హీరో రేప్ చేయటం ఏమిటి? జనం చెప్పులు వేస్తారు.. నేను చెయ్యను అన్న అక్కినేని – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 34,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 34

(రీక్యాప్)
(వంద రోజులు దగ్గర పడుతుండగ ఎన్. టి. ఆర్. చిత్రం విడుదల నిమిత్తం “అమాయకురాలు” వెకేట్ చేయవలసి వచ్చింది. పెద్ద సెంటర్స్ లోనే ఎత్తివేయడంతో మిగిలిన సెంటర్స్ లో కూడా వంద రోజులు పూర్తి కాకుండానే తీసివేశారు. అందువల్ల అమాయకురాలు చిత్రం శతదినోత్సవం జరుపుకోలేక పోయింది.)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూదనరావు తలపెట్టిన ద్వితీయ చిత్రం” విచిత్రబంధం”. కథాంశం విషయంలో తీవ్ర తర్జనభర్జనలు జరిగిన చిత్రమిది. ఆంధ్రప్రభ నవలల పోటీకి యద్దనపూడి సులోచనరాణి రచించిన
” విజేత” అనే నవల వచ్చిందని దానికి ప్రథమ బహుమతి రావలసినప్పటికీ అందులో ఒక ‘రేప్’ సీన్ ఉన్న కారణంగా దానికి అవార్డు ఇవ్వలేదని అయినా ఆ నవల సినిమాగా బాగుంటుందని ఆంధ్రప్రభలో జర్నలిస్టుగా పని చేస్తున్న వెంకట్ మధుసూధనరావుకు సమాచారం అందించారు.



ఇది జరిగిన కొద్దిరోజులకు “విజేత” నవల ప్రింట్ చేయబడి మార్కెట్లో విడుదల అయింది. ఆదుర్తి సుబ్బారావు ఆ నవల చదివి మధుసూదన రావుకు చెప్పారు. ” ఆ నవలలో ఆ రేప్ సీన్ వర్ణన కొంచెం అభ్యంతరకరంగా ఉన్న మాట వాస్తవమే… కానీ కన్విన్సింగ్గా చెప్పగలిగితే సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది”- అన్నారు ఆదుర్తి. ఇంతకీ ఆ నవలలో అభ్యంతరకరమైన విషయం ఏమిటంటే అందులో కథానాయకుడు హీరోయిన్ ను రైలులో రేప్ చేస్తాడు. అసలు ఆ హీరో 1942 ఆగస్టు ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు, చైతన్యవంతుడు. అలాంటి ఉదాత్త భావాలు కలిగిన వ్యక్తి అలా అమానుషంగా ఒక స్త్రీ పై అత్యాచారం చేయడం చాలా అస్వాభావికంగా అనిపిస్తుంది. ఈ అభ్యంతరం తప్పిస్తే మిగిలిన కథలో అద్భుతమైన కథన శైలి ఉంది అనిపించింది.

వెంటనే రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిని కలిసి హీరో పాత్రలో కొన్ని మార్పులు చేసి ఆ రేప్ సీన్ వర్ణనను కొంత మోతాదు తగ్గించి పరిస్థితుల ప్రభావం వల్ల అది సమర్థనీయమే అని కన్విన్స్ చేసేలా రాయమని కోరారు మధుసూదన రావు. ఆయన కోరిక మేరకు హీరోను ఉడుకు రక్తం పొంగే శృంగార నాయకుడైన విద్యార్థిగా మార్చి కాలేజీ జీవితంలో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన గొడవల వల్ల ప్రేరేపితుడై అతను ఆ రేప్ చేసినట్లుగా మార్చి రాశారు రచయిత్రి. ఈ మార్పు వల్ల కథాంశం చాలా బిగువుగా, పొందికగా వచ్చిందని ఆదుర్తి, మధుసూదన రావులు తృప్తి చెందారు.



అక్కినేని నాగేశ్వరరావుకు కథ చెప్పారు మధుసూదనరావు. అది విన్న వెంటనే ” హీరో రేప్ చేయటం ఏమిటి? జనం చెప్పులు వేస్తారు… నేను చేయను”- అని ఖండితంగా చెప్పారు.” అదేమిటి? హీరో అంటే మానవాతీతుడా ? అతనికీ బలహీనతలు ఉంటాయి.after all he is also a humanbeing..” అని నచ్చ చెప్పటానికి ప్రయత్నించారు మధుసూదనరావు.
“ హీరో రేప్ చేస్తే పాత్ర మీద సానుభూతి పోతుంది.. ఎంత కన్విన్సింగ్ గా చెప్పినా జనం రిసీవ్ చేసుకోరు” – అంటారు నాగేశ్వరరావు. “అలా అనుకుంటే నువ్వు నటించిన “భార్యాభర్తలు” మాటేమిటి? అందులో నలుగురు అమ్మాయిలను గదిలో వేసుకుని విచ్చలవిడిగా ప్రవర్తించే పాత్ర కదా.. దాన్నెలా రిసీవ్ చేసుకున్నారు “- వాదనకు దిగారు మధుసూదనరావు.



అప్పట్లో కె. ప్రత్యగాత్మ గారు దర్శకత్వం వహించిన” భార్యాభర్తలు” చిత్రం పెద్ద చర్చనీయాంశమైంది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరితో పాటు పీ ఏ పీ వారి తొలి చిత్ర దర్శకుడైన ఎల్ వీ ప్రసాద్ గారు, ప్రత్యగాత్మ గారి గురువుగారైన తాతినేని ప్రకాశరావు గారు కూడా ఆ సబ్జెక్టు యాంటీ సెంటిమెంట్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

” ఇది పీ ఏ పీ కి నువ్వు చేస్తున్న మొదటి సినిమా… ఇది ఫెయిల్ అయితే నీ భవిష్యత్తు దెబ్బతింటుంది”- అని ప్రత్యగాత్మను వీరంతా హెచ్చరించారు కూడా. ఆ పరిస్థితుల్లో మధుసూదన్ రావును ఆఫీసుకు వచ్చి భార్యాభర్తలు కథ వినమని రిక్వెస్ట్ చేశారు పీ ఏ పీ అధినేత సుబ్బారావు గారు. ఆ కథ విని” చాలా బాగుంది… తప్పకుండా హిట్ అవుతుంది”- అని చెప్పారు మధుసూదనరావు.



సుబ్బారావు గారికి సగం బరువు తొలగిపోయింది. ప్రత్యగాత్మ గారికి కొండంత బలం వచ్చింది. ఆ కథలో హీరో అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరుగుతాడు. అయితే తరువాత పరివర్తన చెందుతాడు. ముందు అలా తిరిగినప్పటికీ తరువాత హీరో సంస్కరించబడే ఫార్ములాకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. కేవలం మధుసూదనరావు ఇచ్చిన మోరల్ సపోర్ట్ కారణంగానే ప్రత్యగాత్మ ఆ సబ్జెక్టు టేకప్ చేశారు. అది సంచలన విజయాన్ని సాధించింది. హీరో అంటే రాముడు మంచి బాలుడు లాగానే ఉండాలి అనే ట్రెడిషనల్ హీరోయిజాన్ని బ్రేక్ చేసిన చిత్రం భార్యాభర్తలు.

ఇది కూడా అలాంటిదే. ముందు కొన్ని బలహీనమైన పరిస్థితుల్లో రేప్ చేసినప్పటికీ అతనిలో వచ్చిన పరివర్తన కారణంగా కోల్పోయిన సానుభూతిని హీరో తిరిగి పొందుతాడన్నది మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావుల అంచనా. తీవ్ర వాదోపవాదాలు జరిగిన మీదట ” నాకు మాత్రం ఇష్టం లేదు.. మీరు బలవంతం పెడుతున్నారు కాబట్టి మీ మీద ఉన్న గౌరవం కొద్దీ ఈ సినిమా చేస్తాను”- అన్నారు నాగేశ్వరరావు. అయితే నాగేశ్వరరావు గారి మనసులో ఉన్న అసంతృప్తిని గమనించి తీసుకునే రిస్కేదో నేనే తీసుకుంటాను.. ఈ సినిమాను కూడా నా సొంతంగా అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ మీద నేనే నిర్మిస్తాను”- అన్నారు మధుసూదనరావు. మిగిలిన నటీనటవర్గం ఎన్నిక జరిగింది. నాగేశ్వరరావు సరసన వాణిశ్రీ హీరోయిన్ గాను, ఇతర పాత్రల్లో ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రామలింగయ్య, రాజబాబు తదితర నటీనటులంతా ఎంపికయ్యారు.



తొలిసారిగా ఈ చిత్రాన్ని పూర్తి రంగుల్లో నిర్మించాలని సంకల్పించారు మధుసూదన రావు. ఆర్టిస్టుల పరంగానూ, కలర్ సినిమా కావటం వలన బడ్జెట్ ఎక్కువవుతుంది అనుకొని నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వారు పంపిణీ విషయంలో తటపటాయించారు. ఈ చిత్రాన్ని కూడా తామే మినిమం గ్యారెంటీ బేసిస్ మీద పంపిణీ చేసేందుకు నిర్ణయించుకున్నారు అన్నపూర్ణ ఫిలింస్ వారు. షూటింగ్ ప్రారంభమైంది.

రేప్ సీన్ చిత్రీకరించవలసిన రోజు వచ్చింది. మార్నింగ్ కాల్షీట్ లో ఆ రేప్ సీన్ ముందు వచ్చే కొన్ని లీడ్ సీన్స్ చిత్రీకరించారు. ఈవినింగ్ కాల్షీట్ లో రేప్ సీన్ చిత్రీకరించాలి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మధుసూదనరావు తన తమ్ముడి కూతురు నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్ళటానికి బయలుదేరారు. అంతలో సెట్లోకి వెళ్తున్న నాగేశ్వరరావుకు ఎదురుపడ్డారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఆయన్ను ఉద్దేశించి ” ఇప్పుడు రేప్ సీన్ తీస్తారా..? హీరో రేప్ చేస్తాడు… హ హ… ఇక ఈ సినిమాను ఆ దేవుడే కాపాడాలి” అని నవ్వుతూ సెట్ లోకి వెళ్లారట. నాగేశ్వరరావు సరదాకి అన్నా కూడా ఆ వ్యంగ్యానికి ఆదుర్తి సుబ్బారావు మనసు చివుక్కుమంది. అప్పుడే గేటు దాటుతున్న కారును చప్పట్లు కొట్టి ఆపి మధుసూదన రావును వెనక్కి పిలిపించారు ఆదుర్తి. ” ఎలాగండి ఈ సీన్ తీయటం… నాగేశ్వరరావు గారు అలా మాట్లాడుతున్నారు”- అని నొచ్చుకున్నారు ఆదుర్తి.



” మీరు అదేం పట్టించుకోకండి.. నాగేశ్వరరావు పైకి అలా అన్నా సెట్ లోకి వచ్చాక చాలా పర్ఫెక్ట్. మీకు తెలియదా ఏమిటి? అయినా నాగేశ్వరరావును మంచి మూడ్ లోకి రప్పించి రిజల్ట్ రాబట్టుకోవడం మీకు కొత్తేమీ కాదు కదా.. మీరేమి ఆందోళన పడకండి.. మనం అనుకున్న ఎఫెక్ట్ తప్పకుండా వస్తుంది”- అని ధైర్యం చెప్పి వెళ్లారు మధుసూదనరావు.

ఆ సీన్ అనుకున్న దానికంటే చక్కగా ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా వచ్చింది. ఆ సీన్ చిత్రీకరణ ముగిసిన తరువాత “ఓస్.. రేప్ అంటే ఇంతేనా? ఏమో అనుకుని భయపడ్డాను” అని నిండుగా నవ్వారు హీరోయిన్ వాణిశ్రీ.

ఆ తరువాత ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తమిళనాడులోని “వైగై డ్యామ్” లో చిత్రీకరించడానికి యూనిట్ మొత్తం వెళ్లారు.ఆ డ్యామ్ కు కొద్దిదూరంలో ‘పెరియకులం’ అనే టౌన్ వుంది. అక్కడ అన్నపూర్ణవారి ద్వితీయ చిత్రం ‘తోడికోడళ్ళు’ తమిళ వెర్షన్ అయిన ‘ఎంగళ్వీట్టు మహాలక్ష్మి’ ఆడుతోంది. ఆ వూరి నుండి థియేటర్ యాజమాన్యం వారు, మరికొందరు ఆఫీసర్లు ఒకరోజు సాయంకాలం షూటింగ్ స్పాట్ కు వచ్చి” మీ యూనిట్ మొత్తం మా ఆతిథ్యం స్వీకరించాలి”- అని కోరారు. మరీ బలవంత పెట్టడంతో వారి ఆహ్వానాన్ని మన్నించి ఆ ఊరు వెళ్లారు. అక్కడ ఆ చిన్న టౌన్ లో నాగేశ్వరరావు ను చూడటానికి జనం విరగబడ్డారు. వారి కేరింతలు, హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. అప్పటికి నాగేశ్వరరావు తమిళ చిత్రాలు చేయడం మానేసి 16 సంవత్సరాలు అయింది. అన్నేళ్ళ తరువాత కూడా చెక్కుచెదరని ఆ అభిమానాన్ని చూసి యూనిట్ సభ్యులంతా ఆశ్చర్యపోయారు.



ఆ తర్వాత కొద్ది రోజులకు విచిత్రబంధం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ వచ్చింది. ఆ సందర్భంగా తిరుపతి వెళ్లి వద్దాం రండి అని మధుసూదనరావును కూడా బయల్దేరదీశారు ఆదుర్తి సుబ్బారావు. రాత్రికి తిరుపతిలో కాటేజీ తీసుకొని పడుకున్నారు. తెల్లారి నిద్ర లేచి చూసేసరికి ఆదుర్తి పక్క మీద లేరు. ఎక్కడికి వెళ్లి ఉంటారబ్బా అనుకుంటుండగానే నెత్తి మీద ఒక టవల్ చుట్టుకుని వచ్చారు ఆదుర్తి.

” ఎక్కడికి వెళ్లారండి… నెత్తి మీద ఆ గుడ్డ ఏంటి? అని ఆశ్చర్యంగా అడిగారు మధుసూదనరావు. చప్పున నెత్తి మీద టవల్ తీసి “శుభ్రంగా గుండు కొట్టించుకొని వచ్చానండి.. ఈ దెబ్బతో నా దరిద్రం వదిలి పోవాలి. మన విచిత్రబంధం తప్పకుండా హిట్ కావాలని ఆ ఏడుకొండల వాడికి మొక్కుకొని తలనీలాలు ఇచ్చేశాను” – అన్నారు ఆదుర్తి. అంతకుముందు ఆయన హిందీలో నిర్మించిన “దర్పన్” ఫెయిల్ అవ్వడంతో ఆయన బాగా నిరాశకు లోనై ఉన్నారు.

చిత్రవిచిత్రమైన కామెంట్స్, కాంట్రవర్సీ ల మధ్య విడుదలయింది విచిత్రబంధం. కచ్చితంగా అదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఉధృతమైంది. అయినా కూడా ఆ ఉద్యమ ప్రభంజనాన్ని ధాటిగా ఎదుర్కొని విజయ విహారం చేసింది “విచిత్రబంధం”. కొందరు విమర్శకులు మాత్రం హీరో రేప్ చేయటం పై విమర్శలు గుప్పించారు. అనంతపురం నుండి’ వాస్తవిక’ అనే కలం పేరుతో ఒక విమర్శకుడు ఆదుర్తిని, మధుసూదన రావును తీవ్రంగా తిడుతూ” ఈ సినిమా ఫెయిల్ అవుతుంది… దీనికి బాధ్యులు మీరిద్దరే”- అంటూ సుదీర్ఘమైన లేఖ రాశాడు.

అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ అఖండ విజయాన్ని సాధించి 25 వారాలు ప్రదర్శించబడి రజితోత్సవ సంరంభాన్ని చవిచూసింది “విచిత్రబంధం”. నూరు రోజులు దాటి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతున్న కారణంగా శతదినోత్సవం ఎందుకు ఏకంగా రజతోత్సవమే చేద్దాం అనుకున్నారు. 22 వ వారం వచ్చేసరికి రజతోత్సవ నిర్వహణపై చర్చలు జరిగాయి. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయాలి అంటే రెండు లక్షలు ఖర్చవుతుంది. మినిమం గ్యారెంటీ పద్ధతి మీద చిత్రాన్ని నడుపుతున్న మీరు ఒక లక్ష భరిస్తే మిగిలిన లక్ష నేను పెట్టుకుని ఫంక్షన్ చేస్తాను అని అన్నపూర్ణ ఫిలిమ్స్ వారికి తన ప్రతిపాదన చెప్పారు మధుసూదనరావు.
కానీ ఆ ప్రతిపాదనకు డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించనందువల్ల రజతోత్సవ సంరంభాన్ని చవిచూడవలసిన విచిత్రబంధం కనీసం శతదినోత్సవాన్ని కూడా జరుపుకో లేకపోయింది.


 



(సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 17న చదవండి)

( విచిత్రబంధం నుండి కొన్ని హిట్ సాంగ్స్ మీకోసం)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here