( రీక్యాప్)
( అప్పటివరకు విడుదలయిన అన్నపూర్ణ వారి చిత్రాలలో highiest grosser గా రికార్డు సృష్టించాడు “పూలరంగడు”. మరువలేని మరొక విశేషం. అప్పటి భారత ఉపాధ్యక్షుడు శ్రీ వి. వి. గిరి గారు సకుటుంబ సమేతంగా బెంగళూరులో” పూలరంగడు” సినిమా చూసి అక్కినేని నాగేశ్వరరావు నటనా కౌశలాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)
అన్నపూర్ణ వారి తదుపరి చిత్రం “ఆత్మీయులు”. ఆత్మీయులు చిత్రనిర్మాణానికి హైదరాబాదులో సారధి స్టూడియోస్ అస్తిత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది.” చదువుకున్న అమ్మాయిలు” చిత్రం నుండే హైదరాబాద్ కు వచ్చింది అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్.

సంస్థ చిత్రాల షూటింగ్స్ నిమిత్తమే నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ సారధి స్టూడియోలో మేజర్ షేర్స్ తీసుకున్నారు. సిబ్బందికి జీతభత్యాలు చెల్లిస్తూ స్టూడియో ఉనికిని కొనసాగించటం కష్టమయింది. కేవలం అన్నపూర్ణ చిత్రాలను దృష్టిలో ఉంచుకుని సారథి స్టూడియోస్ నడుపుతున్నామనీ, సంవత్సరానికి స్టూడియో దాదాపు లక్ష రూపాయల నష్టంతో నడుస్తోందని సారథి స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ కాట్రగడ్డ శ్రీనివాసరావు అన్నపూర్ణ డైరెక్టర్స్ మీటింగ్ లో చెప్పారు. ఆ పరిస్థితుల్లో సారథి స్టూడియో కోసం ఒక సినిమా తీసి పెట్టడం తమ నైతిక బాధ్యతగా భావించారు అన్నపూర్ణ అధినేతలు.
” అన్నపూర్ణ సంస్థలో తీసుకున్నట్లుగానే పారితోషకం తీసుకుని సారథి స్టూడియోస్ కు ఒక సినిమా తీసిపెట్టమని అక్కినేని నాగేశ్వరరావు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన పట్ల అందరూ సానుకూలంగా స్పందించడంతో దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాతగా సారథి స్టూడియో వారి “ఆత్మీయులు” చిత్ర నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏ కథ తీసుకున్నా అది సహజత్వానికి దగ్గరగా ఉండాలన్నది మధుసూదన రావు అభిప్రాయం. అటువంటి సహజ సంఘటననే ఈ చిత్ర కథకు ఆధారంగా తీసుకున్నారు.
అదేమిటంటే-
మధుసూదనరావు స్వగ్రామమైన పెయ్యేరు కు పక్కనే ఉన్న చిన్న గ్రామంలో ఓ భూస్వామి ఉండేవాడు. అతనికి చాలా పొలాలు ఉండేవి. ఆ పొలాల్లో ఒక పాలేరు పనిచేస్తుండేవాడు. ఒక రోజు పక్క పొలంలో మనుషులు ఈ భూస్వామి పొలం గట్టు కొట్టి అందులో ఉన్న నీటిని తమ పొలంలోకి మళ్లించుకోవాలని చూశారు. అప్పుడు పాలేరు అడ్డం పడ్డాడు. ఆ ఘర్షణలో అనుకోకుండా పాలేరు చనిపోయాడు. స్వామి భక్తుడైన పాలేరు పట్ల కృతజ్ఞతా భావంతో అతని పిల్లల్ని భూస్వామి చేరదీసి పెంచుకోవడం జరిగింది.
ఇదీ జరిగిన సంఘటన.
దీనిని రచయిత్రి యద్దనపూడి సులోచనారాణికి చెప్పి కథ తయారు చేయమన్నారు మధుసూదనరావు. కుటుంబ కథలను నవలలుగా మలచటంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్న సులోచనారాణి ఆయన సూచించిన విధంగా ఇతివృత్తాన్ని పల్లెటూరి వాతావరణం తో జోడించి చక్కని కథ తయారు చేశారు. అది అందరికీ నచ్చింది.
ఆ సమయంలో ఆదుర్తి సుబ్బారావు ” దర్పన్” అనే హిందీ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉండటంవల్ల ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను వి.మధుసూదనరావుకు అప్పగించారు. వి.మధుసూదనరావు అన్నపూర్ణ సంస్థకు కొత్త వారేమీ కాదు. అంతకుముందు “తోడికోడళ్ళు”చిత్రానికి ఆదుర్తి దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ గా పని చేశారు. అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు- సావిత్రి కాంబినేషన్లో ఆయన డైరెక్ట్ చేసిన జగపతి వారి” ఆరాధన” గొప్ప హిట్టయింది.

అలా దర్శకుడిని నిర్ణయించుకున్న తరువాత సంభాషణల రచయితగా ఎవరిని తీసుకోవాలి అనే ఆలోచన ఎదురయింది. ఇది పూర్తిగా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే చిత్రం కావటంతో అలాంటి ఇతివృత్తాలతో అంతకు ముందు మంచి నాటకాలు రాసిన పినిశెట్టి శ్రీరామ్ మూర్తిని సంభాషణలు రాయమన్నారు.
మధుసూదన రావు, సీనియర్ జర్నలిస్టు బొమ్మకంటి సుబ్బారావు, ప్రొడక్షన్ మేనేజర్ టీవీఎస్ శాస్త్రి, పినిశెట్టి – ఈ నలుగురు ప్రతిరోజు బీచ్ ఒడ్డున కూర్చొని కథా చర్చలు జరిపారు. పినిశెట్టి తనకప్పగించిన బాధ్యతను దిగ్విజయంగా నిర్వహించి చక్కని సంభాషణలు రాశారు. ఇక నటీనటుల ఎంపిక విషయానికి వస్తే – హీరో నాగేశ్వరరావు సంస్థకు పర్మినెంట్ హీరోగా ఎలాగూ ఉన్నారు.
ఇది పూర్తిగా అన్నాచెల్లెళ్ల కథ కనుక హీరోయిన్ కు అంత ప్రాధాన్యత ఉండదు. అందుచేత హీరోయిన్ వేషానికి టాప్ స్టార్ అవసరం లేదనుకున్నారు. మరి ఎవరిని తీసుకోవాలి అనే ప్రశ్న ఉదయించింది. చాలా మందిని అనుకున్నారు కానీ ఎవరూ కుదరలేదు. అప్పటికి వాణిశ్రీ హీరో కృష్ణ సరసన ఒక సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా కూడా హిట్ అయింది. కనుక వాణిశ్రీని తీసుకుంటే వెరైటీగా ఉంటుందని అందరూ అభిప్రాయపడ్డారు.అలా “ఆత్మీయులు” చిత్రంతో వాణిశ్రీకి తొలిసారిగా అన్నపూర్ణ సంస్థలోను, అక్కినేని సరసన నటించే అవకాశం లభించింది. ఇక అక్కినేనికి చెల్లెళ్లు గా చంద్రకళ, విజయనిర్మల నటించారు. ఆ రోజుల్లో నటీనటులు నిర్మాతలకు ఎంతగా సహకరించేవారో తెలిపేందుకు ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పాలి.

ఆత్మీయులు చిత్రంలో విజయనిర్మల పాత్ర షూటింగ్ మొత్తం పూర్తి అయినప్పటికీ ఒక్కరోజు ప్యాచ్ వర్క్ నిమిత్తం హైదరాబాద్ రావలసి వచ్చింది. ఆరోజు తప్పితే కాంబినేషన్ దొరకటం కష్టం. ఒక్కరోజు పని కోసం ఆమెను హైదరాబాద్ కు రప్పించాలి.
ఆమె ఎలాగో డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని వస్తానని చెప్పారు. ఆమె, ఆమె తండ్రి గారు మద్రాసులో బయలుదేరారు. తీరా ఎయిర్ పోర్టుకు వచ్చాక విజయనిర్మలకు మాత్రమే టికెట్ దొరికింది. ఆమె తండ్రి గారికి దొరకలేదు. చివరి నిమిషం వరకు ప్రయత్నించి ఆఖరుకు తను ఒంటరిగా బయలుదేరి హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసి రాత్రి ఫ్లైట్ కు ఒక్కరే తిరిగి మద్రాసు వెళ్లారు.
“ఒంటరిగా నేను రాలేను- అని విజయనిర్మల నిరాకరించి ఉంటే ఆరోజు దొరికిన ఆర్టిస్టుల కాంబినేషన్ మిస్ అయి ఉండేది. మళ్లీ అది సెట్ అవ్వటానికి ఎన్ని రోజులు పట్టేదో.. ఏ చిన్న వంక దొరికినా షూటింగ్ ఎగ్గొట్టాలని చూసే ఆర్టిస్టులు ఉన్న ఈ రోజులకు నిర్మాతలకు ఎలాంటి కష్టం కలగకూడదని ఆలోచించే ఆర్టిస్టులు ఉన్న ఆ రోజులకు ఎంతో వ్యత్యాసం ఉంది” అంటారు మధుసూదనరావు.
ఇది సారథి స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న సినిమా కనుక ఇందులోని పాటలన్నిటినీ సారథి స్టూడియోలోనే కంపోజ్ చేయించారు. ఇక్కడ సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సుప్రసిద్ధులు, అనుభవజ్ఞులు కృష్ణయ్యర్ పర్యవేక్షణలో ఆ పాటలను రికార్డు చేయించారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి, దాశరధి, కొసరాజు రాసిన పాటలకు ఎస్.రాజేశ్వరరావు సమకూర్చిన బాణీలు అద్భుతంగా వచ్చాయి. ఆత్మీయులు సినిమా సంగీతపరంగా గొప్ప ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది. దాశరధి రాసిన” మదిలో వీణలు మ్రోగే- ఆశలెన్నో చెలరేగే” అన్న పాట, డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసిన” చామంతి ఏమిటే ఈ వింత – ఈ చిన్నదానికి కలిగెనేల గిలిగింత” పాటలను నేటికి ఏనాటికి శ్రోతలు మైమరిచి వింటూనే ఉంటారు. అన్నపూర్ణ వారి ఆస్థాన ఛాయాగ్రహకుడు సెల్వరాజ్ సహకారంతో ఈ పాటలను కేరళ లోని trichur దగ్గరలోని ప్లీచీ డ్యామ్, palghat లోని మళంపురా డ్యామ్ , ఊటీ మొదలైన లొకేషన్లలో చిత్రీకరించారు. అలాగే “కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే”,” మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే”- పాటలను సెట్స్ లోనే అద్భుతంగా చిత్రీకరించి దర్శకుడిగా తనకున్న” విక్టరీ మధుసూదనరావు” అనే పేరును సార్థకం చేసుకున్నారు వి.మధుసూదనరావు.
ఆత్మీయులు సినిమా ద్వారా తెలుగు తెరకు ఒక గొప్ప హిట్ ఫెయిర్ ను అందించింది అన్నపూర్ణ సంస్థ. ఆత్మీయులతో ప్రారంభమైన అక్కినేని వాణిశ్రీ ల కాంబినేషన్ లో ఆ తర్వాత ఎన్నెన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. తెలుగు చలన చిత్ర చరిత్రలో నాగేశ్వరరావు సావిత్రి ల కాంబినేషన్ తరువాత అంత సూపర్ హిట్ పెయిర్ గా పేరుపొందిన కాంబినేషన్ నాగేశ్వరరావు వాణిశ్రీలదే అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.
సాధారణంగా ఒక సినిమా విజయం ఎన్నో కుటుంబాలకు జీవనాధార హేతువవుతుంది. ఆత్మీయులు చిత్ర విజయం కూడా అన్నపూర్ణ సంస్థ ప్రతిష్టను ఇనుమడింపజేయడమే కాకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన సారథి స్టూడియోస్ ఆర్థికంగా పుంజుకుని తల ఎత్తుకు నిలబడటానికి దోహదం చేసింది.
” బాబూ! స్టూడియోను నిలబెట్టి మా బతుకుతెరువు పోకుండా కాపాడారు”
అంటూ మధుసూదనరావు కు చేతులెత్తి నమస్కరించారు సారథి స్టూడియోస్ సిబ్బంది.


( సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 11న చదవండి)
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=X9refabqciM]