హిందీ దొంగరాముడు నిర్మాణం ఎందుకు సాధ్యపడలేదు? – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 22, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 22

(రీ క్యాప్)
(తెలుగు చిత్రాల శతదినోత్సవ వేడుకలు ఆదరించిన ప్రజల సమక్షంలోనే జరగడం ప్రారంభమైంది అన్నపూర్ణ వారి” మాంగల్య బలం”తోనే.
ఇది ఒక నూతన ఒరవడికి శ్రీకారం)

(గత ఎపిసోడ్ తరువాయి భాగం)

1955 గాంధీ జయంతి రోజు రిలీజయిన” దొంగ రాముడు” చిత్రం అత్యంత ప్రజాదరణ పొంది సూపర్ హిట్ కావటం వల్ల హిందీ నిర్మాతలు చాలామంది ఆ పిక్చర్ హిందీ రైట్స్ ఇమ్మని అడగడం జరిగింది. రైట్స్ ఎవరికో ఇవ్వడం కంటే కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో అక్కినేని హీరోగా హిందీ లో మనమే ఎందుకు నిర్మించకూడదు? అని అన్నపూర్ణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనుకున్నారు. అయితే అప్పటికే “మాంగల్య బలం” నిర్మాణం ప్రారంభం కావటంవల్ల అది పూర్తయిన తరువాత హిందీ” దొంగ రాముడు” చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మాంగల్య బలం పూర్తయి విజయవంతం కూడా కావడంతో ఎంతో ఉత్సాహంగా” దొంగ రాముడు” హిందీ వెర్షన్ ప్రారంభించాలని తీర్మానించుకున్నారు.

అన్నపూర్ణ సంస్థ లోని అందరికీ హిందీ ఫీల్డ్ కొత్త. చిత్రం బాగా తీసినా దాని డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూడాలంటే ఆ పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తుల తోడ్పాటు కావాలి. అప్పుడు అక్కినేని సలహాపై హిందీ చిత్ర నిర్మాత గానే కాకుండా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కలిగి ఉన్న ఏవీఎం అయ్యప్ప చెట్టియార్ ను తమ ప్రొడక్షన్ లో భాగస్వామిగా చేర్చుకున్నారు. అదే సమయంలో జెమిని సంస్థ అధిపతి వాసన్ గారు మధుసూధనరావుకు ఫోన్ చేశారు.

” మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి .. ఎప్పుడు రమ్మంటారు”? అని అడిగారు. ప్రముఖ చలన చిత్ర నిర్మాత గానే కాకుండా ఒక మంచి మనిషిగా వాసన్ గారంటే మధుసూదనరావుకు మొదటి నుంచి చాలా అభిమానం. ” పెద్దవారు! మీరు రావడం ఎందుకు? నేనే వస్తాను!” అని ఫోన్ లో చెప్పి ఆ సాయంత్రమే నవయుగ శ్రీనివాసరావు ను తీసుకొని వెళ్లి వాసన్ గారిని కలుసుకున్నారు.
“మీ దొంగ రాముడు చిత్రం తాలూకు హిందీ రైట్స్ నాకు కావాలి.. మీరు ఎలాంటి కండీషన్స్ పెట్టినా నాకు సమ్మతమే.. కావాలంటే మీరే పార్ట్నర్షిప్ లో సినిమా తీసి పెట్టండి. లేనిపక్షంలో మీరే సినిమా తీసి నాకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వండి. ఫైనాన్స్ సంగతి నాకు వదిలేయండి. ఏమైనా సరే ఆ సినిమా మాత్రం నాకు కావాలి”- అన్నారు జెమినీ వాసన్ . మధుసూదనరావు సందిగ్ధంలోపడ్డారు.

” దొంగ రాముడు” హిందీ చిత్ర నిర్మాణానికి సంబంధించి ఇంతకుముందే ఏవీఎం చెట్టియార్ తో సంప్రదించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండటమా? లేక వాసన్ గారితో చేతులు కలపటమా? ఏం చేయాలో తోచక మధుసూదన రావు అలా కొన్ని క్షణాలు సందిగ్ధంలో పడిపోయారు. చివరకు తాము చెట్టియార్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి వాసన్ గారితో చెప్పేశారు.
” ఎగ్రిమెంట్ అయిందా”- అని అడిగారు వాసన్ గారు.
” ఇంకా కాలేదు”.
” ఇది బిజినెస్ మిస్టర్ మధుసూదనరావు.. Agreement signచేయనంతవరకు వాళ్లకు కట్టుబడి ఉండనవసరం లేదు. అగ్రిమెంట్ చేసుకోకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి కదా అన్నారు మధుసూదన రావు. ఈ సమాధానంతో ముందు కొంచెం అప్సెట్ అయినా పరిస్థితిని అర్థం చేసుకుని మధుసూదన రావు నిజాయితీని అభినందించారు వాసన్.

కొద్దిరోజుల తర్వాత దొంగరాముడు హిందీ వెర్షన్ కు శ్రీకారం చుట్టారు. బొంబాయి నుండి హిందీ రచయిత రాజేంద్ర కిషన్ ను హైదరాబాద్ కు ఆహ్వానించి రిడ్జ్ హోటల్ లో ఆయనకు బస ఏర్పాటు చేశారు. సుమారు 20 రోజుల్లో స్క్రిప్టు రెడీ అయింది. ఇక ఆర్టిస్టులను ఎవరిని పెట్టుకోవాలి? ఏవీఎం చెట్టియార్ ను సంప్రదించి తెలుగులో సావిత్రి వేసిన వేషాన్ని మీనా కుమారికి ఇవ్వాలి అనుకున్నారు. జమున పాత్రకు నందా ను, రేలంగి పాత్రకు ఓం ప్రకాష్, సూర్యకాంతం పాత్రకు మనోరమను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

వెంటనే మద్రాసు నుండి ” దొంగ రాముడు” ప్రింట్ ను బొంబాయి ఏవీఎం ఆఫీసుకు పంపించారు. కె.వి.రెడ్డి ,మధుసూదనరావు కూడా అక్కడకు బయలుదేరి వెళ్లారు. అదివరకే నిర్ణయించుకున్న ఆర్టిస్టులను ఆహ్వానించి బొంబాయిలో దొంగరాముడు చిత్రాన్ని చూపించారు. అందరూ అద్భుతమైన చిత్రం అని మెచ్చుకున్నారు. తరువాత జమున వేసిన చెల్లెలు వేషం నేను చేస్తాను అంది మీనా కుమారి. దొంగరాముడు ప్రధానంగా అన్నా చెల్లెల్ల కథ కాబట్టి హీరోయిన్ కంటే చెల్లెలి పాత్రకే ప్రాముఖ్యత ఉన్నదని ఆ పాత్రను తను పోషించడమే సమంజసంగా ఉంటుందని ఆమె అభిప్రాయం. అప్పుడు తెలుగులో సావిత్రికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి అందులో ఆమె ధరించిన పాత్ర ఇంపార్టెన్స్ గురించి మరింత వివరంగా చెప్పి కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆ పాత్రకి రాసిన డైలాగ్స్ ను చదివి వినిపించారు రాజేంద్ర కిషన్. అప్పుడు గానీ సావిత్రి వేషం వేయడానికి మీనా కుమారి అంగీకరించలేదు. ఆర్టిస్టులు అందరిని బుక్ చేసుకున్నాక మ్యూజిక్ డైరెక్టర్ గా మదన్ మోహన్ ని తీసుకున్నారు.

మ్యూజిక్ సిట్టింగ్స్ కు తేదీ కూడా నిర్ణయించుకున్నారు. అయితే అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. తానొకటి తలిస్తే దైవం వేరే విధంగా తలుస్తుంటాడు. ఈ హిందీ చిత్ర నిర్మాణ విషయంలో కూడా అలాగే జరిగింది. అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మధుసూదనరావు ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. అంతకుముందు “మంజల్ మహిమై” చిత్రాన్ని తమిళ్ నాడు థియేటర్లలో చూసేందుకు వారం రోజుల పాటు పాండిచ్చేరి, తిరుచ్చి, కోయంబత్తూరు ప్రాంతాల్లో పర్యటించి నప్పుడే ఆయనకు కొంత అలసట కలిగింది.

ఇప్పుడు బొంబాయి నుంచి వచ్చిన తర్వాత శారీరకంగాను మానసికంగాను కూడా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. తమ ఫ్యామిలీ డాక్టర్ అరుణాచలం గారిని సంప్రదించారు. ఆయన మధుసూధనరావుకు వైద్య పరీక్షలు అన్నీ నిర్వహించారు. ” ఏ మాత్రం స్ట్రెయిన్ అవ్వటానికి వీల్లేదని – పూర్తి విశ్రాంతి అవసరం అని సలహా ఇచ్చారు డాక్టర్. హిందీ చిత్ర నిర్మాణం విషయం కనీసం 6 నెలలు వాయిదా వేయాలి- కానీ ఎలా?

అప్పటికే స్క్రిప్ట్ రాయించారు. ఆర్టిస్టులను బుక్ చేసుకున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్ కు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ” ఈ పరిస్థితుల్లో వెనక్కు వెళ్లడం కష్టం” అన్నారు మధుసూదనరావు. అప్పుడు డాక్టర్ అరుణాచలం అక్కినేనిని పక్కకు పిలిచి మధుసూదనరావు ఆరోగ్యం ఎంత క్షీణించిందో చెప్పారు. ఈ విషయం ఏవీఎం.చెట్టియార్ కు కూడా చెప్పారు అక్కినేని . “పోనీ ప్రొడక్షన్ వర్క్ మీరు, శ్రీనివాస రావు గారు (నవయుగ) చూసుకో రాదా? అని అడిగారు చెట్టియార్ . ప్రొడక్షన్ లో తమకు అనుభవం లేదని తటపటాయించారు ఇద్దరు. ఆ పరిస్థితుల్లో శ్రేయోభిలాషుల మాట కాదనలేక ముందడుగు వేయలేక దొంగరాముడు హిందీ చిత్రం తాలూకు హక్కులను చెట్టియార్ కే ఇచ్చేసారు మధుసూదనరావు.

ఆ తర్వాత ఏవీఎం వారు వేరే ఆర్టిస్టు లతో ఆ చిత్రాన్ని హిందీలో నిర్మించారు. కానీ ముందు అనుకున్నట్టుగా అన్నపూర్ణ సంస్థ కె.వి.రెడ్డి గారిని పెట్టుకుని అక్కినేని హీరోగా దాన్ని తీసి ఉంటే గొప్ప హిట్ అయి ఉండేదని , తన అనారోగ్యం కారణంగానే నాగేశ్వరరావుకు దొంగరాముడు హిందీ చిత్రంలో నటించి రాణించే అవకాశం చేజారిపోయిందనే బాధ నన్ను ఇప్పటికీ తొలుస్తూనే ఉంటుంది అంటారు మధుసూదన రావు.

అదీ కాక అక్కినేనికి హిందీ సినిమా మిస్ అవ్వటం ఇది రెండవ సారి. అంతకుముందు “సంసారం” చిత్రాన్ని జెమినీ వాసన్ గారు హిందీలో నిర్మిస్తూ అక్కినేనిని హీరోగా పెట్టుకోవాలి అనుకున్నారు. కానీ అప్పట్లో అక్కినేని చాలా బిజీగా ఉండటం గమనించి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అలా కాక అప్పుడు సంసారంలోనూ ఇప్పుడు దొంగ రాముడు లోనూ అక్కినేని చేసి ఉంటే ఉత్తరాదిన కూడా టాప్ హీరోగా పేరు తెచ్చుకునేవాడని అంటుంటారు మధుసూదనరావు.

ఇక హిందీ దొంగరాముడు ప్రయత్నాలు విరమించుకున్న తర్వాత మధుసూదనరావుకు చికిత్స ప్రారంభమైంది. ఒకవైపు ఖరీదైన వైద్యం. మరోవైపు పూర్తి విశ్రాంతి. అయినా ఫలితం కనిపించలేదు. మద్రాసులో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు అందరూ ఆయన్ని పరీక్షించారు. ఒక్కరూ వ్యాధి నిర్ధారణ సరిగా చేయలేక పోయారు. ఆయన ఆరోగ్యం మరింత దిగజారిందే తప్ప కొంచమైనా మెరుగుదల కనిపించలేదు. బరువు తగ్గిపోయారు. రక్తపోటు స్థిరంగా ఉండేది కాదు. ఆయనలో అధైర్యం చోటు చేసుకుంది.

తనకు ఏదైనా జరగరానిది జరిగితే?- క్షణం సేపు ఆయనలో ఆ ఆలోచన మెదిలి భయం ఆవరించింది.
వెంటనే పెద్దమ్మాయిల పెళ్లిళ్లు చేసి కొంతైనా తన బాధ్యతను తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.
తిరుపతిలో పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకున్నారు.

మధుసూదనరావు అనారోగ్యం కారణంగా నవయుగ డిస్ట్రిబ్యూటర్లు , తమిళనాడులో అన్నపూర్ణ పిక్చర్స్ చిత్రాలను పంపిణీ చేసే సుబ్బయ్య చెట్టియారు మొత్తం బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ఎవరికి ఎలాంటి లోటు రాకుండా తిరుపతిలో రెండు పెళ్లిళ్లు కన్నుల పండుగలా జరిగేట్టు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో హేమాహేమీలు అందరూ ఆ వివాహాలకు మద్రాసు నుంచి తరలివచ్చారు. మొత్తం మీద పెద్దమ్మాయిలిద్దరి పెళ్లిళ్లు జరిగిపోయాయి. ఒక బాధ్యత తీరింది. కొంత బరువు తగ్గింది. విశ్రాంతి కోసం డాక్టర్ల సలహా మీద మధుసూదన రావు నంది హిల్స్ కు బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో విశ్రాంతి కోసం నంది హిల్స్ కు వచ్చిన అప్పటి రిజర్వ్ బ్యాంకు అధికారి ఒకరు ఆయనకు తారసపడ్డారు. విషయమంతా తెలుసుకుని” మీకు ఆయుర్వేదం మీద నమ్మకం ఉందా”- అని అడిగారు.

” ఆరోగ్యం చేకూరటం ప్రధానంగానీ వైద్య విధానం ఏదైతేనేం? అన్నారు మధుసూదనరావు. ” అలా అయితే కేరళలో త్రిచూర్ దగ్గర”ఒల్లూర్” అనే గ్రామంలో వైద్యరత్న” నీలకంఠన్ మూస్” అనే ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడని వ్యాధి నిర్ధారణ చేయటంలోనూ చికిత్స చేయటంలోనూ ఆయనకు ఆయనే సాటి అని చెప్పారు ఆ బ్యాంకు అధికారి. ఆ మర్నాడే మధుసూదనరావు కేరళ ప్రయాణమయ్యారు.

‘ ఓల్లూరు’ లో నీలకంఠన్ మూస్ గారిని కలుసుకొని తన అనారోగ్యం గురించి వివరించారు మధుసూదన రావు. ఏడు రోజుల పాటు అక్కడ ఆయనకు అన్ని పరీక్షలు జరిగాయి. ట్రీట్మెంట్ ప్రారంభమైంది. ఆయుర్వేద ఔషధాలతో పాటు”ధార, పిడిచల్, నరక్కజి” అనే మూడు రకాలైన ప్రత్యేక చికిత్సలు జరిపారు. ఏడు వారాలు గడిచాయి. ఇంక మీకేం భయం లేదు అని భరోసా ఇచ్చారు డాక్టర్ నీలకంఠన్ మూస్. ఆ మాటతో మరింత ఉత్సాహం కలిగింది… వేయి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది. ఆదుర్తి, కె.విశ్వనాథ్ మద్రాసు నుండి ఒల్లూరు వచ్చారు.

మధుసూదన రావు బాగా ఇంప్రూవ్ అవ్వటం చూసి చాలా ఆనందించారు. ” త్వరగా మద్రాసు రండి.. హిందీ పిక్చర్ మనం ఎలాగూ వదిలేశాం కాబట్టి వెంటనే ఒక తెలుగు సినిమా ప్రారంభిద్దాం.. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది”- అన్నారు ఆదుర్తి సుబ్బారావు. తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మద్రాస్ తిరిగి వచ్చారు మధుసూదనరావు. రాగానే మరొక ఆదర్శ, అభ్యుదయ భావాల, సకుటుంబ కథా చిత్రానికి శ్రీకారం చుట్టారు అన్నపూర్ణ పిక్చర్స్ అధినేతలు.

దాదాపుగా మృత్యు ముఖాన్ని చూసి ఏ మందులకు లొంగని అనారోగ్యాన్ని అవలీలగా అధిగమించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చిన మధుసూదన రావు తన చిత్ర నిర్మాణ ప్రస్థానాన్ని మరింత దిగ్విజయంగా కొనసాగించగలగటం కేవలం ఆయుర్వేదం ప్రసాదించిన పునర్జన్మ అనే అనుకోవాలి. ఇక ఆ తరువాత ఆయన జీవితంలో అనారోగ్యం అన్నది ఆయన దరిచేరలేదు.
(సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 23న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=2zKiTSz9i4Y]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here