చిత్ర పరిశ్రమకు నాటక రంగప్రముఖుల గ్రేట్ మైగ్రేషన్ – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 14, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 14

(రీక్యాప్)
( ఏ నాటకాల పిచ్చిలో పడి తాను తిరుగుతున్నాడని దెప్పిపొడిచారో ఆ నాటకరంగం ద్వారా సంప్రాప్తించిన అనుభవాలు, పరిచయాలే పెట్టుబడిగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.
అంతే… మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలు కార్యరూపం దాల్చటం మొదలు పెట్టాయి.)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

అప్పటి పరిస్థితులు కూడా ఈ నిర్ణయానికి అనుకూలంగానే పరిణమించాయి.
ఆంధ్ర నాటక కళా పరిషత్తు ద్వారా తమ ఉనికికి ఊపిరిపోసుకున్న ఎందరో రచయితలు, నటీనటులు చిత్ర రంగానికి వలసపోవటం ప్రారంభించారు.పరిషత్ సభలలో పాల్గొని బహుమతులు అందుకున్న రచయితలు ఆత్రేయ, డి.వి.నరసరాజు, పినిశెట్టి శ్రీరామమూర్తి, రావూరు సత్యనారాయణ, కొండముది గోపాలరాయ శర్మ, కొర్రపాటి గంగాధరరావు, భమిడిపాటి రాధాకృష్ణ, అనిశెట్టి, ప్రఖ్యా శ్రీరామమూర్తి, బొల్లిముంత శివరామకృష్ణ వంటి ప్రఖ్యాత నాటక రంగ రచయితలందరూ చిత్ర పరిశ్రమ బాట పట్టారు.
ఇక నటీనటుల విషయానికి వస్తే ఎన్టీ రామారావు, జగ్గయ్య, రామకృష్ణ, నాగభూషణం, చలం, డాక్టర్ రాజారావు, రమణారెడ్డి, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, పెరుమాళ్ళు, రామచంద్ర కాస్యప, వెంపటి రాధాకృష్ణ, చదలవాడ కుటుంబరావు, రామ శర్మ, సావిత్రి, వాణిశ్రీ, శారద, కాంచన, వహీదా రెహమాన్, నిర్మల, హేమలత వంటివారు సినీ రంగానికి తరలిపోయారు. ఈ “గ్రేట్ మైగ్రేషన్” కారణంగా నాటక రంగం తన సమగ్రతను క్రమంగా కోల్పోవడం జరిగింది.
ఈ పరిస్థితులకు తన వ్యక్తిగత కారణాలు ఆలోచనలు కూడా తోడుకావడంతో “ నో అదర్ గో ” అనే నిర్ణయానికి వచ్చారు మధుసూదన రావు.
ఆలోచనలు కార్యరూపం సంతరించుకోవటం ప్రారంభించాయి. అనుభవం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించాలన్న ఆశయానికి అంకురార్పణ జరిగింది. కార్యదక్షులకు ఆలోచనలు రావాలే కాని ఆచరణలో పెట్టటం ఎంతసేపు!
అనుకున్నదే తడవుగా చిత్ర నిర్మాణ ప్రారంభానికి సన్నాహాలు పూర్తి చేశారు మధుసూదనరావు. ఆంధ్ర నాటక కళా పరిషత్తులో తను అత్యంత ఆత్మీయంగా, స్నేహంగా మెలిగిన ఎం ఆర్ అప్పారావు, కాజా వెంకటరామయ్య, విజయా పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చెరుకూరి పూర్ణచంద్రరావు, మరొక మిత్రుడు ఎర్నేని వెంకటేశ్వరరావు పార్ట్నర్స్ గా ఒక నూతన చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు మధుసూదన రావు.

అది “శరత్ ఫిలిమ్స్”.
ఈ సంస్థలో అక్కినేని నాగేశ్వరరావుకు ఎలాంటి భాగస్వామ్యము లేదు.
దుక్కిపాటి- అక్కినేనిల సాన్నిహిత్యాన్ని ఎరిగిన వారందరికీ ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది.
జవహర్ ఖాదీ భాన్డార్ లో నాగేశ్వరరావుకు పెట్టుబడి లేకుండా ఆరుపైసల వాటా కల్పించిన మధుసూదన రావు ఇందులో ఆయన్ను ఎందుకు చేర్చుకోలేదు ?

అందుకు ఒక సున్నితమైన కారణం ఉంది.
” అప్పటికే నాగేశ్వరరావు హీరోగా మంచి ఉన్నత స్థానానికి చేరాడు. ఆ సమయంలో నేను ఆయనకు భాగస్వామ్యాన్ని ఆఫర్ చేస్తే అతనితో నాకు గల సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాననే అపప్రద వచ్చే అవకాశం ఉంది. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆ విషయాన్ని నాగేశ్వరరావు దగ్గర ప్రస్తావించలేదు” అంటారు మధుసూదనరావు.
అయితే కొన్ని కారణాలవల్ల శరత్ ఫిలిమ్స్ సంస్థ ఆదిలోనే ఆగిపోయింది.
తను పార్ట్నర్స్ గా చేర్చుకున్న వారంతా తమ సొంత వ్యాపారాల్లో , వ్యాపకాల్లో బిజీగా ఉండేవారు. తను ఒక్కడే సంస్థ వ్యవహారాలన్నీ చూసుకున్న వలసిన పరిస్థితులు ఉన్న దృష్ట్యా మిత్రులందరితో సమాలోచన జరిపి అంత్య నిష్టూరాన్ని ఆదిలోనే నివారించారు మధుసూదన రావు. కనీసం షేర్ కాపిటల్ ను కూడా రైజ్ చేయకముందే శరత్ ఫిలిమ్స్ సంస్థను నిలిపివేశారు.

 



తదుపరి ప్రయత్నంగా మరో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించారు మధుసూదనరావు.
అప్పటికే నాగేశ్వరరావు, అంజలీదేవి మేకప్ మ్యాన్ గోపాలరావు పార్ట్నర్స్ గా “అశ్వనీ ఫిలిమ్స్” సంస్థను ప్రారంభించి’ మాయలమారి’ అనే చిత్రాన్ని నిర్మించారు. అది విజయవంతమైంది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అప్పటికే నిర్మాణ రంగంలో అడుగుపెట్టి ఉన్న నాగేశ్వరరావుతో తన ప్రయత్నాలు, ప్లాన్స్ గురించి వివరించారు మధుసూదనరావు.
నాగేశ్వరరావు తనకు తోచిన సూచనలు చేశారు.
కొద్దిరోజుల్లోనే మరొక నూతన చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభానికి సన్నాహాలు పూర్తయ్యాయి. నవయుగ ఫిలిమ్స్ మేనేజింగ్ పార్టనర్ శ్రీనివాస రావు గారిని మరికొందరిని భాగస్వాములుగా కలుపుకొని ఈసారి పకడ్బందీగా రంగంలోకి దిగారు మధుసూదనరావు.



కంపెనీని రిజిస్టర్ చేసేముందు అక్కినేని నాగేశ్వరరావు తనంతతానుగా” నేను కూడా పార్ట్నర్షిప్ చేరతాను” అన్నారు. తనంత తాను చేరుతానంటే అభ్యంతరం ఏముంటుంది?
‘వెల్కమ్’ అన్నారు మధుసూదనరావు.
నాగేశ్వరరావు పార్ట్నర్గా చేరతారన్న వార్తతో నవయుగ ఫిలిమ్స్ శ్రీనివాసరావు చాలా ఆనందపడ్డారు.

నాగేశ్వరరావుతో మధుసూదనరావుకు గల ఇంటిమసీ ద్వారా ఆయన నటించే చిత్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందవచ్చు అన్నది శ్రీనివాసరావు ఆలోచన. ఉభయతారకమైన ఈ ఆలోచన అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సంస్థ ప్రారంభానికి రంగం సిద్ధం అయింది. సన్నాహాలు పూర్తయ్యాయి. నామకరణం జరపడమే తరువాయి.

మధుసూదన రావు తన పెద్ద కుమార్తె లలితకుమారి, రెండవ కుమార్తె కళ్యాణిలతో పాటు అన్నపూర్ణ అనే పేరు కూడా ఇచ్చి ఈ మూడు పేర్లలో ఏ పేరు పెడితే బాగుంటుందో సూచించమని సముద్రాల రాఘవాచార్యులు గారిని, నార్ల వెంకటేశ్వరరావు గారిని కోరారు.



సంఖ్యా శాస్త్రాన్ని తదితర అంశాలను పరిశీలించి చివరకు” అన్నపూర్ణ” అనే పేరు అన్ని విధాలా బాగుంటుంది అని చెప్పారు సముద్రాల, నార్ల గార్లు. అందరూ కలిసి అదే పేరు ఖాయం చేశారు.
“అన్నపూర్ణ అంటే నా భార్య పేరు పెట్టామని అనుకుంటారేమో”! సందేహం వెలిబుచ్చారు నాగేశ్వరరావు.
“అనుకుంటే అనుకోనివ్వు – మరీ మంచిది” అన్నారు మధుసూదనరావు.
ఇంతకూ “అన్నపూర్ణ” అంటే మధుసూదన రావు తల్లి గారి పేరు. కన్నతల్లి చిన్నతనంలోనే పోతే చిన్న పిల్లలను అల్లారుముద్దుగా పెంచిన ప్రేమమూర్తి అన్నపూర్ణమ్మ గారు. ఆ మహాతల్లి ప్రేమానురాగాల స్మృతి చిహ్నంగా అవతరించింది అన్నపూర్ణ సంస్థ. ఈ విషయం కొందరు సన్నిహితులకు తప్ప ఇప్పటికి చాలా మందికి తెలియదు.
1951 సెప్టెంబర్ 10న” అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” రిజిస్ట్రేషన్ జరిగింది.
అక్కినేని నాగేశ్వరరావు చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్.
దుక్కిపాటి మధుసూదనరావు మేనేజింగ్ డైరెక్టర్.
కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టీ వి ఏ సూర్యారావు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా సంస్థ ప్రారంభమైంది.



ఆశయ సాధనలో తొలి మెట్టు ఎక్కారు మధుసూదనరావు.

( సశేషం)

( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి- నవంబర్ 7న చదవండి)
– ప్రభు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here