1944 మే 8.. మధ్యాహ్నం రెండు గంటలు… ఆ ముహూర్త బలం ఏమిటి? – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 8, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 8

(రీ క్యాప్)

(ఎక్సెల్షియర్ నాటక సమాజం, అందులో నాగేశ్వరరావు, జవహర్ ఖాదీ బాండార్- అప్పట్లో ఈ మూడు అంశాలు మధుసూదన రావు మస్తిష్కాన్ని భర్తీ చేసే ఆలోచనలు. ఇంతలో ఎవరు ఊహించని, ఎదురుచూడని ఒక పరిణామం సంభవించింది)

(గత ఎపిసోడ్ తరువాయి భాగం)

అక్కినేని నాగేశ్వరరావుకు సినిమా ఛాన్స్ వచ్చింది.!! ఆ అవకాశం, ఆ ఆహ్వానం వచ్చింది ఎవరో అల్లాటప్ప వ్యక్తి నుండి కాదు.”ప్రతిభ ఫిలిమ్స్” అధిపతి ఘంటసాల బలరామయ్యగారి నుండి. నాగేశ్వర రావు అన్నయ్య రామబ్రహ్మం గారు బ్రహ్మానంద పడిపోయారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న అవకాశం వచ్చింది కాబట్టి తక్షణం వెళ్లాలన్నారు. మధుసూదన రావుకు తొందరపాటు తగదు అనిపించింది. అర్భకుడు, ఆడ వేషాలు వేస్తున్న వాడు తొందరపడి వెళ్లి హీరో వేషాలకు ఒప్పుకుంటే మార్పు కొరకు చాలా అవస్థ పడవలసి వస్తుంది. కొంచెం ఆగి ఇంకో మంచి కంపెనీ, వీలైతే సాంఘిక చిత్రం చూసుకుని అందులో ప్రయత్నించాలన్నది ఆయన అభిప్రాయం. ఇక్కడ మరొక విషమ పరీక్ష కూడా ఉంది. నడుస్తున్న నాటక సమాజం ఏమయ్యేట్టు.? అది నేటి ఉన్నత స్థితికి రావడానికి ముఖ్య కారకుడు అక్కినేని నాగేశ్వరరావే కదా? ఇప్పుడతను సినిమాల్లోకి వెళ్లిపోతే ఈ బృందం, ఈ సమాజం ఏం కాను? కొందరు మిత్రులు అవునన్నారు… కొందరు కాదన్నారు. నాగేశ్వరరావుకు ఎటూ పాలుపోలేదు.

మేకప్ మాన్ మంగయ్య గారిని సలహా అడిగాడు. ఆయన పరిస్థితి పరిశీలించి, భవిష్యత్తు బేరీజు వేసి వెళ్ళమని సలహా ఇచ్చారు. వెళ్లమన్న వారి అభిప్రాయాలను , వద్దన్న వారి వాదనలను రెండు విన్న నాగేశ్వరరావు స్వగతంలో ఆలోచించుకున్నారు. తుది నిర్ణయాన్ని మాత్రం మధుసూదన రావుకు వదిలేశారు. అది ఆయన పై గల అపార నమ్మకం మరి. నాగేశ్వరరావు కన్నా మధుసూదన రావు ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచించారు. నాగేశ్వరరావు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచించారు. సమాజం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలోచించారు. రెండింటినీ బేరీజు వేసుకుని ఆలోచించారు. చివరకు నాగేశ్వరరావును సినిమాల్లోకి పంపాలనే నిర్ణయానికి వచ్చారు.

అయితే నాగేశ్వరరావు సినిమాలలో దెబ్బతిన్నా అతనికి ఇబ్బంది రాకుండా కట్టుదిట్టం చేశారాయన. నాటక సమాజం పూర్తిగా దెబ్బ తినకుండా నెలకు ఇరవై రోజులు మద్రాసులో ఉండి సినిమాలకు పని చేయటం, పది రోజులు గుడివాడ వచ్చి నాటకాలు వేయడం- ఇదీ ఆయన చేసిన ఏర్పాటు.కొందరు మిత్రులు, క్లబ్ అభిమానులు, నట బృందంలోని కొందరు మధుసూదన రావు విమర్శించారు. మీరు నాగేశ్వర్రావు ఇద్దరినీ పంపించేసి( పెండ్యాల నాగేశ్వరరావు కు అదే సమయంలో సంగీత దర్శకుడిగా అవకాశం వచ్చి ఆయన మద్రాస్ వెళ్లిపోయారు) సమాజానికి అన్యాయం చేస్తున్నారని నిందించారు.

“మనది వ్యాపార సంస్థ కాదు. మనందరం కాలక్షేపానికి ఇది చేస్తున్నాం. ఆ ఇద్దరు నాగేశ్వరరావులకు ఇదే బ్రతుకుతెరువు కాబోతుంది. రేపు మనకి ఏదైనా ఇబ్బందులు ఎదురై నాటక సమాజాన్ని ఎత్తేస్తే వాళ్ల భవిష్యత్తు ఏం కాను..? ఆ విమర్శలకు మధుసూదనరావు చెప్పిన సమాధానం ఇది. సరే! నెలకు పది రోజులు వచ్చి పని చేస్తాను అన్నాడు కదా అని సరిపెట్టుకున్నారు అంతా.

1944 మే 7న మధుసూదనరావు వెంట మద్రాసు మెయిల్ ఎక్కాడు అక్కినేని నాగేశ్వరరావు.

అది ప్రయాణం..
అది ప్రయాస..
అది ప్రయత్నం..
అది ప్రారంభం..

కాలం విచిత్రమైంది.

మూడేళ్ల క్రితం తన వెంట నడిచిన ఒక తమ్ముడు కాని తమ్ముడిని, బంధువు కాని బంధువుని తీసుకుని ఆ పయనం ఎక్కడికో…

ఏ అంతు తెలియని తీరాలకు…!
ఏ అంతం తెలియని దూరాలకు…!

తన వెంట వస్తున్న ఆ పాలబుగ్గల కుర్రవాడు వెండితెర మీద వన్నెలు చిలికించగలడని , వెన్నెల కురిపించగలడని, చరిత్రలు సృష్టించగలడని, చిత్రాలు మార్చగల డని ఎవరూ ఊహించలేదు.

ఈ సామాన్యుడు అసామాన్యుడై , అద్వితీయుడై, అందనివాడై , అందరివాడై, అఖిలాంధ్ర ప్రేక్షక జన హృదయాధినేతయై , సమున్నత, సముజ్వల, సమగ్ర నటజీవిత వైభవ ప్రాభవాలను సొంతం చేసుకుని, మహోన్నత హిమగిరులు సైతం శిరస్సుల నెత్తి చూడవలసినంతటి ఉన్నతికి, ఊర్ధ్వ శిఖరాలకు చేరుకొని తెలుగు చలనచిత్ర కీర్తి పతాకను అంబర చుంబితం గావించి జగద్విదితుడై , జగజ్జెగీయమానంగా ఎదుగుతాడని, వెలుగుతాడని మధుసూదన రావు తెలియదు.

అది తెలిసింది.. అందుకు సాక్షీభూతంగా నిలిచింది కాలం ఒక్కటే!

తెలుగు సినీ సామ్రాజ్యానికి ఒక భావి సామ్రాట్ ను, ఒక భావి నిర్మాతను మోసుకొచ్చానన్న మర్మం తెలిసిన గర్వంతో కాబోలు గంభీరంగా ఐదు గంటలు ఆలస్యంగా మద్రాసు సెంట్రల్ ను చేరింది మెయిల్.

1944 మే 8- మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రతిభా వారి ఆఫీసు ముందు ఆగింది జట్కా. ఘంటసాల బలరామయ్యగారు సాదరంగా ఆహ్వానించారు. సంప్రదింపులు జరిగాయి.
నాగేశ్వరరావు ప్రతి నెల ఫస్ట్ నుండి 20 వరకు సినిమాలకు పనిచేసేటట్లు, అక్కడినుండి నెలాఖరు దాకా దేశం వచ్చి నాటకాలు వేసేటట్లు ఒప్పందం చేసుకున్నారు.
మర్నాడు మధుసూదనరావు గుడివాడకు ప్రయాణమయ్యారు.

కొడుకును హాస్టల్లో వదిలి వెళుతున్న తండ్రి పరిస్థితి ఆయనది. మొదటి నుండి చెప్పుకొచ్చే సుద్దులు, బుద్ధులు మళ్లీ చెప్పుకొచ్చారు.

చెయ్యవలసినవి చెప్పారు
చెయ్యకూడనివి చెప్పారు

ఒంటరిగా మిగిలిపోతున్నానన్నది నాగేశ్వరరావు బాధ.
ఒంటరిగా వదిలి వెళుతున్నానన్నది మధుసూదన రావు వ్యథ.

(సశేషం)
(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి 26 అక్టోబర్ న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=d2asgcwJcC4]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here