ఆ పుకార్లతో తమిళ వెర్షన్ తీసి తొందరపడ్డామేమోననే భావన కలిగింది మధుసూదనరావుకు – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 20,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 20

(రీ క్యాప్)
( తెలుగులో” తోడికోడళ్ళు” అని నామకరణం చేసిన ఈ చిత్రానికి తమిళంలో “ఎంగల్ వీట్టు మహలక్ష్మి” పేరు పెట్టారు.
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)తొలి చిత్రం దొంగరాముడు లో జమున పాత్రకు ప్లేబ్యాక్ పాడిన పి. సుశీలతో ఈ చిత్రంలో తొలిసారిగా హీరోయిన్ సావిత్రికి పాటలు పాడించారు దర్శక నిర్మాతలు. ఈ అవకాశం ఆమెకు ఒక గొప్ప మలుపుగా పరిణమించింది. మొదట్లో గొంతు చాలా పీలగా నూతిలో నుంచి పాడినట్లుగా ఉంటుందని ఆమెను తిరస్కరించిన ప్రముఖులందరూ సుశీల గాన మాధుర్యానికి ముగ్ధులయ్యారు. ఒక్క సుశీల మాత్రమే కాదు. చిత్ర పరిశ్రమలో పనికిరారని తిరస్కరించబడిన వారందరో చరిత్రలు సృష్టించారు. గాయకుడిగా ఘంటసాల, నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు, నటీమణిగా సావిత్రి – ఇలా ఎందరో ప్రముఖులకు ప్రారంభంలో ఎదురయింది పరాభవాలే. ఆ పరాభవాలే ఆశీస్సులై వారిని ఉత్తేజితులను చేశాయి.. ఉన్నత శిఖరాలకు చేర్చాయి.

 ఇక ఈ తోడికోడళ్ళు చిత్రానికి సంబంధించిన గమ్మత్తయిన విషయం ఒకటుంది. ఈ చిత్ర కథలో ఒక ఆవుకు కూడా ముఖ్యమైన పాత్ర కల్పించారు. అయితే చివరి క్షణంలో ఆవు వేషాన్ని కుక్క కొట్టేసింది.

అదెలాగంటే – జయరామ్ నాయుడు అనే ఒక అభిమాని మదనపల్లి నుంచి నాగేశ్వరరావుకు “నా దగ్గర ఒక
అల్సేషియన్ పెంపుడు కుక్క ఉంది. అది ఏం చెప్తే అది చేస్తుంది. మీ సినిమాల్లోకి అవసరమైతే తెలియజేయండి” – అని లెటర్ రాసి దానితో పాటు కుక్క ఫోటోలు పంపించాడు. ఆ ఫోటోలు చూసిన వెంటనే నిర్మాత మధుసూదనరావు దర్శకుడు ఆదుర్తి, కళా దర్శకుడు ఎస్ కృష్ణారావులను కారులో మదనపల్లి పంపించారు. తన కుక్కను గురించి అభిమాని రాసిన దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఏం చెబితే అది.. ఎలా చేయమంటే అలా క్షణాల్లో చేసేది ఆ కుక్క. తక్షణమే దాన్ని , దాని యజమానిని తీసుకొని మద్రాసు వచ్చారు ఆదుర్తి సుబ్బారావు. ఆ విధంగా ఆవు స్థానంలో కుక్క ప్రవేశించింది.
ఆ కుక్కను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్ లో తగు మార్పులు చేసుకుని చిత్రంలో ఆ కుక్కకు మంచి ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి ఆ చిత్రంలో కుక్క చేసిన విన్యాసాలకు విపరీతమైన స్పందన లభించింది.షూటింగ్ కార్యక్రమాలు సజావుగా సాగిపోతున్నాయి.” ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది”- అన్న పాట కోసం సావిత్రి గూడ తో నీళ్లు తోడటం ఎంతో సహజంగా వచ్చేటట్లు సాధన చేసింది. పొలం పనుల్లో నాగేశ్వరరావుకు చిన్నప్పటినుండి అనుభవం ఉంది గనుక ఇబ్బంది లేకపోయింది.

తెలుగు తమిళ రెండు భాషల్లోనూ చిత్ర నిర్మాణం ఏకకాలంలో దిగ్విజయంగా ముగిసింది.
రెండు వెర్షన్స్ ఫస్ట్ కాపీలు వచ్చాయి.

తొలిసారిగా తమిళ చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన అన్నపూర్ణ సంస్థకు అక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలోని లోతుపాతులు తెలియవు.తమిళ వెర్షన్ మేము కొనుగోలు చేస్తాము అని హామీ ఇచ్చారు నాగిరెడ్డి గారు. దీనికి ఒక కారణం ఉంది. వాహినీ సంస్థ అధిపతులలో ఒకరైన చక్రపాణి గారు శరత్ సాహిత్యం మొత్తాన్ని తెలుగులోకి అనువదించారు. అయితే ” నిష్కృతి” షార్ట్ స్టోరీని అన్నపూర్ణ వారు చిత్రకథ గా ఎలా మలిచారు ? ఆ కథలో అంత స్కోప్ లేదే? ఈ అడాప్షన్ ఎలా జరిగింది? తెలుసుకోవాలనే సహజ ఆసక్తితో మధుసూదనరావును అడిగి తోడికోడళ్ళు స్క్రిప్ట్ తీసుకున్నారు. అది చదివిన చక్రపాణిగారు మధుసూధన్ రావును ఎంతగానో అభినందించారు. దానికి తోడు ఆయన ప్రతి రోజు షూటింగ్ దగ్గరకు వచ్చి కూర్చునేవారు. అంత చిన్న కథ ఒక చక్కని కుటుంబకథా చిత్రంగా మలచబడుతున్న తీరును ప్రత్యక్షంగా చూసి ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. ఆ నమ్మకంతోనే తమిళ వెర్షన్ రైట్స్ తీసుకోమని ఆయనే విజయ వాహినీ స్టూడియో అధిపతి నాగిరెడ్డి గారికి సలహా ఇచ్చారు.ఎదురుచూడని ఈ ఆఫర్ తో పెద్ద భారం తీరినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు మధుసూదనరావు. తీరా విడుదల దగ్గర పడుతున్న తరుణంలో కొన్ని అనుకోని అవాంతరాలు, ఇబ్బందులు వచ్చాయి అంటూ నాగిరెడ్డి గారు”ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” ని వద్దన్నారు.

ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దానికి తోడు కొత్తరకం పుకార్లు కొన్ని వ్యాపించాయి. అసలు సినిమా ఏమీ బాగా లేదట. అందుకే నాగిరెడ్డి గారు విరమించుకున్నారట. ఈ పుకార్ల దెబ్బతో కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాలేదు. అసలు తమిళ వెర్షన్ విడుదల చేయగలమా అనే సందేహం పట్టుకుంది. తమిళంలో తీసి తొందరపడ్డామేమో… ఒక్క క్షణం మధుసూదనరావు మదిలో మెదిలింది ఆ భావన.

but God is Great…!

ఒకప్పుడు ఏ.వీ.ఎం. చెట్టియార్ తో పార్ట్నర్ గా ఉండి తరువాత చిత్ర నిర్మాణ రంగం నుండి వైదొలిగిన ఏ. సుబ్రహ్మనియన్ (సుబ్బయ్య చెట్టియార్) చిత్రాన్ని చూస్తానన్నారు. వెంటనే ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు. చిత్రాన్ని చూసి వాదోపవాదాలకు, బేరసారాలకు తావులేకుండా మధుసూదన రావు చెప్పిన రేటుకు’ అవుట్ రేట్’ గా “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” ని సొంతం చేసుకున్నారు సుబ్బయ్య చెట్టియార్. ఈ విధంగా అన్నపూర్ణ సంస్థ తీసిన తమిళ చిత్రాలకు రెగ్యులర్ కస్టమర్ అయ్యారు సుబ్బయ్య చెట్టియార్.1957 జనవరి 7వ తేదీన” తోడి కోడళ్ళు”, జనవరి 14న పొంగల్ కు” ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” విడుదల అయ్యాయి.

తెలుగులో తోడికోడళ్ళు నూరు రోజులు ఆడగా తమిళ ఎంగల్ వీట్టు మహలక్ష్మి ఊహించని రీతిలో రజతోత్సవ సంరంభాన్ని చవిచూసింది. ఈ విధంగా తెలుగు, తమిళ రంగాలలో ఒకేసారి విజయపతాకాన్ని ఎగురవేసింది అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. ఇలా రెండవ ప్రయత్నంలోనే హ్యాట్రిక్ సాధించిన ఘనత సంస్థ కు దక్కింది. అదెలాగంటే – తమిళంలోకి ” తిరుట్టు రామన్” పేరుతో డబ్ చేసిన “దొంగ రాముడు” అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్టయ్యింది. దానితో రెండు ప్రయత్నాలలో మూడు విజయాలు చేకూరినట్లయింది.

కె.వి.రెడ్డి గారి తరువాత ఆదుర్తి సుబ్బారావును బుక్ చేసినందుకు ” what a fall అని ఎగతాళి చేసిన వారంతా what a raise అని ఆశ్చర్యపోయారు.

తెనాలి, విజయవాడ కేంద్రాల్లో కె.వి.రెడ్డి గారు ముఖ్య అతిథిగా” తోడి కోడళ్ళు” శతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కె.వి.రెడ్డి గారి చేతుల మీదగా దర్శకుడు, నటీనటులు, టెక్నీషియన్స్ బహుమతులు అందుకున్నారు.

” ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” శతదినోత్సవ వేడుకలు మద్రాస్ వుడ్ ల్యాండ్స్ హోటల్ లో అప్పటి మద్రాస్ మేయర్ రామనాథన్ చెట్టియార్ ముఖ్యఅతిథిగా, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కే. సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా జయప్రదంగా జరిగాయి. మద్రాసు చిత్ర ప్రముఖులందరూ వచ్చి దర్శక నిర్మాతలను అభినందించారు.

(సశేషం)

(తోడికోడళ్ళు చిత్రంలోని పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందినవే… వాటిలో విశేష ప్రాచుర్యం పొందిన రెండు పాటలు మీకోసం.)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 19న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=MDh02NC-ObQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here