దుక్కిపాటి – అక్కినేని వ్యాపార భాగస్వాములయ్యారు – ఎలా? : స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 7, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar

(రీ-క్యాప్)
(ఎడతెరిపిలేని ప్రదర్శనలతో, అంతులేని ప్రశంసలతో మూడేళ్లు హాయిగా అద్భుతంగా ఆనందమయంగా సాగిపోయాయి)

(గత ఎపిసోడ్ తరువాయి భాగం)

నాగేశ్వరరావుతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాజం ఒక దేవాలయం అయింది. కళామతల్లి ఆరాధ్య దైవం అయితే మధుసూదన రావు పూజారి. అందరికన్నా సమాజానికి తను, తనకి సమాజం అన్న రీతిలో ఉభయతారకంగా వెలిగింది అక్కినేని నాగేశ్వరరావు.

మూడేళ్ల సమాజ సమారాధన, మధుసూదన రావుతో మూడేళ్ల సహజీవనం నాగేశ్వరరావు జీవిత గమనాన్ని, సరళిని మార్చి వేసింది.పల్లెటూరు ముతక ఖద్దరు కుర్రవాడిని చలవ చేసి సాపు దీర్చిన చలవ ఎక్సెల్షియర్ సమాజానిది, అందులో ముఖ్యంగా మధుసూదనరావుది.

” ఆయన నాకు మా అన్నయ్య తరువాత అన్నయ్య అంతటి వారయ్యారు. ఆ సమాజము నాకు మిడిల్ స్కూల్ , హై స్కూలు, కాలేజీ, విశ్వవిద్యాలయం అయింది” అంటారు నాగేశ్వరరావు.
అక్కడే నాగేశ్వరరావు డైలాగులు చక్కగా చెప్పటం నేర్చుకున్నారు. విమర్శను, ఖండనను స్వీకరించి తప్పొప్పులు సరిదిద్దుకోవటం అలవరుచుకుంది అక్కడే. ఆ తరువాతి కాలంలో తన జీవితమంతటినీ ప్రభావితం చేసిన క్రమశిక్షణ, ప్రపంచ జ్ఞానం గడించడానికి బీజాలు పడింది అక్కడే.

ఉత్తముడు, ప్రతిభాశాలి, సుసంస్కృతుడు అయిన మిత్రుడిని , మరొక అన్నయ్యను, గురువును వెరసి మధుసూదనరావును సంపాదించుకుంది అక్కడే.నాగేశ్వరరావు మధుసూదన రావు మాటను ఎప్పుడూ శిరసావహించే వారు. ఆయన మాటను ఎదిరించి వాదించి మెప్పించడం కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నారు.

“నాగేశ్వరరావు! నూనె మంచిది కాదు…
తిరగమోత పెట్టినవి ఎక్కువ తినమాకు…
చూడూ ! సోడా వద్దు- కంఠం పాడవుద్ది…
కిళ్లీ కుర్రాళ్లకు తగదు… నాలిక బండ బారుద్ది…
ఇడ్లీలు కొబ్బరిపచ్చడి వద్దోయ్ ..
కంఠం పాడవుద్ది..
హార్లిక్స్ తాగు.. సత్తువ..”
ఇదీ వరస.
ఏమిటీ ఆప్యాయత?
ఎక్కడిదీ ఆదరణ?
ఎలా ఏర్పడింది ఈ అభిమానం.? ఇలాంటి సుద్దులూ బుద్ధులూ ఒక తల్లి బిడ్డకు చెప్తుంది…
ఒక తండ్రి కొడుక్కు చెబుతాడు…
ఒక అన్న తమ్ముడికి చెప్తాడు…
ఒక గురువు శిష్యుడికి చెప్తాడు.
మరి మధుసూధనరావు నాగేశ్వర రావుకు ఏమై ఇవన్నీ చెప్పారు?
వీటన్నింటికంటే ఉన్నతమైన అనుబంధం ఏదైనా ఉంటే ఆ అనిర్వచనీయమైన అనుబంధమే ఈ ఆప్యాయతాభిమానాలకు హేతువు.మధుసూదనరావు లో ఉన్న ఆశయం ఒక్కటే.
చిరంజీవి నాగేశ్వరరావులో నిబిడీకృతమై ఉన్న ప్రతిభను వెలికి తీసి అతన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలన్నదే ఆయన ఆశయం.కేవలం నటనలోనే కాకుండా నిజ జీవితంలో కూడా నాగేశ్వరరావును నియమబద్దున్ని చేశారు మధుసూదన రావు.

నాగేశ్వరరావు ఈ నియమాలు అన్నింటినీ పాటించేవాడు. ఎప్పుడైనా ఏ బజారులోనో, సినిమా హాల్ వద్దనో ఒక చక్కని అమ్మాయి కనిపించి నాగేశ్వరరావు ఆమె వంక చూస్తున్నట్టు కనిపిస్తే క్షణంలో అతనికి టెంకి జల్ల తగిలేది.”నాటకాల వాళ్లకు నీతి నియమాలు లేవని, వ్యసనపరులు అని పేరుంది. మీకు అలాంటి చెడ్డ పేరు కావాలా?” అని గద్దించేది మధుసూదన రావు కంఠం.
అంతటి క్రమశిక్షణ మధుసూదనరావుది.బృందంలోని మిగతా నటుల విషయంలో కూడా అంత కచ్చితంగా ఉండేవారాయన.

ఈ విధమైన కఠోర క్రమశిక్షణను, నియమ నిబంధనలను,నైతిక సూత్రాలను, మానవతా మూల్యాలను సమాజంలోని అందరికీ ఉద్భోదిస్తూ, తాను స్వయంగా ఆచరిస్తూ ఎక్సెల్షియర్ క్లబ్బు వైభవానికి, తద్వారా నాటకరంగానికి, కళామతల్లికి కమనీయ సేవలందించారు మధుసూదన రావు.

ఒకవైపు ఎక్సెల్సియర్ సమాజం దిగ్విజయంగా నడుస్తుండగానే పోలవరపు సూర్యప్రకాశరావు, మరి కొందరు మిత్రుల భాగస్వామ్యంతో గుడివాడలో “జవహర్ ఖాదీ బాండార్” స్థాపించారు మధుసూదనరావు. ఇందులో నాగేశ్వరరావుకు కేవలం “వంద రూపాయల పెట్టుబడితో ఆరు పైసల వాటా” కల్పించారు.మూడేళ్ల క్రితం అపరిచిత వ్యక్తిగా మధుసూదనరావు వెంట నడిచి వచ్చిన నాగేశ్వరరావు ప్రస్తుతం వ్యాపారంలో భాగస్వామి అయ్యారు.ఇది దిన దిన ప్రవర్ధమానమవుతున్న వారి స్నేహానికి, అనుబంధానికి, ఆత్మీయతకు నిదర్శనం.

జవహర్ ఖాదీ బండార్ లో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగేది. గుడివాడ లోనే కాకుండా తాలూకా స్థాయిలో కాంగ్రెస్ వాదులు కార్యకర్తలు అంతా జవహర్ ఖాదీ భాండార్ కస్టమర్లే.నీలం సంజీవరెడ్డి గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు తదితర కాంగ్రెస్ నాయకులు గుడివాడ వచ్చినప్పుడు ఖద్దరు ఇక్కడే కొనుగోలు చేసేవారు.సమాజంలోనూ, ఊర్లో ను ఎక్కడ చూసినా అందరూ ఖద్దరే ధరించడంతో నాగేశ్వరరావుకు కూడా ఖద్దరు మీద భక్తి కలిగింది. వెంటనే కోరా ఖద్దరు కుట్టించుకుని దర్జాగా మధుసూదన రావు ముందుకు వచ్చి నిలబడ్డాడు. చూడటానికి చాలా దర్జాగా ఉంది. కానీ స్థిరంగా నిలబడలేక అందరూ చూస్తుండగా గోక్కో లేక నాగేశ్వరరావు పడ్డ అవస్థలు చూసి నవ్వుకునే వారు మధుసూదనరావు. మృదువుగా, నాజూగ్గా ఉండే నాగేశ్వరరావు ఒంటిమీద బరకగా, బిగుసుకున్న ట్లుగా ఉండే కోరా ఖద్దరు ఇమడ లేదు.

పచ్చని శరీరంపై దద్దుర్లు వచ్చి దురద పెట్టేది. వెంటనే నాగేశ్వరరావు కుట్టించుకున్న కోరా ఖద్దరు మొత్తం బ్లీచింగ్ కు పంపించి ఆయనను ఖద్దరు దురద నుండి విముక్తున్ని చేశారు మధుసూదనరావు.ఈ ఒక్క విషయంలోనే కాదు… నాగేశ్వరరావుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మధుసూదనరావు ప్రసక్తి, ప్రమేయం, ప్రబోధం ఉండేవి. ఆయనకు నాగేశ్వరరావు లో అమితంగా నచ్చిన గుణం ఒకటుంది.

అదే తెలియనివి అడిగి తెలుసుకునే కుతూహలం..!
ప్రతిదీ శోధించి సాధించాలనే తపన..!
స్వాతంత్ర్య పోరాటం మొదలు రెండవ ప్రపంచ యుద్ధం వరకు సమస్త సమకాలీన సామాజిక స్థితిగతులను అడిగి తెలుసుకుని ఆకళింపు చేసుకునేవారు నాగేశ్వరరావు.

ఎక్సెల్షియర్ సమాజం-
అందులో అక్కినేని నాగేశ్వరరావు- జవహర్ ఖాదీ బాండార్ –
ఈ మూడు విషయాలే అప్పట్లో మధుసూదన రావు మస్తిష్కాన్ని భర్తీ చేసే ఆలోచనలు.
ఈ ఆలోచనలు వాటి కార్యాచరణతో కాలం హాయిగా గడిచిపోతున్న తరుణంలో ఎవరు ఊహించని, ఎదురు చూడని ఒక పరిణామం సంభవించింది.
ఏమిటా పరిణామం !?

( సశేషం)

(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి- అక్టోబర్ -24 న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=JtJW1EmDmWc]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here