నా వేషం ఇలాగే ఉంటే సినిమా ఫెయిల్ అవుద్ది… కావాలంటే పందెం – రేలంగి : స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 23,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 23

(రీ క్యాప్)

(దాదాపు మృత్యు ముఖాన్ని చూసి ఏ మందులకు లొంగని అనారోగ్యాన్ని అవలీలగా అధిగమించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చిన దుక్కిపాటి మధుసూదనరావు తన చిత్ర నిర్మాణ ప్రస్థానాన్ని మరింత దిగ్విజయంగా కొనసాగించగలగటం కేవలం ఆయుర్వేదం ప్రసాదించిన పునర్జన్మ అని అనుకోవాలి. ఇక ఆ తరువాత అనారోగ్యం అన్నది ఆయన దరిదాపులకు రాలేదు)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

కేరళ నుండి తిరిగి రాగానే కొత్త చిత్రం కోసం డిస్కషన్స్ ప్రారంభమయ్యాయి. ఒక చిత్రం విజయవిహారం చేస్తుంటే తదుపరి చిత్ర ప్రారంభానికి సన్నాహాలు జరపటం అన్నపూర్ణ సంస్థ కు ఆనవాయితీ అయింది. మాంగల్య బలం శతదినోత్సవానికి పరుగులు తీస్తుండగానే తదుపరి చిత్రం” వెలుగునీడలు” చిత్ర కథకు ఒక రూపం వచ్చింది. ఇది పూర్తిగా అన్నపూర్ణ సంస్థ వారు స్వయంగా సమకూర్చుకున్న కథ.

ఈ చిత్రాన్ని కూడా ద్విభాషా చిత్రంగానే నిర్మించాలని తీర్మానించుకున్నారు.
తెలుగులో” వెలుగునీడలు” అని నామకరణం చేసిన ఈ చిత్రానికి తమిళంలో” తూయ ఉల్లం” అని నామకరణం చేశారు.
తెలుగు తమిళ వెర్షన్స్ కు దాదాపు ముందు చిత్రాలకు పనిచేసిన సాంకేతిక వర్గాన్నే ఎంపిక చేశారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా పెండ్యాల నాగేశ్వరరావు పునః ప్రవేశం చేశారు.

డైలాగ్స్ ఆత్రేయ. ఈ చిత్రంలోనే అన్నపూర్ణ సంస్థకు ఆత్రేయ వైరాగ్యం పట్టుకుంది. ఆత్రేయ వైరాగ్యాన్ని గురించి తెలియని, అనుభవం కాని దర్శక నిర్మాతలు ఎవరూ చిత్రపరిశ్రమలో లేరేమో…
” చాలా గొప్ప కథ ఇది- డైలాగ్స్ బాగా రాయాలి.. ఇక్కడ ఉంటే మీకు ఏకాగ్రత కుదరదు..” అని ఆత్రేయను బుజ్జగించి కేరళలోని “పీచీ డ్యామ్” కు పంపించారు మధుసూదనరావు. ఆయనకు ఒక కారు, అసిస్టెంట్ డైరెక్టర్ కె వి రావు, డ్రైవరు, బాయ్ ని ఇచ్చి పీచీ డ్యామ్ గెస్ట్ హౌస్ లో కూర్చుని బాగా రాయండి అని పంపిస్తే అక్కడ దాదాపు నెల రోజులు కూర్చుని వర్క్ అంతా అయిపోయింది అని వచ్చారు ఆత్రేయ. తీరా చూస్తే కామెడీ సీన్స్ మొత్తం అలాగే వదిలేసారు. అదేమంటే ఉలకడు- పలకడు.ఆత్రేయ కామెడీ మేకింగ్ లో దిట్ట అయినా కామెడీ రైటింగ్ లో మాత్రం డల్ అన్న విషయం తనకూ తెలుసు.
మద్రాసు వచ్చిన తరువాత ఆత్రేయ చాలా బిజీ అయిపోవటంతో ఆంధ్ర నాటక కళా పరిషత్తులో చాలా బహుమతులు గెలుచుకున్న ప్రఖ్యాత నాటక రచయిత కొర్రపాటి గంగాధరరావును పిలిచి హాస్య సన్నివేశాల వరకు ఆయనతో రాయించారు.

ఈ చిత్ర కథ మెడికల్ కాలేజీ విద్యార్థులు, వారి విద్యార్థి జీవితం, వైద్య వృత్తి నేపథ్యంలో జరుగుతుంది.
ఆ మెడికల్ aspect కు సంబంధించిన సన్నివేశాలలో సూచనలు, సలహాలు ఇవ్వటానికి శ్రీమతి శ్యామలా రెడ్డి అనే డాక్టరు తన క్లినిక్ పని పూర్తిచేసుకుని 11 గంటలకు వచ్చేవారు. ఆమె ఆ సన్నివేశాల చిత్రీకరణ జరిగినన్ని రోజులు వచ్చి సిరంజి పట్టుకోవడం మొదలు అన్ని విషయాల్లోనూ సరైన సూచనలు ఇచ్చేవారు. ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది డాక్టర్లు మెడికల్ సైడ్ ఇంత పర్ఫెక్షన్ కనిపించింది మీ చిత్రంలోనే అని అభినందించారు.

అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కు గానీ, కోర్టు వ్యవహారాలకు గాని సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించ వలసి వచ్చినప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన వ్యక్తులతో సమగ్ర చర్చలు జరిపి వీలైతే వారిని షూటింగ్ వద్దకు తీసుకువచ్చి వారి సూచనల మేరకు ఆ సన్నివేశాలను చిత్రీకరించడం అన్నపూర్ణ సంస్థకే సాధ్యమైంది. ఎవరూ వేలెత్తి చూపకూడదు అన్న పట్టుదల ఉన్నవారే ఇంత చిన్న విషయాల్లో కూడా అంత శ్రద్ద వహించగలుగుతారు.

ఇంతలో ఈ చిత్ర కథకు ముఖ్యంగా క్లైమాక్స్ కు ఒక అనుకోని గ్రహణం పట్టింది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోDVS రాజు, తాతినేని ప్రకాశరావు తెలుగు, తమిళ భాషలలో” మా బాబు” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అది ఒక హిందీ చిత్ర ఆధారంగా నిర్మిస్తున్నారు. మధుసూదన రావు అభిప్రాయాల మీద గురి , గౌరవం ఉన్న ప్రకాశ రావు గారు ఆ హిందీ చిత్రాన్ని ఆయనకు చూపెట్టారు. ఆ చిత్రం చూస్తున్న మధుసూదనరావుకు ఆశ్చర్యం వేసింది. అంతకంటే కంగారు పడ్డా రాయన. ఈ హిందీ చిత్రంలోని క్లైమాక్స్ తమ వెలుగునీడలు క్లైమాక్స్ కు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇది అనుకోకుండా జరిగిన కో- ఇన్సిడెంట్.అన్నపూర్ణ దర్శక నిర్మాతలు గానీ, రచయితలు గాని ఆ హిందీ చిత్రాన్ని అస్సలు చూడలేదు.
ఎలా ఉంది అన్నారు ప్రకాశరావు గారు. బాగుంది.. మీరు తప్పకుండా ఈ చిత్రాన్ని తీయండి.. అని చెప్పి అక్కడి నుండి రాత్రి 9 గంటల సమయంలో నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు మధుసూదన రావు.
ఆ సమయంలో వచ్చిన మధుసూదన రావుని చూసి ఆశ్చర్యపోయారు నాగేశ్వరరావు.
” ఏమిటండి ఈ టైం లో వచ్చారు”- అడిగారు నాగేశ్వరరావు.

విషయమంతా చెప్పారాయన.
ఆయన కూడా ఆలోచనలో పడ్డారు.
తమ క్లైమాక్స్ తాము అనుకున్నట్లుగానే చిత్రీకరిద్దాం అంటే ” చూశారా! మధుసూదన రావు పెద్ద మనిషి కదా అని చూపిస్తే ఎంత పని చేశారో” అని అపనింద వస్తే!
ఇప్పుడు క్లైమాక్స్ విషయం నిజంగా అడకత్తెరలో పోక చెక్క అయింది.

ఏదో సినిమా చూసి తనకు తోచిన అభిప్రాయం చెబుదాము కదా అని వెళితే మెడలో తాడే పామై కరిచిన సామెతలా అయింది.

తమది కాని తప్పుకు మూల్యం చెల్లించవలసిన పరిస్థితి. ఆ మాటకొస్తే ఇందులో ఎవరి పొరపాటు లేదు. దిస్ ఈస్ ఆల్ యాక్సిడెంటల్.

ఏది ఏమైనా కథాచౌర్య అభియోగం తనపై మోపబడటం తనకు ఏమాత్రం ఇష్టం లేదు.మరుసటి రోజున ఆదుర్తి సుబ్బారావుకు విషయం అంతా వివరించి క్లైమాక్స్ మార్చాలని కోరారు.

“మీరు మాటపడితే ఒకటి నేను మాట పడితే ఒకటా? తప్పకుండా మార్చేద్దాం”- అని వెంటనే ఆ పని మీద కూర్చున్నారు. కొత్త క్లైమాక్స్ కూడా బాగా వచ్చింది.

కానీ మధుసూదనరావుకు మాత్రం ఏదో అసంతృప్తి మనసులో మెదులుతూనే ఉంది.
రెండు భాషల్లోనూ షూటింగ్ నిర్విఘ్నంగా సాగుతుంది. ఈ చిత్రంలో రేలంగికి తను చేస్తున్న పాత్ర నచ్చలేదు. పంచ కట్టు, బుర్రమీసాలు, నెత్తిన పిలకతో చాలా డీ-గ్లామరైజ్డ్ గా ఉంది తన వేషం అని తెగ బాధపడిపోయేవారాయన. అయితే తన అసంతృప్తిని నేరుగా మధుసూదనరావు వద్ద వ్యక్తం చేయలేక తమిళంలో తను పోషిస్తున్న పాత్రనే పోషిస్తున్న తంగవేలుకు బాగా ఎక్కించారు. ముందు నువ్వు వెళ్లి మాట్లాడుతూ ఉండు. తరువాత నేను కూడా వస్తాను అని తంగవేలును ముందుకు నెట్టారు రేలంగి.

” ఎన్నా సారు! ఇంద వేషం ఇనక్కు పుడికిలియే-” అని మధుసూదన్రావుతో టాపిక్ లేవనెత్తారు తంగవేలు. వారి మధ్య సంభాషణ జరుగుతుండగానే ఏమీ ఎరగనట్లు సీన్ మధ్యలో ప్రవేశించారు రేలంగి.
ఇదంతా రేలంగి వారి ప్రీ ప్లానింగ్ అని మధుసూదనరావుకు ముందుగానే తెలుసు.
” మీ సినిమాలు హిట్ అవటంలో మా పాత్రల కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉందండి.. మమ్మల్ని ఇలా డీ గ్లామరైజ్డ్ గా చూపిస్తే జనం చూడరు. ఈ చిత్రంలో నా వేషానికి జనం ఇష్టపడరు. ఈ క్యారెక్టర్ ఫ్లాప్ అవుతుంది చూడండి- అని సవాలు విసిరారు.
ఆయన వాదన విన్న మధుసూదనరావుకు నవ్వొచ్చింది.
“చూడండి రేలంగి గారు పాత్రను బట్టి వేషం ఉంటుంది. గుమస్తాకు సూటు బూటు వేయటం బాగుండదు. మీ క్యారెక్టర్ కు ఒక మంచి పాట కూడా ఉంటుంది( శివ గోవింద గోవింద). ఆ పాట గ్యారెంటీగా హిట్ అవుతుంది. కాబట్టి మీరేం భయపడనవసరం లేదు. .. అని నచ్చచెప్పటానికి ప్రయత్నించారు మధుసూదనరావు.
” ఏం కాదండి… నా వేషం ఇలాగే ఉంటే చిత్రం ఫెయిల్ అవుద్ది… కావాలంటే పందెం”.. అన్నారు రేలంగి.
” ఎంత పందెం”- అన్నారు మధుసూదనరావు నవ్వుతూ.

” వేషం మీ ఇష్టం వచ్చినట్లు వేయిస్తున్నారుగా.. పందెం ఎంతో కూడా మీరే చెప్పండి”- అన్నారు రేలంగి రోషంగా.
“సరే- ఈ సినిమా హిట్ అయితే మీకు ఇచ్చే రెమ్యూనరేషన్ మీరు వాపస్ ఇవ్వాలి. ఈ సినిమా ఫెయిల్ అయితే నేను మీకు ఇస్తున్న రెమ్యునరేషన్ కు రెట్టింపు ఇస్తాను” అన్నారు మధుసూదనరావు.

పందెం ఖాయం చేసుకున్నారు.

( సశేషం)

(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 25న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=_O4OHLVKsOg]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here