అక్కినేని నాగేశ్వరరావును పెళ్లి చేసుకుంటానని ఉవ్వుళ్ళూరిన అతనెవరు !? – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 6, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna - First Daily Web Article Series - Part 6

(రీ-క్యాప్)
( అక్కినేని నాగేశ్వరరావుకు అతని వల్ల ఎక్సెల్షియర్ సమాజానికి గొప్ప పేరు వచ్చింది. ఈ పరిస్థితుల్లో సమాజానికి ఒక సమస్య వచ్చింది)

( గత ఎపిసోడ్ తరువాయి)

ప్రస్తుతం సమాజం చేతిలో ఉన్నది ఒకే ఒక్క నాటకం. అది ఆశాజ్యోతి. ఆ ఒక్క నాటకంతో ఎన్ని ప్రదర్శనలు ఇస్తారు? అందుకే కనీసం మరి రెండు నాటకాలను సిద్ధం చేసుకోవాలని సంకల్పించింది సమాజం. అనుకున్నదే తడవుగా అందుకు ఏర్పాట్లు చేసింది.

ముందుగా “సత్యాన్వేషణ” అనే నాటకం తయారైంది. ఈ నాటకాన్ని గుడివాడ బోర్డ్ హై స్కూల్ లో సంస్కృతం టీచర్ గా పనిచేస్తున్న సూరపనేని శోభనరావు రచించారు. వితంతు పునర్వివాహం, కుల మత సంకుచిత భావాల నిర్మూలన వంటి మంచి ప్రగతిశీల భావాలతో కూడుకున్న నాటకం ఇది. నటీనటులందరూ చక్కగా తర్ఫీదు పొందారు. ఇందులో నాగేశ్వరరావుది ప్రేమించి పునర్వివాహం చేసుకున్న వితంతు పాత్ర.
వీరు నాటకాన్ని ప్రదర్శనకు సిద్ధం చేసుకున్న సమయంలోనే గుడివాడలో ప్రముఖ రచయిత – శతావధాని త్రిపురనేని రామస్వామి చౌదరి గారి (త్రిపురనేని గోపీచంద్ గారి తండ్రిగారు) షష్టిపూర్తి ఉత్సవాలను ఘనంగా జరిపించడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆయనను గజారోహణ గావించి ఘనంగా సన్మానించాలని సంకల్పించారు. ఆ ఉత్సవాలలో సత్యాన్వేషణ తొలి ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించారు. త్రిపురనేని వారి షష్టిపూర్తి ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కాబట్టి వారి ముందు ప్రదర్శన ఇస్తే సమాజం యొక్క పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి అన్నది వారి ఉద్దేశం.

సరే.. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రదర్శన ఇవ్వవలసిన రోజు వచ్చింది. అయితే చివరి క్షణంలో నిరాశ ఎదురైంది. ప్రదర్శనకు కలెక్టర్ అనుమతి లభించలేదు.
అప్పట్లో నాటక సమాజాల మీద ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచేది. ప్రదర్శించే ప్రతి నాటకం స్క్రిప్ట్ ప్రతిని కలెక్టర్ కు పంపాలి. ఆయన అనుమతి లభిస్తేనే ప్రదర్శన. నాటకాల ద్వారా యువకుల్లో వామపక్ష భావాలను, విప్లవ చైతన్యాన్ని పురికొల్పే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆంక్షలను విధించింది. సత్యాన్వేషణ నాటకంలో మంచి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండటం వల్లనే ఆ నాటకానికి అనుమతి నిరాకరించబడింది. ఎంతో శ్రమకోర్చి సాధన చేసిన నాటకం ప్రదర్శనకు నోచుకోకపోవడంతో అందరూ నిరాశపడ్డారు. మరలా “ఆశాజ్యోతి” పైనే ఆధార పడవలసి వచ్చింది. ఆ ఒక్క నాటకాన్ని విరివిగా ప్రదర్శించేవారు. కొంతకాలానికి సత్యాన్వేషణ నాటకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి కుండబద్దలు కొట్టినట్లుగా ఉన్న సన్నివేశాలను టోన్ డౌన్ చేసి కలెక్టర్ అనుమతి పొంది ప్రదర్శనకు సిద్ధం చేశారు.

దీనికితోడు “వేదాంత కవి” రచించిన” తెలుగు తల్లి” అనే ఒక ప్రచురిత నాటకాన్ని కూడా సాధన చేశారు. అయితే ఈ నాటకాన్ని అప్పటికే ఇతర సమాజాల వాళ్లు బాగా ఆడి ఉండటంతో ఎక్సెల్షియర్ సమాజం వారు దీనిని ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వలేదు.
లెక్కకు మూడు నాటకాలు చేతిలో ఉన్నా ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చినవి ఆశాజ్యోతి, సత్యాన్వేషణ. గుడివాడ కేంద్రంగా తాలూకా స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనే కాకుండా పొరుగు జిల్లాలైన గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో కూడా విస్తృతంగా పర్యటించి ప్రదర్శనలిచ్చారు. ప్రొఫెషనల్స్, కాంట్రాక్ట్ నాటకాల వాళ్లు అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆ రోజుల్లో ఎక్సెల్షియర్ సమాజం క్రమశిక్షణతో నియమపాలనతో, సమయపాలనతో ప్రదర్శనలు ఇచ్చిన కారణంగా విస్తారమైన పేరు ప్రఖ్యాతులు లభించాయి.

అప్పట్లో బందరులో ఇండియన్ డ్రమెటిక్ కంపెనీ అని గొప్ప పేరున్న సమాజం ఒకటి ఉండేది. ఆ ప్రొఫెషనల్ సంస్థకు డివి సుబ్బారావు అధిపతి. వారి సత్య హరిచంద్ర, చిత్రనళీయం, వింధ్యరాణి నాటకాలు సుప్రసిద్ధం. అయితే బందరు వెళ్లి వారి సమాజాన్ని బుక్ చేసుకుందామని బయల్దేరే కాంట్రాక్టర్స్ గుడివాడలో ఎక్సెల్సియర్ సమాజం పేరు విని మనసు మార్చుకుని వీరిని బుక్ చేయటం చాలాసార్లు జరిగింది.
ఇది సమాజం సాధించిన పేరు ప్రఖ్యాతులకు నిదర్శనం. సమాజం జైత్రయాత్ర నిరాఘాటంగా సాగిపోతోంది. అన్ని ప్రదర్శనలలోనూ అక్కినేని నాగేశ్వరరావుకు ‘ఏ’ క్లాస్ హీరోయిన్ అన్న పేరు వచ్చింది. సాంఘిక నాటకాల్లో స్త్రీ పాత్రను ఇంత అద్భుతంగా, మగవారి గుండెలు ఝల్లుమనేంత గొప్పగా పోషించటం అతనికే చెల్లింది అంటూ ఊరూరా నీరాజనం పట్టారు.

ఒకసారి పాలకొల్లులో” ఆశాజ్యోతి” ప్రదర్శన ఇచ్చినప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. ఆ టౌన్ లో ముచ్చర్ల సుబ్బరాజు గారు అనే గొప్ప పేరున్న భూస్వామి ఒకరున్నారు. ఆయన ఆశాజ్యోతి ప్రదర్శన తిలకిస్తున్నారు. ఆయన పక్కనే 50 ఏళ్ల వయసున్న వారి బంధువు ఒకాయన కూర్చున్నారు. ఆయన భార్య చనిపోగా రెండవ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆయన స్టేజి మీద స్నేహలత పాత్ర వేసిన అమ్మాయి వైపు తదేకంగా చూస్తున్నాడు. అది గమనించిన సుబ్బరాజు గారు” ఏమిటయ్యా అలా చూస్తున్నావ్? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ” అని వేళాకోళం ఆడారు. ఎగిరి గంతేసినంత పనిచేసి” ఓ.. తప్పకుండా చూసుకుంటాను” అన్నాడు ఆ ఆసామి. “సరే ! అయితే రేపు ఈ సమాజం వాళ్లందరినీ మా ఇంటికి భోజనానికి పిలిచాను. నువ్వు అక్కడకు రా.. మాట్లాడుకుందాం” అన్నారు సుబ్బరాజు గారు.

మరుసటి రోజు మస్తుగా ముస్తాబై లొట్టలేసుకుంటూ సుబ్బరాజు గారి ఇంటికి చేరాడు ఆ పెద్దమనిషి.
“ఎక్కడ? ఆ అమ్మాయిని పిలిపించండి” అన్నట్లుగా తిష్ట వేసాడు.
అందరూ నవ్వు ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
హటాత్తుగా వెళ్లి అతని ఎదురుగా నిలబడ్డాడు అక్కినేని నాగేశ్వరరావు.
” ఇదిగో ఇతనే ఆ అమ్మాయి” అన్నారు సుబ్బరాజు గారు.
ఆ పెద్దమనిషి నిలువుగుడ్లేసాడు . అందరూ ఘోల్లున నవ్వారు.

ఇలా హీరోయిన్ వేషంలో ఎందరినో మోసం చేశాడు అక్కినేని నాగేశ్వరరావు. అలాంటి అందమైన మోసాలే ఆయన నటజీవిత సోపానాలు. ఎక్సెల్సియర్ సమాజంలో ఆర్థిక విషయాలు ఎప్పుడు సెకండరీ స్థానంలో ఉండేవి. మంచి పేరు, మన్నన ప్రధమాంశాలు.
ఏదైనా సామాజిక ప్రయోజనం కోసం ఉచిత ప్రదర్శన ఇవ్వవలసి వస్తే ఎవ్వరూ ఏ మాత్రము వెనుకాడేవారు కాదు. అప్పటి పాలకొల్లు మున్సిపల్ చైర్మన్ బోళ్ల వెంకట సుబ్బారావు గారు ప్రారంభించిన ఒక ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిధుల సమీకరణ నిమిత్తం మూడు ఉచిత ప్రదర్శనలు ఇచ్చి తన వితరణ శీలతను చాటుకుంది ఎక్సెల్సియర్ సమాజం. ఇలా ఎడతెరిపిలేని ప్రదర్శనలతో అంతులేని ప్రశంసలతో మూడేళ్లు హాయిగా, ఆనందమయంగా సాగి పోయాయి.

( సశేషం)
( ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి 22 th అక్టోబర్ న చదవండి)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=P1tp8Kg2BSM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here