(రీక్యాప్)
” బాబూ! స్టూడియోను నిలబెట్టి మా బ్రతుకు తెరువు పోకుండా కాపాడారు”- అంటూ మధుసూదన రావుకు చేతులెత్తి నమస్కరించారు సారథి స్టూడియోస్ సిబ్బంది.
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)
దేశభక్తిని ప్రభోదించే ఒక మంచి చిత్రాన్ని నిర్మించాలన్న సంస్థ ఆశయానికి రూపకల్పనే ” జై జవాన్” నిర్మాణం. ఈ ఆశయాన్ని డి.వి.నరసరాజు గారికి చెప్తే ఆయన చైనా వార్ తో ప్రారంభించి పాకిస్తాన్ వార్ తో ముగిస్తూ రెండింటికీ మధ్య చక్కని ఫ్యామిలీ డ్రామాను, సెంటిమెంట్ ను చూపిస్తే కథాపరంగా ను, ఆశయపరంగాను చక్కని చిత్రం అవుతుంది” అని సూచించారు. ఇతివృత్తాన్ని యద్దనపూడి సులోచనారాణి గారికి చెప్పి ఒక మంచి కథను రూపొందించమని కోరారు మధుసూదనరావు. ఆ ప్రకారమే ఆమె కథ రాశారు. అది చాలా బాగా వచ్చింది. ఇందులో హీరో ఒక మిలటరీ ఆఫీసర్. తాము కోరిన నేపథ్యంలో చక్కగా వచ్చిన కథకు అంతకంటే గొప్పగా డైలాగులు రాశారు డి. వి. నరసరాజు గారు. హిందీ చిత్రాల నిర్మాణ దర్శకత్వ వ్యవహారాలలో మునిగి ఉన్న ఆదుర్తి సుబ్బారావు గారు ఈ చిత్రానికి కూడా కాల్షీట్స్ సర్దుబాటు చేయలేక పోయారు.

అప్పుడు డి. యోగానంద్ ను “జై జవాన్” చిత్రానికి దర్శకుడుగా నిర్ణయించుకున్నారు. యోగానంద్ అన్నపూర్ణ లో పనిచేసిన 5వ దర్శకుడు.షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మిలటరీ క్యాంపులు, సైనికుల శిక్షణ మున్నగు దృశ్యాల చిత్రీకరణలో వాస్తవికత కనిపించాలంటే అలాంటి వాతావరణం కావాలి. గండిపేటకు వెళ్లేదారిలో ఉన్న ఆర్టిలరీ సెంటర్ (సైనిక శిక్షణ కేంద్రం) వారి సహాయాన్ని కోరారు మధుసూదనరావు. అడిగినదే తడవుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు వారు. కొన్ని సన్నివేశాల్లో అట్మాస్పియర్ షాట్స్ కోసం జూనియర్ ఆర్టిస్టుల అవసరం లేకుండా వారే సోల్జర్స్ ను పంపించారు.
” పాలబుగ్గల చిన్నదాన” అనే పాటలో కనిపించే వారంతా ఒరిజినల్ సోల్జర్సే .
ఈ విధంగా వారి సహకారంతో చాలా భాగం షూటింగ్ దిగ్విజయంగా జరిగింది. చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. క్లైమాక్స్ లో పాకిస్తాన్- భారత్ యుద్ధ దృశ్యాలను చూపించాలి. క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాల్లో కొన్ని మ్యాచింగ్ షాట్స్ కోసం అన్వేషణ ప్రారంభించారు మధుసూదన రావు.
అప్పటికే తాష్కెంట్ ఒప్పందం కుదిరి యుద్ధ విరమణ జరిగింది. ఆ సమయంలో ఫిలింస్ డివిజన్ వారి వద్దకు వెళితే తాష్కెంట్ ఒప్పందం ప్రకారం ఇండో- పాక్ యుద్ధ దృశ్యాలను ఎక్కడా ప్రదర్శించకూడదు… అలా చూపటం నిషిద్ధం”- అని చెప్పారు .

మధుసూదనరావు షాక్ అయ్యారు.
సినిమా క్లైమాక్స్ మొత్తం ఇండో- పాక్ వార్ పైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏమిటి చేయడం? వెంటనే మద్రాసు వెళ్లి సెన్సార్ వారిని సంప్రదించారు. వారు కూడా ఇదే చెప్పారు. గొప్ప సంకట పరిస్థితి ఎదురైంది. ఎలా? ఏం చేయాలి?క్లైమాక్స్ మార్చడం తప్ప వేరే గత్యంతరం లేకపోయింది. అలా చేస్తే చిత్ర కథలోని పటుత్వం మొత్తం నీరుగారిపోతుంది.
అలాంటి క్లిష్టపరిస్థితుల్లో క్లైమాక్స్ మార్చక తప్పలేదు.

మంచుకొండలపై చైనా సరిహద్దుల్లో పోరాట సన్నివేశాలను ఎంతో సహజంగా చిత్రీకరించినప్పటికీ , సైనిక అధికారిగా నాగేశ్వరరావు గొప్పగా నటించినప్పటికీ సినిమా ఎత్తుగడకు క్లైమాక్స్ కు పొంతన లేకపోవడంతో జై జవాన్ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది.ఒక మంచి దేశభక్తి ప్రభోదితమైన చిత్రం అందించాలన్న అన్నపూర్ణ సంస్థ ఆశయానికి ఎదురైన నిరాశ ఇది.ఎందరో తస్మదీయ వర్గాల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అన్నపూర్ణ సంస్థ పరాజయాన్ని తమ విజయంగా భావించిన కొందరు ప్రబుద్ధులు పార్టీలు చేసుకున్నారు.ఈ అపజయ భారం అందరికన్నా ఎక్కువగా మధుసూదనరావును కుంగదీసింది. ఇది సంస్థ తొలి అపజయం మాత్రమే కాదు… వ్యక్తిగతంగా మధుసూదనరావు జీవితంలోనే తొలి పరాజయం. విపరీతమైన ఆందోళనకు గురయ్యా రాయన. ఆరోగ్యం క్షీణించింది. తాను మద్రాసు చేరినప్పటి నుండి పర్సనల్ డాక్టర్ గా ఉంటున్న స్నేహితుడు డాక్టర్ సి ఆర్ ఆర్ పిళ్ళై గారు” అయిపోయిన దానిని గురించి బాధపడటం వల్ల ఉన్న ఆరోగ్యం పాడైపోతుంది… గతాన్ని మరిచిపోయి రాబోయే దాని గురించి జాగ్రత్త తీసుకోండి”- అని సలహా ఇచ్చారు.జీవితమనే పరుగు పందెంలో మనిషి అనే వాడు పడక తప్పదు… పడి లేవకా తప్పదు.
ఈ పరాజయంపై స్పందిస్తూ” ఒక ఇంటికి పునాదులు తీసి వేరొక ఇంటిని కట్టినట్లు అయింది ఈ సినిమా. దీనివల్ల మా సంస్థకు ఆర్థిక నష్టం ఏమీ రాలేదు కానీ హార్థికంగా మేము, ముఖ్యంగా నేను చాలా దెబ్బతిన్నాను” అంటారు మధుసూదన రావు.


కానీ ప్రతి అపజయము రాబోయే విజయానికి పునాది అవుతుందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం.
( సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 13న చదవండి)
(ఇప్పుడు” జై జవాన్” సినిమాలోని కొన్ని హిట్ సాంగ్స్ మీకోసం)
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=cYox9avsuTg]