స్వర్ణయుగంలో అన్నపూర్ణ పుస్తక రచన ఎలా ప్రారంభమైందంటే….

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 17,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 17

తెలుగు వెబ్ సైట్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సినిమా నవలను ధారావాహికగా పబ్లిష్ చేసిన క్రెడిట్ “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కామ్” కే దక్కుతుంది. గత నెలరోజులుగా రోజు విడిచి రోజు “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కామ్” లో “స్వర్ణ యుగంలో అన్నపూర్ణ” సినీ నవలను చదువుతున్న కొందరు పాఠకులు , సినీ ప్రముఖులు ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది? ఈ నవల రచన ఎప్పుడు జరిగింది? ఈ సమాచారం అంతా మీకు ఎలా తెలిసింది? ఎలా సేకరించారు ? అని అడుగుతున్నారు.
ఈ సీరియల్ ఇప్పటికి 17 భాగాలు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా అసలు “స్వర్ణ యుగంలో అన్నపూర్ణ” నవల ఎప్పుడు, ఎలా ప్రచురితం అయిందో పాఠకులకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆ వివరాలను మీ ముందు ఉంచుతున్నాను.

నా పేరు ప్రభు. గుంటూరు జిల్లా మాచర్ల మా స్వస్థలం. నేను 1986 లో శతాధిక చిత్ర దర్శకులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాను. ఆయన వద్ద విశ్వనాధ నాయకుడు, బ్రహ్మనాయుడు, నేనే రాజు నేనే మంత్రి, ప్రజానాయకుడు, బ్రహ్మపుత్రుడు వంటి కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తరువాత కొంత గ్యాప్ రావడంతో ” సార్! శివరంజని పత్రికలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ గా ఉందట.. నేను జాయిన్ అవుతాను సార్” అని మా గురువుగారు దాసరి నారాయణరావు గారిని అడగటం జరిగింది. అప్పట్లో ఉదయం దినపత్రిక, శివరంజని సినిమా పత్రికలను స్థాపించి పత్రికా రంగంలో కూడా సంచలనం సృష్టించారు దాసరి నారాయణరావు గారు. నేను అడిగిన వెంటనే అంగీకరించి నన్ను శివరంజని పత్రికలో రిపోర్టర్ గా నియమించారు దాసరి గారు.
అలా 1988లో “శివరంజని” సినీ వారపత్రిక లో రిపోర్టర్ గా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన నేను చాలా తక్కువ కాలంలోనే ఫిలిం ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యాను. సినీ ప్రముఖులు అందరితోనూ పరిచయ సాన్నిహిత్యాలు ఏర్పడ్డాయి. సినీ పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించిన రెండు సంవత్సరాలకే నేను “ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్” జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాను.
సినీ పాత్రికేయుడుగా నా ఎదుగుదలను, ఉన్నతిని చూసి మా గురువుగారైన దాసరి నారాయణ రావుగారు చాలా సంతోషించేవారు. ఇలా సాగుతుండగా మద్రాసు నుండి వచ్చిన సీనియర్ సినీ పాత్రికేయులైన బొమ్మకంటి సుబ్బారావు గారు ” ప్రభూ ! అన్నపూర్ణ పిక్చర్స్ అధినేతలైన దుక్కిపాటి మధుసూదనరావు గారు వారి సంస్థ చరిత్రను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నారు. ఎవరు రాస్తే బాగుంటుంది అని నన్ను అడిగారు. నేను మీ పేరు చెప్పాను. ఒకసారి వెళ్ళి కలుస్తావా” అన్నారు.
“తప్పకుండా కలుస్తాను” అన్నాను. కాని పనుల ఒత్తిడి వల్ల నేను వెళ్ళటం కుదరలేదు. ఇంతలో ఒక రోజు శివరంజని కార్యాలయానికి ఫోన్ వచ్చింది. దుక్కిపాటి మధుసూదనరావు గారు లైన్ లో ఉన్నారు.. అన్నాడు ఆపరేటర్.
వెంటనే ఫోన్ అందుకుని” నమస్కారం సార్ అన్నాను”.
” ప్రభు గారు మీతో కొంచెం మాట్లాడాలి. నన్ను రమ్మంటారా.. మీరు రాగలరా? అన్నారు.
“అయ్యో..! మీరు రావటం ఏమిటి సార్.. నేనే వస్తున్నాను ” అని వెంటనే వెళ్లి మధుసూదన్ రావు గారిని కలిసాను.
“మా సంస్థ చరిత్రను పుస్తక రూపంలో తేవాలనుకుంటున్నాం . ఎవరు రాస్తే బాగుంటుంది.? అని అడిగారు మధుసూదన రావు గారు.
నేను వెంటనే గుడిపూడి శ్రీహరి గారు, పి.ఎస్.ఆర్ ఆంజనేయశాస్త్రి గారు, నాదెళ్ల నందగోపాల్ గారు వంటి కొందరు ప్రముఖ సినిమా జర్నలిస్టుల పేర్లు చెప్పాను.
వారందరూ గొప్ప జర్నలిస్టులే… నాకు చాలా సన్నిహితులే. కానీ వాళ్లు చాలా సీనియర్స్. వారి టైమింగ్స్ కు నా టైమింగ్స్ కు పొంతన కుదరదు. శివరంజని పత్రికలో మీ ఆర్టికల్స్ చదివాను… మీ శైలి నాకు బాగా నచ్చింది. మీరు రాస్తే బాగుంటుంది.. అన్నారు మధుసూదన రావు గారు. నా మనసులో ఉన్న కోరిక కూడా అదే.
“దొరకునా ఇటువంటి సేవ” అనుకుంటూ మహా భాగ్యం అన్నాను.

అలా అందింది నాకు అన్నపూర్ణ వారి చరిత్రను అక్షరబద్ధం చేసే అవకాశం.
అయితే నేను కోరి కోరి నెత్తికెత్తుకున్నది ఆషామాషీ వ్యవహారం కాదు. అంబరాన్ని చుంబించే అన్నపూర్ణ వారి కీర్తిపతాక చరిత్రకు అక్షర రూపాన్నిచ్చే బృహత్తర కార్యక్రమం ఇది. తీరా కార్యరంగంలోకి దిగాక అనిపించింది ఇల్లు అలకగానే పండగ కాదు అని.
దాదాపు ఆరు నెలల పాటు ప్రతిరోజు మధుసూదనరావు గారి ఇంటికి వెళ్లి నోట్స్ తీసుకునే వాడిని. కానీ నా పనులవత్తిడివలన పుస్తక రచనకు ఒక పట్టాన ఉపక్రమించ లేకపోయాను.
మధుసూదన్ రావు గారికి కోపం వస్తుంది. కానీ ఏమీ అనలేక పోయారు. ఉన్నట్టుండి ఒకరోజు కాఫీ తాగి వద్దాం పద అని కారులో ఎక్కించుకొని అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ కు తీసుకువెళ్లారు.
రెస్టారెంట్ లోకి వెళ్ళకుండా నేరుగా ఒక రూమ్ లోకి నడిచారు.
కొద్దిసేపు అవి ఇవి మాట్లాడిన తర్వాత
ఉన్నట్టుండి బయటకు వెళ్లి తలుపు గడి పెట్టారు.
నేను ఆశ్చర్యపోయి “ ఇదేంటి సార్.. తలుపు గడిపెట్టారు ” అన్నాను.
“అవునయ్యా… నిన్ను గదిలో బంధిస్తే నన్నా పని మొదలు పెడతావని ఇలా చేశాను… నన్ను చూస్తే నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు,సావిత్రి ,ఎస్.రాజేశ్వరరావు లాంటి వాళ్లే భయపడతారు…నువ్వు సంవత్సరం దాటినా పనే మొదలుపెట్టలేదు”- అన్నారు.
ఆయన మాటల్లో కోపంతో కూడిన ప్రేమ కనిపించింది.
“మరి ఈ గదిలో బంధిస్తే ఎలా రాయాలి” అన్నాను.
“ఈ గది నీ కోసమే బుక్ చేశాను.. ఇక్కడే కూర్చుని పుస్తకం పూర్తి చెయ్యి” అన్నారు మధుసూదనరావు గారు.
“సరే! రూమ్ లో లాక్ చేసేసారు కదా.. ఇక్కడ ఇలాగే వదిలేసి వెళ్ళండి.. పెన్ను పేపర్ లు పంపించండి.. అన్నాను నేను కూడా సీరియస్ గా.
నవ్వుతూ.
“ సరేలే రా ” అని గడి తీశారు.

“లేదు సర్… పుస్తకం పూర్తయ్యాకే ఈ రూమ్ నుండి బయటికి వస్తా… అని చెప్పి రేయింబవళ్ళు పనిచేసి కేవలం 10 రోజుల్లో పుస్తక రచన పూర్తి చేసి మధుసూదన్ రావు గారి చేతిలో మాన్యు స్క్రిప్ట్ పెట్టాను. వెంటనే ఆయన పుస్తక ప్రచురణ జరిపించారు.
అన్నపూర్ణ సంస్థ తో తనకు గల స్నేహానుబంధాన్ని , నా మీద గల వాత్సల్యాన్ని పురస్కరించుకుని సుప్రసిద్ధ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డి.రామానాయుడు గారు ఈ పుస్తకానికి
“ముందుమాట” రాశారు.

ఇక ఈ “స్వర్ణ యుగంలో అన్నపూర్ణ” పుస్తకావిష్కరణ కార్యక్రమం నా జీవితంలో ఒక మధుర ఘట్టం గా నిలిచిపోయింది.
1993 ఆగస్టు 11వ తేదీన రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం. నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు ముఖ్య అతిథిగా , గ్రంథావిష్కర్తగా విచ్చేయగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు సభాధ్యక్షత వహించగా అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు, జగ్గయ్య, జమున, రామానాయుడు, అల్లు రామలింగయ్య, అప్పటి రాష్ట్ర DGP నారాయణ రావు గార్ల వంటి ప్రముఖులు వేదికను అలంకరించారు.
ఇక వేదిక ముందు రవీంద్రభారతిలో సగం చిత్రపరిశ్రమ కూర్చుని వుంది.

ఇప్పుడు పుస్తక రచయిత ప్రభు ను వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను అని వ్యాఖ్యాత చెప్పగానే నేను వేదిక మీదకు వెళుతుంటే ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ సిబ్బంది నన్ను అడ్డుకున్నారు. స్టేజి మీద మహామహులు కూర్చుని ఉంటే వీడెవడో కుర్రాడు ఆటోగ్రాఫ్ ల కోసం వెళుతున్నాడు అనుకొని నన్ను ఆపేశారు. అప్పుడు మధుసూదన రావు గారు పరుగున వచ్చి “అతనేనయ్యా పుస్తక రచయిత… అంటూ నన్ను వేదిక మీదకు తీసుకువెళ్లి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారికి పరిచయం చేయగా” నువ్వా… ఈ పుస్తకం రాసింది… ఎవరో తలపండిన పెద్దవాళ్లు రాశారు అనుకున్నాను… నాగేశ్వర రావు గారి వైపు తిరిగి “చాలా చిన్న కుర్రోడు.. అన్నారు.
దానికి నాగేశ్వర రావు గారు” దాసరి నారాయణరావు గారి శిష్యుడు కదా .. అని కామెంట్ చేశారు.
నా అభిమాన , ఆరాధ్య నటుడు జగ్గయ్య గారు వేదిక మీదకు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ” ఎంత బాగా రాసావయ్యా” అని ముద్దు పెట్టుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.
ఇవీ “స్వర్ణ యుగంలో అన్నపూర్ణ ”
పుస్తక-రచన-ప్రచురణ ఆవిష్కరణ విశేషాలు.

(ఇక ఇప్పుడు తదుపరి ఎపిసోడ్ లోకి ప్రవేశిద్దాం)

(రీక్యాప్)
( తన ఆలోచనను డి వి నరసరాజు గారి ముందు ఉంచారాయన . ఇద్దరూ కలిసి ఒక సంక్షిప్త రూపాన్ని తయారుచేసి కె.వి రెడ్డి గారికి వినిపించారు.)
( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

అది విన్న కె.వి.రెడ్డి గారు “బ్రహ్మాండం ప్రొసీడ్ అవ్వండి” అన్నారు. ఇంగ్లీష్ నవల “లవింగ్ బ్రదర్స్” నుండి తీసుకుంది ‘తమ్ముడి కోసం అన్న దొంగతనాలు చేయడం’ అన్న ఒక్క పాయింట్ మాత్రమే. మిగిలిన కథ మొత్తం అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం.
కథాంశాన్ని ప్రతిభంబిస్తూ చిత్రానికి “దొంగరాముడు” అని నామకరణం చేశారు.
స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైంది. తనకు గల పూర్వ పరిచయాన్ని పురస్కరించుకొని దర్శకుడి అనుమతితో పెండ్యాల నాగేశ్వరరావును సంగీతదర్శకుడిగా బుక్ చేశారు మధుసూదనరావు. సముద్రాల రాఘవాచార్యులు గారు పాటల రచయిత. మొత్తం తొమ్మిది పాటలు రాయడానికి నెల రోజులు పట్టింది. షూటింగ్ కు ముందే 9 పాటల రికార్డింగ్ పూర్తి చేశారు.
నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, జమున, రేలంగి, సూర్యకాంతం తదితర నట వర్గాన్ని బుక్ చేశారు.

ఈ చిత్రంలో తొలుత జగ్గయ్య గారు పోషించిన పాత్రకు రామచంద్ర కాశ్యప గారిని అనుకున్నారు. అయితే ఆయన అంతకు కొద్ది రోజుల క్రితమే ఒక చిత్రంలో దాదాపు ఇలాంటి పాత్రనే పోషించి ఉండటంతో ఆయన స్థానంలో జగ్గయ్య గారిని తీసుకోవటం జరిగింది. అయితే సంకుచిత మన మనస్కులు కొందరు ఈ మార్పుకు కులాభిమానాన్ని అంటగట్టారు. జగ్గయ్య గారు కమ్మ వారు కావటం వల్లనే ఆయనకు ఈ వేషం ఇచ్చారని వదంతి లేపారు. ఆదినుండి అభ్యుదయ భావాలు, ప్రగతిశీల దృక్పదాలు కలిగిన మధుసూదన రావు, అక్కినేని నాగేశ్వరరావు ఈ పుకార్లు విని నవ్వుకున్నారు. అసలు అన్నపూర్ణ వారి చరిత్రను పరిశీలిస్తే ఈ సంకుచిత కులతత్వ ధోరణి ఆ సంస్థ ఛాయలకు కూడా చేరిన దాఖలాలు కనిపించవు.
ఈ సంస్థ తొలి చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి. ఆ తరువాత ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్ వంటి ప్రముఖులే కాక సంస్థ పరిచయం చేసిన ఎందరో నటీనట ,సాంకేతిక నిపుణులు ‘కమ్మే’తరులే.
అన్నపూర్ణ సంస్థ ఆదినుండి ప్రతిభకు పట్టాభిషేకం జరిపిందే తప్ప ఇలాంటి సంకుచితమైన ఆలోచనలను ఏ నాడు దరిచేరనీయలేదు.
తొలి చిత్రం ద్వారా ఆర్.నాగేశ్వరరావు ను విలన్ గా పరిచయం చేసింది అన్నపూర్ణ సంస్థ.
షూటింగ్ కు సర్వ సన్నాహాలు పూర్తయ్యాయి.
అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కె.వి.రెడ్డి స్కూల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ప్రారంభం అయింది.
క్రమశిక్షణ, నియమ పాలన, సమయపాలన – ఇవి ఆ స్కూల్లో అందరూ పాటించవలసిన సూత్రాలు.
సృజనాత్మక, ప్రయోగాత్మక, కళాత్మక దృష్టి, దృక్పథాలు – ఇవి ఆ స్కూల్లో అందరూ అభ్యసించవలసిన పాఠ్యాంశాలు.
డి వి నరసరాజు గారు స్క్రిప్ట్ చదువుతుంటే మధుసూదన రావు వాచీలో టైం నోట్ చేస్తుంటే ప్రతి షాట్ కు ముందుగానే ఫిలిం నిడివి వేసుకుంటూ ఏ షాట్ ఎంత లెంగ్త్ వచ్చేది , ఎంత టైం తీసుకునేది స్క్రిప్టు మీద రాయించి తను తీయబోయే సినిమా నిడివి 17 వేల అడుగులు అని ముందుగానే ప్రకటించారు కె.వి.రెడ్డి ద గ్రేట్.

కాలంలో సెకండ్లు, కెమెరాలో ఫ్రేమ్ లు దర్శకుడి కంట్రోలు తప్పకూడదన్న సూత్రాన్ని సిద్ధాంతీకరించి అమలు చేసిన మొదటి దర్శకుడు బహుశా కె.వి.రెడ్డి గారే.

షూటింగ్ ప్రారంభమైంది.

అన్నీ ఉదయం 7am to 1pm కాల్ షీట్స్ ప్లాన్ చేశారు.
ప్రతిరోజు ఉదయం ఆరున్నరకు కె.వి.రెడ్డి గారి ఇంటి ముందు కారు ఆగేది. అందులో మధుసూదన రావు, డి వి నరసరాజు గారు ఉండేవారు. కారు ఆగిన ఐదు సెకండ్లలో దర్శకుడు కె.వి. రెడ్డి గారు వచ్చేవారు . 6:45 కు వాహినీ స్టూడియో ఫ్లోర్ ముందు కారు ఆగేది. 7 గంటలకు తొలి షాట్ చిత్రీకరణ మొదలయ్యేది.ఏ రోజు ఎన్ని షాట్స్ ప్లాన్ చేస్తే అన్ని షాట్స్ ఖచ్చితంగా పూర్తయ్యేవి. కాల్ షీట్ సమయానికి పావు గంట ముందుగానే షూటింగ్ పూర్తయ్యేది. ఆ పావు గంట సమయాన్ని మరుసటి రోజు తీయబోయే ఫస్ట్ షాట్ గురించి ఛాయాగ్రాహకుడు ఆది ఇరానీతో చర్చించటానికి వినియోగించేవారు.

సెట్ మీదకు వచ్చాక ఒక సెట్ ప్రాపర్టీ గురించి గానీ, కాస్ట్యూమ్స్ గురించి గానీ, కనీసం గుండుసూది కోసమైనా వెతుక్కునే అవసరంగానీ , కారు బయటకు వెళ్లవలసిన అగత్యం గాని ఉండేది కాదు. షూటింగుకు కావలసిన సమస్తము ముందుగానే సిద్ధం చేసి ఉంచేవారు మధుసూదనరావు.

చిత్ర నిర్మాణం పూర్తయింది.

మొత్తం 70 కాల్ షీట్స్ లో ఐదు కాల్షీట్స్ అవుట్ డోర్ లో చేశారు.
62 రోల్స్ నెగటివ్ expose చేశారు.
చిత్రం మొత్తం నిడివి 17 వేల 250 అడుగులు వచ్చింది. అది తొలుత ప్రకటించిన దానికంటే 250 అడుగులు ఎక్కువ.
అందుకు ఒక కారణం ఉంది.
చిత్రంలో హీరో నాగేశ్వరరావుకు, విలన్ ఆర్.నాగేశ్వరరావుకు మధ్య ఒక ముష్టియుద్ధం సన్నివేశం ఉంది. దానిని మొదట్లో మామూలుగానే ప్లాన్ చేశారు.
ఇంతలో మద్రాసులో ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ పోటీలు జరిగాయి. ఒకరోజు సరదాగా కె.వి.రెడ్డి గారు, నాగేశ్వరరావు, డి.వి.నరసరాజు, మధుసూదనరావు ఆ పోటీలను చూడటానికి వెళ్లారు. అది చూసి కె.వి. రెడ్డి గారికి ఒక ఐడియా స్ఫురించింది. ప్రతి సినిమాలోనూ ఉండే క్రాపు చెదరని, చొక్కా నలగని ఫైట్స్ కన్నా సహజంగా, వాస్తవికతకు దగ్గరగా ఉండే ఫైట్ ఒకటి
హీరో విలన్ మధ్య పెడితే బాగుంటుంది అనిపించింది.
రోజూ వెళ్లి ఆ పోటీల్లోని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ను నోట్ చేసుకోవడం ప్రారంభించారు. తమతో పాటు రాఘవులు అనే ఫైటర్ ను కూడా తీసుకువెళ్లేవారు.
34- భగీరథమ్మాళ్ స్ట్రీట్ లోని ఆఫీసు కాంపౌండులో రెండు లారీల ఇసుక పోయించి చుట్టూ తడికలు కట్టించి ఫైటర్ రాఘవులు సహాయంతో ఇద్దరు నాగేశ్వరరావులతో ఫైట్ ప్రాక్టీస్ చేయించారు.
తొలుత ఒరిజినల్ స్క్రిప్ట్ లో ఆ ఫైట్ కు కేటాయించింది100 అడుగులు. అయితే ఈ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా రావటంతో దాన్ని మరో 250 అడుగులకు పెంచారు.
ఈ పెంచినదే ఆ అదనపు నిడివి.
ఒక చిత్రానికి expose చేసే నెగిటివ్ ఆ చిత్రం మొత్తం నిడివికి మూడు రెట్లకు మించకూడదు అన్నది కె.వి.రెడ్డి గారి సిద్ధాంతం.
చిత్రం నిడివి మీద కంట్రోల్ లేని దర్శకుడు చిత్ర నిర్మాణం లోని చాలా అంశాల మీద తన అదుపును కోల్పోతాడు అన్నది కె.వి. రెడ్డి గారి అభిప్రాయం.
ఈ విధంగా చిత్ర నిర్మాణం లోని ప్రతి అంశం పట్ల ఖచ్చితమైన, స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండేవారు కె.వి.రెడ్డి గారు.
ఆయన దృష్టిలో సినిమాకు స్క్రీన్ ప్లే ప్రాణప్రదమైన విషయం. ” స్క్రీన్ ప్లే అంటే రకరకాల రంగుల పువ్వులతో ఏర్చికూర్చిన ఒక అందమైన మాల. అందులో నుండి ఒక్క పువ్వును తొలగించినా ఆ లోపం ఎలా కనిపిస్తుందో స్క్రీన్ ప్లే నుండి ఒక చిన్న షాట్ ను తీసివేసినా ఆ లోపం అలాగే కనిపిస్తుంది” అనేవారు కె.వి.రెడ్డి గారు.

( సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 13 న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=xoya_S8fXY8]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here