ఇద్దరు మిత్రులు చిత్రం ద్వారా పరిచయమైన గొప్ప గీత రచయిత ఎవరు? – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 26,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 26

(రీక్యాప్)
( అప్పటి భారత కార్మిక మంత్రి వి వి గిరి గారు హైదరాబాదు దీపక్ మహల్ లో ఇద్దరు మిత్రులు చిత్రాన్ని సతీ సమేతంగా చూసి ప్రశంసల వర్షం కురిపించటం మర్చిపోలేని మధుర ఘట్టం అంటారు మధుసూదనరావు)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

హైదరాబాద్ తాజ్ మహల్ హోటల్ లో పనిచేసే ఒక సర్వర్ “ఇద్దరు మిత్రులు” చిత్రాన్ని 26 సార్లు చూసాడట! ఈ విషయం హోటల్ సూపర్వైజర్ మధుసూదనరావుతో చెబితే ఆయన నమ్మలేదు. ఆ సప్లయర్ను పిలిపించి అడిగితే” అవునండి ఇవాళ 27 వ సారి వెళ్తున్నాను” అని చెప్పాడు.“ఆ సినిమాలో అంతగా నచ్చింది ఏమిటయ్యా”- అని అడిగితే
” ఏముందండీ పగలంతా కష్టపడి పని చేస్తాం… రాత్రి వెళ్లి హాల్లో కూర్చుంటే ఆ పాటలు వింటూ, ఆ సీన్స్ చూస్తూ కష్టమంతా మర్చిపోతాం”- అని చెప్పాడు. అన్నపూర్ణ సంస్థకు ఇలాంటి ఎన్నెన్నో ప్రశంసలను, అనుభూతులను అందించిన అద్భుత విజయంగా నిలిచింది “ఇద్దరు మిత్రులు” చిత్రం .

అందుకే ఆ విజయానికి తగిన స్థాయి లోనే” ఇద్దరు మిత్రులు” శత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది అన్నపూర్ణ సంస్థ. హైదరాబాద్ దీపక్ మహల్ లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన శతదినోత్సవ వేడుకలకు నటి నట,సాంకేతికవర్గం మొత్తాన్ని మద్రాసు నుండి ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకొచ్చారు. ఆ శతదినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ సావిత్రి నటీ నటులకు మెమోంటోలను బహుకరించడం.” ఈ సినిమాలో నాకు వేషం లేనందుకు బాధపడ్డాను. ఈ విధంగానైనా అన్నపూర్ణ సంస్థ విజయంలో పాలుపంచుకునే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను”- వేదిక పైనే ఆనంద భాష్పాలు రాల్చారు మహానటి సావిత్రి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్క సినిమా వరకే అయినా అన్నపూర్ణ సంస్థ వియోగాన్ని భరించలేకపోవటం ఆ సంస్థ సంపాదించుకున్న మంచితనానికి నిదర్శనం. ఈ చిత్ర శతదినోత్సవ వేడుకల్లో చిత్ర ఛాయాగ్రహకుడు సెల్వరాజ్ కు వజ్రాల ఉంగరం బహుకరించారు అన్నపూర్ణ సంస్థ వారు. తెలుగులో తొలి ద్విపాత్రాభి నయాన్ని అద్భుతంగా చిత్రీకరించి సాంకేతిక విప్లవానికి కారకుడైన సెల్వ రాజ్ యొక్క ప్రతిభకు అన్నపూర్ణ వారు జరిపించిన పట్టాభిషేకం అది.చార్టెడ్ ప్లేయిన్ రాత్రి ఏడుగంటలకే రిటర్న్ వెళ్ళవలసి ఉండటంతో సాయంత్రం నాలుగు గంటలకు బృందావన్ రూఫ్ గార్డెన్ లో టీ పార్టీ ఏర్పాటు చేశారు నవయుగ డిస్ట్రిబ్యూటర్స్. ఆ పార్టీకి దాదాపు అప్పటి క్యాబినెట్ మంత్రులు అందరూ హాజరు కావడం విశేషం. ఆ టీ పార్టీ లో ఒక కొత్త అమ్మాయి పాట పాడింది. తెలియని వాళ్లకు లతా మంగేష్కర్ పాడుతుందేమో అనిపించేంత శ్రావ్యంగా పాడింది ఆ అమ్మాయి . ఆహుతులందరూ మంత్రముగ్దులయ్యారు . ఆ అమ్మాయి పేరు ఆశాలత కులకర్ణి.

” ఈ అమ్మాయికి సినిమాల్లో ఛాన్స్ ఇస్తే”-? ఈ ఆలోచనను తన పక్కనే ఉన్న పీ.సుశీలకు చెప్పగా” తప్పకుండా ఇవ్వండి. నిజంగా ఆమె గొంతు చాలా బాగుంది” అన్నారామె. తను ఒక గాయని అయి ఉండి మరొక గాయని పట్ల అంత ప్రోత్సాహకరంగా మాట్లాడటం మధుసూదన రావు కు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే విషయం సుశీలను అడగ్గా” ఎప్పటికైనా కొత్తనీరు రావాలి కదా.. అయినా నేను మాత్రం ఎన్ని పాటలు పాడగలను… ప్రస్తుతం ఉన్న బిజీలో పాడ లేక చస్తున్నాను” అన్నారు పి. సుశీల. అన్నపూర్ణ వారి తరువాతి చిత్రం ” చదువుకున్న అమ్మాయిలు” లో ఆశాలత కులకర్ణికి అవకాశం కల్పించారు మధుసూదన రావు.ఈ”ఇద్దరు మిత్రులు” చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు మరొక గొప్ప గేయ రచయిత పరిచయం అయ్యారు. ఆయనే దాశరథి. ఈ పరిచయానికి పూర్వం దాశరధి తాను తెలుగులోకి అనువదించిన గాలీబు గేయాలను అక్కినేని నాగేశ్వరరావుకు అంకితం చేశారు. ఆ సభకు బూర్గుల రామకృష్ణారావు గారు అధ్యక్షత వహించారు. ఆ గేయ సంపుటిని మధుసూదనరావు చదివారు. ఆ శైలి ఆయనకు బాగా నచ్చింది. మీరు సినిమాలకు పాటలు రాయకూడదా? అన్నారు మధుసూదనరావు. అందుకు సమాధానంగా ” నాకు సంగీత పరిజ్ఞానం లేదు కదా ఎలా రాయాలి” అన్నారు దాశరథి.
” అదంతా నేను చూసుకుంటా మీరు రాస్తారా” అన్నారు మధుసూదన రావు. ఓకే అన్నారు దాశరధి.
ఆ మర్నాడు మద్రాసు ప్రయాణమయ్యారు. తొలిసారిగా సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావుతో మ్యూజిక్ సిట్టింగ్ లో పాల్గొన్నారు దాశరధి.ట్యూన్ కు రాస్తారా ? లేక మీరు రాస్తే మేం ట్యూన్ కట్టుకోవాలా? అనడిగారు రాజేశ్వరరావు.
ట్యూన్ కు రాయటం అంటే ఏమిటి ? అమాయకంగా అడిగారు దాశరధి.
అంటే” నేను సరిగమలు రాసిస్తే దాని ప్రకారం మీరు పదాలు వేయటం ఒక పద్ధతి. లేదా మీరు రాస్తే దానికి నేను ట్యూన్ కట్టుకోవడం రెండవ పద్ధతి. ఈ రెండింటిలో మీకు ఏది ఈజీ చెప్పండి”అన్నారు రాజేశ్వరరావు.
” సరే మీరు ట్యూన్ ఇవ్వండి” రాస్తాను. ఛాయిస్ రాజేశ్వరరావుకే ఇచ్చారు దాశరథి.
ట్యూన్ ఇచ్చి అలా తమలపాకు బిగిద్దామని పక్కకు వెళ్ళారు రాజేశ్వరరావు.
పది నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి” రెడీ” అన్నారు దాశరథి.“అప్పుడేనా”- అని ఆశ్చర్యపోతూ హార్మోనియంలో రాగాలాపన చేసి సరిచూసుకున్నారు రాజేశ్వరరావు. ఆయన ఆశ్చర్యానికి అంతులేదు. వెంటనే చరణాలకు ట్యూన్ ఇచ్చి అలా పక్కకు వెళ్లి మధుసూదనరావు చెవులో గుస గుస గా చెప్పారు-” అమ్మో!-ఈయన అఖండుడండి … నేను ఇచ్చిన ట్యూన్ చాలా కష్టమైంది. పదినిమిషాల్లో రాసి పడేసాడు అంటే నమ్మండి” – అంటూ తెగ మెచ్చుకున్నారు రాజేశ్వరరావు. ఈ విధంగా దాశరధి కలం నుండి జాలువారిన తొలి సినిమా పాట “ఖుషి ఖుషి గా నవ్వుతూ.. చలాకి మాటలు రువ్వుతూ ” అంటూ సాగింది. తరువాత హైదరాబాద్ లో ఉంటూ ‘ఖవ్వాలి’ పాటల తీరుతెన్నులు తెలిసిన వారు కావటంతో ఇందులోని ఒక ఖవ్వాలి పాటను కూడా ఆయనతోనే రాయించారు. “నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి” అన్న ఈ పాట చిత్రంలోని తొలి పాట.

ఇద్దరు మిత్రులు నిర్మాణ సమయంలోనే చిత్ర పరిశ్రమలో విపరీతమైన సంచలనం సృష్టించింది. తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు ద్విపాత్రాభినయాన్ని చూపించి చిత్రపరిశ్రమలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది ఈ చిత్రం. అయితే కాస్టింగ్ విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. తొలిసారి డ్యూయెల్ రోల్ చేస్తున్న అక్కినేని నాగేశ్వరరావు సరసన మంచి పేరున్న హీరోయిన్స్ ను పెట్టాలి కానీ ఎవరో ఇద్దరు డాన్సర్స్ ను పెట్టారు. ఏదో వరుసగా నాలుగు హిట్స్ కొట్టినంత మాత్రాన ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటూ కామెంట్స్ చేశారు.విసుర్లను, విమర్శలను ఖాతరు చేసే అలవాటు లేని అన్నపూర్ణ వారు వాటిని తేలిగ్గా తీసుకున్నారు.అన్నపూర్ణ వారి “ ఇద్దరు మిత్రులు” ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి “భార్య భర్తలు” షూటింగ్స్ దాదాపు ఏకకాలంలో జరిగాయి. ఈ రెండు సంస్థల మధ్య చక్కని స్నేహసంబంధాలు ఉండేవి. ఈ రెండు సంస్థల ఆవిర్భావానికి ముందు మధుసూదనరావు, ఏవి సుబ్బారావు కలిసి ఒక సంస్థను ప్రారంభించాలనుకున్నారు. కానీ సుబ్బారావు గారు నూతనోత్సాహంతో ముందుగా పి .ఏ.పీ. సంస్థను ప్రారంభించారు. ఇక ఆయన నిర్మించిన ” భార్యాభర్తలు” చిత్రం విషయానికి వస్తే ఆ చిత్ర కథాంశం విషయంలో జరిగిన చర్చల్లో, తర్జనభర్జనల్లో మధుసూదనరావు కూడా పాల్గొన్నారు. ఆ సబ్జెక్టు తప్పకుండా హిట్ అవుతుంది అని ఘంటాపథంగా చెప్పారు మధుసూదనరావు.అనుకున్నట్లుగానే “భార్యాభర్తలు” పెద్ద సక్సెస్ అవటమే కాకుండా నేషనల్ అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రజిత పథకాన్ని కూడా పొందింది. తమ సోదర సంస్థకు లభించిన ఈ విజయాన్ని తమ విజయంగా భావించింది అన్నపూర్ణ సంస్థ. అందుకే “భార్యాభర్తలు” యూనిట్ కు మద్రాస్ అశోక హోటల్ లో ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. అన్యులు ఎవరూ లేకుండా పీ ఏపి , అన్నపూర్ణ సంస్థల యూనిట్ మెంబర్స్ మాత్రమే పాల్గొన్న ఆ సభలో ఆరుద్ర, గుమ్మడి తదితరులు ప్రసంగించారు.” ఒక సంస్థ విజయాన్ని చూసి ఈర్ష్య పడే ఈ రోజుల్లో సాటి సంస్థ సాధించిన విజయానికి ఇంత అభిమానంగా ప్రతిస్పందించటం అన్నపూర్ణ వారి ఉత్తమ సంస్కారానికి నిదర్శనం! సంస్థల మధ్య ఇలాంటి సోదర భావము,స్నేహ సంబంధాలు ఉంటే చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది” -అంటూ ప్రసంగించిన వక్తలందరూ అన్నపూర్ణ సంస్థ ను అభినందించారు.


 (సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి డిసెంబర్ 1న చదవండి)

( ఇద్దరు మిత్రులు చిత్రం నుండి కొన్ని పాటలు మీకోసం)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=R9HiZMs1J4o]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here