( రీక్యాప్)
(మొట్ట మొదటి సినిమాతోనే కె.విశ్వనాథ్ కు దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. పోను పోను కమర్షియల్ సినిమాను దృశ్యకావ్యంగా మలచుకుంటూ కళాతపస్విగా నీరాజనాలు అందుకున్నారు కె.విశ్వనాథ్)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)
అన్నపూర్ణ సంస్థలో” తోడి కోడళ్ళు” చిత్రంతో ప్రారంభమై వరుసగా తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించి ఒక సినిమా విరామం తరువాత మరలా మాతృ సంస్థలో” పూలరంగడు” చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు ఆదుర్తి సుబ్బారావు.
ఈ చిత్ర కథ ఒక రూపాన్ని సంతరించుకోవడానికి వెనుక ఒక సుదీర్ఘమైన కథే ఉంది. తొలుత మధుసూదనరావు, గొల్లపూడి మారుతీ రావు కూర్చుని అన్నపూర్ణ వారి తొలి చిత్రం” దొంగ రాముడు” లోని అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ మీద మరొక ప్రయోగం చేయదలచుకున్నారు. ” దొంగ రాముడు” క్లైమాక్స్ లో ఆపదలో ఉండి జైలుపాలు కావలసిన అన్నను చెల్లెలు కాపాడుతుంది. అందుచేత హీరో ప్రాముఖ్యత తగ్గింది. ఈ సినిమాలో అన్నయ్య పాత్రను ఆద్యంతం హీరోయిక్ గా చూపించాలనే ఉద్దేశంతో ఒక చక్కటి సంక్షిప్త కథను రూపొందించారు. చర్చలు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో గొల్లపూడికి హైదరాబాద్ నుండి సంబల్పూర్ రేడియో స్టేషన్ కు బదిలీ అయింది. అసంపూర్తిగా ఉండిపోయిన కథను ఎవరితో పూర్తి చేయించాలి అని ఆలోచించి చివరకు ముళ్ళపూడి వెంకటరమణ గారికి అప్పగించారు. ముళ్లపూడి వెంకటరమణ గారు అప్పటికే మద్రాసు నుండి విజయవాడకు మకాం మార్చారు. మధుసూదన రావు విజయవాడ వెళ్లి ఆయనతో విపులంగా చర్చలు జరిపి కథకు తుది రూపాన్నిచ్చారు. ఇక డైలాగ్స్ ఎవరితోనో ఎందుకు మీరే రాయవచ్చు కదా! అన్నారు మధుసూదనరావు.
” కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల డైలాగ్స్ నేను రాయలేను” అన్నారు ముళ్ళపూడి వెంకటరమణ.అప్పటికి”బలిపీఠం” నవల విడుదలై విశేష ప్రజాదరణ పొంది ఉండటంతో నవలా ప్రపంచంలో ముప్పాళ్ళ రంగనాయకమ్మ పేరు మారుమోగిపోతుంది. ఆమె రాసిన నవలల్లో పదునైన సంభాషణలు ఉంటున్న కారణంగా ఆదుర్తి సూచన మేరకు సంభాషణల రచనా బాధ్యతను ఆమెకు అప్పగించారు.ఇప్పుడు ప్రారంభమైంది అసలు సమస్య! నిర్మాత ఉండేది హైదరాబాద్ – దర్శకుడు ఉండేది మద్రాసు – కథా రచయిత ఉండేది విజయవాడ – సంభాషణ రచయిత్రి ఉండేది వైజాగ్- ఎవరు ఎక్కడికి వస్తే అందరికీ అందుబాటుగా, సౌకర్యంగా ఉంటుంది. అని ఆలోచించి విజయవాడ బెస్ట్ అన్నారు అందరు. రైల్వే స్టేషన్ లో రెండు రిటైరింగ్ ఏసి రూమ్స్ తీసుకొని వారం రోజులు చర్చలు జరిపి కథలో మరికొన్ని మార్పులు చేసి తుది రూపాన్ని ఇచ్చి సంభాషణల రచనా బాధ్యతను ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారికి అప్పగించారు. ఆమె నాలుగు సార్లు ప్రతిసారి పది రోజుల చొప్పున హైదరాబాద్ వచ్చి కూర్చుని సంభాషణల రచన పూర్తి చేసేలాగా మాట్లాడుకున్నారు. హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్లో బస చేసి డైలాగ్స్ పూర్తి చేశారు రంగనాయకమ్మ గారు. అయితే సెంటిమెంటల్ సీన్స్ బాగా రాసినప్పటికీ హాస్య సన్నివేశాలు ఆశించినంత బాగా రాలేదు. అప్పుడు మరలా మధుసూదనరావు ఆదుర్తి గారితో కూర్చుని కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా కొన్ని చేతులు మారిన కారణంగా స్క్రీన్ ప్లే up to the mark రాలేదు అన్న అసంతృప్తి ఆదుర్తి గారిలో ఏర్పడింది. కానీ ఆయన ఆ విషయం వ్యక్తం చేయలేదు.

ఈ సినిమాలో నేటి మేటి దర్శక నటి విజయనిర్మల తొలిసారిగా అన్నపూర్ణ సంస్థలో నటించారు. నాగేశ్వరరావు గారి చెల్లెలిగా శోభన్ బాబు సరసన నటించారు విజయనిర్మల. ఒకరోజు మద్రాసు ప్రకాష్ స్టూడియోకు ఏదో పనిమీద వెళ్ళిన మధుసూదన రావు కు తనను తాను పరిచయం చేసుకుని అన్నపూర్ణ సంస్థలో నటించాలి అనే అభిలాషను వ్యక్తం చేశారు విజయనిర్మల. తను నటించిన ఒక మలయాళ సినిమా కూడా చూపించారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు చెప్పి పూలరంగడు లో విజయనిర్మలకు వేషం కన్ఫామ్ చేశారు మధుసూదనరావు.
ఇక ఈ చిత్రంలో నాగేశ్వరరావు సరసన శ్రీమతి జమున నటించడం విశేషం . అన్నపూర్ణవారి తొలిచిత్రం దొంగరాముడు లో నాగేశ్వరరావు చెల్లెలిగా నటించి ఇప్పుడు ఈ 12వ చిత్రంలో హీరోయిన్ గా నటించారు శ్రీమతి జమున.

ఆత్మగౌరవం లో తన పాత్రకు విశేష ఆదరణ లభించడంతో అల్లు రామలింగయ్య ” నాకు పూలరంగడు లో కూడా వేషం ఇచ్చి తీరాల్సిందే”- అని పట్టు పట్టారు.” ఈ సినిమాలో మీకు తగిన వేషం లేదండి బాబూ! చిన్న పోలీస్ పాత్ర ఉంది. అది మీరు చేయటం బాగుండదు”- అని చెప్పినా కూడా ” ఓ సెంటిమెంట్ గా అన్నపూర్ణ సంస్థ నాకు అచ్చి వచ్చింది. నా భార్య కూడా ఇంత వరకు మీరు పోలీసు వేషం వేయలేదు. తప్పకుండా వేయండి అంటుంది… కాబట్టి చిన్న పాత్ర అయినా వేస్తాను”- అని మారాం చేశారాయన. అప్పుడు ఆ పోలీసు పాత్రనే కొంచెం నిడివి పెంచి అల్లు రామలింగయ్య తో వేయించారు.

రాష్ట్రంలో నిర్మించే ప్రతి చిత్రంలోనూ స్థానిక కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలనే సంకల్పం కలిగిన అన్నపూర్ణ సంస్థ పూలరంగడు చిత్రంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్టేజ్ ఆర్టిస్ట్ “భాను ప్రకాష్” అనే నటుడికి చాలా ప్రాముఖ్యత గల పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలో గుమ్మడి బావమరిది పాత్రలో చాలా చక్కగా చేశారాయన. ఆ తరువాత దాదాపు అన్నపూర్ణావారి అన్ని చిత్రాలలో నటించారు భాను ప్రకాష్. అంతేకాకుండా మెయిన్ క్యారెక్టర్స్ తప్పించి మిగిలిన చిన్న పాత్రలు అన్నింటిలోనూ స్థానిక కళాకారులకే అవకాశం కల్పించారు.
ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, చిత్తూరు నాగయ్య తండ్రీ కొడుకులుగా నటించారు. వీరిద్దరూ అనుకోని పరిస్థితుల్లో జైల్లో కలుసుకుంటారు. తామిద్దరూ తండ్రి కొడుకులమనే విషయం అక్కడే తెలుసుకుంటారు. ఈ సన్నివేశానికి ముందు వీరిద్దరితో పాటు ఇతర ఖైదీలు అందరిపై ఒక పాట చిత్రీకరించాలి.” చిల్లర రాళ్ళకు మొక్కుతు ఉంటే చెడిపోదువురా ఒరేయ్ ఒరేయ్”- ఇది ఆ పాట.

ఈ పాటలో నాగేశ్వరరావుకు యధావిధిగా ఘంటసాల గారు నేపధ్య గానం చేయగా చాలా కాలం తర్వాత చిత్తూరు నాగయ్య గారు తన పాట తానే పాడుకోవటం విశేషం.” ఈ పాటను జైలు సెట్టింగ్ వేసి తీస్తే బాగుండదు.. ఒరిజినల్ జైలులో తీస్తేనే ఆ ఇంపాక్ట్ వస్తుంది”- అన్నారు ఆదుర్తి . జైల్లో షూటింగ్ కు పర్మిషన్ దొరకటం కష్టం . అయినా తన ప్రయత్నం తాను చేశారు మధుసూదన రావు.అప్పటి జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావుగారితో మాట్లాడగా వెంటనే జైలు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి షూటింగుకు పర్మిషన్స్ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. అలా వెంటనే పర్మిషన్స్ రావటంతో చంచల్ గూడ, ముషీరాబాద్ సెంట్రల్ జైళ్లలో చిత్రీకరించి తాము ఆశించిన ఎఫెక్ట్ ను రాబట్టుకోగలిగారు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.ఇక ఈ సినిమాలోని ” నీ జిలుగు పైట నీడలోన నిలువనీ… నన్ను నిలువనీ” అనే పాటను రంగుల్లో చిత్రీకరించి తొలిసారిగా కలర్ శకంలోకి అడుగు పెట్టింది అన్నపూర్ణ సంస్థ.షూటింగ్ పూర్తయింది.
ఈ చిత్రం పై చిత్ర పరిశ్రమలో ముఖ్యంగా పంపిణీ విభాగంలో విపరీతమైన వ్యాఖ్యలు వినవచ్చాయి. అప్పటికి నాగేశ్వరరావు నటించిన నాలుగు చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.ఇది నాగేశ్వరరావుకు ఐదవ ప్లాప్… అన్నపూర్ణ సంస్థకు తొలి ప్లాప్…అని పుకార్లు పుట్టించారు.ఇదే సమయంలో వాసిరాజు ప్రకాశరావు అనే జర్నలిస్టు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును ఇంటర్వ్యూ చేస్తూ పూలరంగడు చిత్రం గురించి ప్రస్తావించారట. ఏదో మూడ్ లో ఉన్న ఆదుర్తి” ఆ ఏదో ఆడుతుందిలే.. నాకు ఆ సినిమా మీద పెద్ద హోప్స్ లేవు” అన్నారట. ” పూలరంగడు”- సినిమా మీద దర్శకుడికే హోప్స్ లేవు” అని రాసి పడేసాడు వాసిరాజు ప్రకాశం.

అసలే అపనమ్మకాలు, పుకార్ల మధ్య నలిగిపోతున్న” పూలరంగడు”కు ఈ వార్త పెద్ద షాక్ అయింది.
ఈ పుకార్లతో కలత చెందిన నవయుగ శ్రీనివాసరావు ఉరుకుపరుగుల మీద మద్రాసు వెళ్లి రీరికార్డింగ్ జరిపిస్తున్న మధుసూదన రావును కలిశారు. ఆయన్ను పక్కకు పిలిచి” ఈ సినిమా ఫ్లాప్ అయితే అన్నపూర్ణ సంస్థకు, అక్కినేని నాగేశ్వరరావుకు, నవయుగ ఫిలిమ్స్ కు చాలా తలవంపులు అవుతుంది. ఇది ఎలాగైనా హిట్ అవ్వాలి . కావాలంటే వెంటనే ఒక లక్ష రూపాయలు పంపిస్తాను. ఏమైనా రీషూట్ చేయదలిస్తే చేయండి… ఖర్చుకు వెనకాడ వద్దు”- అంటూ ఆందోళన వెలిబుచ్చారు.
” ఈ సినిమా ఫ్లాప్ అయ్యే ప్రసక్తే లేదు. ఇది తప్పకుండా హిట్ అవుతుంది. మీరేం ఆందోళన చెందవద్దు”- అని శ్రీనివాసరావుగారికి భరోసా ఇచ్చారు మధుసూదనరావు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు మరొక సమస్య వచ్చింది. నాగేశ్వరరావు నటించిన “రహస్యం” చిత్రం కూడా విడుదలకు సిద్ధం అయింది. అది కూడా పూలరంగడు తో పాటే విడుదలయ్యేలా ఉంది. తన సినిమాకు తన సినిమాయే పోటీ అయ్యే విచిత్ర పరిస్థితి ఎదురైంది అక్కినేనికి. అది పూర్తి రంగుల చిత్రం.అప్పటికే ఆ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగి ఉన్నాయి. కానీ ఆ పోటీని ఎదుర్కోవటం తప్పనిసరి. సరే ఎలాగో సంప్రదింపులు జరిపి పూలరంగడు విడుదలయ్యాక నాలుగు వారాలకు రహస్యం విడుదల అయ్యేలాగా డిస్టిబూటర్స్ తమలో తాము అంగీకారానికి వచ్చారు. అదే సమయంలో మరో నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. దానితో అన్నపూర్ణ వారి చిత్రాలలో ఏ సినిమా సమయంలోనూ ఎదురవ్వని ఉత్కంఠ పరిస్థితి ఎదురైంది.

మొత్తానికి అవరోధాలను అధిగమించి 1967 నవంబర్ 24న విడుదలయింది “పూలరంగడు”.
తాము ప్రతి సినిమా విడుదల సమయంలో ఎదురుచూసే ఒక వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది.
” గ్యారెంటీగా వంద రోజులు ఆడుతుంది..200 రోజులు కూడా ఆడే అవకాశం ఉంది”- అని చెప్పాడు ఆప్త మిత్రుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు.
మరుసటి రోజున ” పూలరంగడు 200 రోజులు ” అంటూ అందరికీ కార్డ్స్ పోస్ట్ చేశాడు డేగా రాధాకృష్ణ నాయుడు.
ఈయన రిపోర్ట్స్ మీద చిత్ర పరిశ్రమలో చాలామంది పెద్దవాళ్లకు పెద్ద నమ్మకం. దొంగరాముడు మొదలుకొని అన్నపూర్ణ వారి ప్రతి చిత్రానికి రిపోర్ట్స్ పంపించేవారు డేగా రాధా కృష్ణ నాయుడు. ఆయన రిపోర్టును నిజం చేస్తూ మధుసూదనరావు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తూ కలెక్షన్ల కనక వర్షాన్ని అభినందనల పూల వర్షాన్ని కురిపించాడు “పూలరంగడు”.
విడుదలకు ముందు అపనమ్మకాన్ని వ్యక్తం చేసిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తన అంచనాలు తప్పు అని నిజాయితీగా అంగీకరించారు. “అదే ఆయన గొప్పతనం. తన అంచనాల్లో గానీ, ఆలోచనల్లో గాని ఏదైనా లోపం ఉంది అని గ్రహిస్తే నిజాయితీగా ఒప్పుకుంటారాయన. హిట్ అయితే తన గొప్పగా చెప్పుకుని ఫెయిల్ అయితే ఎదుటివారి మీద నెట్టాలని ప్రయత్నించే తత్వం ఆయనకు లేదు. అందుకే ఆయనంటే నాకు విపరీతమైన గౌరవం, అభిమానం- అంటారు మధుసూదనరావు.
హైదరాబాద్ బసంత్ టాకీస్ లో జరిగిన పూలరంగడు శతదినోత్సవ వేడుకకు సుప్రసిద్ధ హిందీ నటుడు “రాజేంద్ర కుమార్” ముఖ్య అతిథిగా విచ్చేసి నటీ నట వర్గానికి షీల్డులను బహుకరించారు.
అప్పటి వరకు విడుదలైన అన్నపూర్ణావారి చిత్రాల్లోకెల్లా “highest grosser” గా రికార్డు సృష్టించాడు ” పూలరంగడు”.
మరువలేని మరొక విశేషం.


అప్పటి భారత ఉపాధ్యక్షుడు శ్రీ వి వి గిరి గారు సకుటుంబ సమేతంగా బెంగళూరులో” పూలరంగడు” చిత్రాన్ని చూసి నాగేశ్వరరావు నటనా కౌశలాన్ని విపరీతంగా మెచ్చుకున్నారు.
(సశేషం)
(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 9న చదవండి)
( పూలరంగడు నుండి కొన్ని హిట్ సాంగ్స్ మీకోసం)
