దర్శకుడిగా కె.వి.రెడ్డి ఇచ్చిన మొదటి సలహా – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 16, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 16

( రీక్యాప్)
(ఒకేసారి నాలుగు చిత్రాలపై ఏకాగ్రత నిలపటం సాధ్యమా? కుదరదులే అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు మధుసూదనరావు.
మరలా అన్వేషణ ప్రారంభమైంది.

అదే సమయంలో ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

వాహినీ సంస్థలో కొన్ని మనస్పర్థల కారణంగా కె.వి.రెడ్డి గారు బయట చిత్రాలకు చేస్తారన్నది ఆ వార్త. చిత్ర పరిశ్రమలో దావాలనంలా వ్యాపించింది ఈ వార్త.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలన్నీ కె.వి.రెడ్డి గారికి స్వాగతం పలికాయి. అయితే ఆయన ఏ సంస్థకు మాట ఇవ్వలేదు. సందిగ్ధ స్థితి లో ఉన్నారాయన.

అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, మధుసూదన రావు కె.వి.రెడ్డి గారి ని కలిసారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల కోరికలు ఒకటే అయ్యాయి.
అప్పటికి హీరోగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న నాగేశ్వరరావును డైరెక్ట్ చేయాలన్నది కె.వి.రెడ్డి గారి కోరిక.
ఆయన దర్శకత్వంలో నటించాలన్నది నాగేశ్వరరావు కోరిక.

ఇదిలా ఉంటే కె.వి రెడ్డి గారికి మధుసూదన రావుతో ఉన్న కొద్దిపాటి పరిచయమే ఆయనపై ఒక సదభిప్రాయం కలిగించింది. ఒకసారి “గుణసుందరి” చిత్రం విడుదలకు కె.వి.రెడ్డి గుడివాడ వచ్చారు. ఆ చిత్రాన్ని గుడివాడలో తమ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు కాజా వెంకట్రామయ్య గారు. భోజనాలు జరుగుతుండగా మాటల మధ్యలో “మీ గుడివాడ నుండి ఎవరో మధుసూదనరావట .. నా “పోతన” చిత్రం రిలీజ్ అయినప్పుడు ఎక్సలెంట్ అని, “వేమన” రిలీజ్ అయినప్పుడు good but class అని టెలిగ్రాములు ఇచ్చారు. నేను రిప్లై రాయటానికి ఆయన అడ్రస్ తెలియలేదు.. ఎవరాయన? యధాలాపంగా ఆరా తీశారు కె.వి.రెడ్డి గారు.
“ఈయనే ఆ మధుసూదనరావు”.. మా నాటక కళా పరిషత్తు జాయింట్ సెక్రెటరీ… పక్క కుర్చీలో కూర్చుని భోంచేస్తున్న మధుసూదనరావును పరిచయం చేశారు కాజా వెంకట్రామయ్య గారు.
అది తొలి పరిచయం.

మధుసూదన రావు పంపిన అభిప్రాయాలు కరెక్ట్ అన్నట్లుగానే పోతన సూపర్ హిట్ కాగా, వేమన ఏవరేజ్ గా ఆడింది. అలాంటి విమర్శనాశక్తి, ఖచ్చితమైన అంచనాలు కలిగిన మధుసూదన రావు నిర్మాతగా తన వద్దకు రావడం కేవీ రెడ్డి గారికి బాగా నచ్చింది.

“నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక నెల రోజుల్లో ఏ సంగతి చెప్తాను. బయటి చిత్రాలు అంగీకరిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే
ఇస్తాను” అన్నారు కె.వి.రెడ్డి గారు.

మరలా నెల రోజులకు వెళ్లి కలిశారు. అప్పటికాయన ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు.
“మీకు సినిమా చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ప్రస్తుతం నేను “పెద్ద మనుషులు” చిత్రం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. నేను ఒకసారి ఒక చిత్రాన్ని మించి చేయనని కూడా మీకు తెలుసు. ప్రస్తుతం వాహినీ స్టూడియోలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ చిత్రం నిర్మాణం ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. మరి మీరు వెయిట్ చేయగలరా? ఆలోచించుకుని చెప్పండి” అన్నారాయన.
మధుసూదన రావు, నాగేశ్వరరావు, నవయుగ శ్రీనివాస రావు గార్లు పునరాలోచనలో పడ్డారు.

కె.వి.రెడ్డి వంటి గొప్ప దర్శకుడు తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తే సంస్థ ఇమేజ్ ఇనుమడిస్తుంది.
ఇది వాహిని నుండి బయటకు వచ్చాక ఆయన చేసే తొలి చిత్రం కావటం ప్రతిష్టాకర విషయం.
ఆయన కోసం నిరీక్షించడానికే నిర్ణయించుకున్నారు. ఆ నిరీక్షణ సమయంలో స్క్రిప్ట్ వర్క్ పకడ్బందీగా సిద్ధం చేసుకోవచ్చు.

వెంటనే వెళ్లి కలిశారు మధుసూదనరావు. పారితోషికం విషయం ప్రస్తావించారు.
” నన్ను ఏమి అడగొద్దు.. మీరే నిర్ణయించండి. ఎంత న్యాయం అని భావిస్తే అంతే ఇవ్వండి. డబ్బు విషయం ఇంకెప్పుడూ నా దగ్గర ప్రస్తావించకండి. నాకు డబ్బు ప్రధానం కాదు.. వ్యక్తులే ముఖ్యం” -స్నేహ పూర్వకంగా అన్నారు కె. వి.రెడ్డి .

అడ్వాన్స్ ఇచ్చారు మధుసూదన రావు.
అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తిది అడ్వాన్స్ స్వీకరించిన వ్యక్తిది ఒకటే లక్ష్యం.

తొలిచిత్రం హిట్ కావాలి.

మిత్రులు హితులు సన్నిహితులు శుభస్య శీఘ్రం అన్నారు.
ఈ సంచలన వార్త మెల్లిగా చిత్ర పరిశ్రమ చెవిన పడింది.
పాండీ బజార్ నోరు తెరిచింది.
కె.వి.రెడ్డి వంటి గొప్ప దర్శకుడు వాహినీ నుండి బయటకు వచ్చి పెద్ద సంస్థల వాళ్ళు పిలిచినా వెళ్లకుండా ఊరూపేరూ లేని కొత్త సంస్థకు పని చేయటం ఏమిటి ?
కె.వి. రెడ్డికి మతి చెడినట్లు ఉంది.
అయినా ఆయనతో సాంఘిక చిత్రం తీయడం ఏమిటి? ఏ జానపదమో , పౌరాణికమో తీయించుకుని వచ్చిన అవకాశాన్ని మాక్సిమం క్యాష్ చేసుకోవాలి గానీ..
వీళ్లకు బుర్ర లేదు
సర్టిఫికెట్ ఇచ్చేసింది పాండీ బజార్.

దర్శకుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కె.వి.రెడ్డి గారు ఇచ్చిన మొదటి సలహా-

ఎందుకు అనవసరంగా ఖర్చులు పెంచుకోవడం.. మనం షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఇంకా చాలా టైముంది. ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు?
ఒక డ్రైవరు, ఒక అకౌంటెంట్, ఒక బాయ్ చాలు. మిగిలిన స్టాఫ్ ను తగ్గించి మరలా షూటింగ్ టైంలో పిలిపించండి. అనవసర ఆర్భాటాలకు పోవద్దు.
ఇది తొలి సలహా.
ఇది తొలి పాఠం .
చిత్ర నిర్మాణం అనేది ప్రిస్టేజ్ ఇష్యూయే.. కానీ ఫాల్స్ ప్రెస్టేజ్ ని గుర్తించి దానిని దూరంగా ఉంచటం అవసరం.
ఆ సలహాను వెంటనే అమలు చేశారు మధుసూదన రావు. బిల్డింగ్ లో కింద పోర్షన్ ను ఎస్. వి. రంగారావు గారికి అద్దెకు ఇచ్చి పై పోర్షన్ ఆఫీస్ కొరకు అట్టిపెట్టుకున్నారు.

కథా చర్చలు ప్రారంభమయ్యాయి. “పెద్ద మనుషులు చిత్రానికి డి.వి.నరసరాజు గారితో డైలాగులు రాయించాము. ఆయన మీరు నాటక కళాపరిషత్తు నాటినుండి మిత్రుల కదా.. ఆయనతోనే మన చిత్రానికి డైలాగులు రాయించుకుందాం. ఆ సినిమా హీరో రామచంద్ర కాశ్యప గారిలో మంచి సృజనాత్మక భావాలు ఉన్నాయి. వారిద్దరితో కలిసి మీరు స్టోరీ డిస్కషన్స్ ప్రారంభించండి. నేను ఖాళీ దొరికినప్పుడల్లా వస్తాను”- చెప్పారు కె.వి.రెడ్డి.
కథా చర్చలు ఆరునెలల సాగాయి.
ఒక సబ్జెక్టు వర్కౌట్ చేశారు.
అయితే ఆ కథ మీద మధుసూదన రావుకు ఏదో అస్పష్టమైన సందేహం.
ఎందుకో ఈ సబ్జెక్టు ఫస్ట్ హాఫ్ ఒక కథలాగా సెకండ్ హాఫ్ మరొక కథ లాగా ఉందనిపిస్తుంది. నాకు మొదటినుండి ఈ డౌట్ ఉంది కానీ చెబితే డైరెక్టర్ గారు ఏమనుకుంటారో?
నరసరాజు గారి దగ్గర తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు మధుసూదనరావు.
ఆయన మెల్లిగా కేవీ రెడ్డి గారికి చెప్పారు.
నిజమా? మరి నాకెందుకు చెప్పలేదు.?
మీరేమైనా అనుకుంటారేమోనని …
” చూడండి మీరు నిర్మాతలు. నాకోసం సంవత్సరాల కొద్దీ వెయిట్ చేయడానికి సిద్ధపడ్డారు. తొలి సినిమా తీస్తూ మనసులో సందేహాలు పెట్టుకోవడం మంచిది కాదు. మీకు నచ్చకపోతే విరమించుకుందాం . వేరే సబ్జెక్ట్ ఏదైనా ఆలోచిద్దాం అన్నారు కె.వి.రెడ్డి గారు చాలా తేలిగ్గా.( అలా విరమించుకున్న ఆ కథ తరువాత జయంతి పిక్చర్స్ బ్యానర్ పై” పెళ్లినాటి ప్రమాణాలు” చిత్రంగా రూపొంది విడుదలయింది.)

మధుసూదన రావు కు ఆశ్చర్యమేసింది. ఇంత పెద్ద డైరెక్టర్ అయి ఉండి కూడా ఎదుటి మనిషి అభిప్రాయానికి అంతా విలువ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం అనుకున్నారాయన.
దర్శకుడు చిత్ర నిర్మాణంలో కీలకమైన వాడే కానీ కీలక విషయాలలో తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే ధోరణిలో ప్రవర్తించకూడదు.

ఆ విధంగా ఆ సబ్జెక్టు విరమించుకున్న తరువాత కొద్దిరోజులకు మరలా కథా చర్చలు ప్రారంభమయ్యాయి.

అసలు ఏ నేపథ్యంలో కథ అల్లుకుంటే బాగుంటుంది?
“అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ అనేది యూనివర్సల్… ఈ ఫార్ములాకు ఎప్పుడూ ఫెయిల్యూర్ ఉండదు”- అన్నారు కె.వి.రెడ్డి.
ఓకే అన్నారు అందరు.
హీరో అనేవాడు చెల్లి కోసం ఏమైనా చేస్తాడు. ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్దమే. కానీ తను ప్రాణప్రదంగా చూసుకునే చెల్లెలు తన కారణంగా కష్టాల్లో పడే పరిస్థితి ఎదురవుతుంది.

“ఇదీ అవుట్ లైన్… ఈ లైన్ మీద చర్చలు జరపండి” అన్నారు కె.వి.రెడ్డి.

ఇది నాగేశ్వరరావుతో తను చేస్తున్న తొలి చిత్రం. నాగేశ్వరరావు ఇప్పటివరకు జానపద, పౌరాణికాలు, దేవదాసు లాంటి లవ్ స్టోరీ చేశారు. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అయితే ఆయనకు ఒక డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది. ఇది కె.వి.రెడ్డి గారి అభిప్రాయం.

సరే ఈ అన్నాచెల్లెళ్ల కథాంశం మీద కొద్ది రోజులు పని చేశారు.

ఇంతలో ఒక రోజు ఏదో పని మీద మౌంట్ రోడ్డు వెళ్లారు మధుసూదన రావు. అక్కడ ” హిగ్గిన్ బాధమ్స్” బుక్ స్టాల్ లో ” లవింగ్ బ్రదర్స్” అనే పుస్తకం కంటపడింది. వెనుక అట్టమీద ఇచ్చిన సంక్షిప్త కథను చదివారు. అందులో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అన్న దొంగతనాలు చేసి తమ్ముడిని చదివిస్తాడు. తమ్ముడు ఉన్నత స్థానానికి వెళ్లి గొప్ప పొజిషన్ కు చేరుకునే సమయానికి అన్న ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన అన్న ఒక దొంగ అన్న విషయం లోకానికి తెలిస్తే అందువల్ల తమ్ముడి ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఎక్కడ,ఏ పరిస్థితుల్లోనూ నోరు మెదపడు అన్న. న్యూ థియేటర్స్ “సౌగంద్” కూడా దాదాపు ఇదే కథ. అది పెద్ద హిట్ పిక్చర్.!
బుక్కు చదివిన మధుసూదన రావుకు
ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది.
ఆ తమ్ముడి పాత్రను చెల్లెలు చేస్తే….?

తన ఆలోచనను నరసరాజు గారి ముందు ఉంచారాయన . ఇద్దరూ కలిసి ఒక సంక్షిప్త కథారూపాన్ని తయారుచేసి కేవీ రెడ్డి గారికి వినిపించారు.

అది విన్న కె.వి.రెడ్డి గారు ఏమన్నారు?
(సశేషం)
(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 11న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=L1vpGOsrloI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here