అన్నపూర్ణ సంస్థ అంటే క్రమశిక్షణకు మారుపేరు – డాక్టర్ డి. రామానాయుడు: స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 18, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 18

( ఈవారం స్వర్ణ యుగంలో అన్నపూర్ణ
ధారావాహిక తరువాయి భాగానికి ముందు ఈ నవలకు సుప్రసిద్ధ నిర్మాత మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు రాసిన ముందుమాటను యథాతథంగా అందిస్తున్నాను)

అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి చరిత్ర పుస్తక రూపంలో వెలువడుతుందని తెలిసి చాలా సంతోషించాను. తెలుగు చిత్ర పరిశ్రమకు స్వర్ణయుగ కాలంగా భావించబడుతున్న కాలంలో ప్రారంభమైన అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ ఆనాటి విలువలను, ప్రమాణాలను పదిల పరిచి పదింతలు చేసింది అనటంలో సందేహం లేదు. అన్నపూర్ణ సంస్థతోనూ ఆ సంస్థ అధినేతలైన శ్రీ దుక్కిపాటి మధుసూదనరావు గారితోనూ, శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారితోనూ, ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తోనూ నాకు గల అనుబంధాన్ని గురించి ఏమి చెప్పినా అది పునరావృతమే అవుతుంది. నా ఆత్మీయుల గురించి ఎంత చెప్పినా నన్ను గురించి నేను చెప్పుకోవటమే అవుతుంది. అయినా చరిత్ర సృష్టించిన నిజాలను, జగమెరిగిన వాస్తవాలను చెప్పటానికి సందేహం ఎందుకు? అందుకే ఈ పుస్తకానికి ముందుమాట వ్రాయవలసిందిగా పుస్తక రచయిత, ప్రముఖ జర్నలిస్టు చిరంజీవి ప్రభు అడిగిన వెంటనే ఆనందంగా అంగీకరించాను.

అన్నపూర్ణ సంస్థ అంటే క్రమశిక్షణకు మారుపేరు. ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాల నెలవుగా కొలువుతీరిన సంస్థ అన్నపూర్ణ. స్వభావరీత్యా చిత్ర నిర్మాణం అనేది ఒక ” అన్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ” అనే భావన చాలా మందిలో ఉంది. కానీ క్రమశిక్షణ, ముందుచూపు, నిరంతర కృషి ఉంటే చిత్ర నిర్మాణమంతటి చక్కని వ్యాపారం మరొకటి లేదని సంస్థ నిరూపించింది. అలాగని కేవలం వ్యాపార ధోరణితో ధనార్జనే లక్ష్యంగా వారి చిత్రాలు రూపొందలేదు. సృజనాత్మక, కళాత్మక విలువలను వ్యాపార దృష్టితో చక్కగా మేళవించి ఉభయ తారక మైన ఫలితాలను సాధించారు అన్నపూర్ణ వారు.
నేను మా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి మా తొలి చిత్రం” రాముడు- భీముడు” నిర్మించే సమయానికే అన్నపూర్ణ వారు విజయ విహారం చేస్తున్నారు. అప్పటికే పేరెన్నికగన్న గొప్ప సంస్థల సరసన తన పేరును చేర్చుకుని “బ్యానర్ వేల్యూ” అనే పదానికి చక్కని నిర్వచనంగా నిలిచింది అన్నపూర్ణ సంస్థ.

అన్నపూర్ణ సంస్థలో పని చేయడాన్ని ఒక అదృష్టంగానూ , గొప్ప అవకాశం గానూ నటీనట సాంకేతిక వర్గం చెప్పుకోవడం నాకు తెలుసు. ఒక చిత్ర నిర్మాణ సంస్థకు ఇలాంటి ఇమేజ్ ఏర్పడటం సామాన్య విషయం కాదు. కేవలం ఆర్థిక విషయాలు సాధించినంత మాత్రాన ఇలాంటి ఇమేజ్ సిద్ధించదు. సంస్థ ఇమేజ్ పెరగడానికి దోహదపడే సత్ లక్షణాలు అన్నింటిని తనలో ఇముడ్చుకున్న ఆదర్శప్రాయమైన సంస్థ అన్నపూర్ణ.అన్నపూర్ణ సంస్థ వారి చిత్ర నిర్మాణ ధోరణి, వారి పద్ధతులు, వారు నెలకొల్పిన సంప్రదాయాలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే నూతన సంస్థలకు మార్గదర్శకంగా నిలిచాయి అన్నది నా అభిప్రాయం. నా వరకు నేను ఆ సంస్థ నుండి కొన్ని ఆచరణాత్మకమైన నిర్మాణ రీతులను అలవరచుకున్నాను అని సగర్వంగా చెప్పగలను. ప్రజాదరణ పొందిన ఒక పాపులర్ నవలను తెరకెక్కించటంలో తీసుకొనవలసిన జాగ్రత్తలను, మెళుకువలను నేను అన్నపూర్ణ సంస్థలో దుక్కిపాటి మధుసూదనరావుగారి నుండి నేర్చుకున్నాను.

ఈ విధంగా నేను అభిమానించే అన్నపూర్ణ సంస్థ చరిత్ర పుస్తక రూపంలో రావడం చాలా ఆనందదాయకం. చిత్ర పరిశ్రమలో భావితరాలకు ఈ పుస్తకం ఒక మార్గదర్శినిలా ఉపయుక్తం అవుతుందని నా భావన.

ఇక పుస్తక రచనలో రచయిత ప్రభు తీసుకున్న జాగ్రత్తలు, అతని రచనా శైలి ప్రశంసనీయంగా వున్నాయి. సంస్థ ఆశయాలను, లక్ష్యాలను, అవి సాధించబడిన పద్ధతులను చక్కగా తెలియజేశాడు.
అన్నపూర్ణ సంస్థ ప్రారంభానికి ముందు దుక్కిపాటి మధుసూదనరావు- అక్కినేని నాగేశ్వరరావు గార్ల పూర్వ చరిత్ర , ఆంధ్ర నాటక కళా పరిషత్తు ద్వారా సాధించబడిన నాటక రంగ వైభవం- మున్నగు అంశాలను ఆసక్తిదాయకంగా వివరించాడు.

ఇక సంస్థ ఆవిర్భావం నుండి అది సాధించిన విజయాలు అఖిలాంధ్ర ప్రేక్షకులకు సూపరిచితాలే అయినప్పటికీ రచయిత వాటిని అభివర్ణించిన తీరు చక్కగా సాగింది.

చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షక లోకంలోనూ
ప్రతి ఒక్కరూ చదవవలసిన మంచి పుస్తకం ఈ
” స్వర్ణయుగంలోఅన్నపూర్ణ”.

అభినందనలతో….
మీ ….రామానాయుడు .

( ఇప్పుడు ధారావాహికలోకి ఎంటర్ అవుదాం)

(రీ క్యాప్)
“స్క్రీన్ ప్లే అంటే రకరకాల రంగుల పువ్వులతో ఏర్చికూర్చిన ఒక అందమైన మాల. అందులో నుండి ఏ ఒక్క పువ్వును తొలగించినా ఆ లోపం ఎలా కనిపిస్తుందో స్క్రీన్ ప్లే నుండి ఒక్క చిన్న షాట్ తీసి వేసినా ఆ లోపం అలాగే కనిపిస్తుంది ” అంటారు కె.వి.రెడ్డి గారు.
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)


అలాగే ఒక చిత్రానికి కథను తయారు చేసుకునేటప్పుడు అందులోని పాత్రల స్వభావ స్వరూపాలను ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. అవి చిత్రం ఆద్యంతం అలాగే కొనసాగాలి. దాన్నే క్యారెక్టరైజేషన్ అంటారు. ఒక పాత్ర ఒక సన్నివేశంలో ఒకలాగా మరొక సన్నివేశంలో మరొక లాగా ప్రవర్తించేలా క్యారెక్టరైజేషన్ ఉండకూడదు అన్నది కె.వి.రెడ్డిగారి నిశ్చితాభిప్రాయం.

” హాస్యం అనేది చిత్ర కథలో ఒక భాగమై ఉండాలే కానీ అది ఒక ప్రత్యేకమైన సెపరేట్ ట్రాక్ లాగా అనిపించకూడదు. హాస్యం కోసం కొన్ని ప్రత్యేకమైన పాత్రలను సృష్టిస్తేనే ఈ ప్రమాదం సంభవిస్తుంది. అలా కాకుండా కథలో ఉన్న పాత్రల్లో ఏ ఏ పాత్రలు హాస్యానికి మలుచుకోవడానికి వీలుగా ఉంటాయో చూసుకొని ఆ ప్రకారం చేస్తే అప్పుడు హాస్యం అనేది చిత్రంలో అంతర్భాగం అవుతుంది” – అంటారు కె.వి.రెడ్డి గారు.

చిత్ర నిర్మాణంలో ఏ చిన్న విషయాన్నైనా దర్శకుడు నిర్లక్ష్యం చేయకూడదు అన్నది కె. వి. రెడ్డి గారి అభిప్రాయం. ప్రధాన పాత్రలకు ఆర్ట్ డైరెక్టర్ తో స్కెచెస్ వేయించి నటీనటులకు మేకప్ చేయించి స్టిల్స్ తీయించి ఆ స్టిల్స్ ప్రకారం ప్రతిరోజు మేకప్, కాస్ట్యూమ్స్ సరిచూసుకునేవారు కె.వి.రెడ్డి గారు.

ఆయన నాయకత్వంలో ఎప్పుడూ సమిష్టి దృక్పథమే ఉంటుంది తప్ప తానే సోల్ మోనార్క్ అనే భావన ఎప్పుడూ ఉండేది కాదు. ఎదుటి వారు ఇచ్చే సలహాలలో, సూచనలలో విషయం ఉందని గ్రహిస్తే దాన్ని తీసుకోవటానికి ఆయన ఏ మాత్రం వెనుకాడేవారు కాదు. నేనొక పెద్ద డైరెక్టర్ ను వీడు చెప్తే వినేది ఏమిటిలే అనే ఇగో ఆయనలో మచ్చుకైనా కనిపించేది కాదు- అంటారు మధుసూదనరావు.

ఎదిగేకొద్దీ ఒదిగే మనస్తత్వం ఉన్న సాత్వికులకే ఇది సాధ్యం!
” చిత్ర నిర్మాణంలో మెలకువలన్నీ నేను కె.వి.రెడ్డి గారి వద్ద నేర్చుకున్నాను. అది నా అదృష్టం. తరువాతి కాలంలో నేను తీసిన చిత్రాలన్నీ ఆయన బాటలో సాగినవే” అంటారు మధుసూదనరావు.
ఇలాంటి గొప్ప ఆలోచనలు, పద్ధతులు, క్రమశిక్షణ కలిగిన కె.వి.రెడ్డి గారి దర్శకత్వంలో అన్నపూర్ణ వారి తొలి చిత్రం” దొంగ రాముడు” షూటింగ్ కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిసాయి.
ఫైనల్ ఎడిటింగ్ అయిన తరువాత కె.వి.రెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు, డి.వి.నరసరాజు, నవయుగ శ్రీనివాసరావు, ఇతర పార్ట్నర్స్ చిత్రాన్ని చూశారు.

ప్రొజెక్షన్ అయ్యాక అందరూ బయటికి వచ్చారు. నవయుగ శ్రీనివాసరావు, ఇతర భాగస్వాములు కిమన్నాస్థి అన్నట్లుగా ఉన్నారు. బాగుంది అని కానీ, బాగోలేదు అని కాని చెప్పకుండా మౌనంగా నిష్క్రమించారు.
డి వి నరసరాజు గారు చాలా బాగుంది అన్నారు.
అక్కినేని నాగేశ్వరరావు” సినిమా చాలా బాగుందండి.. నా క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. తప్పకుండా హిట్ అవుతుంది”- తన అభిప్రాయం చెప్పి నరసరాజు గారితో కలిసి వెళ్లిపోయారు.

చివరకు కె.వి.రెడ్డి గారు – మధుసూదనరావు గారు ఇద్దరే మిగిలారు.
” సినిమా మీకు ఎలా ఉంది”- అన్నారు కె.వి.రెడ్డి గారు.
” నాకు చాలా బాగా నచ్చిందండి. తప్పకుండా హిట్ అవుతుంది”- అన్నారు మధుసూదనరావు.
ఇద్దరూ కారులో బయలుదేరారు.

కొద్దిసేపు మౌనం తర్వాత” మన డిస్ట్రిబ్యూటర్స్ కు సినిమా నచ్చినట్లు లేదు కదా? అన్నారు కేవీరెడ్డి.
” అవును- వాళ్లకు నచ్చినట్లు లేదు.. ఏమి చెప్పకుండా వెళ్లిపోయారు-” అన్నారు మధుసూదనరావు .
” చూడండి మధుసూదన్ రావు గారు- ఈ చిత్రంలో హిట్ కావడానికి అవసరమైన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఇందులో నవరసాలు ఉన్నాయి. సెంటిమెంట్, కామెడీ, మంచి మ్యూజిక్ అన్నీ ఉన్నాయి. ఇది గ్యారెంటీగా సక్సెస్ అవుతుంది…

ఇది హిట్ కాకపోతే…

ఒక్క క్షణం ఆగారాయన…

ప్రశ్నార్థకంగా చూశారు మధుసూదనరావు.

“ఈ సినిమా హిట్ కాకపోతే నేను చిత్ర పరిశ్రమ నుండి రిటైర్ అవుతాను”.

ఆ స్టేట్మెంట్ విన్న మధుసూదనరావు షాక్ అయి అలా చూస్తుండిపోయారు.

“మీరేం భయపడకండి .. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది – అని ఇల్లు రాగానే సీరియస్ గా కారు దిగి వెళ్లిపోయారు కె.వి.రెడ్డి గారు.

కొద్దిరోజుల తర్వాత “దొంగ రాముడు” తుది మెరుగులు దిద్దుకుని ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఈ వార్త చిత్ర పరిశ్రమలో అందరికీ తెలిసింది.
ప్రివ్యూ షో లు వేయమని ఒత్తిళ్ళు ప్రారంభమయ్యాయి.
కె.వి.రెడ్డి గారు ప్రివ్యూ వేయొద్దు అని గట్టిగా చెప్పారు.
“సంస్థ తొలి చిత్రం ప్రివ్యూ వెయ్యకపోతే తలా ఒక రకంగా అనుకుంటారు” – అన్నారు మధుసూదనరావు.
“ వేసినా అనుకుంటారు … అయినా నేను మీ సంస్థకు ఈ సినిమా చేయటం అందరికీ కడుపుమంటగానే ఉంది. ఎందుకు లేనిపోనివి కొనితెచ్చుకోవడం”- అన్నారు కె.వి.రెడ్డి గారు.
” మన సినిమా బాగుంది అన్న ఆత్మవిశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు” అని చెప్పి కె.వీ. రెడ్డి గారిని ఒప్పించారు మధుసూదనరావు.

తొలి చిత్రం preview ట్రిప్లికేన్ లోని ప్యారగాన్ థియేటర్లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.

చిత్రాన్ని చూశారు మద్రాసు సినీ ప్రముఖులు, పాండీ బజార్ పండితులు.

ఆ రోజు సాయంత్రానికల్లా మొత్తం గగ్గోలు పుట్టింది.
ఇంకేముంది …పాపం కొత్త నిర్మాతలను
కె.వి.రెడ్డి నిలువునా ముంచేశాడు.. పాపం తొలి చిత్రమే చివరి చిత్రం చేశాడు.
సానుభూతి కురిపించారు..
సంతాపాలు ప్రకటించారు…

“అందుకే ప్రివ్యూ వేయొద్దు” అన్నాను..
నిష్టూరంగా అన్నారు కె.వి.రెడ్డి గారు.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

ఫలితం కోసం అన్నపూర్ణ సంస్థ కన్నా, కె.వి.రెడ్డి గారి కన్నా ఆత్రంగా, ఆశగా, ఉండబట్టలేనట్లుగా ఉత్కంఠతతో ఎదురుచూసాయి పాండీ బజార్ వర్గాలు.

1955 అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున రిలీజ్ అయింది
“దొంగ రాముడు”.

కొందరి విజయం ఇంకొందరికి కడుపు మంటను, గుండె కోతను కలిగిస్తుంది.

ఎందుకో…?

అఖిలాంధ్ర ప్రేక్షక జన హృదయాలను దోచుకున్నాడు” దొంగరాముడు”.

అందుకేనేమో…!?

( సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 15 న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=xPfxOY4c-ng]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here