What a fall? అన్నపూర్ణ సంస్థ రెండవ చిత్రానికే ఇంత దిగజారి పోవడమా? – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 19, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 19

“దొంగ రాముడు” చిత్రం నుండి కొన్ని హిట్ సాంగ్స్:

అన్నపూర్ణ వారి చిత్రాలు కథాపరంగా, సన్నివేశపరంగా, సంభాషణల పరంగా ఎంత జనరంజకంగా ఉంటాయో సంగీతపరంగా కూడా అంతటి ప్రజాదరణ పొందాయి. అందుకే ఆయా చిత్రాలలోని కొన్ని హిట్ సాంగ్స్ ను పుస్తకంలో ప్రచురించటం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా దొంగరాముడు చిత్రంలోని నాలుగు పాటలను మీ ముందు ఆవిష్కరిస్తున్నాం.


 


 


 


 

( స్వర్ణ యుగంలో అన్నపూర్ణ సీరియల్ కొనసాగింపు)

(రీ క్యాప్)
( 1955 అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున “దొంగరాముడు” విడుదలయింది. కొందరి విజయం కొందరికి కడుపు మంటను… గుండెకోతను కలిగిస్తుంది.

ఎందుకో..?

అఖిలాంధ్ర ప్రేక్షక జన హృదయాలను
దోచుకున్నాడు “దొంగరాముడు”.

అందుకేనేమో..!?

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

తొలి చిత్రం హిట్ అయింది.
“దొంగ రాముడు” విజయ విహారం చేస్తుండగానే ద్వితీయ చిత్ర ప్రారంభానికి సన్నాహాలు ప్రారంభించింది అన్నపూర్ణ సంస్థ.

మరలా కె.వి.రెడ్డి గారిని అడిగారు.

ఆయనకు ఏం చెప్పాలో… ఎలా చెప్పాలో అర్థం కాలేదు. “మీకు ‘నో’ అని చెప్పలేనంత గొప్పగా నన్ను గౌరవించారు. కానీ ఇక్కడ పరిస్థితి మారింది. నాకు మరలా వాహినీ సంస్థ నుండి పిలుపు వచ్చింది. కాదంటే ఇదివరకు ఉన్న అభిప్రాయ బేధాలు మరింత ఎక్కువవుతాయి. కాబట్టి వెళ్లక తప్పదు. ఈ సారికి మీరు దర్శకుడిగా వేరే ఎవరినైనా పెట్టుకోండి.
మీ సంస్థకు నా అండదండలు ఎప్పుడూ ఉంటాయి. మీ స్టోరీ డిస్కషన్స్ కు వస్తాను. నాకు తోచిన సలహాలు ఇస్తాను” – చెప్పలేక చెప్పారు కె.వి.రెడ్డి గారు.

అసలు అన్నపూర్ణ సంస్థకు తొలి హిట్ అందించడానికే కేవీ రెడ్డి గారికి వాహినీ తో వియోగం సంప్రాప్తించినదేమో? అనిపిస్తుంది. అందుకే
“కె.వి.రెడ్డి గారు ఫస్ట్ పిక్చర్ చేయకపోతే మేము, మా సంస్థ ఎక్కడ ఉండేవారమో” – అంటుంటారు మధుసూదనరావు.

మరొక దర్శకుడి కోసం అన్వేషణ ప్రారంభమైంది.

అప్పుడు ఆదుర్తి సుబ్బారావు అనే కొత్త దర్శకుడు తొలి చిత్రంగా “అమర సందేశం” అనే చిత్రానికి దర్శకత్వం వహించి ఉన్నారు. ఆ చిత్రంలో నాగేశ్వరరావును నటించమని అడిగారు ఆ చిత్ర నిర్మాతలు. అప్పట్లో అది సాధ్యపడలేదు. తరువాత తదుపరి చిత్రానికైనా అంగీకరిస్తాడనే ఆశతో ” అమర సందేశం” చిత్రాన్ని నాగేశ్వరరావుకు చూపించాలనుకున్నారు.మధుసూదన రావు, నాగేశ్వరరావు ఇద్దరూ ఆ చిత్రాన్ని చూశారు. అది ఆశించినంత బాగా లేకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి. కానీ దర్శకుడిలో మాత్రం మంచి ప్రతిభ వుంది… మంచి అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోగల నేర్పు ఉంది అనిపించింది.


 

దొంగరాముడు విజయవంతమైన తరువాత ఆ స్థాయిలో రెండవ చిత్రం కూడా ఉండాలి అన్నది అన్నపూర్ణ డైరెక్టర్ల ఆకాంక్ష. దర్శకుడి విషయమే ఎటూ తేలలేదు. ఈ తర్జనభర్జనలు ఇలా కొనసాగుతుండగానే వేరే షూటింగ్ నిమిత్తం నాగేశ్వరరావు కాశ్మీర్ వెళ్లారు. దర్శకుడిని బుక్ చేసే విషయం పెండింగ్ ఫైల్ లాగా అలా ఉండి పోయింది. నవయుగ శ్రీనివాసరావు గారిని అడిగితే ఆయన వేరే దర్శకుడి పేరు చెబుతున్నారు. అది మధుసూదనరావుకు ఇష్టం లేదు. ఏం చేయాలి?

కె.వి.రెడ్డి గారి సలహా తీసుకుంటే?

వెంటనే కె.వి.రెడ్డి గారిని కలిసి సలహా అడిగారు. తమ దృష్టిలో ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పారు. కె.వి.రెడ్డి గారు కొంచెం సేపు ఆలోచించి” ఆదుర్తి సుబ్బారావు గతంలో నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తానని వచ్చాడు. కానీ నా దగ్గర ఖాళీ లేక అవకాశం ఇవ్వలేదు. అతనికి మీరు అవకాశం ఇచ్చారు అంటే కె.వి.రెడ్డి గారి తరువాత నాకు ఛాన్స్ ఇచ్చారు అనే కృతజ్ఞతతో, భయభక్తులతో పనిచేస్తాడు. ఒక హిట్ చిత్రం తర్వాత తీస్తున్న చిత్రం కాబట్టి బాధ్యతాయుతంగా కృషి చేస్తాడు. అదీకాకుండా అతను ఎడిటర్ కూడా కావటంతో ఫిలింను పొదుపుగా ఎలా వాడాలో, ప్రొడక్షన్ కాస్ట్ ఎలా తగ్గించాలో అవగాహన ఉంటుంది. తప్పకుండా అతన్నే దర్శకుడుగా పెట్టుకోండి”.



ఇదీ కె.వి.రెడ్డి గారు విశ్లేషించి ఇచ్చిన సలహా.

కె.వి.రెడ్డి గారి సలహా పై తీవ్రంగా ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చి ఆదుర్తి సుబ్బారావును పిలిపించారు మధుసూదనరావు. తమ రెండవ చిత్రానికి దర్శకత్వ బాధ్యత ఇస్తానని మాట ఇచ్చారు. ఆదుర్తి ఆనందానికి అవధులు లేవు. మధుసూదనరావుకు ధన్యవాదాలు చెప్పారు. రాతకోతలు తప్ప ఓరల్ అగ్రిమెంట్ పూర్తయినట్లే. ఒక విధంగా ఇది ఏకపక్ష నిర్ణయం. ఈ విషయాన్ని విపులీకరించి కాశ్మీర్ లో ఉన్న నాగేశ్వరరావుకు ఉత్తరం రాశారు మధుసూదనరావు.
” నేను ప్రకాష్ స్టూడియో వారి” కన్నతల్లి” చిత్రానికి పని చేసినప్పుడు ఆదుర్తి సుబ్బారావు అసిస్టెంట్ గా పని చేశారు. అప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. మంచి అభిరుచి కలవాడు… ఎడిటర్ కూడా. మీరు చాలా మంచి పని చేశారు”- అని అభినందిస్తూ కాశ్మీర్ నుండి ప్రత్యుత్తరం వచ్చింది.

తన నిర్ణయానికి మద్దతు లభించడంతో మధుసూదనరావుకు కొండంత బలం వచ్చింది.


 

ఆదుర్తి సుబ్బారావుతో కథా విషయమై చర్చలు ప్రారంభించారు.

మధుసూదనరావు శరత్ సాహిత్యం మొత్తం క్షుణ్ణంగా చదివి ఉన్నారు. వాటిలో” నిష్కృతి” అనే బెంగాలీ నవల తనకు బాగా నచ్చింది. ఆదుర్తి సుబ్బారావుకు చదవమని ఇచ్చారు. ఆయన కూడా బాగుందన్నారు.ఇక కె.వి.రెడ్డి గారి అభిప్రాయం తెలుసుకోవాలి. ఆయనకు నిష్కృతి బుక్ ఇచ్చారు. ఆయన చదివిన తరువాత తాము దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నది వివరించారు మధుసూదన రావు.ఆయన చాలా బాగుంది ప్రొసీడ్ అంటూనే ఒక చక్కని సలహా ఇచ్చారు.

” ఈ కథలో కామెడీ తక్కువగా ఉంది. కథాంశం ప్రకారం సూర్యకాంతం ముగ్గురు తోడికోడళ్లలో ఒకరు. ఆ పాత్రకు సలహాలు ఇస్తూ వత్తాసు పలికే వాడు ఒకడు ఉంటే బాగుంటుంది. అలాంటి హాస్య పాత్రకు రూపకల్పన చేయమని సలహా ఇచ్చారు కె.వి.రెడ్డి గారు. ఆ సూచన ప్రకారం చిత్రంలో చోటు చేసుకున్నదే జగ్గయ్య పాత్ర .


 

కథ పై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంతలో ఆదుర్తి సుబ్బారావుకు ఒక ఆలోచన వచ్చింది.
ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తే? తన ఆలోచనను మధుసూదనరావు ముందు ఉంచారాయన.

నాగేశ్వరరావు అప్పటికే ఏడెనిమిది తమిళ చిత్రాలలో నటించి ఉన్నారు. తమిళంలో ఘన విజయాన్ని సాధించిన “దేవదాసు” వల్ల ఆయన పేరు తమిళనాడులో మారుమోగిపోతుంది. అంతేకాకుండా తెలుగులో అద్భుత విజయాన్ని సాధించిన దొంగరాముడు చిత్రాన్ని తమిళంలోకి” తిరుట్టు రామన్” పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయగా అది కూడా నూరు రోజులు ఆడింది. దాదాపు తెలుగుతో సమానమైన స్టార్ వాల్యూ తమిళంలో కూడా సంపాదించారు నాగేశ్వరరావు. ఇక మిగిలిన పాత్రలు పోషిస్తున్న వారిలో సావిత్రి, కన్నాంబ, ఎస్ వి రంగారావులకు కూడా తమిళంలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. వీరి పాత్రలు పోనూ మిగిలిన పాత్రలకు తమిళ ఆర్టిస్టులను బుక్ చేసి ఏకకాలంలో షూటింగ్ జరిపితే ఖర్చులు కూడా చాలా కలిసి వస్తాయి.



తెలుగు ,తమిళం రెండింటిలోనూ నటించే ఆర్టిస్టులకు ఒకటిన్నర పారితోషికం ఇవ్వాలి. అంటే తెలుగులో 50 వేలు ఇస్తే రెండింటికీ చేసినందుకు 75 వేలు ఇవ్వాలి.

ఈ అంచనాలు, బడ్జెట్ వివరణలతో ఆదుర్తి సుబ్బారావు మధుసూదన రావునూ, వారి కంపెనీ డైరెక్టర్స్ ను ఒప్పించగలిగారు. ఈ ద్విభాషా చిత్ర నిర్మాణ యోచన బాగుంది అని ప్రోత్సహించారు కె.వి.రెడ్డి గారు.

మద్రాసు సినీ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది ఈ వార్త.

what a fall..? కె.వి.రెడ్డి వంటి దర్శకుడు తొలి చిత్రాన్ని అందించిన సంస్థ రెండవ చిత్రానికి ఇంత దిగజారి పోవడమా? what a fall ..?

ఎవరో ముక్కూ ముఖం తెలియని కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వటమే కాకుండా ఒకేసారి రెండు భాషల్లో నిర్మాణమా?

అదీ ఒక బెంగాలీ షార్ట్ నవల ఆధారంగా…?

‘ ఇది దుందుడుకు నిర్ణయం’- అన్నారు కొందరు.
‘ఈ దెబ్బతో వీళ్ళకు తెలిసోస్తుందిలే’ – అన్నారు మరి కొందరు.

-అన్నపూర్ణ వారి తదుపరి చిత్రం
“తోడి కోడళ్ళు” …
-తెలుగు తమిళంలో త్వరలో ప్రారంభం –
అని “దొంగ రాముడు” నూరవ రోజున అన్ని పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు వెలువడ్డాయి.

తొలి చిత్ర విజయోత్సాహంతో ద్వితీయ చిత్ర ప్రారంభ సన్నాహాలు వేగం పుంజుకున్నాయి.

” తోడి కోడళ్ళు” చిత్రానికి తెలుగులో ఆత్రేయ డైలాగులు రాస్తున్నారు. తమిళంలో ఎవరితో రాయించాలన్నది ప్రశ్న. అప్పట్లో తమిళంలో అన్నాదురై, కరుణానిధి సంభాషణల రచనకు పెట్టింది పేరు.
” కరుణానిధి డైలాగులు రాయాలి- శివాజీ గణేషన్ చెప్పాలి”- అన్నది అప్పట్లో పెద్ద పాపులర్ స్లోగన్.

అయితే ఇక్కడ సమస్య వేరు. తెలుగు తెలిసిన తమిళ రచయిత కావాలి. స్నేహితులు కొందరు శ్రీధర్ పేరు చెప్పారు. శ్రీధర్ తెలుగువారు… నెల్లూరుకు చెందిన వారు. ఆయన పూర్వీకులందరూ మద్రాస్ లో స్థిరపడి ఉండటంతో తెలుగు మాట్లాడటమే తప్ప రాయటం రాదు. తమిళంలో మూడు నాలుగు చక్కని నాటకాలు కూడా రాసారు శ్రీధర్. కాబట్టి తొలిసారిగా సినిమా డైలాగులు రాసే అవకాశాన్ని శ్రీధర్ కు కల్పించింది అన్నపూర్ణ సంస్థ. ఆయన తెలుగు డైలాగులను తమిళంలో రాసుకొని వాటికి తమిళ నేటివిటీని జోడించారు.
తెలుగులో ఆత్రేయ లాగానే తమిళంలో కూడా చాలా క్లుప్తంగా, అర్థవంతంగా, సందర్భోచితంగా డైలాగ్స్ రాశారు శ్రీధర్.

తరువాత సమస్య పాటల రచన.
తెలుగులో ఆత్రేయ, శ్రీ శ్రీ, కొసరాజు, తాపీ ధర్మారావు గార్లు పాటలు రాశారు.
మరి తమిళంలో ఎవరు?

అప్పటికే తమిళంలో సుప్రసిద్ధుడైన ఉడుమలై నారాయణ కవి పేరు సూచించారు శ్రీధర్. ఆయనతో పాటు తమిళ వెర్షన్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన కేఎస్ గోపాలకృష్ణన్ రెండు పాటలు రాశారు.( ఆ తరువాత ఆయన తమిళంలో గొప్ప దర్శకుడు గా అనేక విజయవంతమైన చిత్రాలు తీసి పేరు గడించారు)
తెలుగు వెర్షన్ కు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా వి.మధుసూదనరావు పని చేశారు.

సంగీత దర్శకుడిగా వేణు మాస్టర్( హీరో భానుచందర్ తండ్రి గారు) నియమితులయ్యారు.

ఈ విధంగా రెండు భాషలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, పాటలు సిద్ధం చేసుకున్నారు. కె.వి.రెడ్డి గారు రెండుసార్లు అన్నపూర్ణ ఆఫీసుకు వచ్చి తెలుగు స్క్రిప్ట్ అంతా విని కొన్ని చోట్ల చిన్న చిన్న మార్పులు సూచించారు. కె.వి.రెడ్డి గారి సూచనలు సమంజసమైనవే అని అంగీకరించి అమలు చేశారు ఆదుర్తి సుబ్బారావు.

కె.వి.రెడ్డి గారు ఆదుర్తి సుబ్బారావుకు మరో సలహా కూడా ఇచ్చారు.
” ఈ సినిమాకు సమర్ధుడైన కెమెరామెన్ అవసరం. న్యూటోన్ స్టూడియోలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ
“జితేన్ బెనర్జీ” దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న “సెల్వరాజ్” చాలా చురుకైన వాడు, తెలివైనవాడు… అతన్ని ఈ చిత్రానికి కెమెరామెన్ గా పెట్టుకోండి”- అని సలహా ఇచ్చారు కె.వి.రెడ్డి గారు. వెంటనే సెల్వరాజ్ ను పర్మినెంట్ బేసిస్ మీద ఎక్స్ క్లూసివ్ గా బుక్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్నపూర్ణ సంస్థలో ప్రవేశించిన సెల్వరాజ్ ఆ సంస్థలో ప్రముఖ టెక్నీషియన్ అయి వరుసగా 16 చిత్రాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా పని చేశారు. నాగేశ్వరరావు ముఖాన్ని సెల్వరాజ్ మౌల్డ్ చేసినంత గొప్పగా మరే ఛాయాగ్రహకుడు చేయలేదని ప్రతీతి.

తెలుగులో” తోడి కోడళ్ళు” అని నామకరణం చేసిన ఈ చిత్రానికి తమిళంలో ” ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” అని పేరు పెట్టారు.
(సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 17న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=750rHEFMc9M]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here