అక్కడ పునాదులు పడుతుంటే ఇక్కడ స్తబ్దత అలముకుంది – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 9, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 9

(రీ- క్యాప్)
( ఒంటరిగా మిగిలిపోతున్నాను అన్నది నాగేశ్వరరావు బాధ- ఒంటరిగా వదిలి వెళుతున్నాను అన్నది మధుసూదన రావు వ్యధ)

( గత ఎపిసోడ్ తరువాయి భాగం)

తిరిగి గుడివాడకు చేరారు మధుసూదనరావు. సెలవు దినాల్లో స్కూల్ కాంపౌండ్ లాగా బోసిగా కనిపించింది ఎక్సెల్షియర్ నాటక సమాజం. ఇద్దరు నాగేశ్వరరావులు వెళ్ళిపోయారు. సమాజానికి రెండు కళ్ళు పోయినట్లు అయింది.
క్రమంగా మధుసూదన రావు ఆలోచనల పరిధినుండి నాగేశ్వరరావు, నాటక సమాజం దూరం అయ్యాయి.
అక్కడ నాగేశ్వరరావు భవిష్యత్తుకు పునాదులు పడుతుంటే ఇక్కడ సమాజం స్తబ్దతలోకి జారుకుంది.
మిగిలిన వ్యాపకం జవహర్ ఖాదీ భాండార్. కొద్దిరోజులు గడిచాయి. ఒక అనుకోని సంఘటన జరిగింది.
మధుసూదన రావుకు ఎం. ఆర్. అప్పారావు గారి నుండి ఒక ఆహ్వానం అందింది.ఆ ఆహ్వానంలో ఒక ఆఫర్ ఉంది. ఆ ఆఫర్ లో ఒక బాధ్యత ఉంది.

ఆ బాధ్యతే “ఆంధ్ర నాటక కళా పరిషత్” సహాయ కార్యదర్శి పదవీ నిర్వహణ.
తను ఆరాధించే కళామతల్లికి, తను అభిమానించే నాటకరంగానికి సేవ చేసే అవకాశం, అదృష్టం మరలా ఈ రూపంలో వచ్చాయి.

ఎం. ఆర్. అప్పారావు గారి నుండి ఈ ఆహ్వానం రావటానికి ముందు ఒక పూర్వ గాధ ఉంది.
1943లో “ బందరు ఆంధ్ర నాటక కళా పరిషత్” మహాసభలు జరిగినప్పుడు ఎం. ఆర్. అప్పారావు గారిని ఏకగ్రీవంగా పరిషత్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అప్పటివరకు కొద్దిమంది ప్రొఫెషనల్స్, ఔత్సాహికులు రెండేళ్లకో మూడేళ్లకో లాంచనంగా పరిషత్తు సభలు జరిపేవారు. వాటిపట్ల కళాభిమానుల్లో అంత ఆసక్తి ఉండేది కాదు. సభలు జరిగిన కొద్దిరోజులు తప్పితే పరిషత్తు పేరు ఎక్కడా వినిపించేది కాదు. ఔత్సాహికులకు పరిషత్తు కార్యక్రమాలలో తగిన విలువ, ప్రాధాన్యత ఉండేవి కావు. అంతా అస్తవ్యస్తంగా ఉండేది.

పరిషత్తును సర్వ లక్షణ సమన్వితమైన సంస్థగా రూపుదిద్ద టానికి ప్రయత్నం అప్పారావు గారిని అధ్యక్షునిగా ఎన్నుకోగానే ప్రారంభమైంది. పరిషత్ ప్రతిష్ట సువ్యాపితం కావాలంటే ఔత్సాహిక సమాజాలను కూడగట్టుకుని రావాలని మొదటిగా భావించిన వారు బహుశా అప్పారావు గారే. నాటక కళ పట్ల నిజమైన ఉత్సాహం కలిగి ఏడాది పొడుగునా దీక్షాదక్షతలతో పనిచేసే కార్యకర్తలు అవసరం అని ఆయన భావించారు.

ఆ భావనలో ఆయనకు స్ఫురించిన వారిలో మధుసూదన రావు ఒకరు. వీరిద్దరూ ఒకప్పుడు బందరు నోబుల్ కళాశాలలో సహాధ్యాయులే కదా!
అప్పటినుండి ఆ సాన్నిహిత్యం, ఆ పరస్పర గౌరవాభిమానాలు గౌరవప్రదంగా కొనసాగుతూ వచ్చాయి. కాలేజీ రోజుల్లోనే కాకుండా ఎక్సెల్షియర్ సమాజం సెక్రటరీగా కూడా మధుసూదన రావులో ఉన్న క్రియాశీల, ప్రగతిశీల భావాలు, కార్యదక్షత, కళల పట్ల ఆసక్తి, నాటక రంగం పట్ల ఆరాధన గురించి అప్పారావు గారు విన్నారు… చూసారు.

అందుకు ఫలితమే ఈ ఆహ్వానం.
ఆ రోజుల్లో పరిషత్ కార్యకర్తలను అధ్యక్షుల వారే ఎంచి నియమించుకునేవారు.
ఈ ఆహ్వాన ఫలితంగా ఎక్సెల్షియర్ సమాజం క్రమంగా కనుమరుగవుతూ ఉంటే ఆంధ్ర నాటక కళా పరిషత్తుతో మధుసూదనరావు అనుబంధం బలపడటం ప్రారంభమైంది.

ఇక్కడ ఇది ఇలా ఉండగా అక్కడ మద్రాసులో నాగేశ్వరరావు తొలి చిత్రమైన “సీతారామజననం” పూర్తిచేసి మంచి నటుడని, మంచివాడని గుర్తింపు సంపాదించుకున్నాడు. తదుపరి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
అది రానే వచ్చింది. అయితే ఆ అవకాశం తనకు నిజంగా వచ్చింది.. లేనిదీ తెలియని పరిస్థితి.
అది తనకు దక్కుతుందో లేదో అన్న అయోమయంలో ఉన్నాడు అక్కినేని నాగేశ్వరరావు.
“మాయాలోకం” చిత్రంలో హీరోగా చేసే ఆ అవకాశాన్ని ఖరారు చేయవలసింది గూడవల్లి రామబ్రహ్మం గారు.
ఆయన అనుగ్రహిస్తే బోళా శంకరుడు అనీ,ఆగ్రహిస్తే దూర్వాసుడు అనీ ప్రతీతి.

మాలపిల్ల, రైతు బిడ్డ వంటి అభ్యుదయ చిత్రాల దర్శకుడిగా ఆయన పేరు చిత్ర పరిశ్రమలో మారుమోగిపోతోంది. ఇప్పుడు “కాంభోజ రాజు” బుర్ర కథ ఆధారంగా గూడవల్లి రామబ్రహ్మం గారు నిర్మించ తలపెట్టిన చిత్రం “మాయాలోకం”. అందులో “శరాంబదిరాజు” వేషం కోసం ఒక మంచి నటుడు గురించి వెతుకుతున్నారాయన .
అదే సమయంలో ఖద్దరు కొనుగోలు నిమిత్తం దక్షిణాది వెళ్లి తిరిగి వస్తూ మద్రాసులో ఆగారు మధుసూదన రావు. ప్రతిభా వారి ఆఫీసుకు వెళ్లి నాగేశ్వరరావును కలిశారు. ఆ తరువాత గూడవల్లి రామబ్రహ్మం గారు ఒంట్లో ఏదో సుస్తీ చేసి రంగా నర్సింగ్ హోంలో చేరారని ఘంటసాల బలరామయ్యగారు చెప్పగా పరామర్శించటానికి వెళ్లారు మధుసూదన రావు. వీరిద్దరికి అంతకు పూర్వమే పరిచయం ఉంది. అదెలాగంటే…

మధుసూదనరావు తండ్రి సీతారామస్వామి గారు గూడవల్లి రామబ్రహ్మంగారు చిరకాల మిత్రులు. ఒకసారి 1937 జనరల్ ఎలక్షన్స్ లో మద్రాసు శాసనసభకు జస్టిస్ పార్టీ అభ్యర్థిగా చల్లపల్లి రాజా గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి బ్రహ్మయ్య గారు నిల్చున్నారు. చల్లపల్లి రాజా గారి తరపున గూడవల్లి రామబ్రహ్మం గారు, కొసరాజు రాఘవయ్య చౌదరి గారు గుడివాడ, ముదినేపల్లి ప్రాంతాలలో ప్రచారానికి వచ్చారు. అయితే స్వతహాగా కాంగ్రెస్ అభిమాని అయిన మధుసూధనరావు ఆయన మిత్రబృందం వీరి ప్రచారాన్ని సాగనీయకుండా సభల్లో అల్లరి చేసి వాళ్లు వెను తిరిగేలా చేశారు. ఈ సందర్భంగా మధుసూదనరావు పై ఆయన తండ్రి గారికి ” చూసావా నీ సుపుత్రుడి నిర్వాకం ” అంటూ ఫిర్యాదు చేశారు రామబ్రహ్మం గారు. అయితే ఇవి రాజకీయంగా ఉన్న అభిప్రాయబేధాలే కానీ వ్యక్తిగతంగా రామబ్రహ్మం గారి పైన, చల్లపల్లి రాజా గారి పైన మధుసూదన రావుకి ఎంతో గౌరవం ఉండేది. అది గమనించిన రామబ్రహ్మం గారు, చల్లపల్లి రాజా గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడమే కాక మధుసూదన రావు పట్ల ఒక సదభిప్రాయాన్నే కలిగి ఉన్నారు.
ఇది వీరి పూర్వ పరిచయాల కథా కమామీషు.

సరే- ఇక ప్రస్తుతానికి వస్తే పలకరింపులు, పరామర్శలు అయ్యాక రామబ్రహ్మంగారే ” మాయాలోకం తీస్తున్నాను… శరాంబదిరాజు వేషానికి 19 లేదా 20 ఏళ్ల వయసున్న మంచి కుర్రాడు కావాలి.. ఎవరైనా ఉన్నారా” అని అడిగారు గూడవల్లి రామబ్రహ్మం గారు.

మధుసూధనరావు మదిలో చప్పున నాగేశ్వరరావు మెదిలాడు.
కానీ వెంటనే చెబితే ఏమనుకుంటారో..?
అడిగిన వెంటనే తమ కుర్రాడిని సిఫార్సు చేసుకుంటున్నాడని అపార్థం చేసుకుంటారేమో..!
అందుకే వెళ్లిన వెంటనే వాకబు చేసి ఉత్తరం రాస్తానని చెప్పి వచ్చారు మధుసూదన రావు.
గుడివాడ చేరిన వెంటనే రామబ్రహ్మం గారికి ఉత్తరం రాశారు.

“మీరు చెప్పిన వేషానికి తగిన కుర్రాడు మద్రాసులోనే ప్రతిభ ఆఫీసులో ఉన్నాడు. ఘంటసాల బలరామయ్యగారి సీతారామజననంలో చేసాడు. మీరు చెప్పిన అన్ని లక్షణాలు ఆ కుర్రాడికి ఉన్నాయి”.
ఇదీ ఆ లేఖ సారాంశం.

ఇది జరిగిన కొద్ది రోజులకు గూడవల్లి రామబ్రహ్మం గారు అక్కినేని నాగేశ్వరరావును చూడటం కోసం ప్రతిభా వారి ఆఫీసుకు వెళ్లారు..

అప్పుడేం జరిగింది!?

గూడవల్లి రామబ్రహ్మం గారు అక్కినేని నాగేశ్వరరావును చూశారా!?
చూసి ఏమన్నారు..?
ఆ అవకాశం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కిందా !?

(సశేషం)

(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి అక్టోబర్ 28న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=3Ga2Y5nNfUk]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here