అన్నపూర్ణ సంస్థకు పర్మినెంట్ డైరెక్టర్ అయ్యారు ఆదుర్తి సుబ్బారావు – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 21,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 21


 


 


 


 

(రీ క్యాప్)
(తెనాలి, విజయవాడ కేంద్రాలలో “తోడి కోడళ్ళు” శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” శతదినోత్సవ వేడుకలు మద్రాసు ఉడ్ లాండ్స్ హోటల్ లో జరిగాయి.)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

 రెండు తెలుగు చిత్రాలు, ఒక తమిళ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతో అన్నపూర్ణ సంస్థ అగ్రశ్రేణి సంస్థల సరసన చోటు చేసుకుంది. ప్రేక్షక లోకంలో అన్నపూర్ణ పిక్చర్స్ చిత్రాల పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం, కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ సంస్థ నుండి వచ్చే చిత్రం కోసం ఎదురుచూడటం ప్రేక్షకుల వంతయింది. 3వ చిత్ర నిర్మాణం కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈసారి దర్శకుడి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అన్నపూర్ణ సంస్థకు ఒక పర్మినెంట్ డైరెక్టర్ దొరికాడు. ఆదుర్తి సుబ్బారావుకు మాతృ సంస్థ అయింది అన్నపూర్ణ పిక్చర్స్.

అన్నపూర్ణ సంస్థ రథసారథి అయిన దుక్కిపాటి మధుసూదనరావుకు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు మధ్య ఏర్పడిన అనుబంధం, అవగాహన సంస్థ విజయాలకు, అభివృద్ధికి,ఔన్నత్యానికి బాటలు వేసాయి. ఒక దర్శకునికి- నిర్మాతకు మధ్య ఉండవలసిన సదవగాహనకు సత్సంబంధాలకు నిర్వచనం గా నిలిచింది వీరి స్నేహం. ఇద్దరి అభిప్రాయాలలోనూ, అభిరుచుల్లోను ఉన్న సామీప్యత వీరి సాన్నిహిత్యాన్ని పటిష్టం చేసింది.దర్శకునిగా నిర్మాత సంక్షేమమే ఆదుర్తి లక్ష్యం. నిర్మాత పరంగా ఆలోచించే అతి కొద్ది మంది దర్శకులలో ఆదుర్తి ప్రథముడు అంటారు మధుసూదనరావు. నిర్మాతగా దర్శకుని విధి నిర్వహణలో ఏ మేరకు కల్పించుకోవాలో ఖచ్చితమైన పరిధులు తెలిసిన వ్యక్తి మధుసూదన రావు. అందుకే కథాచర్చల్లో తప్ప దర్శకత్వానికి సంబంధించిన సాంకేతిక, సృజనాత్మక విషయాల్లో ఆయన ఏమాత్రం జోక్యం చేసుకునేవారు కాదు. వీరికి తోడు సెల్వరాజ్ ఛాయాగ్రహణ ప్రతిభ సంస్థ విజయాలకు మరొక ముఖ్య కారణం అయింది.

సంస్థలో ఆదుర్తి సుబ్బారావు తొలి చిత్ర విజయంతో ద్వితీయ చిత్రం ప్రారంభానికి కథాన్వేషణలు ప్రారంభమయ్యాయి. బెంగాలీ భాషలో ప్రముఖ రచయిత్రి ఆశాపూర్ణాదేవి రచించిన “అగ్ని పరీక్ష” నవల ఆధారంగా ఒక చిత్రాన్ని నిర్మించారు. భావనారాయణ అనే ఒక నిర్మాత ఆ చిత్రం కాపీ ఒకటి మద్రాస్ తెచ్చారు. చాలామంది దర్శక నిర్మాతలు ఆ చిత్రాన్ని చూసి పెదవి విరిచారు. ఆ చిత్రాన్ని చూసి నచ్చింది అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి మధుసూదనరావు. అందరూ అది యాంటీ సెంటిమెంట్ సబ్జెక్ట్ అన్నారు. అన్నపూర్ణ సంస్థలో కూడా అందరికీ అదే అభిప్రాయం ఉంది. కానీ ఎవ్వరూ బయటపడలేదు.ఇంతకీ ఆ చిత్రంలో యాంటీ సెంటిమెంట్ ఉంది అని అందరూ వాదిస్తున్న పాయింట్ ఏమిటంటే- హీరోయిన్ కు చిన్నతనంలోనే పెళ్లి అయిపోతే ఆ విషయం గుర్తులేని ఆ అమ్మాయి హీరోను ప్రేమిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు… చిన్నతనంలోనే అనుకోని పరిస్థితుల్లో పెండ్లాడిన ఆమె బావే. తనను పెండ్లాడిన వాడినే ప్రేమిస్తుంది కాబట్టి ఇందులో యాంటీ సెంటిమెంట్ ఏమీ లేదు అన్నది మధుసూదనరావు అభిప్రాయం.

ఆ విషయం తెలిసే దాకా జరిగే కథ అంతా ఏంటి సెంటిమెంట్ కిందకే వస్తుంది కదా… ఇది మిగతా వారి వాదన. ఆ విషయం హీరోయిన్ కు , ఆమె తల్లిదండ్రులకు తెలియదు గాని హీరోకు ఆడియన్స్ కు తెలుసు. అందులో సస్పెన్స్ ఏమీ లేదు. చిన్నప్పుడే తెగిపోయిన బంధాన్ని హీరో మరలా ఎలా సాధించాడు ? అనే ప్రాసెస్ కు మంచి అప్లాజ్ వస్తుంది. కాబట్టి ఇది తప్పకుండా హిట్ అవుతుంది అన్నది మధుసూదనరావు విశ్లేషణ. అయితే ఈ అభిప్రాయంతో ఆదుర్తి సుబ్బారావు, నాగేశ్వరరావు, ఆత్రేయ, నవయుగ శ్రీనివాసరావు ఎవరూ ఏకీభవించకపోయినా దాన్ని ఖండించలేదు. తమ మనసులో సందేహాలను ఎవరూ బయటపెట్టలేదు. మధుసూదన రావు కు ఈ సబ్జెక్ట్ బాగుంది అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి కె.వి.రెడ్డి గారు.ఇదిలా ఉండగా కలకత్తాలో ఉన్న మిత్రుడికి ఫోన్ చేసి బెంగాలీ చిత్రం టాక్ ఎలా వచ్చింది? యాంటీ సెంటిమెంట్ అనే అభిప్రాయం ఏమైనా వ్యక్తమైందా తెలుసుకోమని పురమాయించారు మధుసూదన రావు.
అలాంటిదేమీ లేదు… సినిమా బాగా ఆడుతుంది అని రిపోర్ట్ ఇచ్చాడా మిత్రుడు. మధుసూదన రావు లోని కాన్ఫిడెన్స్ కు మరింత బలం చేకూరింది. వెంటనే ఆ చిత్రం రీమేక్ రైట్స్ కొన్నారు మధుసూదనరావు. ఈ చిత్రాన్ని కూడా ద్విభాషా చిత్రంగానే తీయాలని తీర్మానించుకున్నారు. తెలుగులో “మాంగల్యబలం” అని- తమిళంలో ” మంజల్ మహిమై ” అని కవల చిత్రాలకు నామకరణం చేశారు. ఆల్మోస్ట్ ఆల్ తొలి ద్విభాషా చిత్రానికి పనిచేసిన నటీనట సాంకేతిక బృందాన్నే ఈ చిత్రాలకు ఎంపిక చేశారు. రెండు భాషలకు చెందిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంతా కలిపి ఎయిర్ బస్ లాగా 80 మంది పని చేశారు. ఈ చిత్రంలోని కొన్ని దృశ్యాలను అవుట్డోర్లో చిత్రీకరించాలని నిర్ణయించుకుని మొత్తం యూనిట్ ఊటీ తరలి వెళ్లింది. ఇది అన్నపూర్ణవారు తొలిసారిగా ఊటీలో జరిపిన ఔట్డోర్ షూటింగ్.1958 ఏప్రిల్ 20 నుండి మే 10 వరకు ఇరవై రోజుల పాటు ఈ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. యూనిట్ మొత్తం ‘స్నో డెన్’ గెస్ట్ హౌస్ లో బసచేసింది. యూనిట్ మొత్తానికి మండు వేసవిలో ఊటీ షూటింగ్ కొత్త అనుభవంలా అనిపించింది. వారిలో చాలామందికి ఊటీ రావటం అదే ఫస్ట్ టైం. అంతకుముందు తెలుగు చిత్రాల షూటింగ్ ఊటీలో జరగలేదు.

ఐదు రోజుల పాటు షూటింగ్ నిర్విఘ్నంగా సాగింది. ఈ ఐదు రోజుల్లో “వాడిన పూలే వికసించలే ” అనే పాట, కొన్ని సీన్స్ చిత్రీకరణ జరిగింది. ఇంతలో అనుకోని అవాంతరం వరుణ దేవుని రూపంలో ఎదురైంది. ఎడతెరిపిలేని వర్షాల వల్ల షూటింగ్ మొత్తం అప్ సెట్ అయింది. ఆదుర్తి, మధుసూదనరావులకు ఏం చేయాలో తోచలేదు. పోనీ ప్రస్తుతానికి ప్యాకప్ చేసి మరలా సెప్టెంబర్లో వచ్చేలాగా ప్లాన్ చేద్దాం అనుకున్నారు. కానీ అంతకుముందు సావిత్రి చెప్పిన శుభవార్త ఈ కొత్త ప్లాన్ కు పెద్ద అవరోధం అవుతుంది. ఇంతకూ ఆమె చెప్పిన శుభవార్త ఏమిటంటే తాను తల్లి కాబోవటమే. ఈ శుభవార్త కారణంగా సెప్టెంబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా ఇక సెప్టెంబర్ లో షెడ్యూల్ ప్లాన్ చేసుకునే అవకాశమే లేకుండా పోయింది.అన్నివిధాల ఆలోచించి షూటింగ్ పేకప్ చేయటం మంచిదని నిర్ణయించుకుని తిరిగి వచ్చేశారు. ఊటీ షెడ్యూలులో ప్లాన్ చేసిన వర్క్ లో తప్పనిసరిగా అవుట్డోర్లో షూట్ చేయవలసిన సీన్స్ మాత్రం తిరుపతిలో ప్లాన్ చేసి మిగిలిన సీన్స్ చిత్రీకరణ కోసం వాహినీ స్టూడియోలో సెట్స్ వేసారు. ఒకవైపు నెలలు నిండుతున్న కారణంగా సావిత్రి పై చిత్రీకరించ వలసిన సన్నివేశాలను ముందుగా పూర్తి చేయవలసి వచ్చింది. అందుకే సావిత్రి పై అవుట్ డోర్ లో చిత్రీకరిద్దాం అనుకున్న ” తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం” అనే పాటను వాహినీ స్టూడియోలో వేసిన సెట్ లోనే చిత్రీకరించారు. ఇలాంటి చిన్న చిన్న అవరోధాలు ఎదురైనప్పటికీ మాంగల్య బలం,మంజల్ మహిమై చిత్రాల నిర్మాణం ఏక కాలంలో పూర్తయింది.ఈసారి పాండీ బజార్ కామెంట్స్ పెద్దగా వినిపించలేదు. అసలు సంస్థలోని వ్యక్తులకే ఈ చిత్రాల పట్ల సందేహాలు ఉండటం విశేషం. తమిళ వెర్షన్ కొనుగోలు నిమిత్తం మరలా ప్రత్యక్షమయ్యారు సుబ్బయ్య చెట్టియార్. ఆయన ఈసారి తనతో పాటు తన మిత్రుడు ప్రఖ్యాత పత్రికాధిపతి రామనాథ్ గోయంకాను వెంట తెచ్చారు. ఏ.వి.ఎం. ధియేటర్ లో సినిమా చూసిన తరువాత రామ్ నాధ్ గోయంకా ఒక కామెంట్ చేశారు.” పాది ప్లేట్ బిర్యాని ఎక్ చాయ్ గాళ్లందరికీ ఈ సినిమా నచ్చుతుంది”- అన్నారు.
ఉత్తరాదిలో ఏదైనా సినిమా నచ్చితే ఇంటర్వెల్లో పావు ప్లేట్ బిర్యానీ తిని , చాయ్ తాగి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ప్రేక్షకులు.” definitely this film is going to be a big hit” అని కాంప్లిమెంట్ ఇచ్చారు రామనాథ్ గోయంకా. సినిమా చూశాక నవయుగ చంద్రశేఖర రావు, గీత రచయిత కొసరాజు గార్లు మాత్రం బాగుంది- తప్పకుండా హిట్ అవుతుంది అన్నారు. మిగతా అందరికీ డౌట్ గా ఉంది.1959 జనవరి 7న “తోడి కోడళ్ళు” విడుదలయ్యాక ఖచ్చితంగా రెండేళ్లకు అదే రోజున ” మాంగల్య బలం” విడుదల అయింది. తమిళంలో “మంజల్ మహిమై” పొంగల్ కు విడుదలయ్యింది.
సుబ్బయ్య చెట్టియార్ థియేటర్లో తెలుగు ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తానని ముచ్చటపడ్డారు. మధుసూదన రావు ఆయన కలిసి విజయవాడకు ప్రయాణమయ్యారు. విజయవాడ మారుతి థియేటర్లో మ్యాట్నీ షోకు వెళ్లారు.
థియేటర్లో చిత్రం చూస్తున్నంత సేపు ఎవరైనా నవ్వుతారేమో, మంచి సీన్స్ లో ఏమైనా ప్రతిస్పందిస్తారేమోనని ఆశగా చూసారు చెట్టియార్. ఆయన ఆశ నిరాశే అయింది.
నవ్వటం నామోషీ అన్నట్లుగా బిర్ర బిగుసుకుపోయారు అందరూ..

చెట్టియార్ కు ఏమీ అర్థం కాలేదు. మారుతీ థియేటర్ ప్రొప్రైటర్ పి. బెనర్జీ గారు ” ఇది గొప్ప వాళ్ళ షో సార్… ఇప్పుడు చూసినవారంతా డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబిషన్ సెక్టర్ వాళ్ళు. సినిమా చూసేటప్పుడు నవ్వ కూడదని , ముఖ్యంగా అన్నపూర్ణ పిక్చర్స్ సినిమా అయితే అసలు నవ్వ కూడదని నిర్ణయించుకున్నారనుకుంటా “- అసలు రహస్యం చెప్పారాయన.


9 గంటల షో కు వస్తే అసలు ఆడియన్స్ రెస్పాన్స్ తెలుస్తుందని చెప్పారు బెనర్జీ. మరలా 9 గంటల షో కు వెళ్లారు చెట్టియార్.

ఇది అసలైన జడ్జెస్ చూసే షో. నచ్చిన దాన్ని దోచుకోవటం.. నచ్చనిదాన్ని మెచ్చుకోవడం వంటి హిపోక్రసీకి తావు లేని పబ్లిక్ షో ఇది. సినిమా స్టార్ట్ అయింది. అడుగడుగునా ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన చూసి దిగ్భ్రాంతి చెందారు చెట్టియార్. ఆయన ఆశ్చర్యానికి కారణం జనం నవ్వటం కాదు… వ్యాపార వర్గాల వారు ఏడవటం.” ఇదెక్కడి న్యాయమండీ” అన్నారు చెట్టియార్.

విజయాలనేవి అభిమానులనే కాదు.. విరోధులను కూడా సంపాదించి పెడతాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమిటి?
మరలా మద్రాసులో పొంగల్ రోజున ప్రభాస్ టాకిస్ లో పబ్లిక్ షో చూశారు చెట్టియార్.
కళకు భాషా భేదమే గానీ భావ బేధాలు ఉండవని మరోసారి నిరూపితమైంది.
తెలుగులో “మాంగల్య బలం”
తమిళంలో”మంజల్ మహిమై”
రెండూ హిట్ అయ్యాయి. రెండూ శతదినోత్సవ చిత్రాలు అయ్యాయి. మారుతి ధియేటర్ యజమాని పి. బెనర్జీ సహకారంతో “మాంగల్య బలం” శత దినోత్సవ వేడుకలను విజయవాడ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించింది అన్నపూర్ణ సంస్థ.
అప్పటి రాష్ట్ర మంత్రివర్యులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అధ్యక్షత వహించారు.

తెలుగు చిత్రాల శతదినోత్సవ వేడుకలు ఆదరించిన ప్రజల సమక్షంలోనే జరగడం ప్రారంభమైంది అన్నపూర్ణ వారి” మాంగల్య బలం” తోనే-
ఇది ఒక నూతన ఒరవడికి శ్రీకారం.

( సశేషం)

( “మాంగల్య బలం” చిత్రం నుండి సూపర్ హిట్ అయిన 3 పాటలు మీకోసం ….)

(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 21న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=tIriJwdWxNA]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here