వాళ్లిద్దరూ పోయారు ..నేను కూడా పోతానేమో..నేను రాయను అన్న ఆత్రేయ – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 27,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 27

(రీక్యాప్)
( “సంస్థల మధ్య ఇలాంటి సోదర భావమూ, స్నేహ సంబంధాలు ఉంటే చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది- అంటూ ప్రసంగించిన వక్తలు అందరూ అన్నపూర్ణ సంస్థను అభినందించారు.)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

“ఇద్దరు మిత్రులు” తరువాత చిత్రం “చదువుకున్న అమ్మాయిలు”. ఈ చిత్ర నిర్మాణం వెనుక చాలా వ్యయ ప్రయాసలు ఉన్నాయి. ఈ చిత్ర కథకు ” ఇద్దరు మిత్రులు” నిర్మాణ సమయంలోనే శ్రీకారం జరిగింది. డాక్టర్ శ్రీదేవి అనే రచయిత్రి రచించిన ” కాలాతీత వ్యక్తులు” అనే నవలను మధుసూదనరావు చదివారు. ఆ నవల చాలా బాగా రాశారావిడ. అయితే సినిమాగా రూపొందించడానికి  ఆ నవల అనువుగా లేదు. కానీ ఆ రచయిత్రి శైలి మధుసూదనరావుకు బాగా నచ్చింది. ఈమెతో ఏదైనా లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు రాయిస్తే బాగుంటుంది అనిపించింది. వెంటనే ఆమెను సంప్రదించారు. తను అనుకుంటున్న లైన్ ఆమెకు చెప్పారు. ఆడపిల్లలు పై చదువులు చదవడంలో ఎదురయ్యే సమస్యలతో ప్రారంభించి, చదువు పూర్తయ్యాక అంత చదువు చదివిన వరుణ్ణి  తేవడం , సంసారంలో ఆర్థిక ఇబ్బందులు, చదువుకున్న అమ్మాయిలు ఉద్యోగాలు చేయటంలో ఎదురయ్యే సమస్యల  నేపథ్యంలో ఒక కథ వ్రాయమని కోరారు. ఇద్దరు మిత్రులు షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆమెను పిలిచి స్టోరీ డిస్కషన్స్ జరిపేవారు మధుసూదన రావు. కొంతకాలం చర్చలు జరిగాయి. కథ ఒక రూపాన్ని సంతరించుకుంది.  ఇంతలో ఒక దుర్వార్త.ఇంటెస్టినల్ ట్యుబర్ క్యులోసిస్ వ్యాధి బారినపడి  డా. శ్రీదేవి చనిపోయారు. డాక్టర్ అయ్యుండి కూడా తనలో పెరుగుతున్న వ్యాధిని ఆమె  గుర్తించలేకపోవటం దురదృష్టకరం. ఆ వార్త తెలిసిన  మధుసూదనరావు ఆమె భర్తను పరామర్శించడానికి వెళ్లారు. డాక్టర్ శ్రీదేవి అప్పటివరకు రాసిన స్క్రిప్ట్ ను మధుసూదన రావుకు ఇచ్చారు ఆమె భర్త. అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు  ఎవరితో పూర్తి చేయించాలి? ప్రముఖ రచయిత్రి ‘ఇల్లెందుల సరస్వతీదేవి’ పేరు సూచించారు దాశరధి. ఆమె గొప్ప రచయిత్రే కానీ ఆర్తోడాక్స్ టైప్ అని కొందరి అభిప్రాయం.    అయితే ‘వీఎన్ రమాదేవి’ అన్ని విధాల బెస్ట్ అని సూచించారు దాశరధి. ఆమె గురించి వాకబు చేస్తే ఆమె అప్పుడే డెలివరీకి ఆసుపత్రిలో చేరారని తెలిసింది.మరలా దాశరథి గారిని కలవడానికి ఆల్ ఇండియా రేడియోకి వెళ్లిన మధుసూదనరావుకు ప్రఖ్యాత రచయిత గోపీచంద్ తారసపడ్డారు. విషయం తెలుసుకున్న గోపీచంద్ నేను రాస్తాను అన్నారు. ఇది లేడీస్ సబ్జెక్టు కావడంతో ఆడవాళ్లు రాస్తేనే బాగుంటుందని మధుసూదనరావు అభిప్రాయం. అప్పుడు గోపీచంద్ యుద్ధనపూడి  సులోచనారాణి పేరు సూచించారు. వెంటనే యద్దనపూడి సులోచనారాణితో మాట్లాడి విషయం అంతా వివరించారు.అలా తొలిసారిగా అన్నపూర్ణ సంస్థకు కథ రాయటం ద్వారా చలనచిత్ర రంగంలో అడుగుపెట్టారు యద్దనపూడి సులోచనారాణి .ఈ విధంగా చేతులు మారి ఎలాగైతేనేం చదువుకున్న అమ్మాయిలు” స్క్రిప్ట్ దాదాపు సిద్ధమైంది. కొద్ది రోజుల్లో సెట్స్ కి వెళ్దాము అనుకుంటుండగా వాహినీ స్టూడియోలో స్ట్రైక్ వచ్చిపడింది.13 ఫ్లోర్స్ తో ఆసియాలోకల్లా పెద్ద స్టూడియోగా పేరుపొందిన వాహినీ స్టూడియో మూతపడటంతో మిగిలిన స్టూడియోలన్నీ బిజీ అయిపోయాయి. ఇంతలో ” మంచి మనసులు” శత దినోత్సవ వేడుకలను హైదరాబాదులో ఏర్పాటుచేసి చిత్ర ముహూర్తం షాట్ కు కెమెరా స్విచాన్ చేసిన మధుసూదనరావును బహుమతి ప్రదాతగా ఆహ్వానించారు “బాబు మూవీస్” అధినేతలు ఆదుర్తి సుబ్బారావు, సుందరం గార్లు. శతదినోత్సవ వేడుకలు ఘనంగా పూర్తయిన తరువాత మర్రి  చెన్నారెడ్డి గారు” అక్కడ వాహినీ స్టూడియో స్ట్రైక్ లో ఉంది కదా.. మీ తరువాత సినిమా ఇక్కడే తీయండి” అన్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు లంచ్ తరువాత సారధి స్టూడియో చూడటానికి వెళ్లారు మధుసూదన రావు, ఆదుర్తి సుబ్బారావు, కెమెరామెన్ సెల్వరాజ్.మూతబడి ఉన్న స్టూడియో తాళాలు తీయించి చూశారు. కొత్త mitchell కెమెరా మంచి కండిషన్లో ఉంది. సౌండ్ సిస్టం కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అన్ని విషయాలు సరిచూసుకొని సాయంత్రం డిన్నర్ లో” ఇక్కడ చేస్తాము.. కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువవుతుంది”- అన్నారు మధుసూదనరావు. ” దానిదేముంది- ముందు మీరు వచ్చి షూటింగ్ జరిపితే ఆ నష్టాన్ని ప్రభుత్వం కాంపెన్ సెట్ చేసే లాగా మేము చూస్తాం” హామీ ఇచ్చారు మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి గార్లు. అప్పటికింకా సబ్సిడీ విధానాన్ని ప్రవేశ పెట్టలేదు. నాగేశ్వరరావుతోను, ఇతర పార్ట్నర్స్ తోను అన్ని విషయాలు చర్చించారు మధుసూదనరావు. పూర్తి చిత్రం హైదరాబాదులోనే తీసేలాగా నిర్ణయించుకుని మద్రాసు వెళ్లారు.అక్కడకు వెళ్లాక వాహినీ స్టూడియోలో స్ట్రైక్ పరిస్థితి ఎలా ఉంది అని నాగిరెడ్డి గారిని వాకబు చేశారు. మరో ఆరు నెలల దాకా స్టూడియో తెరిచే ప్రసక్తి లేదన్నారాయన. ఇక దానితో హైదరాబాద్ వెళ్ళటానికి అన్ని విధాల సిద్ధపడింది అన్నపూర్ణ సంస్థ. వాహినీ స్టూడియోలో పనిచేసే కార్పెంటర్  మేస్త్రి కుప్పు స్వామి నాయుడుని హైదరాబాద్ పంపించారు. పదివేల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి సెట్స్ వేయించారు. వాహినీ స్టూడియోలో  పెయింటింగ్ డిపార్ట్మెంట్ నుంచి బ్యాక్గ్రౌండ్ పెయింటర్ అంథోనీ స్వామిని కూడా పంపించారు. అలాగే వాహినిలో సౌండ్ dtp చీఫ్ ఇంజనీరుగా చేసి స్ట్రైక్ మూలంగా తొలగించబడ్డ ఏ. కృష్ణన్ ను హైదరాబాద్ కు పంపించి మూతపడిన సారథి స్టూడియోను  మరలా తెరిపించారు.  సారథి స్టూడియో కొత్త కళ వచ్చింది.ఈ పరిణామం రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి పథంలో ఒక గొప్ప ముందడుగు అయింది. అయితే ఇక్కడ షూటింగ్ చేయటం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరువాత అక్కడ వాహినీ స్టూడియోలో సమ్మె విరమణ జరిగింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం చొరవ తీసుకుని వర్కర్స్ కు యాజమాన్యానికి మధ్య సయోధ్య కుదిర్చి వాహినీ స్టూడియోను తిరిగి  తెరిపించారు. అప్పుడు నాగిరెడ్డి గారు” మీ సినిమాలన్నీ వాహిని లోనే తీశారు.. సెంటిమెంటల్ గా   కూడా వాహినీ  మీకు అచ్చి వచ్చింది. కాబట్టి మరలా మద్రాసు వచ్చేయండి” అన్నారు.దానికి “హైదరాబాదులో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అదీ కాకుండా అక్కడ ప్రభుత్వ పరంగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అయినా మీరు ఆరు మాసాల వరకు స్టూడియో తెరవము అని చెప్పబట్టే కదా మేము వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు నిర్ణయం మార్చుకోలేము”- అని చెప్పి యూనిట్ మొత్తాన్ని హైదరాబాదుకు ప్రయాణం చేయించారు మధుసూదన రావు. సంస్థ పట్ల ఉన్న అభిమానంతో ఆర్టిస్టులందరూ హోటల్స్ వద్దు అందరం స్టూడియోలోనే ఉంటాం. అనవసరపు ఖర్చులు ఎందుకు- అంటూ స్వచ్ఛందంగా సారథి స్టూడియోలోనే బస చేయటానికి నిర్ణయించుకున్నారు.  నాగేశ్వరరావు, సావిత్రి, కృష్ణకుమారి, ఇ.వి.సరోజ, గుమ్మడి, శోభన్ బాబు, రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం- ఇలా పేరుమోసిన ఆర్టిస్టులందరూ సారథి స్టూడియోలో ఉన్న ఆరు గదులలో సర్దుకున్నారు.షూటింగుకు సకల సన్నాహాలు పూర్తయ్యాయి. ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ ఫైనలైజ్ కావచ్చిన తరుణంలో హటాత్తుగా రచయిత గోపీచంద్ గుండెపోటుతో మరణించారు. ఇప్పుడేం చేయాలి? మిగిలిన వర్కు ఎవరితో పూర్తి చేయించాలి? అన్న సమస్య వచ్చింది. ఆత్రేయను అడిగితే”- అమ్మో ఈ సినిమా ప్రారంభించిన వేళా విశేషం ఏమిటో గాని శ్రీదేవి గారు పోయారు, ఇప్పుడు గోపీచంద్ గారు పోయారు, నేను కూడా పోతానేమో? నేను రాయను” అంటూ పలాయనం చిత్తగించారు ఆత్రేయ. సరే ఎలాగూ పూర్తి కావచ్చింది కదా అనుకుని మిగిలిన స్క్రిప్ట్ వర్క్ ఆదుర్తి సుబ్బారావు, మధుసూదన రావు కలిసి పూర్తి చేసుకున్నారు.

” అయితే ఇన్ని మార్పులు చేర్పులు జరగటం వల్ల, రైటర్స్ మారటం వల్ల  “చదువుకున్న అమ్మాయిలు” స్క్రిప్టు నేను ఆశించిన స్థాయిలో రాలేదు. చదువుకున్న ఆడపిల్లల సమస్యల నేపథ్యంలో చక్కని ప్రయోగాత్మక చిత్రం తీద్దాం అని మొదలు పెడితే అది సంతృప్తికరంగా రాలేదు. మా సంస్థ చరిత్రలో స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తిగా తీసిన మొదటి సినిమా చదువుకున్న అమ్మాయిలే “- అంటారు మధుసూదన రావు.

ఈ సినిమాలోనే శోభన్ బాబు తొలిసారిగా అన్నపూర్ణ సంస్థలో  నటించారు. అదీ సావిత్రి భర్తగా… ఆ కాంబినేషన్ పై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.

” సావిత్రి మీద నాగేశ్వరరావు, రామారావు తప్ప వేరే ఎవరు చెయ్యి వేసినా ప్రేక్షకులు సహించరు… ఇదేమి కాంబినేషన్”- మధుసూదనరావును నిలదీసినంత పనిచేశారు చక్రపాణి.

అయితే పాత్ర ప్రాధాన్యతలను బట్టి నటీనటుల ఎంపిక జరుగుతుంది గాని వారి ఇమేజ్ ని బట్టి పాత్రలను రూపొందించే అలవాటు అన్నపూర్ణ సంస్థకు ఆది నుండి లేదు. ఇందులో శోభన్ బాబు ది అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదు. అన్నపూర్ణ సంస్థ హైదరాబాదులో నిర్మించిన తొలి చిత్రం “చదువుకున్న అమ్మాయిలు”. ఇక్కడ ఉన్న వసతులను, సౌకర్యాలను, లోకల్ టాలెంట్ ను పూర్తిగా వినియోగించుకునే ఉద్దేశంతో ముఖ్య పాత్రలకు తప్ప మిగిలిన చిన్న చిన్న పాత్రలకు స్థానిక కళాకారులనే ఎంపిక చేసుకున్నారు.

రీ రికార్డింగ్, మిక్సింగ్ తో సహా చిత్ర నిర్మాణం మొత్తాన్ని హైదరాబాద్ లోనే జరుపుకున్న తొలి చిత్రం “చదువుకున్న అమ్మాయిలు”. మద్రాసు నుండి ఏడుగురు మ్యూజిషియన్స్ ను ఇన్స్ట్రుమెంట్స్ తో సహా రప్పించి, 15 మంది స్థానిక మ్యూజిషియన్స్ ను పెట్టుకుని ఎస్  రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో కృష్ణయ్యర్ చీఫ్ సౌండ్ ఇంజనీరుగా రీ రికార్డింగ్, మిక్సింగ్ లు ఇక్కడే పూర్తి చేశారు. క్వాలిటీ దెబ్బతింటుందని కొంతమంది భయ పెట్టినప్పటికీ ప్రింటింగ్ కూడా ఇక్కడే జరిపించిన పూర్తి” రాష్ట్రవాళీ” చిత్రం గా రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి చరిత్రలో నిలిచిపోయింది “చదువుకున్న అమ్మాయిలు”.

అయితే “చదువుకున్న అమ్మాయిలు” దర్శక నిర్మాతలైన ఆదుర్తి సుబ్బారావు, మధుసూదనరావు లకు పూర్తి సంతృప్తి ఇవ్వకపోయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం ఆ సినిమా బాగా నచ్చేసింది. అందుకే సునాయాసంగా నూరు రోజులు ఆడింది. అవతల “లవకుశ” వంటి కలర్ పిక్చర్ గట్టి అపోజిషన్ ఇచ్చినప్పటికీ ఆ పోటీని తట్టుకుని”చదువుకున్న అమ్మాయిలు” వందరోజులు ఆడటం మధుసూదన రావుకే ఆశ్చర్యంగా అనిపించింది.

అయితే సినిమా రిలీజ్ అయిన రెండవ రోజున హైదరాబాద్ లోను, గుంటూరులోను కొందరు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఈ సినిమా మీద కేసు వేశారు. ఇందులో పద్మనాభం మెడికల్ రిప్రజెంటేటివ్. అతను ఇవి.సరోజ వెంటపడి ఏడిపిస్తుంటే కాలు చెప్పు విసిరేస్తుంది. ఆ చెప్పును  అలాగే బ్యాగ్ లో పెట్టుకుని పరుగెత్తుతాడు పద్మనాభం. ఈ సిల్లీ కారణం మీద కోర్టుకెక్కి” మెడికల్ రిప్రజెంటేటివ్స్ పరువు తీశారు.. వెంటనే ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయాలి అని కేసు వేస్తే ఇది చాలా సిల్లీ కేస్ అంటూ చివాట్లు పెట్టి మరీ కేసును కొట్టేసింది కోర్టు.

ఈ విధంగా ఆరంభం నుండి రిలీజ్ అయిన తరువాత కూడా చాలా రిస్కు లతో గడిచింది “చదువుకున్న అమ్మాయిలు” చిత్ర నిర్మాణం.

ఇద్దరు మిత్రులు ఫంక్షన్లో పాటలు పాడిన ఆశాలత కులకర్ణి అనే అమ్మాయితో ఈ సినిమాలో రెండు పాటలు పాడించారు. ఒకసారి మధుసూదనరావు అన్నపూర్ణ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొందరు హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్ లో రూమ్ తీసుకుని ఉండగా ఆ పక్కనే ఉన్న రూఫ్ గార్డెన్ నుండి ఒక శ్రావ్యమైన గొంతు వినిపించింది. ” ఇదేమిటి- లతా మంగేష్కర్ ఇక్కడికి ఎప్పుడు వచ్చింది” అని ఆశ్చర్యపోయారు ఆ మిత్రబృందం. ఆమె లతా మంగేష్కర్ కాదు… ఆశాలత కులకర్ణి అనే మరాఠీ అమ్మాయి- అన్నారు మధుసూదనరావు. కాదంటే కాదు అని వాదించుకుని తీరా వెళ్లి ఆమెని చూసి ఆశ్చర్యపోయారు ఆ మిత్రులు. అంత గొప్ప గాయనిని ” చదువుకున్న అమ్మాయిలు”ద్వారా పరిచయం చేసి మీ అమ్మాయికి గొప్ప భవిష్యత్తు ఉంది.. మేమంతా ప్రోత్సహిస్తాం అని హామీ ఇచ్చినప్పటికీ ఆమె తల్లిదండ్రులు వినకుండా ఆమెకు పెళ్లి చేసేసారు. పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె పూనా వెళ్ళిపోయింది. ఒక మంచి గాయని తో పాడించి ప్రయోగం చేసామన్న తృప్తి మాత్రం అన్నపూర్ణ సంస్థకు మిగిలిపోయింది.


 (సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 3న చదవండి)

(చదువుకున్న అమ్మాయిలు లోని కొన్ని పాటలు మీ కోసం)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=ZxhsQmV1-6I]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here