( రీక్యాప్)
( ఆ ప్రతిపాదనకు డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించనందువల్ల రజతోత్సవ సంరంభాన్ని చవి చూడవలసిన
” విచిత్రబంధం” కనీసం శతదినోత్సవాన్ని కూడా జరుపుకో లేకపోయింది)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)
చిరకాల పరిచయస్తులు చిరకాలం తరువాత కలిస్తే చిరస్మరణీయమైన జ్ఞాపకాల గతం ఒక్కసారిగా గుర్తుకొచ్చి మనసంతా బరువెక్కుతుంది. ఆ స్మృతులను ఒక్కసారి నెమరు వేసుకుంటే మనసెంతో తేలిక పడుతుంది. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తరువాత ఒకరికొకరు తారస పడ్డ దుక్కిపాటి మధుసూదనరావు- సుప్రసిద్ధ హిందీ నటి వహీదా రెహమాన్ ల మానసిక స్థితి అదే.1951 లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు వారు తెనాలిలో నిర్వహించిన సభల్లో డ్యాన్స్ ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ఒక బాలనటిగా వహీదా రెహమాన్ ను చూశారు మధుసూదనరావు. విజయవాడ మునిసిపల్ కమీషనర్ గా ఉన్న ఆమె తండ్రిగారు కూడా మధుసూదనరావుకు బాగా తెలుసు. అదీ కాక తమ అన్నపూర్ణ సంస్థకు ఆస్థాన దర్శకుడైన ఆదుర్తి సుబ్బారావు నిర్మించిన హిందీ సినిమాల కథానాయిక ఆమె. ఇన్ని విధాలుగా మధుసూదనరావుకు సుపరిచితురాలైన వహీదా రెహమాన్ ఒకసారి అనుకోకుండా మద్రాస్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు తారసపడ్డారు. పలకరింపులు అయ్యాక త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారామె. ఆ శుభవార్త కు శుభాకాంక్షలు తెలుపుతూనే” పెళ్లి చేసుకోబోయే ముందు ఒక తెలుగు సినిమాలో నటించకూడదా? అన్నారు మధుసూదనరావు.
“తెలుగు అమ్మాయినైన నాకు తెలుగు సినిమాలో నటించడానికి అభ్యంతరం ఏముంటుంది? మీరు తీస్తానంటే నేను చేయనoటానా” ? సమాధానాన్నే ప్రశ్నగా వేసారు వహీదా రహమాన్.

ప్రస్తుతానికి ఇదంతా ఫ్లాష్ బ్యాక్.
ఇది జరిగిన కొద్ది రోజులకు తమ తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టింది అన్నపూర్ణ సంస్థ. ఈ చిత్రానికి “బంగారు కలలు” అని నామకరణం చేశారు. ఆ సంస్థలో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానాంశంగా ఇది మూడవ సినిమా. ఆంధ్ర పత్రికలో ధారావాహికగా ప్రచురితమైన యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా ఒక చిత్రాన్ని రూపొందిద్దాం
అని ప్రపోజ్ చేశారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. కథ అందరికీ నచ్చటంతో నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నటీనటుల ఎంపిక జరుగుతున్న సమయంలోనే నాగేశ్వరరావు సరసన హీరోయిన్ పాత్రకు వహీదా రెహమాన్ గురించి మనసులో అనుకొని తన అభిప్రాయాన్ని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ముందు ఉంచారు మధుసూదన రావు. ఈ ప్రతిపాదనకు తిరుగు ఏముంటుంది? వహీదా రెహమాన్ అంతటి స్టార్ నటించటానికి అంగీకరిస్తే అందులో ఆక్షేపించటానికి ఏముంటుంది?- అంటూ తన అంగీకారంతో పాటు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఇక హీరో చెల్లెలు పాత్రకు లక్ష్మి ని బుక్ చేసారు.
మిగిలిన ఆర్టిస్టులను కూడా నిర్ణయించుకొని సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా ‘చలం’ నిర్మించిన సినిమా ఒకటి రిలీజ్ అయింది. అందులో కూడా చెల్లెలు వేషం వేసిన లక్ష్మి తల్లిదండ్రులను ఎదిరించి ఇల్లు విడిచి తను ప్రేమించిన వాడి వెంట వెళ్లిపోతుంది. బంగారు కలల్లో కూడా లక్ష్మి పాత్ర అలాంటిదే. ఇప్పుడేం చేయాలి? పోనీ లక్ష్మిని తొలగిస్తే?
ఒక ఆర్టిస్టును ఖాయపరచుకున్న తరువాత తొలగించే పద్ధతి అన్నపూర్ణ సంస్థలో లేదు. అది సంస్థ ప్రిన్సిపల్స్ కే వ్యతిరేకం. మరి ఏం చేయాలి? రకరకాలుగా ఆలోచించారు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. లక్ష్మి ని హీరోయిన్ ను చేసి వహీదా రెహమాన్‌ను చెల్లెలి పాత్రకు పెట్టుకుంటే.. అనే ఆలోచన వచ్చింది. ఈ ప్రతిపాదన బాగానే ఉంది. కానీ హీరోయిన్ గా బుక్ చేసిన వహీదాకు ఈ విషయం ఎలా చెప్పాలి? అంత పెద్ద నేషనల్ ఆర్టిస్ట్ కాదనకుండా మన సినిమాలో నటిస్తానని ముందుకు వస్తే ఇలా చేయడం భావ్యమా?

రకరకాల ఆలోచనలు మస్తిష్కాన్ని తొలుస్తుండగా మధుసూదన రావు వహీదా రెహమాన్ కు పరిస్థితి వివరించి చెల్లెలు పాత్ర చేయవలసిందిగా రిక్వెస్ట్ చేశారు. కొద్దిసేపు ఆలోచించి ఆమె ఇలా అన్నారు- ” నేను ఆర్టిస్టును.. చేసేది మంచి పాత్రా? కాదా? అనే తప్ప హీరోయిన్ పాత్రా ? హీరో చెల్లెలు పాత్రా ? అనే పట్టింపు నాకు లేదు. నేను ఏ పాత్ర చేసినా దానివల్ల సినిమాకు మంచి జరుగుతుంది అని మీరు భావిస్తే నాకేం అభ్యంతరం లేదు”- సహృదయంతో సమస్యను అర్థం చేసుకుని వహీదా ఇచ్చిన సమాధానంతో మధుసూదనరావు మనసు కుదుటపడింది. అప్పుడామె ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని చెల్లెలు పాత్రను ఇంకొంచెం పెంచడం జరిగింది. ఆమెకు జోడీగా విలన్ పాత్రలో కైకాల సత్యనారాయణ నటించారు.

” ఎన్నో విలన్ పాత్రలు చేశాను కానీ వహీదా రెహమాన్ గారి లాంటి నేషనల్ ఆర్టిస్టు పక్కన నటించటం చాలా అరుదైన అవకాశం” అంటూ కైకాల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ లో ఎదురైన మరొక ముఖ్య సమస్య అక్కినేని నాగేశ్వరరావు ఆరోగ్యం. అంతకుముందే ఏర్పడిన అస్వస్థత నుండి ఆయన పూర్తిగా కోలుకోలేదు. హృద్రోగ నిపుణులైన డాక్టర్ పీ. ఎస్. రావు గారు( నవయుగ శ్రీనివాసరావు గారి అల్లుడు) మధుసూదనరావుతో ఏకాంతంగా మాట్లాడారు.” నాగేశ్వర రావు గారు ఎక్కువగా శ్రమ తీసుకోకుండా జాగ్రత్త పడండి”- అని హెచ్చరించారాయన.
షూటింగ్ ప్రారంభమైంది.. గోవా లో అందమైన ప్రకృతి ఒడిలో..
లోకేషన్స్ లో ఏవైనా ఎత్తులు ఎక్కవలసి వచ్చినప్పుడు, ఫైటింగ్ సీన్స్ లో పాల్గొనవలసి వచ్చినప్పుడు మధుసూదన రావు వారించినా నాగేశ్వరరావు దాదాపు విసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తన ఆరోగ్యం కన్నా వృత్తి ధర్మానికి ఆయన ఇచ్చే విలువ ఉన్నతమైనదనటానికి ఇది ఒక నిదర్శనం.

ఇక తెలుగు సినిమా సెట్స్ పై జాతీయ నటి వహిదా రెహమాన్ కనబరచిన నిరాడంబరతను, ఆమె కలుపుగోలుతనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. బొంబాయి నుండి ఫ్లైట్ లో వస్తున్న ఆమెను రిసీవ్ చేసుకోవడానికి మేనేజర్ కు బదులుగా స్వయంగా మీరే వెళితే బాగుంటుందని ఆదుర్తి సుబ్బారావు చేసిన సూచన మేరకు స్వయంగా ఎయిర్ పోర్టు కు వెళ్లారు మధుసూదనరావు. బాగా మందీమార్బలంతో ఒక ఐదారుగురు జనాన్ని వెంట తెచ్చుకుంటుందేమో అని ఎదురుచూస్తున్న మధుసూదన రావుకు ఆశ్చర్యంగా అనిపించింది.
హెయిర్ డ్రెస్సింగ్ లో, టచ్ అప్ లో సహాయపడేందుకు ఒక పెద్దావిడను మాత్రం వెంట పెట్టుకొచ్చారు వహీదా రెహమాన్. తన పాత్రకు కావలసిన కాస్ట్యూమ్స్, మేకప్ మెటీరియల్ బొంబాయి నుండి తానే తెచ్చుకున్నారు. ఇక ఆమె స్టేటస్ కు తగినట్లుగా ఉంటుందని రిడ్జ్ హోటల్ లో బస ఏర్పాటు చేస్తే” షూటింగ్ పూర్తయి రాత్రికి వస్తాము.. కేవలం రాత్రి పూట పడుకునేందుకు అంత ఖర్చు పెట్టి ఆ హోటల్ రూమ్ ఎందుకు? సరదాగా నేను కూడా మీ అందరితో పాటే సారథి స్టూడియో లోనే ఉంటాను”- అన్నారామె. సారధి స్టూడియోలో రూమ్స్ ఖాళీ లేనందున ఆమెను ఎలాగో ఒప్పించి దగ్గరలో ఉన్న” బ్లూ మూన్” హోటల్లో బస ఏర్పాటు చేశారు.

హిందీ చిత్రరంగంలో ఒక టాప్ ర్యాంక్ హీరోయిన్ గా వెలుగుతూ ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి అంత సహృదయంతో, సంపూర్ణ సహకార ధోరణిని ప్రదర్శించిన వహీదా రెహమాన్ పట్ల, ఆమె నిరాడంబరత పట్ల యూనిట్ లోని ఒక్కరికి ఒక ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడింది.
ఇక నటన విషయంలో తనకు తానే సాటి అనేలా చేశారామె. సింగారం చిందులు వేసే వయసులో బంగారు కలలు కంటూ బంగారం లాంటి జీవితాన్ని భగ్నం చేసుకునే మధ్యతరగతి యువతి పాత్రలో అద్భుత నటనను ప్రదర్శించారు వహీదా. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రలకు గొప్పగా న్యాయం చేశారు. ముఖ్యంగా పతాక సన్నివేశంలో నటసార్వభౌమ ఎస్వీ రంగారావు ప్రదర్శించిన నటనా కౌశలం అద్భుతం. ఆయన విలన్ ను కాల్చి చంపడం, హీరో ఆ నేరాన్ని తనపై మోపుకొని జైలుకెళ్లటం మున్నగు సన్నివేశాలలో అక్కినేని- ఎస్.వి.రంగారావులు పోటీపడి నటించారు. ఈ సినిమాలో ఒక క్లబ్ సాంగ్ లో నేటి సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, నిర్మాత
టీ. సుబ్బరామి రెడ్డి నటించటం విశేషం. క్లబ్ డాన్స్ చేస్తున్న వహీదా రెహమాన్ బుగ్గ గిల్లే చిలిపి కస్టమర్ గా ఒక్క క్షణం తెరమీద కనిపిస్తారాయన.

ఈ సినిమా అవుట్డోర్ షెడ్యూలు గోవాలో జరగడం విశేషం. అప్పట్లో విమాన సిబ్బంది మెరుపు సమ్మె జరపడంతో వహీదా రెహమాన్ బొంబాయి నుండి రైల్లో గోవా బయలుదేరారు. హైదరాబాద్ నుండి బయలుదేరే వాళ్ళందరికీ కార్లు, మద్రాసు నుండి వచ్చే వారికి రైళ్లే శరణ్యం అయ్యాయి. మొత్తానికి గోవా షూటింగ్ ఒక అనుభూతిగా మిగిలిపోయింది. ముఖ్యంగా గోవా బీచ్ లో ‘హిప్పీ’ల సహకారం మరువలేనిది. వారి వేషధారణ, హెయిర్ స్టయిల్, వాలకం చూసి నటి లక్ష్మి మున్నగువారు మొదట్లో విసుక్కున్నప్పటికీ వారి ఫ్రెండ్లీ నేచర్ తో షూటింగ్ సజావుగా సాగింది.
అట్మాస్పియర్ షాట్స్ కోసం జూనియర్ ఆర్టిస్ట్స్ తో పని లేకుండాపోయింది. షూటింగ్ జరుగుతున్నంతసేపు అలా నిలబడి ఉన్నారు కదా అని టీ ఇస్తే దానికి వాళ్లు డబ్బులు ఇవ్వబోయారు.
” మీరు ఆనందంగా మా షూటింగ్ చూస్తున్నారు.. మాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సహకరిస్తున్నారు.. మేము అభిమానంగా టీ ఇస్తే మీరు డబ్బులు ఇవ్వడం బాగోలేదు”- అని మధుసూదనరావు అంటే ” మేము పనిచేయనిదే ఏదీ ఫ్రీగా తీసుకోము… అది మా ప్రిన్సిపుల్”- అని సమాధానమిచ్చారు.ఏదో కేర్ ఫ్రీగా, బాధ్యతారహితంగా తిరుగుతుంటారు అనుకున్న ‘హిప్పీ’లకు కూడా అంత మంచి సిద్ధాంతాలు ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
మొత్తానికి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా షూటింగ్ సజావుగా సాగి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముగించుకుని విడుదలకు సిద్ధమైన తరుణంలో ఒక అనుకోని అవాంతరం ఎదురైంది.కోర్టు కేసు రూపంలో ఎదురైంది ఆ అవాంతరం.
తను రాసిన “జోడు జ్యోతులు” అనే నవలను పరిశీలించమని అక్కినేని నాగేశ్వరరావుకు ఇస్తే దాన్ని ఆయన యద్దనపూడి సులోచనరాణి గారికి ఇచ్చి కథ కాపీ కొట్టి ఈ సినిమా తీశారని, దీని విడుదలను నిలిపివేసి తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఒక రచయిత సిటీ సివిల్ కోర్టులో కేసు వేశాడు. ఆ కేసులో ఆ రచయిత అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు, డిస్ట్రిబ్యూటర్ నవయుగ శ్రీనివాసరావు, యద్దనపూడి సులోచనారాణి, ఆ నవలను సీరియలైజ్ చేస్తున్న ఆంధ్ర పత్రిక యాజమాన్యాన్ని ముద్దాయిలుగా పేర్కొన్నాడు. దీని వెనుక అన్నపూర్ణ సంస్థకు తన కథలు ఇవ్వటానికి ప్రయత్నించి విఫలమైన ఒక ప్రముఖ రచయిత్రి హస్తం ఉంది అంటారు మధుసూదనరావు.
సినిమా విడుదలకు కేవలం వారం రోజుల ముందు ఈ అవాంతరం వచ్చిపడింది. మిగిలిన అందరూ
” ఓ పది వేలు వాడి ముఖాన కొట్టి వదిలించుకుందాం “- అన్నారు.కానీ నాగేశ్వరరావు, మధుసూదన రావులు మాత్రం ” డబ్బు ఇస్తే మనం తప్పు చేసినట్లు అవుతుంది.. చేయని నేరానికి పరిహారం కట్టడం ఏమిటి? ఏదో ఒకటి కోర్టులోనే తేల్చుకుందాం” అనే దృఢ సంకల్పంతో ఉన్నారు. రిలీజ్ ముందు రోజు ప్రొజెక్షన్ ఏర్పాటుచేస్తే సినిమా చూసిన జడ్జి అంతకు ముందే ఆ నవల చదివి ఉండటంతో దానికీ ఈ సినిమాకు ఏ మాత్రం పొంతన లేదని చెప్పి కేసు కొట్టి వేశారు . కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ఇవ్వలేక పోవటం తప్ప ఈ కేసు వల్ల ఎలాంటి నష్టం జరగలేదు.
విడుదలైన అన్ని కేంద్రాలలో దిగ్విజయంగా వంద రోజుల పాటు ప్రదర్శించబడి సంస్థకు బంగారు పంటను అందించింది ” బంగారు కలలు”.


( సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 19న చదవండి)
( బంగారు కలలు చిత్రంలోని కొన్ని పాటలు మీకోసం)
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=vv3RUnuCyaY]