నిర్మాణం అన్నపూర్ణా ఆర్ట్ పిక్చర్స్ మీద – పంపిణీ అన్నపూర్ణ ఫిలిమ్స్ మీద… – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 33,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 33

(రీక్యాప్)

( జై జవాన్ వల్ల మా సంస్థకు ఆర్ధిక నష్టం ఏమీ రాలేదు… కానీ హార్థికంగా మేము , ముఖ్యంగా నేను చాలా దెబ్బతిన్నాను”- అంటారు మధుసూదన రావు.
కానీ ప్రతి అపజయము కాబోయే విజయానికి పునాది అవుతుంది అన్నది జగమెరిగిన వాస్తవం)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

“మధుసూదన రావు గారూ! మేమందరము భాగస్వాములం అయినప్పటికీ మీరు ఒక్కరే కష్టపడుతూ అన్నపూర్ణ సంస్థకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసి లాభాలు ఆర్జించి పెట్టారు. మూతపడే స్థితికి వచ్చిన సారథి స్టూడియోస్ కోసం” ఆత్మీయులు” చిత్రాన్ని నిర్మించి పెట్టారు. మీ కృషికి తగిన స్థాయిలో మీకు ప్రాఫిట్స్ రాలేదు… మా తో పోల్చుకుంటే మీ1/8 షేర్ ప్రకారమీకు వచ్చే ప్రాఫిట్ చాలా తక్కువ. కాబట్టి మీరే ఒక సంస్థను పెట్టుకొని సినిమాలు తీయండి. పెట్టుబడి మొత్తం మేమే పెట్టి మినిమం గ్యారెంటీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం. నష్టంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. లాభాలు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందాం”- నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అధినేత, సారథి స్టూడియోస్ అధినేతల్లో ఒకరు, అన్నపూర్ణ సంస్థలో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అయిన కాట్రగడ్డ శ్రీనివాసరావు ప్రతిపాదన ఇది.

 కాట్రగడ్డ శ్రీనివాస రావు చేసిన ఈ ప్రతిపాదనకు అన్నపూర్ణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఏకగ్రీవంగా తమ ఆమోదాన్ని తెలిపారు. మధుసూదన రావు పట్ల అందరిలో ఉన్న సదభిప్రాయం, అభిమానం ఈ నిర్ణయానికి దారి తీసింది. ఆ ప్రతిపాదన నుండి పుట్టిన నూతన చిత్ర నిర్మాణ సంస్థ” అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్”. ఈ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం “అమాయకురాలు”.

దర్శకుడు వి.మధుసూదనరావు.

కథ మాటలు పినిశెట్టి.

పినిశెట్టి సమకూర్చిన ఈ చిత్ర కథ కూడా పల్లెటూరు వాతావరణంలో సాగేదే. ఒక ధనవంతుడు తన ఒక్కగానొక్క కుమార్తెను పేదవాడైన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలన్న సంకల్పంతో అతన్ని చదివించి వృద్ధిలోకి తెస్తాడు. అయితే ధనవంతుడి భార్య ఆ సంబంధానికి ససేమిరా ఒప్పుకోకపోవడం వల్ల గత్యంతరం లేక వేరే సంబంధం చూసి
ముహూర్తాలు పెట్టుకుంటారు.


 

ఓ అనుకోని పరిస్థితిలో వయసులో ఉన్న ఆ కాబోయే దంపతులు శారీరకంగా ఒకటవుతారు. ధనవంతుడి ఆస్తి కోర్టు పరంగా దాయాదుల పాలవుతుంది. డబ్బు లేని సంబంధం మాకెందుకు అని అబ్బాయి తరుపువారు ఆ సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటారు. తన కూతురు పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని తెలుసుకున్న ఆ తండ్రి తల్లడిల్లిపోతాడు.తనకు ఓ ధనవంతుడి కూతురుతో పెళ్లి నిశ్చయమైందన్న శుభవార్తను చెప్పటానికి వచ్చిన మేనల్లుడు జరిగిన విషయం తెలుసుకుని నిర్ఘాంతపోతాడు. ఒకప్పుడు తనను చేరదీసి అంత వాడిని చేసినందుకు కృతజ్ఞతగా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. అతను చేస్తున్న త్యాగాన్ని తట్టుకోలేక ఆ పిల్ల ఆత్మహత్యకు పూనుకుంటుంది. టూకీగా ఇదీ కథ.

ఈ చిత్రంలో ఎంతో మానసిక సంఘర్షణకు లోనయ్యే రెండు పాత్రలను అక్కినేని – గుమ్మడి పోటాపోటీగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇకపోతే “ఇద్దరు మిత్రులు” చిత్రంతో పరిచయం గావింపబడిన శారదకు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి అన్నపూర్ణ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చింది. అయితే ఈ ఎనిమిదేళ్లలో నటిగా ఆమె ఎంతో సాధించింది. ముఖ్యంగా మళయాళ చిత్ర రంగంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని మూడింటిలో ఒక “ఊర్వశి”ని అప్పటికే సొంతం చేసుకున్నారావిడ. అయితే మాతృభాష అయిన తెలుగులో అదే స్థాయిలో అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అన్నది ఆమె అభిలాష. అన్నపూర్ణ సంస్థ నుండి పిలుపు వచ్చింది అంటే అది హీరోయిన్ వేషం అయి ఉంటుందని ఆశించారావిడ.అయితే అది హీరోయిన్ క్యారెక్టర్ కాదు. అయినా సబ్జెక్ట్ వినగానే ఒక ఆర్టిస్టుగా స్పందించి ఆ క్యారెక్టర్ చేయటానికి ఉత్సాహం చూపించారు.నిజానికి హీరో నాగేశ్వరరావు సరసన హీరోయిన్ క్యారెక్టర్ కాదు అన్న అసంతృప్తి తప్ప హీరోయిన్ కన్నా ప్రాముఖ్యత గల పాత్ర అది. “అమాయకురాలు” టైటిల్ రోల్ ఆమెదే. నాగేశ్వరరావు సరసన హీరోయిన్ గా కాంచన చేశారు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం సజావుగా జరిగాయి. క్లైమాక్స్ దృశ్యాలతో పాటు కొన్ని పాటల చిత్రీకరణ కోసం కేరళ వెళ్లారు. అక్కడ జరిగిన ఒక ప్రమాదకర సంఘటన నుండి అందరూ క్షేమంగా, పరువు గా బయటపడగలిగారు అంటే అందుకు కేరళ రాష్ట్రంలో శారదకు గల పేరు ప్రఖ్యాతులే కారణం. ఆ సంఘటన పూర్వాపరాలు ఇవి…

కథ ప్రకారం విలన్ రమణమూర్తి రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తన భార్య అయిన శారదకు మాయమాటలు చెప్పి పిక్నిక్ కు అని తీసుకువెళ్లి నీళ్లలో తోసేస్తాడు. ఆమె కొనవూపిరితో ఉండి తన కూతుర్ని హీరో చేతుల్లో పెట్టి చనిపోతుంది. ఈ దృశ్యాల చిత్రీకరణ కోసం కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం దగ్గరలో గల “అరువికెరా” డ్యామ్ కు వెళ్లారు. ఆ డ్యామ్ కు ఉన్న ఆరు గేట్లు తెరిస్తే నీరు మహా ఉధృతంగా కెనాల్ లోకి ప్రవహిస్తుంది. ఆమెను నీళ్లలోకి నెట్టివేసే సన్నివేశ చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. చివరిగా నీళ్లలో నెట్టడానికి ఒక డమ్మీ బొమ్మను కూడా కూడా సిద్ధం చేశారు. నీళ్లలో కొట్టుకు పోయినట్లుగా చూపటానికి శారదా వయసు కలిగిన ఒక మలయాళ అమ్మాయిని డూప్ గా పెట్టారు. ఆమె నడుముకి ఒక తాడు కట్టి బయటకు కనబడకుండా ఆ తాడును నీళ్లలో వదిలేశారు. శారద, రమణమూర్తిలపై క్లోజప్ షాట్స్ తీసిన తరువాత ఆ లాంగ్ షాట్ పెట్టారు. కెమెరామెన్ సిద్ధంగా ఉన్నారు. ఆ డూప్ నడుముకు కట్టిన తాడు గట్టిగా పట్టుకొని ఉన్నారు ఇద్దరు సెట్ బాయ్స్. ఒకవేళ అమ్మాయి నీళ్లలో కొట్టుకుపోతే పట్టుకోవడానికి ఇద్దరు కుర్రాళ్లను , అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావును కొంచెం దూరంలో ఉన్న బ్రిడ్జి దగ్గర రెడీగా ఉంచారు. ఇక ఎలాంటి ప్రమాదం లేదు అనుకున్న తరువాత స్టార్ట్ కెమెరా అన్నారు దర్శకుడు వి.మధుసూదనరావు.

” యాక్షన్” అనగానే ఒకేసారి ఆరు లాకర్స్ తెరుచుకోవటం కొద్ది గ్యాప్ లో ఆ అమ్మాయి నీళ్లలో దూకటం జరిగింది. ఆ అమ్మాయి నడుముకు కట్టిన తాళ్లు పట్టుకున్న కుర్రవాళ్లు కెమెరా వ్యూ లోకి వస్తున్నారని దర్శకుడు గట్టిగా అరిచేసరికి వాళ్లు కంగారుపడిపోయి ఆ తాళ్ళను వదిలేశారు. మహా ఉధృతంగా పరుగులు తీస్తున్న నీళ్లలో ఆ అమ్మాయి కొట్టుకుపోతుంది. యూనిట్ మొత్తం కంగారుగా వెంట పరిగెత్తింది. ఆ అమ్మాయిని పట్టుకోవటానికి బ్రిడ్జి దగ్గర ఉంచిన కుర్రోళ్ళు ఎంత ప్రయత్నించినా దగ్గరకు చేరుకోలేకపోయారు. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు నీళ్లలో కొట్టుకుపోయాడు. ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ భయంకరమైన సుడి గుండాలు ఉన్నాయి. ఆ కాలువ గట్టున యూనిట్ తో పాటు షూటింగ్ చూడటానికి వచ్చిన వందలాది జనం పరుగులు తీశారు. కాని ఏ ఒక్కరు అమ్మాయిని, అసిస్టెంట్ డైరెక్టర్ ను రక్షించే ప్రయత్నం చేయలేకపోయారు. వారు ఆ సుడిగుండాలు ఉన్న ప్రాంతంలో మునుగుతూ తేలుతూ కొంతదూరం కొట్టుకుపోయాక ఇద్దరు మలయాళ కుర్రాళ్ళు ప్రాణాలకు తెగించి నీళ్లలోకి దూకి వాళ్ళిద్దరినీ రక్షించి ఒడ్డుకు చేర్చారు. కొన ఊపిరితో ఉంది ఆ అమ్మాయి. కానీ కొద్ది సేపటికి తేరుకుని ప్రాణ గండం నుండి బయటపడింది. కానీ అప్పుడు ప్రారంభమైంది యూనిట్ మొత్తానికి అసలు గండం.

షూటింగ్ చూడటానికి వచ్చిన వందలాది జనం యూనిట్ మీద పడ్డారు.ఎక్కడ ఆ డైరెక్టర్? అని చిందులేస్తూ నానా రభస చేశారు. ఇక ఆల్మోస్ట్ ఆల్ మీదపడి కొట్టబోయే పరిస్థితి.

అప్పుడు యూనిట్ వాళ్లందరినీ రక్షించింది శారద ఇమేజ్. కేరళ లో తనకు గల విపరీతమైన పాపులారిటీ కారణంగా వాళ్లందరికీ నచ్చచెప్పి ఎలాగోలా ప్రమాదం నుండి తప్పించింది శారద. ఆ మలయాళ అమ్మాయిని, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావును హాస్పిటల్లో చేర్పించారు. శారద సూచన మేరకు షూటింగ్ స్పాట్ నుండి డైరెక్టర్ వి.మధుసూదనరావును తప్పించి తన వెంట కారులో తీసుకుపోయారు నిర్మాత డి. మధుసూదనరావు.

అంతా సద్దుమణిగాక విశ్లేషించుకుంటే ఈ ప్రమాదానికి 3 కారణాలు కనిపించాయి. నీళ్లలో కొట్టుకుపోయే దృశ్యం బాగా ఎఫెక్టివ్ గా వస్తుందనే ఉద్దేశంతో నాలుగు లాకర్స్ కు బదులు మొత్తం ఆరు లాకర్స్ లిఫ్ట్ చేయమని చెప్పారట దర్శకుడు వి.మధుసూదనరావు. ఈ విషయం నిర్మాత మధుసూదనరావుకు గాని, ఇతర యూనిట్ మెంబర్స్ కు గానీ తెలియదు. రెండవ కారణం కెమెరా ఫీల్డ్ లోకి వస్తున్నారని దర్శకుడు అరిచేసరికి కంగారు పడ్డ సెట్ బాయ్స్ తాళ్ళు వదిలేయటం. అసలు మూడవ కారణం ఆ డూప్ వేసిన అమ్మాయి తనకు ఈత వచ్చు అని అబద్ధం చెప్పటం.

ఈ మూడు కారణాల్లో ఆ అమ్మాయి అబద్ధం చెప్పటమే అసలు కారణంగా వాదించి అందరినీ శాంతింప చేశారు శారద. అక్కడ ఉన్న ఒక చిన్న దేవాలయానికి మధుసూదనరావుగారితో విరాళం ఇప్పించి, పూజలు చేయించి సమస్యను పరిష్కరింపచేశారు శారద.

అయితే అంత పెద్ద ఉపద్రవం జరిగినప్పటికీ ఆ సన్నివేశాన్ని మాత్రం చాలా అద్భుతంగా తనలో ఇముడ్చుకుంది సెల్వరాజ్ కెమెరా. మొత్తానికి కేరళ షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదకర సంఘటన మినహాయిస్తే మిగిలిన షూటింగ్ మొత్తం చాలా ప్రమోదభరితంగా జరిగింది.

త్రివేండ్రంకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న “నెయ్యర్ డ్యామ్” లో ఒక పాట చిత్రీకరణ కోసం గెస్ట్ హౌస్ లో దిగింది అన్నపూర్ణ యూనిట్. పగలంతా అక్కడ షూటింగ్ చేసుకుని రాత్రికి త్రివేండ్రం వెళ్లేవారు. ఒకరోజు అప్పటి కేరళ ముఖ్యమంత్రి అచ్యుత్ మీనన్ విశ్రాంతి కోసం ఆ గెస్ట్ హౌస్ కు వచ్చారు. తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుండి వచ్చారని గెస్ట్ హౌస్ ఇంచార్జ్ పరిచయం చేశారు.

” మీరు ఈ రూమ్ కూడా తీసుకోండి…నేను వేరే గెస్ట్ హౌస్ కి వెళ్తాను”.. అని మాకు చెప్పి “వీళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి” అని గెస్ట్ హౌస్ సిబ్బందిని ఆదేశించి వెళ్లారు అచ్యుత మీనన్. ఎలాంటి ఆర్భాటాలు, వందిమాగధ బృందాలు, అడుగుకొక పోలీసు సెక్యూరిటీ లేకుండా కేవలం తన పర్సనల్ సెక్రటరీ ఒక్కడితో వచ్చి అలా నిరాడంబరంగా మాట్లాడి వెళ్లిన ఆ ముఖ్యమంత్రిని మనసులోనే అభినందించుకున్నారు మధుసూదన రావు. చిత్ర నిర్మాణం పూర్తయింది.

ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ నవయుగ ఫిలిమ్స్ కాదు. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో పి.ఏ.పి. సుబ్బారావు, జగపతి రాజేంద్ర ప్రసాద్, దుక్కిపాటి మధుసూదన రావు, అక్కినేని సతీమణి శ్రీమతి అన్నపూర్ణ భాగస్వాములుగా వెలసిన నూతన పంపిణీ సంస్థ” అన్నపూర్ణ ఫిలిమ్స్” తొలి చిత్రంగా “అమాయకురాలు” విడుదలైంది.

విడుదలైన అన్ని కేంద్రాలలో విజయఢంకా మ్రోగించింది “అమాయకురాలు”. అయితే విజయవాడ, గుంటూరు వంటి సెంటర్స్ లో థియేటర్స్ దొరక్క ఎన్టీఆర్ చిత్రాలను రెగ్యులర్ గా ప్రదర్శించే థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. వంద రోజులు దగ్గర పడుతుండగా ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా విడుదల నిమిత్తం అమాయకురాలు చిత్రాన్ని వెకేట్ చేయవలసి వచ్చింది. పెద్ద సెంటర్స్ లోనే ఎత్తివేయడంతో మిగిలిన సెంటర్స్ లో కూడా 100 రోజులు పూర్తి కాకుండానే తీసివేశారు.


 అందువలన “అమాయకురాలు” శతదినోత్సవం జరుపుకోలేకపోయింది.

( సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 15న చదవండి)

( అమాయకురాలు చిత్రంలోని కొన్ని హిట్ సాంగ్స్ మీకోసం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here