చక్రభ్రమణం రైట్స్ అన్నపూర్ణ సంస్థకైతేనే ఇస్తాం అన్న కోడూరి కౌసల్యాదేవి – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 28,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 28

( రీక్యాప్)
( పెళ్లి అయిన కొద్ది రోజులకే ఆశాలత కులకర్ణి పూనా వెళ్ళిపోయింది. ఒక మంచి గాయని తో పాడించి ప్రయోగం చేశామన్న తృప్తి మాత్రం అన్నపూర్ణ సంస్థకు మిగిలిపోయింది)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి విజయ పరంపరలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం” డాక్టర్ చక్రవర్తి”. ఇది తొలి తెలుగు నవలా చిత్రం అంటారు దుక్కిపాటి మధుసూదనరావు. ( అయితే 1940వ దశకం లోనే “బారిష్టర్ పార్వతీశం” నవలను సినిమాగా రూపొందించారు అనే ఒక ఆధారం కూడా చరిత్ర పుటలలో కనిపిస్తోంది)
“చదువుకున్న అమ్మాయిలు” డైలాగ్స్ రాస్తున్న తరుణంలోనే గోపీచంద్ ఆంధ్రప్రభ నిర్వహించిన నవలల పోటీలో న్యాయనిర్ణేతల కమిటీ మెంబర్ గా ఉన్నారు. పోటీకి వచ్చిన నవలల్లో కోడూరి కౌసల్యాదేవి రచించిన “చక్రభ్రమణం” నవల చాలా అద్భుతంగా ఉంది. ఆ నవల రైట్స్ మీరు తీసుకోండి. ఆ నవల బయటకు వచ్చిందంటే ఎవరో ఒకరు తీసేసుకుంటారు.. మీరు త్వరపడండి” అని హెచ్చరించారు గోపీచంద్. ఇదిగో అదిగో వెళ్దాం అనుకుంటుండగానే ఆ నవల మార్కెట్ లో విడుదలైంది.అది చదివిన పాఠకులు అన్నపూర్ణ సంస్థ ఈ నవలను సినిమాగా తీస్తే బాగుంటుంది అని రాస్తూ, ఏ ఏ పాత్రకు ఎవరెవరు బాగుంటారు కూడా సూచిస్తూ వందల సంఖ్యలో ఉత్తరాలు రాశారు.వెంటనే ఆ నవల రైట్స్ కొనటం కోసం కోడూరి కౌసల్యాదేవి స్వస్థలమైన రాజమండ్రి వెళ్లారు మధుసూదన రావు. అంతకుముందే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆ నవల రైట్స్ కొనుగోలు నిమిత్తం రాజమండ్రి వెళ్లారట. అయితే మేము అన్నపూర్ణ సంస్థకు అయితేనే ఇస్తాము అని చెప్పారట.” అన్నపూర్ణ డైరెక్టర్ను నేనే కదమ్మా… సరే వారికే ఇవ్వండి”- అని చెప్పి వెను తిరిగారట ఆదుర్తి సుబ్బారావు. ఈ విషయం మధుసూదన రావు వెళ్ళినప్పుడు చెప్పారు కోడూరి కౌసల్యాదేవి, ఆమె తండ్రి గారు.సరే! నవల రైట్స్ కొనుగోలు చేయడం జరిగింది. డైలాగ్స్ కూడా ఆమెనే వ్రాయమని ఆఫర్ చేశారు మధుసూదనరావు.
” పెళ్లి కావలసిన పిల్ల.. సినిమాలకు రాయడం కోసం హోటల్స్ లో దిగటం.. ఊళ్ళు తిరగడం మంచిది కాదు.. వద్దులేండి” – అని ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు ఆమె తండ్రి.ఇవన్నీ చదువుకున్న అమ్మాయిలు చివరి రోజుల్లో జరిగిన సంగతులు. ఆ చిత్రం విడుదలై విజయవంతంగా అడుతున్న రోజుల్లో డాక్టర్ చక్రవర్తి స్క్రిప్ట్ వర్క్ కు శ్రీకారం జరిగింది.ఈ చిత్రానికి కె.విశ్వనాధ్ దర్శకత్వం వలసి ఉంది. కె.విశ్వనాథ్ వాహినీ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా చేస్తుండేవారు. మూడు చిత్రాలకు అసోసియేట్ గా పని చేసిన తరువాత డైరెక్టర్ గా అవకాశం ఇచ్చే అవగాహనపై అన్నపూర్ణ సంస్థలో చేరారు కె.విశ్వనాథ్. వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు తో మూడు చిత్రాలు పూర్తయ్యాయి. ఒప్పందం ప్రకారం “డాక్టర్ చక్రవర్తి” కి దర్శకత్వం వహించమని కోరారు మధుసూదన రావు.అయితే డాక్టర్ చక్రవర్తి కధ విపరీతమైన ప్రజాదరణ పొందిన నవల కావటంతో దాన్ని హ్యాండిల్ చేయడానికి కె.వ్విశ్వనాధ్ కొంచెం సంకోచించారు. ఈ చిత్రం వరకు గురువుగారైన ఆదుర్తిగారు చేస్తే తర్వాత చిత్రం చేస్తానులెండి- అన్నారాయన. ఆ కారణంగా డాక్టర్ చక్రవర్తి చిత్రానికి కూడా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించక తప్పలేదు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రచయితగా గొల్లపూడి మారుతీ రావు కు కథా చర్చల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. పరిచయం జరిగిన కొద్ది రోజుల్లోనే ఆయనలో గల ప్రతిభను గుర్తించి అన్ని విధాల ఎంకరేజ్ చేయాలనుకున్నారు మధుసూదన రావు. అందుకే తనతో పాటు ఆదుర్తి, కె.విశ్వనాథ్ కూడా స్క్రీన్ ప్లే రచనలో పాల్గొన్నప్పటికీ టైటిల్స్ లో స్క్రీన్ ప్లే రచయితగా ఒక్క ‘గొల్లపూడి మారుతీరావు’ పేరు మాత్రమే వేయించారు మధుసూదన రావు. ఆ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమకు మరొక గొప్ప రచయితను అందించిన ఘనత అన్నపూర్ణ సంస్థకు దక్కింది.ఈ చిత్రానికి సంభాషణల రచయితగా మరల అన్నపూర్ణలోప్రవేశించారు ఆత్రేయ.ఈ చిత్రంలోని పాత్రలకు నటీనటుల ఎంపిక చేసింది మాత్రం పాఠకులే! చక్రభ్రమణం నవల చదివి ఏ పాత్రకు ఎవరెవరు సరిపోతారో సూచిస్తూ పాఠకులు రాసిన అభిప్రాయాల మేరకే నటీనట వర్గం ఎంపిక జరిగింది.ప్రేక్షకుల అభిప్రాయాలు అన్నపూర్ణ నిర్ణయాలు ఒకటి కావటం యాదృచ్చికం కాదు. అన్నపూర్ణ సంస్థ ప్రేక్షకుల అభిరుచిని తమ చిత్రాల్లో ప్రతిబింబింపచేస్తుందని చెప్పటానికి ఇది ఒక గొప్ప నిదర్శనం.మహానటి సావిత్రి అన్నపూర్ణ సంస్థలో చేసిన చివరి చిత్రం డాక్టర్ చక్రవర్తి. షావుకారు జానకి తొలిసారి అన్నపూర్ణ సంస్థలో నటించింది కూడా ఈ చిత్రంలోనే.” చదువుకున్న అమ్మాయిలు” తో హైదరాబాదులో కాలుమోపిన అన్నపూర్ణ సంస్థ తదుపరి చిత్రాలన్నీ ఇక్కడే నిర్మించింది. సంస్థ చిత్రాల కోసమే నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ సారధి స్టూడియోలో మేజర్ షేర్స్ తీసుకున్నారు. ఇక్కడ చిత్ర నిర్మాణం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న నటీనట సాంకేతిక వర్గాన్ని సాధ్యమైనంతవరకు వినియోగించుకోవడాన్ని నైతిక బాధ్యతగా భావించింది అన్నపూర్ణ సంస్థ.” చదువుకున్న అమ్మాయిలు” చిత్రం రీరికార్డింగ్, మిక్సింగ్ ఇక్కడే జరపగా.. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి బ్యాక్ ప్రొజెక్షన్ కూడా హైదరాబాద్ లోనే జరిపారు. చిత్రంలోని మొదటి పాట” ఈ మౌనం ఈ బిడియం… ఇదేనా ఇదేనా చెలియ కానుక”- మొత్తం ట్రైన్ లో చిత్రీకరించాల్సి ఉంది. అందుకోసం పెరంబుర్ ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుండి ప్రత్యేకంగా వర్కర్స్ ను పిలిపించి ఒక ఫస్ట్ క్లాస్ రైలు పెట్టె సెట్టింగ్ వేయించారు. రైల్వే ప్లాట్ ఫార్మ్ ను సారథి స్టూడియోలో వేయించారు.ఈ పాట చిత్రీకరణలోని బ్యాక్ ప్రొజెక్షన్ మొత్తం ఇక్కడే జరిపించారు. ఈ విధంగా హైదరాబాదులో చిత్రనిర్మాణానికి అనువైన సౌకర్యాలు అన్నీ ఉన్నాయని ఆనాటి నుండి నిరూపిస్తూ వచ్చింది అన్నపూర్ణ సంస్థ.


 చిత్ర నిర్మాణం పూర్తయింది.1964 జులై 10న విడుదలై అఖండ విజయం సాధించాడు డాక్టర్ చక్రవర్తి. ఈ సినిమా విషయంలో చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే మాస్ ప్రేక్షకుల కన్నా క్లాస్ ప్రేక్షకులే ఈ చిత్రాన్ని విపరీతంగా ఆదరించారు. దీనికి కారణం ఇది విశేష ప్రజాదరణ పొందిన నవలా చిత్రం కావటమే. అయితే క్లాస్ ప్రేక్షకుల ఆదరణతో పాటూ వారి విమర్శలను కూడా చవిచూశాడు డాక్టర్ చక్రవర్తి.

ముఖ్యంగా కామెడీ విషయంలో ఈ చిత్రం కొన్ని విమర్శలను ఎదుర్కొంది. అద్భుతమైన కథాసంవిధానంతో రూపొందిన ఈ చిత్రంలోని హాస్యం మూల కథ నుండి డీవియేట్ అయ్యింది. హాస్యానికి ప్రేక్షకులనుండి మంచి స్పందన లభించినప్పటికీ ముఖ్య కథాగమనానికి హాస్య సన్నివేశాలు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డు పడ్డాయని కొన్ని పత్రికలు విమర్శించాయి. రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి కూడా ఈ విషయంలో కొంత అసంతృప్తి చెందారు. అయితే ఈ విమర్శల్లో వాస్తవం లేకపోలేదు అంటారు మధుసూదనరావు. హాస్యం అనేది చిత్ర కథలో అంతర్భాగమై ఉండాలేగాని హాస్యం కోసమే కొన్ని పాత్రలను సృష్టించకూడదు అని కె.వి.రెడ్డి గారి దగ్గర నేర్చుకున్న పాఠాన్ని ఈ సినిమాలో ఆచరణలో పెట్టలేకపోయాము అంటారు మధుసూదనరావు.వచ్చిన విమర్శలను నిజాయితీగా అంగీకరించే తత్వాన్ని అలవర్చుకోవడమే రాబోయే విజయాలకు హేతువు అవుతుంది. విమర్శలను ఆహ్వానించే ధైర్యం అన్నపూర్ణ అధినేతలైన మధుసూదన రావుకు, అక్కినేని నాగేశ్వరరావుకు ఇతర భాగస్వాములకు ఆది నుండి అబ్బిన సుగుణం.

ఇక సంగీతం విషయంలో డాక్టర్ చక్రవర్తి గత చిత్రాల ప్రమాణాలను పదిలంగా కాపాడింది. ఆరుద్ర, ఆత్రేయ, శ్రీ శ్రీ, దాశరథి, కొసరాజు గారలు రాసిన పాటలకు ఎస్.రాజేశ్వరరావు సమకూర్చిన సంగీతం చిత్ర విజయంలో సమ భాగస్వామి అయింది. ముఖ్యంగా శ్రీశ్రీ రచించిన” మనసున మనసై బ్రతుకున బ్రతుకై” పాటకు పండితపామర వర్గాల నుండి గొప్ప స్పందన లభించింది.

ఇక అవార్డుల విషయానికి వస్తే డాక్టర్ చక్రవర్తి అగ్ర స్థానాన్ని ఆక్రమించింది.ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు( రజిత పతకం) లభించింది. అదే సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డులలో ఉత్తమ చిత్రంగా “తొలి స్వర్ణ నంది”ని అందుకున్న చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఏపీ ఫిలిం ఫ్యాన్స్ వారి బెస్ట్ పిక్చర్ అవార్డు, మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ వారి బెస్ట్ పిక్చర్ అవార్డులతో పాటు ఇంకా ఎన్నో సాంస్కృతిక సంస్థల అవార్డులను అందుకుని సంస్థ కీర్తిని దేశ వ్యాప్తం చేసిన ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచింది డాక్టర్ చక్రవర్తి.
ఆర్థికంగానూ, అవార్డుల పరంగాను డాక్టర్ చక్రవర్తి చిత్రం సాధించిన ఘన విజయం మరొక చిత్ర నిర్మాణ సంస్థ ఆవిర్భావానికి ప్రేరణ అయింది… అదెలాగంటే…

డాక్టర్ చక్రవర్తి చిత్రానికి బంగారు నందితో పాటు చిత్ర నిర్మాత మధుసూదనరావుకు పదివేల రూపాయలు, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు ఐదు వేల రూపాయలు నగదు బహుమతులు కూడా లభించాయి. తొలి నంది అవార్డుల ప్రదానోత్సవ సభలో ఉపన్యసించిన మంత్రులందరూ ఉత్తమ, ప్రయోజనాత్మక చిత్రాలను నిర్మించే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహకాలు కల్పిస్తుంది అని హామీ ఇచ్చారు. అలాంటి చిత్రాలు నిర్మించినప్పుడు ఒకవేళ నష్టం వస్తే ఏదో ఒక రూపంలో ప్రభుత్వం ఆ నష్టాన్ని” కాంపెన్సేట్” చేస్తుంది అని కూడా హామీలు గుప్పించారు ప్రభుత్వ అధినేతలు. ఈ హామీల ప్రభావం దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మీద బాగా పనిచేసింది. ఆయన మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది.

వెంటనే బయలుదేరి మధుసూదన రావు ఇంటికి వెళ్లారు ఆదుర్తి సుబ్బారావు. అప్పటిదాకా అవార్డుల సభలోనూ, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విందులోను తనతోపాటే ఉన్న ఆదుర్తి అంతలోనే మిట్ట మధ్యాహ్నం వేళ ప్రత్యక్షమవడం చూసి ఆశ్చర్యపోతూనే ఆదుర్తిని ఆహ్వానించారు మధుసూదనరావు.

తన మనసులోని ఆలోచనను మధుసూదనరావు ముందు ఉంచారు ఆదుర్తి.” ఉత్తమ కథాంశాలతో నిర్మించే ప్రయోజనాత్మక చిత్రాలకు ప్రోత్సాహం కల్పిస్తామని మంత్రులందరూ హామీలు ఇచ్చారు కాబట్టి మనకు వచ్చిన నగదు బహుమతులను మూలధనంగా పెట్టి ఒక కొత్త సంస్థను ప్రారంభించి” ఎక్స్పెరిమెంటల్” చిత్రాలను నిర్మిద్దాం. సినిమా పూర్తి కావటానికి అవసరమైన డబ్బు నవయుగ వారు ఇస్తారు”.

ఇదీ అత్యుత్సాహంతో ఆదుర్తి చేసిన ప్రతిపాదన.ఈ ప్రతిపాదన విన్న మధుసూదన రావు ఒక్క క్షణం ఆలోచించి నవ్వుతూ” నేను ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలి.. ఈ పరిస్థితుల్లో నేను ప్రయోగాలు చేయలేను..” అని చెప్పటంతో పాటు ఆదుర్తిని కూడా కొంత నిరుత్సాహపరిచారు.తన ఆలోచనకు మధుసూదనరావు మద్దతు లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు ఆదుర్తి.

ఆ తర్వాత ఎలాగో ఈ విషయం అక్కినేని నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది. ఆయన ఆదుర్తి సుబ్బారావు ఆలోచనలకు మద్దతు పలికి “చక్రవర్తి చిత్ర” అనే నూతన చిత్ర నిర్మాణ సంస్థ ఆవిర్భావానికి కారకులయ్యారు.

అక్కినేని, ఆదుర్తిల ఆశయాలకు, అభిరుచికి అద్దం పట్టేలాగా సమాజానికి చక్కని సందేశాన్ని అందించే కథాంశంతో, ప్రయోజనాత్మక పందాలో ” సుడిగుండాలు” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రజాదరణకు నోచుకోలేదు. బాగా నష్టపోయారు. అయితే ఆ చిత్రానికి జాతీయ అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజిత పతకం రాగా , నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘బంగారు నంది’ లభించింది. ఆర్థికంగా బాగా నష్టపోయినప్పటికీ అవార్డులు ఇచ్చిన హార్దిక ఉత్సాహంతో, ఆదర్శాల బలంతో ” మరో ప్రపంచం” చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కూడా ఫెయిల్ అయింది. నష్టం రెండింతలయింది. ఇలాంటి చిత్రాలను నిర్మిస్తే అన్ని విధాల ప్రోత్సహిస్తామని ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. కనీసం ఆ చిత్రాలను16 mm ప్రొజెక్టర్ లతో స్కూళ్లలో ప్రదర్శించటానికి అవసరమయ్యే సహకారాన్ని కూడా ప్రభుత్వం అందించలేదు.

ప్రభుత్వ హామీలను నమ్మి ఆదర్శాలకు పోయినందుకు ఆర్థికంగాను, హార్థికంగాను చాలా నష్టపోయారు అక్కినేని, ఆదుర్తి.

లక్షల్లో నష్టం వచ్చినప్పటికీ నంది అవార్డు లభించిందన్న తృప్తి మాత్రమే మిగిలింది. ఆరోజున ఆ చిత్రాల వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని పూర్తిగా ‘కాంపెన్ సేట్’ చేయలేకపోయినా ఊరడింపుగా నైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉంటే అదే బాటలో కొన్ని ప్రయోజనాత్మక చిత్రాలు వచ్చి ఉండేవి.

“డాక్టర్ చక్రవర్తి” శత దినోత్సవ వేడుకలను ఐదు కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని సంకల్పించారు.అయితే అదే సమయంలో మాచర్లలో వరదలు వచ్చి ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. ఆ పరిస్థితుల్లో శతదినోత్సవాలు జరపటం సమంజసం కాదని భావించి వేడుకలను రద్దు చేసి అన్నపూర్ణ, నవయుగ సంస్థల తరఫున 50 రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి అందజేశారు.
ఇదీ ” డాక్టర్ చక్రవర్తి” విజయ విహార చరిత్ర.

(సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 5న చదవండి)

( డాక్టర్ చక్రవర్తి లోని ప్రజాదరణ పొందిన కొన్ని పాటలు మీ కోసం)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=iIDIYRicsp4]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here