(రీక్యాప్)
(బంగారు కలలు విడుదలైన అన్ని కేంద్రాలలో విజయవంతంగా వంద రోజులు ప్రదర్శించబడి సంస్థ ఇమేజ్ ని ఇనుమడింప చేయడంతో పాటు అన్నపూర్ణకు బంగారు పంటను అందించింది)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)
“బంగారు కలలు” చిత్రం తరువాత అప్పటికి నిర్మాణంలో ఉన్న తన ఇతర చిత్రాల షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని హార్ట్ ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లారు అక్కినేని నాగేశ్వరరావు. దాదాపు ఒక సంవత్సరం విరామం వచ్చింది. ఆయన తిరిగి వచ్చే లోపల ఒక లో బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టి ‘ప్రేమ లేఖలు’ చిత్రానికి శ్రీకారం చుట్టారు మధుసూదనరావు. అక్కినేని లేకుండా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ఇది. రెండు కలర్ చిత్రాల తరువాత అన్నపూర్ణ వారి ఆఖరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం కూడా ఇదే.

ఆంధ్రపత్రికలో యద్దనపూడి సులోచనారాణి ధారావాహికగా రాసిన ” ప్రేమ లేఖలు” నవల ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభానికి కొద్దిరోజుల క్రితమే విడుదలై సంచలన విజయాన్ని సాధించిన” జ్యోతి” చిత్రాన్ని చూసి కె.రాఘవేంద్రరావు ను ఈ చిత్రానికి దర్శకుడుగా ఎన్నుకున్నారు మధుసూదనరావు.
‘ జ్యోతి’ చిత్ర కథానాయిక అయిన జయసుధ ను హీరోయిన్ గాను , మురళీమోహన్ ను ఆమె భర్త పాత్రకు ఎన్నుకున్నారు. ఇక అతి ముఖ్యమైన పాత్రలో ఒక కొత్త నటుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. కథానాయకుడే ప్రతినాయకుడు కావడం ఈ చిత్ర కథలోని విశిష్టత, వైవిద్యం. ఇలాంటి పాత్రకు ఒక రెగ్యులర్ హీరోని పెడితే అది సానుభూతి పాత్రమవదు.
సరిగ్గా అదే సమయంలో హిందీలో ” అంకుర్” చిత్రం విడుదలై దిగ్విజయంగా నడుస్తోంది. ఆ చిత్రంలో నటించిన కన్నడ నటుడు ‘ అనంతనాగ్’ ఈ పాత్రకు అన్ని విధాలా సరిపోతాడని మధుసూదన రావు భావించారు. వెంటనే బొంబాయికి కబురు చేసి అనంత నాగ్ ను పిలిపించి అతనికి చిత్రకథను అందులో అతను ధరించబోయే పాత్రను విశదపరిచారు మధుసూదన రావు. ఆనందంగా అంగీకరించారు అనంతనాగ్. ఇక ఇతర పాత్రలకు జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య , దీప, భాను ప్రకాష్, తదితరులను ఎన్నుకున్నారు.

సంగీత దర్శకుడు సత్యంకు తొలిసారిగా అన్నపూర్ణలో చేసే అవకాశం ఈ చిత్రం ద్వారా లభించింది. కెమెరామెన్ గా సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు విన్సెంట్ నియమితులయ్యారు. అన్ని విధాలా అన్ని హంగులు సమకూర్చుకుని షూటింగ్ ప్రారంభించారు.
అప్పటికి తెలుగులో వస్తున్న చిత్రాల సరళకి అనుగుణంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనువుగా ఈ చిత్రాన్ని చాలా చక్కగా రూపొందించారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. అప్పటికే విస్తృతంగా కలర్ చిత్రాలు వస్తున్న తరుణంలో ఈ చిత్రాన్ని కూడా కలర్లో తీద్దామని ప్రోత్సహించినప్పటికీ రాఘవేంద్రరావు బ్లాక్ అండ్ వైట్ లోనే తీద్దామన్నారు.
” లో బడ్జెట్ చిత్రాన్ని తీయాలన్న ఆలోచనతో మనం చిన్న ఆర్టిస్టులను బుక్ చేసుకున్నాం.. ఇతరత్రా ప్రొడక్షన్ వేల్యూస్, టెక్నికల్ వాల్యూస్ విషయంలో మనం ఎలాగూ రాజీ పడే ప్రసక్తే లేదు.. కలర్ లో తీస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది.. దానికి తోడు చిన్న ఆర్టిస్టులతో తీసిన సినిమా అంత కలెక్ట్ చేయదు.. అంటారు కె. రాఘవేంద్రరావు. అది కూడా పాయింటే. అందువల్ల బ్లాక్ అండ్ వైట్‌లోనే తీద్దాం అన్న రాఘవేంద్రరావు ప్రపోజల్ కు అంగీకరించవలసి వచ్చింది.

ఈ ఒక్క లోపం తప్ప మిగిలిన అన్ని అంశాల్లో చిత్రం ప్రశంసనీయంగా వచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శించబడిన ఈ లో బడ్జెట్ చిత్రం సంస్థకు మంచి లాభాలను ఆర్జించి పెట్టింది.
రిలీజ్ కు ముందే అమెరికా వెళ్ళిన మధుసూదనరావుకు అన్ని విధాల గొప్ప సంతృప్తిని ఇచ్చింది ప్రేమలేఖలు. సంగీత పరంగా ‘ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి’ -‘ విన్నానులే పొంచి విన్నానులే’ మొదలగు పాటలు సంగీత ప్రియులను అలరించాయి. నటీనటులను, దర్శకుడు కె.రాఘవేంద్రరావును ఎన్నుకోవటంలో మధుసూదనరావు అంచనాలు నూటికి నూరుశాతం ఫలించాయి.

ముఖ్యంగా అనంతనాగ్ తన పాత్రను ఆకలింపు చేసుకుని బాగా నటించాలని ఎంతో కృషి చేశాడు. అయితే తెలుగు భాష ఆయనకు అంతగా తెలియక పోవడం వల్ల డైలాగ్స్ ఎక్కువ ఉన్న దృశ్యాలలో నటనపరంగా కొంత ‘ఈజ్’ తగ్గినట్లు అనిపించింది. మొత్తం మీద తన పాత్ర పోషణలో ఆయన కనబరిచిన హావభావాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి .

ఓకేసారి బెంగళూరు వంటి రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా విడుదలయిన “ప్రేమ లేఖలు” చిత్రానికి డెక్కన్ హెరాల్డ్ వంటి పత్రికలు ఎంతో ప్రోత్సాహకరమైన సమీక్షలు రాశాయి.


ఈ చిత్రాన్ని కలర్లో తీసి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది అంటారు మధుసూదనరావు.
( సశేషం)
(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 21న చదవండి)
( ప్రేమ లేఖలు చిత్రంలోని కొన్ని హిట్ సాంగ్స్ మీకోసం)
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=zIDBJbduVW4]