అన్నపూర్ణ లో మూడవ దర్శకుడు కె.విశ్వనాథ్ – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 29, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 29

(రీక్యాప్)
(ఆ పరిస్థితుల్లో శతదినోత్సవాలు జరపటం సమంజసం కాదని భావించి వేడుకలను రద్దు చేసి అన్నపూర్ణ, నవయుగ సంస్థల తరుపున మాచర్ల వరద బాధితుల సహాయ నిధికి 50
వేల రూపాయలు ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి అందజేశారు)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

తమ తదుపరి చిత్రం” ఆత్మగౌరవం” ద్వారా మరో ప్రతిభావంతుడైన దర్శకున్ని తెలుగు తెరకు పరిచయం చేసింది అన్నపూర్ణ సంస్థ… ఆయనే కె.విశ్వనాథ్.అన్నపూర్ణ సంస్థలో పనిచేసిన 3వ దర్శకుడు ఆయన. వరసగా మూడు చిత్రాలకు అసోసియేట్ గా ఆదుర్తి దగ్గర పనిచేశాక నాలుగో చిత్రానికి డైరెక్టర్ గా” డాక్టర్ చక్రవర్తి” చిత్రానికి సారథ్యం వహించవలసిన కె.విశ్వనాథ్ అప్పట్లో తన అదైర్యాన్ని వ్యక్తం చేయటం వల్ల దాన్ని కుడా ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేయటం జరిగింది.అన్న మాట తప్పని అన్నపూర్ణ అధినేతలు” ఆత్మగౌరవం” చిత్రాన్ని డైరెక్ట్ చేయమని మళ్లీ విశ్వనాద్ ను కోరారు. ఆ బాధ్యతను ఆయన సంతోషంగా స్వీకరించారు .’ ఇక ఎలాంటి కథ తీయాలి’ అన్నది చర్చనీయాంశం అయింది.
” ఇంతవరకు ఫ్యామిలీ డ్రామాతో కూడిన సెంటిమెంటల్ సినిమాలను, సీరియస్ కథాంశాలను తీశాము కనుక కొత్తదనం కోసం ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ తో ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కామెడీ తీస్తే బాగుంటుంది”- అన్నారు మధుసూదనరావు.
ఈ ఆలోచన కె.విశ్వనాథ్ కు కూడా నచ్చింది.వెంటనే యద్దనపూడి సులోచనారాణి తో కథా చర్చలు ప్రారంభమయ్యాయి.కథ అనుకున్న దానికంటే బాగా వచ్చింది. కథలోని పాత్రలన్నీ కామెడీకి ఒదిగిపోయే విధంగా సన్నివేశాలు సమకూడాయి.హాస్యరస భరితమైన నాటకాలు రాయడంలో ఆరితేరిన గొల్లపూడి మారుతీరావుకు సంభాషణలు రాసే బాధ్యతను అప్పగించారు. అప్పట్లో గొల్లపూడి మారుతీ రావు హైదరాబాద్ రేడియో స్టేషన్ లో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసేవారు. సాధారణంగా సినిమా సంభాషణలు ప్రశాంతమైన గెస్ట్ హౌస్ ల్లోనో , ఫైవ్ స్టార్ హోటల్ గదుల్లోనో రూపుదిద్దుకుంటాయి. కానీ “ఆత్మగౌరవం” చిత్రానికి సంభాషణలు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోని చెట్ల నీడన, పచ్చిక బయళ్ల పై మొలకెత్తాయి.
నాటకాలలో పాత్రోచితమైన డైలాగులు రాయడంలో సిద్ధహస్తుడైన మారుతీ రావు సినిమా మీడియాను సులువుగానే అవగాహన చేసుకొని ఆత్మ గౌరవం చిత్రానికి చక్కని సంభాషణలు రాశారు.కథలో “ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్” తక్కువై బిగువు సడలి పోతుందేమోనన్న అనుమానంతో మళ్లీ కథ గురించి సమాలోచనలు ప్రారంభమయ్యాయి. కథలో ఇమిడిపోయే విధంగా గుమ్మడి భార్యగా ఒక పిచ్చి అమ్మాయి పాత్రను సృష్టించారు మారుతీ రావు. ఎలాంటి ఇమేజ్ లేని ఒక కొత్త అమ్మాయిని ఆ పాత్రకు తీసుకోవాలని అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న వాసంతి అనే అమ్మాయికి ఆ వేషం ఇచ్చారు.అల్లు రామలింగయ్యకు అన్నపూర్ణ సంస్థ చిత్రాలు అన్నింటిలోకి ప్రాముఖ్యత కలిగిన హాస్యపాత్ర ఈ చిత్రంలో లభించింది. తన వేషాన్ని ఆధ్యంతం అద్భుతంగా రక్తికట్టించి మంచి పేరు తెచ్చుకుని చిత్ర విజయంలో భాగస్వామి అయ్యారు అల్లు రామలింగయ్య. కాలేజీ స్టూడెంట్ గా అక్కినేని ఎంతో సహజంగా మరెంతో హుషారుగా నటించి “రొమాంటిక్ హీరో” గా తనకు తానే సాటి అనిపించుకున్నారు.తమ్ముడి మీద పెట్టుకున్న ఆశలు, నమ్మకాలు వమ్ము కాగా మానసికంగా కుంగిపోయే అన్నగానూ- ఎంతగానో ప్రేమించిన భార్య మరణిస్తే పరిస్థితులకు తలవంచి ఒక పిచ్చి పిల్లను రెండవ భార్యగా చేసుకుని అనుక్షణం ఆవేదనకు గురయ్యే భర్తగా గుమ్మడి అద్భుతంగా నటించి ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టారు.కాలేజీ అమ్మాయిలుగా కాంచన,రాజశ్రీ పోటాపోటీగా నటించి యువతరానికి గిలిగింతలు పెట్టారు. అలాగే రేలంగి, రమణారెడ్డి ‘హాలు-బాజాలు’ అనే హాస్య ద్వయంగా నటించి ఆహ్లాదకరమైన హాస్యాన్ని అందించారు.ఇక చిత్ర నిర్మాణం విషయానికి వస్తే- తొలిసారిగా దర్శకత్వం బాధ్యతలను చేపట్టిన విశ్వనాధ్ కు నటీనటుల నుండి చాలినన్ని కాల్షీట్స్ తీసుకునే విషయంలోనూ- ఫిలిం నెగెటివ్ విషయంలోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చి సహకరించారు మధుసూదన రావు. అంతకుముందు అన్నపూర్ణ సంస్థలో అసోసియేట్ గా నాలుగు చిత్రాలకు పని చేసిన విశ్వనాధ్ ఆ అనుభవాన్నంతా ఆత్మగౌరవం చిత్రానికి దర్శకత్వం వహించడంలో కనబరిచి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు.ఈ చిత్రానికి పాటల కంపోజింగ్ మద్రాస్ లో పెట్టుకుంటే రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్ ఇతరత్రా బిజీగా ఉండి కాన్సన్ట్రేట్ చేయలేరు అన్న అనుమానంతో వారందరినీ హైదరాబాద్ రప్పించి మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటు చేశారు. ప్రముఖ కవులు ఆరుద్ర, దాశరథి, డాక్టర్ సి.నారాయణరెడ్డి పాటలు రాయగా ఆస్థాన సంగీత దర్శకుడుగా మారిన ఎస్.రాజేశ్వరరావు సంగీత సారథ్యం వహించి శ్రావ్యమైన ట్యూన్స్ ఇచ్చారు.స్వతహాగా సౌండ్ ఇంజనీర్ కావటం వల్ల దర్శకులు విశ్వనాధ్ స్వయంగా దగ్గరుండి పాటల్ని చక్కగా రికార్డు చేయించుకున్నారు. పాటలన్నీ సూపర్ హిట్ అవటంతో ఆత్మగౌరవం కు మ్యూజికల్ గా కూడా మంచి పేరు వచ్చింది.

ఆత్మగౌరవం చిత్రం ద్వారా హైదరాబాద్ కు చెందిన ‘సుమతీ కౌశల్’ ను నృత్య దర్శకురాలిగా పరిచయం చేశారు. “నృత్య శిఖరం” అనే డ్యాన్స్ స్కూలు నిర్వహిస్తున్న ఈమె తన స్టూడెంట్స్ తో రవీంద్రభారతిలో ఇచ్చిన ఒక కార్యక్రమాన్ని చూసి ఆమెకు ఈ అవకాశం కల్పించారు మధుసూదన రావు.సహజ వాతావరణాన్ని కన్నులకు కట్టేలా చూపించాలన్న లక్ష్యంతో ఈ చిత్రం అవుట్ డోర్ దృశ్యాలను మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, రామప్ప సరస్సు, రామప్ప దేవాలయం దగ్గర, డిండి ప్రాజెక్టు ప్రాంతంలోను చిత్రీకరించారు. స్థానికంగా ఉన్న నటీ నటులకు , సాంకేతిక నిపుణులకు ఈ చిత్రంలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు.1966 మార్చి 18న విడుదలైన “ఆత్మగౌరవం” శతదినోత్సవ చిత్రం అవటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులలో తృతీయ ఉత్తమ చిత్రంగాను, ఉత్తమ కథా చిత్రంగాను అవార్డులను అందుకోవడం విశేషం.

మొట్ట మొదటి చిత్రంతోనే కె. విశ్వనాధ్ కు దర్శకునిగా మంచి పేరు వచ్చింది. పోను పోను కమర్షియల్ సినిమాలను దృశ్య కావ్యాలుగా మలచుకుంటూ
“కళాతపస్వి”గా జన నీరాజనాలు అందుకున్నారు కె.విశ్వనాథ్.


 ( సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 7న చదవండి)

( ఆత్మగౌరవం చిత్రంలోని కొన్ని పాటలు మీకోసం)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=t8R3t2ThwI0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here