో మార్పులు అవసరమని భావించారు మధుసూదన రావు.ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లాడిన సందర్భాలు తమ వెలుగునీడలు, డాక్టర్ చక్రవర్తి, అమాయకురాలు చిత్రాల్లో ఉన్నాయి. అందుకే ఈ కథకు ఎవరూ ఊహించని ముగింపు ఇస్తే వైవిధ్యంగా ఉంటుందని ఆయన భావించారు. ఆ మేరకు దర్శకుడు రాఘవేంద్రరావుతో చర్చించి క్లైమాక్స్ లో మార్పులు చేయవలసిందిగా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిని కోరారు.


 

కొద్ది రోజులకు ఆమె వేరే క్లైమాక్స్ రాసి పంపారు. అయితే కొత్త క్లైమాక్స్ “యాంటీ సెంటిమెంట్” అయ్యే ప్రమాదం ఉందేమో చూడండి అంటూ ఒక నోట్ కూడా రాశారావిడ. కానీ మధుసూదనరావు కు ఈ కొత్త ముగింపు కొత్త తరహాగా వుందనిపించింది. అది రాసిన రచయిత్రే అది యాంటీ సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి” రాధాకృష్ణులు”
అలాగే మిగిలిపోయేలాగా క్లైమాక్స్ తీద్దాం అన్నారు రాఘవేంద్ర రావు. అన్ని సినిమాల్లో లాగా అలాంటి పేలవమైన ముగింపు ఇస్తే ఇక ఈ సినిమాలో వైవిధ్యం, నవ్యత ఏముంటాయి?- మార్చిన విధంగానే తీద్దాం అంటారు మధుసూదనరావు.


 

మొత్తానికి సెంటిమెంట్ -యాంటీ సెంటిమెంట్ అన్న పాయింట్స్ మీద తీవ్ర తర్జనభర్జనలు జరిగిన మీదట
” సరే మీ ఇష్టం- అంటూ అయిష్టంగానే షూటింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రాఘవేంద్ర రావు.

హీరో తప్ప మిగిలిననటీనటుల ఎంపిక ఇదివరకే పూర్తయింది. ఇందులో హీరో పాత్రకు అక్కినేని నాగేశ్వరరావును అడిగారు. అప్పటికే అమెరికాలో హార్ట్ ఆపరేషన్ ముగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు నాగేశ్వరరావు. కానీ ఆపరేషన్ కు వెళ్లకముందే కొన్ని చిత్రాలు అంగీకరించి ఉండటంతో అవి పూర్తయ్యేదాకా డేట్స్ ఇవ్వటం ఎలా అన్నారు . ప్రత్యామ్నాయాలు ఆలోచించి చివరకు శోభన్ బాబును హీరోగా బుక్ చేశారు. అంతకుముందు ఆయన అన్నపూర్ణ సంస్థలో చదువుకున్న అమ్మాయిలు, పూలరంగడు చిత్రాల్లో నటించారు. ఇక నృత్య ప్రాధాన్యత కలిగిన రాధ పాత్రకు జయప్రద అన్ని విధాల సరిపోతుందని అందరూ భావించటంతో ఆమెను బుక్ చేశారు.

 


 

అన్ని సన్నాహాలు పూర్తి చేసుకొని షూటింగ్ కార్యక్రమాలకు ఉద్యుక్తులయ్యారు. చిత్ర కథకు అనువైన చక్కని గ్రామీణ వాతావరణం కలిగిన పల్లె కోసం అన్వేషణ జరిపారు. చాలా ఊర్లు చూసిన మీదట చివరకు విజయవాడ సమీపంలోని’ తాడిగడప’ గ్రామం అన్ని విధాలా తమ చిత్ర కథకు అనువైనదిగా భావించారు. గ్రామమే కాకుండా ఆ గ్రామంలో హీరోయిన్ హౌస్ సెట్ కు కావలసిన మంచి ఇల్లు దొరికింది. రచయిత్రి వర్ణించిన రెండంతస్తుల మేడ, పూల మొక్కలు, ముఖ్యంగా జామ చెట్టు- అన్ని ఆ ఇంటి పరిసరాలలో ఉన్నాయి. తమ కథకు అన్ని విధాల సరిపోయే ఆ ఇంట్లోనే రాధాకృష్ణ చిత్రం షూటింగ్ చాలా భాగం జరిగింది. రాధకు పెళ్లి చేసి పంపేటప్పుడు సంప్రదాయబద్ధంగా ‘సారె’ ఇచ్చి పంపే సన్నివేశంలో జూనియర్ ఆర్టిస్ట్ ల తో పాటు గ్రామంలోని స్త్రీలు కూడా పాల్గొన్నారు. ఆ సన్నివేశాన్ని ఎంతో సహజంగా చిత్రీకరించారు రాఘవేంద్రరావు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా ముగిసింది “రాధాకృష్ణ”షూటింగ్.చిత్రం విడుదలైంది.

 


 

హైదరాబాద్ బసంత్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చుని చిత్రాన్ని చూశారు మధుసూదనరావు. ప్రతి సన్నివేశానికి ప్రేక్షకుల నుండి చక్కని స్పందన వచ్చింది. సంగీతం పరంగా ‘రాధా ….కృష్ణ..’ అనే టైటిల్ సాంగ్ తో సహా అన్ని పాటలు ప్రేక్షకులను అలరించాయి. థియేటర్లో సినిమా చూస్తున్న మధుసూదనరావుకు క్లైమాక్స్ దగ్గరపడే కొద్ధి ఉత్కంఠ పెరుగుతోంది. ఆ సన్నివేశానికి ప్రేక్షకుల నుండి లభించే ప్రతిస్పందన చిత్ర విజయాన్ని నిర్ధారిస్తుంది.

 


 

ఆ సన్నివేశం రానే వచ్చింది. క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ నుదుట రక్త తిలకం దిద్దాడు. ప్రేక్షకుల ఈలలు, కరతాళధ్వనులు తప్ప మధుసూదన రావుకు మరేమీ వినిపించలేదు.సినిమా ప్రారంభం నుండి ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా పతాక సన్నివేశంలో వారి హర్షామోదాలు పతాక స్థాయికి చేరుకోవడంతో “రాధాకృష్ణ” నూరు రోజుల చిత్రమని అప్పుడే ఊహించారు నిర్మాత మధుసూదనరావు.వెంటనే మద్రాస్ కు ఫోన్ చేసి క్లైమాక్స్ సన్నివేశానికి వచ్చిన రెస్పాన్స్ గురించి, ఓవరాల్ గా సినిమా టాక్ గురించి ఆనందంగా చెప్పారు మధుసూదనరావు.రాఘవేంద్ర రావు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తన వాదన నిజం కాలేదన్న బాధ రాఘవేంద్రరావులో కానీ, తన వాదనే సరైందన్న గర్వం మధుసూదనరావు లో గానీ కనిపించలేదు.వారు అలాంటి భావాలకు అతీతులు . వారి అభిప్రాయంలో కథా చర్చ అనేది సాగర మధనం వంటిది. వాదోపవాదాలు, తర్జనభర్జనలు, అభిప్రాయాల మార్పిడి జరిగినప్పుడే సర్వ సమ్మతమైన కథామృతం లభిస్తుంది.
దుక్కిపాటి మధుసూదనరావు వంటి సీనియర్ ప్రొడ్యూసర్ కు వరుసగా రెండు ఘన విజయాలను అందించిన ఘనత అప్పటి యువ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు దక్కింది.

 


 

( సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 23న చదవండి)

( రాధాకృష్ణ చిత్రంలోని కొన్ని హిట్ సాంగ్స్ మీకోసం)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here