తొలి చిత్రానికి దర్శకుడు ఎవరన్నది పెద్ద ప్రశ్నార్థకమై నిలిచింది – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 15,Telugu Cinema Updates,Telugu Film News 2018,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 15

(రీక్యాప్)

( 1951 సెప్టెంబర్ 10న” అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ రిజిస్ట్రేషన్ జరిగింది.
అక్కినేని నాగేశ్వరరావు- చైర్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్.
దుక్కిపాటి మధుసూదనరావు- మేనేజింగ్ డైరెక్టర్.
కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి వి ఏ సూర్యారావు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా సంస్థ ప్రారంభమైంది.

ఆశయ సాధనలో తొలి మెట్టు ఎక్కారు మధుసూదన రావు. )

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

స్కూల్ డేస్ లోనూ, నాటకరంగంలోనూ చేపట్టిన ఏ కార్యక్రమంలోనైనా ఫస్ట్ – బెస్ట్ అనిపించుకున్న తనకు చిత్ర నిర్మాణ రంగంలో కూడా “నెంబర్ వన్” అనిపించుకోవాలన్న కోరిక ప్రగాఢంగా ఉంది. అందుకు తగ్గ ఆత్మ విశ్వాసం ఆయనకు దండిగా ఉంది.
ధనుర్విద్యార్జనలో నిమగ్నుడైన పాండవమధ్యముడుకి చెట్టు గానీ , పిట్టగానీ కనిపించవు.

అతని లక్ష్యం దాని ‘కన్ను’.

ఇప్పుడుమధుసూదన రావు లక్ష్యం ఒక్కటే… తొలి చిత్రం హిట్ కావాలి.
ఆ కోరిక అంత బలంగా ఉంది కాబట్టే తొలి చిత్రానికి దర్శకుడు ఎవరన్నది పెద్ద ప్రశ్నార్థకమై నిలిచింది.
సుదీర్ఘ చర్చలు, సమాలోచనల అనంతరం దర్శకుని తమలో తామే నిర్ణయించుకున్నారు.
ఆ దర్శకుడు మరెవరో కాదు.
భరణీ పిక్చర్స్ అధిపతి, రత్నమాల లైలామజ్ను, బ్రతుకు తెరువు వంటి హిట్ చిత్రాల దర్శకుడు విఖ్యాత నటీమణి శ్రీమతి భానుమతి భర్త గారైన రామకృష్ణ గారు.

ఈ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.

ఆంధ్ర నాటక కళా పరిషత్తు గుడివాడ మహాసభలకు తొలిసారిగా గూడవల్లి రామబ్రహ్మం, భానుమతి గార్లను ఆహ్వానించే బాధ్యత తనకు అప్పగించినప్పుడే మధుసూదనరావుకు భానుమతి గారితో పరిచయం ఏర్పడింది. అంతకు మునుపు వరవిక్రయం, స్వర్గసీమ, మల్లీశ్వరి చిత్రాలు చూసి భానుమతి గారి అభిమాని అయ్యారాయన.

పరిషత్ సభలకు వచ్చినప్పుడు అప్పటికి మూడు మాసాలవాడైన ఆమె కుమారుడు భరణికి ఆవుపాలు మొదలుకొని ఆమెకు కావలసిన సమస్త సౌకర్యాలను సమకూర్చి సాదరంగా గౌరవించి పంపిన మధుసూదనరావు పట్ల ఆమెకు, భర్త రామకృష్ణ గారికి, వారి సహచరుడు డి ఎల్ గారికి ఎనలేని అభిమానం ఏర్పడింది. ఆ తరువాత నాగేశ్వరరావు భరణి సంస్థలో రత్నమాల, లైలామజ్ను చిత్రాల్లో నటిస్తున్న సమయంలో ఆయన్ను కలవడానికి వెళ్ళినప్పుడల్లా మధుసూధనరావుకు సాదర స్వాగతం లభించేది. ఆ సమయంలోనే రామకృష్ణ గారితో పరిచయం స్నేహంగా బలపడింది. ఈ కారణాలన్నింటి దృష్ట్యా రామకృష్ణ గారిని తమ తొలి చిత్రానికి దర్శకత్వం వహించవలసిందిగా కోరారు మధుసూదన రావు, నాగేశ్వరరావులు.

ఆనందంగా, అభిమానంగా అంగీకరించారు రామకృష్ణ గారు. ఆయనకు పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. కొంతకాలం పాటు కథాచర్చలు జరిగాయి. అయితే ఒకరోజు రామకృష్ణ గారి నుండి మధుసూదన రావు కు పిలుపు వచ్చింది… వెళ్లారు.
” మీరు ఎంతో అభిమానంగా నన్ను దర్శకుడుగా ఎంచుకున్నారు. కానీ ప్రస్తుతం నేను కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల్లో ఉన్నాను. ఈ పరిస్థితుల్లో మీ తొలి చిత్రాన్ని విజయవంతం చేయటానికి అవసరమైన ఏకాగ్రత నేను నిలుపలేను. మీకు న్యాయం చేయలేనేమోనని భయంగా ఉంది. కాబట్టి ఈ చిత్రం వరకు వేరే ఎవరినైనా ఎన్నుకోండి”- చెప్పలేక చెప్పారు రామకృష్ణ గారు. తరువాత తను తీసుకున్న పదివేల రూపాయలు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు. సినిమా రంగంలో తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వటం మామూలుగా జరిగే పని కాదు. రామకృష్ణ గారి గొప్పతనం అదే.

ఇక రెండవ ప్రయత్నంగా బి ఎన్ రెడ్డి గారిని అడిగారు. ఆయన సుముఖత వ్యక్తం చేసినప్పటికీ పారితోషికం విషయంలో పొంతన కుదరలేదు.
” నేను వాహినీ సంస్థ నుండి బయటకు వచ్చి మీకు సినిమా చేయాలి అంటే లక్ష రూపాయలు అడగటం సహజం” అన్నారాయన.
కానీ కొత్త సంస్థ తొలి చిత్రానికి అంత పారితోషికం చెల్లించడం సాధ్యం కాని పని. ఆయన అడగడంలోనూ వీరు విరమించుకోవటంలోనూ అసమంజసం ఏమీ లేదు.

మరలా అన్వేషణ ప్రారంభమైంది.

ఈసారి మిత్రుడు కాజా వెంకటరామయ్య గారి సలహా మేరకు పి.పుల్లయ్య గారిని సంప్రదించారు.
ఆయన తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అప్పటికి పుల్లయ్యగారు తెలుగులో “అర్ధాంగి” చిత్రాన్ని పూర్తిచేసి అదే చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మిస్తున్నారు.
అప్పుడు మధుసూదనరావు ఒక షరతు పెట్టారు. తమ చిత్రం పూర్తయ్యే వరకు మరో ఇతర చిత్రాన్ని అంగీకరించకూడదని. పుల్లయ్య గారు తొలుత ఈ షరతుకు అంగీకరించారు.

కొద్దిరోజులు గడిచాయి.

పుల్లయ్య గారి పై వత్తిడి అధికమైంది. అంతకుముందు ఆయన ఎప్పుడో ఎవరికో అన్యాపదేశంగా ఇచ్చిన మాట వల్ల ప్రస్తుతం ఆబ్లిగేషన్స్ కు తలవంచటం తప్పనిసరి అయింది. ఆయన మరి రెండు చిత్రాలను అంగీకరించవలసి వచ్చింది.
ఒకేసారి నాలుగు చిత్రాలపై ఏకాగ్రత నిలపటం సాధ్యమా?
కుదరదులే అనుకుని మధుసూదన రావు ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నారు.
మరల అన్వేషణ ప్రారంభమైంది.

అదే సమయంలో ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.

ఏమిటా సంచలన వార్త?

(సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి నవంబర్ 9న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=LKK0SZcdGaw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here