అక్కినేని నటన పై ఓ తమిళ హీరో దుష్ప్రచారం – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 24, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 24

(రీక్యాప్)
(” వేషం మీ ఇష్టం వచ్చినట్లు వేయి స్తున్నారుగా… పందెం ఎంతో కూడా మీరే చెప్పండి”- అన్నారు రేలంగి రోషంగా.
“సరే- ఈ సినిమా హిట్ అయితే మీకు ఇచ్చే రెమ్యూనరేషన్ మీరు వాపస్ ఇవ్వాలి.. ఈ సినిమా ఫెయిల్ అయితే నేను మీకు ఇస్తున్న రెమ్యూనరేషన్ కు రెట్టింపు ఇస్తాను”- అన్నారు మధుసూదనరావు.
పందెం ఖాయం చేసుకున్నారు)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

పందెం ఫలితం గురించి తర్వాత తెలుసుకుందాం. ఇకపోతే ఈ చిత్రం షూటింగ్ లో మరొక తమాషా సంఘటన జరిగింది.
ఒకరోజు షాట్ విరామ సమయంలో సావిత్రి, సూర్యకాంతం, సంధ్య( జయలలిత తల్లి) కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు. ఇంతలో ఇ.వి.సరోజ వారి వద్దకు వచ్చింది. ఈమె తమిళ నటి. వెలుగునీడలు తెలుగు వర్షన్ లో గిరిజ పోషిస్తున్న పాత్రను తమిళ వెర్షన్ లో ఈమె పోషిస్తోంది. ఆమెకు తెలుగు నేర్చుకోవాలని ఉబలాటం. సావిత్రి, సూర్యకాంతంల వద్ద తన కోరికను వ్యక్తం చేసింది. ఆమెను ఆటపట్టించడానికి ఇదే సరైన అదును అనుకుని ఆమెకు ముందుగా కొత్త వారిని ఎలా పరిచయం చేసుకోవాలో నేర్పుతామని చెప్పి” నమస్కారం! నన్ను పెళ్లి చేసుకుంటారా” అంటే” మీరు బాగున్నారా” అని అర్థం అని చెప్పారు. పాపం ఆమె ఆ మాటలను వల్లెవేస్తూ కూర్చుంది. అంతలో ప్రఖ్యాత దర్శకులు బి.ఎన్.రెడ్డి గారు సెట్ లోకి వచ్చారు. ఇ.వి.సరోజ నేరుగా ఆయన వద్దకు వెళ్లి” నమస్కారం …నన్ను పెళ్లి చేసుకుంటారా? అనేసింది.

అంతే! ఆయన షాక్ అయ్యారు. పక్కనే ఉన్న మధుసూదన్ రావును ఉద్దేశించి ” ఈజ్ షీ క్రేజీ- నన్ను పెళ్లి చేసుకుంటావా అంటది ఏమిటి? అని కోప్పడ్డారు.ఆ తర్వాత విషయం తెలుసుకుని అందరూ ఆనందంగా నవ్వుకున్నారు.
” ఇక నా జన్మలో తెలుగు మాట్లాడను” అంది ఇ.వి.సరోజ.

వెలుగునీడలు శతదినోత్సవ వేడుకలను విజయవాడలోనూ, తరువాత వైజాగ్ లోనూ ఆ తరువాత తిరుగు ప్రయాణంలో రాజమండ్రిలో ను జరపాలని నిర్ణయించుకున్నారు.

విజయవాడలో ఫంక్షన్ ముగిసిన తర్వాత డిన్నర్ పూర్తి అయ్యేసరికి విశాఖపట్నం వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్
రైట్ టైం కే వచ్చి వెళ్ళిపోయింది . మర్నాడు ఉదయం మెయిల్ ఎక్కితే విశాఖ చేరేటప్పటికి ఒంటిగంట అవుతుంది. కానీ అక్కడ ఫంక్షన్ తొమ్మిది గంటలకే. ఏం చేయాలో తోచలేదు. అందరూ అప్ సెట్ అయ్యారు. అంతలో శర్మ గారు వచ్చి విశాఖపట్నం కు వెళ్ళే ఒక పాసింజరు ఉందని.. అందులో థర్డ్ క్లాస్ మాత్రమే ఉందని చెప్పారు.
” ఏంటి… సావిత్రి థర్డ్ క్లాస్ లో వెళ్దామా? అన్నారు నాగేశ్వరరావు.
” ఓ…నేను రెడీ!.. అంది సావిత్రి.

అలా ప్యాసింజర్ రైల్లో థర్డ్ క్లాస్ లో అందరూ ఉత్సాహంగా ఎక్కేసారు. చివరి నిమిషంలో వచ్చి రైలు ఎక్కటం వల్ల ఇతర కంపార్ట్ మెంట్స్ లో ఉన్న ప్రయాణికులకు వెంటనే తెలీకపోయినా రైలు రాజమండ్రి చేరేసరికి అందరికీ తెలిసిపోయింది.

రైలు ఆగిన చోటల్లా అభిమానులు వచ్చి ఆ బోగిని చుట్టుముట్టి ఆర్టిస్టులు అందర్నీ బయటకు రమ్మని అల్లరి చేయడం ప్రారంభించారు. కంపార్ట్ మెంట్ గుమ్మం దగ్గర నిలబడి కర్ర పెత్తనం చేస్తూ అభిమానులను అదుపు చేశారు సూర్యకాంతం.అలా ప్యాసింజర్ రైలులో అదీ థర్డ్ క్లాస్ లో ఆనాటి హేమాహేమీలైన నటీనటులు, దర్శక నిర్మాతలు ప్రయాణం చేయటం చాలా అరుదైన మధురానుభూతిగా మిగిలిపోయింది అందరికీ.

తమ సంస్థ నిర్మించిన చిత్రాలన్నింటిలోనూ కథాపరంగా, సంగీత, సాహిత్య, సాంకేతిక విలువల దృష్ట్యా” వెలుగునీడలు” సమగ్ర చిత్రం అంటారు మధుసూదనరావు.

ఈ చిత్రంలో నటీనటులందరూ తమ తమ పాత్రలకు పరిపూర్ణ న్యాయాన్ని చేకూర్చారు. ముఖ్యంగా నాగేశ్వరరావు సావిత్రి ఒకరికొకరు పోటీపడి ప్రదర్శించిన అభినయ చాతుర్యం కళాభిమానులకు కనువిందు చేసింది.
తెలుగులో “వెలుగునీడలు” అఖండ విజయాన్ని సాధించి అన్నపూర్ణ సంస్థ ప్రతిష్టను పదింతలు చేసింది.కానీ
తమిళంలో “తూయ ఉళ్లమ్” ఏవరేజ్ చిత్రం అయింది. అయితే ఈ చిత్రం హిట్ కాకపోవడానికి గల కారణాలు అప్పట్లో చిత్రపరిశ్రమ మొత్తం మీద చర్చనీయాంశాలయ్యాయి. తమిళ చిత్ర రంగంలో నాగేశ్వరరావు ఎదుగుదలను దెబ్బతీయడం కోసం ఒక తమిళ నటుడు చేసిన తీవ్ర ప్రయత్నాలు “తూయ ఉల్లం” చిత్రాన్ని ఏవరేజ్ కు పరిమితం చేశాయి. ఆ నటుడు చేసిన దుష్ప్రచారాలలో నాగేశ్వరరావు తమిళుడు కాకపోవటం వల్ల తమిళ ఉచ్ఛారణ సరిగా ఉండదు అనేది ఒకటి.

అతని ప్రోద్బలం వల్ల కొన్ని తమిళ పత్రికలు ఈ విమర్శను హెడ్ లైన్స్ కు ఎక్కించాయి. దేవదాసు, లైలా మజ్ను, ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి, మంజుల్ మహిమయ్ వంటి చిత్రాలలో నాగేశ్వరరావు ఉచ్ఛారణ పట్ల వినపడని విమర్శలు ఈ చిత్రం విషయంలోనే వినిపించడానికి గల కారణం ఏమిటో దీని వెనుక ఎవరి హస్తం ఉందో చిత్ర పరిశ్రమలో అందరూ గ్రహించగలిగారు.

“తూయ ఉల్లం” మౌంట్ రోడ్డులో నూతనంగా నిర్మించబడిన శాంతి థియేటర్ లో పొంగల్ రోజున విడుదలైంది. ఆ ధియేటర్ లో పొంగల్ కు తమ చిత్రాలు విడుదల చేయాలని తమిళ చిత్ర రంగంలో పేరుప్రఖ్యాతులున్న నిర్మాతలంతా ప్రయత్నించారు. కానీ ఆ ధియేటర్ ప్రొప్రైటర్ ఉమాపతి ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి,మంజల్ మహిమై చిత్రాలు నిర్మించిన అన్నపూర్ణ వారి చిత్రంతోనే తన ధియేటర్ ప్రారంభిస్తానని సుబ్బయ్య చెట్టియార్ కు మాట ఇచ్చి, ఎవరి ఒత్తిడికి లొంగకుండా” తూయ ఉల్లం” ను పొంగల్ కు రిలీజ్ చేశారు. దీనిపై ఆగ్రహించిన శివాజీ గణేషన్ అభిమానులు తూయ ఉల్లం పై వ్యతిరేక ప్రచారం చేశారు. ఈ కారణం వల్ల కూడా తూయ ఉల్లం యావరేజ్ చిత్రం అయింది .


 (సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 27న చదవండి)

(“ వెలుగునీడలు”చిత్రం నుండి విశేష ప్రజాదరణ పొందిన కొన్ని పాటలు మీకోసం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here