తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా ద్విపాత్రాభినయ అద్భుతాన్ని చూపించిన అన్నపూర్ణ సంస్థ – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 25, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar

(రీక్యాప్)
( దీనిపై ఆగ్రహించిన శివాజీ గణేషన్ అభిమానులు” తూయ ఉల్లం” పై వ్యతిరేక ప్రచారం చేశారు. ఈ కారణం వల్ల కూడా”తూయ ఉల్లం” యావరేజ్ చిత్రం అయింది.)

(గత ఎపిసోడ్ తరువాయి భాగం)

“దొంగరాముడు” తరువాత నాగేశ్వరరావును ఆయన ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన చిత్రం ” ఇద్దరు మిత్రులు”. ద్విపాత్రాభినయాన్ని తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు చూపిన చిత్రం “ఇద్దరు మిత్రులు”.

వెలుగునీడలు శతదినోత్సవ వేడుకల నిమిత్తం విశాఖపట్నం వెళ్లిన మధుసూదన రావు, మిత్రులు నవయుగ చంద్రశేఖర రావు, నవయుగ మేనేజర్ డి. విశ్వనాథ శర్మ, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏవి సుబ్బారావు లతో కలసి కలకత్తా వెళ్లారు. కలకత్తా లో కొన్ని చిత్రాలు చూశారు. వాటిల్లో లో ప్రముఖ బెంగాలి హీరో ఉత్తమ్ కుమార్ ద్విపాత్రాభినయం చేసిన “తాషేర్ ఘర్” మధుసూదనరావుకు వచ్చింది. పీ ఏ పీ సుబ్బారావు గారికి ఆ చిత్రం రైట్స్ తీసుకునే ఉద్దేశం ఉందేమోనని అడిగారు. ఆ సినిమాలో డ్యూయల్ రోల్ తప్ప మరి ప్రత్యేకత, వైవిద్యం లేవని కాబట్టి తనకు ఆ సినిమా తీసుకునే ఉద్దేశం లేదని చెప్పారు సుబ్బారావు. కథలో పెద్ద విశేషమేమీ లేకపోయినప్పటికీ అక్కినేని నాగేశ్వరరావుతో ద్విపాత్రాభినయం చేయించాలనే దృష్టితో”తాషేర్ ఘర్” రైట్స్ కొనుగోలు చేసి మద్రాసు చేరుకున్నారు మధుసూదనరావు.

ఆదుర్తి సుబ్బారావుతో కథా చర్చలు ప్రారంభించారు. అయితే తెలుగు లో కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. తెలుగు లో చాలా కొత్త పాత్రలు చేరాయి. శారద, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, సూర్యకాంతం, ఇ.వి.సరోజ పాత్రలు ఒరిజినల్ లో లేవు. తొలిసారిగా అన్నపూర్ణ సంస్థ ట్రీట్మెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ను చేపట్టింది. మా అన్ని చిత్రాల కథలను నేను ఇప్పటికీ చెప్పగలను. కానీ ఎన్నిసార్లు చూసినా ఇద్దరు మిత్రులు కథనం మాత్రం వివరంగా చెప్పలేను అంటారు మధుసూదన రావు. ఈ చిత్రం నుండి ద్విభాషా చిత్రాల నిర్మాణాన్ని విరమించుకుంది అన్నపూర్ణ సంస్థ. రెండు భాషల్లో చిత్రాన్ని నిర్మిస్తే ఖర్చులు కలిసి వస్తాయి అనుకునే రోజులు పోయాయి. అన్నపూర్ణ సంస్థ వరసగా సాధిస్తున్న విజయాలను చూసి రెమ్యూనరేషన్స్ విపరీతంగా పెంచేశారు కొందరు తమిళ ఆర్టిస్టులు. దానికి తోడు మరికొన్ని ప్రతికూల పరిస్థితులు తోడు కాగా “ఇద్దరు మిత్రులు” చిత్రాన్ని తెలుగు వరకే పరిమితం చేశారు.

తెలుగు అడాప్షన్ లో పుట్టుకొచ్చిన కొత్త పాత్రల్లో హీరో చెల్లెలు పాత్ర ముఖ్యమైనది. ఈ పాత్ర ఎవరితో చేయించాలి అన్నది ప్రశ్న. దీనికి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు కన్నా కొత్త అమ్మాయి బాగుంటుంది అనుకున్నారు. అన్వేషణ ప్రారంభమైంది. పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. చాలామంది అమ్మాయిలు ఫోటోలు పంపించారు. ఒకరూ నచ్చలేదు. ఒకరోజు ఎల్వి ప్రసాద్ గారిని” ఎవరైనా కొత్త అమ్మాయి ఉంటే చెప్పండి” అని అడిగారు మధుసూదనరావు. అప్పుడే సినిమాల్లో వేషాల కోసం తెనాలి నుండి ఒక కొత్త అమ్మాయి ప్రసాద్ గారికి ఫోటోలు పంపించింది. ఆ ఫోటోలను చూపించారు ఎల్ వి ప్రసాద్ గారు. బాగుంది అనుకుని వెంటనే ఆ అమ్మాయిని పిలిపించి చూశారు. ఆదుర్తి సుబ్బారావు ఓకే అన్నారు. అలా ఆ చిత్రంలో హీరో చెల్లెలు పాత్ర ద్వారా తెలుగు తెరకు మరొక గొప్ప నటి పరిచయమైంది… ఆమే శారద.

ఈ చిత్రంలో సావిత్రి చేయదగ్గ పాత్ర లేదు. అదే విషయం మధుసూదన రావు సావిత్రి కి చెప్పారు. ఆమె కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. మీ తొలి చిత్రం నుండి నేను అన్ని సినిమాల్లో ఉన్నాను. నాకు వేషం లేదంటారా? అంటూ మారాం చేసింది సావిత్రి. వేషం లేకపోవటం కన్నా మాతృ సంస్థ వంటి అన్నపూర్ణతో వియోగాన్ని ఆమె భరించలేకపోయింది. ఒక్క సావిత్రే కాదు… అన్నపూర్ణ సంస్థ చిత్రాలలో పనిచేసే అవకాశాన్ని ఒక మధురమైన అనుభూతిగా చెప్పుకునే నటీనటులు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు.

ఇక ద్విపాత్రల్లో దర్శనమిచ్చే నాగేశ్వరరావు సరసన నటించడానికి ఇద్దరు హీరోయిన్స్ కావాలి. వారిలో ఒకరుగా రాజసులోచన బుక్ చేశారు. రెండవ పాత్రకు హీరోయిన్ దొరకడం కష్టమైంది. చాలామందిని చూశారు. ఒకవైపు షూటింగ్ ప్రారంభమైంది. ఇంకో నాలుగు రోజుల్లో సెకండ్ హీరోయిన్ సెట్ లో ఎంటర్ అవ్వాలి. ఒకరోజు వాహినీ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా పక్క ఫ్లోర్లో వేరే షూటింగ్ నుండి వచ్చింది ఇ.వి.సరోజ.” వనక్కం సార్- ఏన్నా సర్.. నీంగల్ సింగల్ వర్షన్ దా ఎడికరింగ… ఇదుమే ఇనక్కు వేశమ్ ఇళ్లామే పోచ్”- నమస్కరిస్తూనే నిట్టూర్చింది. మధుసూదన రావు ఒక్కసారి ఇ.వి.సరోజను పరిశీలనగా చూశారు. ఆ అమ్మాయి అంతకుముందు తోడి కోడళ్ళు చిత్రంలో డాన్స్ చేసింది. వెలుగునీడలు తమిళ వెర్షన్ లో నాగేశ్వరరావు భార్యగా( తెలుగులో గిరిజ చేసిన పాత్ర) నటించింది. “ఈ సినిమాలో హీరోయిన్ వేషం ఇస్తాము చేస్తావా”- అన్నారు మధుసూదన రావు. ఆశ్చర్యంగా నమ్మలేనట్లు చూస్తూ మీక మీరు ఒక్క వెర్షనే కదా తీస్తుంది. నాకు తెలుగు రాదు కదా- అన్నది అరవంలో.

అదంతా నీకెందుకు నువ్వు చేస్తావా చెప్పు అన్నారాయన. ఆనందంతో ఎగిరి గంతేసింది ఆ అమ్మాయి. వెంటనే ఫ్లోర్ లోకి వెళ్లి “సెకండ్ హీరోయిన్ దొరికింది”- అని ప్రకటించేశారు మధుసూదనరావు. ఎవరు అన్నారు… అందరూ ఆసక్తిగా. ఇ.వి.సరోజ ఆ అమ్మాయికి తెలుగు అక్షరం ముక్క కూడా రాదు కదా! సందేహం వెలిబుచ్చారు ఆదుర్తి సుబ్బారావు… నాగేశ్వరరావు. ” అదంతా నేను చూసుకుంటాను.. మీకు అంగీకారమైన చెప్పండి”- అన్నారు మధుసూదన రావు. క్షణం సేపు ఆలోచించి’ ఓకే’ అన్నారు ఆదుర్తి. వెంటనే ఆ అమ్మాయిని ఖాయం చేశారు. ఆ అమ్మాయి ధరించే పాత్ర డైలాగులన్నీ తమిళంలో రాయించి ప్రాక్టీస్ చేయించే బాధ్యతను అసోసియేట్ డైరెక్టర్ కె.విశ్వనాథ్ కు అప్పగించారు. ఆ పాత్రకు ఎవరితో డబ్బింగ్ చెప్పించాలనుకున్నారో ఆ ఆర్టిస్ట్ ను పిలిచి ఆమె డైలాగులన్నీ రిహార్సల్స్ చేయించి అదే మాడ్యులేషన్లో టేప్ చేయించి ఆ టేప్ సహాయంతో తమిళ లిపిలో రాసుకున్న డైలాగులను ఇ.వి.సరోజతో ప్రాక్టీస్ చేయించారు. షూటింగ్ సమయానికి లిప్ మూమెంట్ తో సహా పర్ఫెక్ట్ గా తయారు చేశారు ఇ.వి.సరోజ ను. ఈ విధంగా ఈ బి.సరోజ ను తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేసింది అన్నపూర్ణ సంస్థ.

“ఇద్దరు మిత్రులు” చిత్రంతో తొలిసారిగా అన్నపూర్ణ లో కాలు పెట్టారు సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు. తెలుగు శ్రోతల మనసుల్లో మధురస్మృతులుగా మిగిలిపోయే రస గుళికల వంటి పాటలకు ప్రాణ ప్రతిష్ట చేశారాయన. ఆది నుండి సంగీతం విషయంలో ఉన్నత ప్రమాణాలు సృష్టించిన అన్నపూర్ణ సంస్థకు ” ఇద్దరు మిత్రులు” లోని పాటలు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఈ రోజుల్లో ఉన్న గోల్డెన్ డిస్కులు, ప్లాటినం డిస్కులు వంటివి ఆ రోజుల్లో ఉండి ఉంటే “ఇద్దరు మిత్రులు” సాధించే రికార్డులను అధిగమించటం ఎవరితరమూ అయ్యేది కాదు.

ఇక ఈ చిత్రానికి డైలాగులు మొత్తం రాసింది కొర్రపాటి గంగాధరరావు. ట్రబుల్ మేకర్ గా ప్రసిద్ధి చెందిన ఆత్రేయకు కొద్దిపాటి వియోగాన్ని కలిగిస్తేనన్నా కొంచెం దారికి వస్తారన్న ఆశతో ఆదుర్తి, మధుసూదన రావు కూడబలుక్కుని ఆత్రేయను పక్కనబెట్టి కొర్రపాటి గంగాధరరావుకు అవకాశం ఇచ్చారు. ఆయన ఈ చిత్రానికి చాలా చక్కగా పాత్రోచితమైన డైలాగులు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ బాపట్లలో డాక్టర్గా తాను చేసుకుంటున్న ప్రాక్టీస్ దెబ్బతింటుందన్న భయంతో ఆయన చిత్ర పరిశ్రమలో కొనసాగలేదు.

“ఇద్దరు మిత్రులు”- ప్రివ్యూ షో లో చూసి పరిశ్రమ ప్రముఖులు అందరు అభినందించారు. ఫస్ట్ కాపీ వచ్చినవెంటనే వాహినీ స్టూడియోలో కట్టవలసిన బిల్లులను చెల్లించటానికి వెళ్లారు మధుసూదన రావు. వాహినీ స్టూడియో అధినేత నాగిరెడ్డి మధుసూదనరావును చూడగానే’ I am jelous of you’- అన్నారు. ‘ఎందుకండి’ అన్నారు మధుసూదనరావు ఆశ్చర్యంగా. ఇంత పెద్ద స్టూడియో పెట్టుకొని మేము ఇలాంటి సినిమా తీయలేకపోయాము. రాత్రి మీ” ఇద్దరు మిత్రులు” సినిమా చూసాం. రియల్లీ సూపర్బ్ అంటూ అభినందనలు కురిపించారాయన. అంత పెద్ద వ్యక్తి నుండి వచ్చిన ఆ అనూహ్య అభినందనలు మధుసూదన రావును ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. మద్రాసు సినీ వర్గాల టాక్ తెలుగు ప్రేక్షకుల తీర్పు ఒకటైన సందర్భాలు చాలా అరుదు. వారు ప్లాప్ అన్న చిత్రాన్ని ప్రేక్షకులు సూపర్ హిట్ చేస్తారు. వారు హిట్ అన్న చిత్రాన్ని జనం తిప్పి కొడతారు. 1961 డిసెంబర్ 29న విడుదలైన “ఇద్దరు మిత్రులు” ఈ రెండింటిని సమన్వయం చేస్తూ సెన్సేషనల్ హిట్ అయింది.
అప్పటి భారత కార్మిక మంత్రి వి.వి.గిరి గారు హైదరాబాద్ దీపక్ మహల్ లో ఈ చిత్రాన్ని సతీ సమేతంగా చూసి ప్రశంసల వర్షం కురిపించటం మరచిపోలేని మధుర ఘట్టం అంటారు మధుసూదన రావు.
( సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 29న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=vmeUZrD9awE]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here