ముదినేపల్లి ఎక్సెల్షియర్స్ క్లబ్ లో పేకాట జోరుగా సాగుతుండేది – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 4, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna - First Daily Web Article Series - Part 4

(రీ-క్యాప్)
పెయ్యేరు- ముదినేపల్లి పక్క పక్క గ్రామాలే కావటంతో పగలంతా పొలం పనులు చూసుకుని సాయంత్రం కాగానే సైకిల్ ఎక్కి పావుగంటలో ముదినేపల్లి చేరుకునేది దుక్కిపాటి మధుసూదనరావు అండ్ బ్యాచ్.

ముదినేపల్లిలో ఉంది “ఎక్సెల్షియర్స్ క్లబ్”

(గతవారం తరువాయి)

ఆ రోజుల్లో యువకులు కాంగ్రెస్ నాయకత్వంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ అల్లర్లు సృష్టిస్తున్నారని వారిని తీవ్రవాద దృష్టి నుంచి మరల్చడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ముఖ్య కేంద్రాల్లో రిక్రియేషన్ క్లబ్ లు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ల ఆదేశం మేరకు ఈ రిక్రియేషన్ క్లబ్ లు వెలిశాయి. వాటిలో ముదినేపల్లి లో ఎక్సెల్షియర్స్ క్లబ్ ఒకటి. అన్ని క్లబ్బుల లో లాగానే ఈ క్లబ్ లో కూడా పేకాట జోరుగా సాగేది. స్పోర్ట్స్ విభాగంలో అన్ని రకాల ఆటలు ఉండేవి. అయితే కుర్రకారు పేకాట పిచ్చి తో చెడి పోతున్నారన్న ఉద్దేశంతో ఆ క్లబ్బులో ఒక నాటక విభాగాన్ని కూడా ప్రారంభించారు ఆ ఊరి పెద్దలు. ఆ నాటక విభాగం వారు ప్రదర్శించేది “జయంత జయ పాలం” అనే పౌరాణిక నాటకం.
ఒకరోజు ఆ నాటకాన్ని మధుసూదనరావు చూడటం తటస్థించింది. నాటకం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. నాటకం ఎలా ఉంది అని నిర్వాహకులు అడిగితే ‘ప్చ్’ అంటూ పెదవి విరిచారాయన.
” ఇంతకాలం ఈ పాత చింతకాయ పౌరాణిక నాటకాలు పట్టుకొని వేలాడతారు . చక్కగా ఏదైనా సాంఘిక నాటకాన్ని అడగొచ్చు కదా! అని ఒక ఉచిత సలహా ఇచ్చారు మధుసూదన రావు.
అప్పటికే ‘జయంత జయ పాలం’ నాటకంతో బోర్ కొట్టి ఉన్న నిర్వాహకులకు ఈ సూచన నచ్చింది. అయితే ఒక కొత్త నాటకాన్ని టేకప్ చేయాలి అంటే మాటలు కాదు.
మరి సాంఘిక నాటకాలు ఏమి రెడీగా లేవు కదా! అన్నాడొక కార్యకర్త అమాయకంగా.
‘ లేకపోతేరాయించండి’.. తేలిగ్గా అనేశాడు మధుసూదన రావు.
అదేదో మీరే రాయించ వచ్చు కదా! అన్నారెవరో గుంపు నుంచి.
‘అవును మీరే రాయించండి’ అన్నారంతా.
ఇదేదో చూడబోతే చుట్టుకొన్నట్లు అయింది.
‘సరే చూద్దాం’.. అన్నట్లుగా తల ఊపారు మధుసూదన రావు.
కొద్దిరోజులకు గుడివాడ బోర్డ్ హైస్కూల్లో తెలుగు టీచర్ గా పని చేస్తున్న కోనేరు కుటుంబరావు గారికి ఒక థీమ్ చెప్పి నాటక వ్రాయమన్నారు మధుసూదన రావు. కార్మికుల కష్టసుఖాలను గురించి, పెట్టుబడిదారుల దోపిడీ గురించి నాటకం రాస్తే బాగుంటుందని సూచించారు. కొద్దిరోజులకు కుటుంబరావు నాటకాన్ని తయారు చేశారు. రిహార్సల్స్ చేసి నాటకాన్ని ప్రదర్శనకు తయారుచేశారు. నాటకం పేరు “ఆశాజ్యోతి”. సలహా ఇచ్చి నాటకాన్ని రాయించిన మధుసూదన రావును ప్రత్యేకంగా ఆహ్వానించారు.
తొలి సాంఘిక నాటకం కావటంతో జనం విరగబడ్డారు. రాత్రి10 గంటలకు ప్రదర్శన ప్రారంభమైంది. ప్రేక్షకుల సహనానికి పరీక్ష అన్నట్లుగా తెల్లవారుజామున నాలుగు గంటల దాకా సాగింది నాటకం.
ఇక చెప్పేదేముంది?
తొలి ప్రదర్శన అట్టర్ ఫ్లాప్.
కారణం ఒక్కటే- అది ఆరు గంటల సుదీర్ఘ ప్రదర్శన కావడమే.
నిర్వాహకులకు నీరసం ముంచుకొచ్చింది. మరలా అందరూ మధుసూదనరావు సలహా అడిగారు.. ఏం చేయాలి అని.
ప్రదర్శనను మూడు గంటలకు కుదించితే మంచిదని సలహా ఇచ్చి ఆ బాధ్యతను తానే స్వీకరించారు మధుసూదన రావు. కోనేరు కుటుంబరావు గారికి తగిన సూచనలు ఇస్తూ అనవసరమైనవిగా భావించిన దృశ్యాలను ఎడిట్ చేస్తూ నాటకాన్ని మూడు గంటల వ్యవధికి కుదించి వ్రాయించారు. ఈసారి నాటకానికి సంగీతాన్ని సౌరభాన్ని కూడా జత చేశారు మధుసూదన రావు.
సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు తండ్రి గారు మధుసూదన రావు సతీమణి సుశీలా దేవి గారికి సంగీతం మాస్టారు. తండ్రిగారి లాగానే నాగేశ్వరరావుకు కూడా సంగీత సరస్వతి అనుగ్రహం లభించింది. అత్త గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా కాలక్షేపానికి పెండ్యాల నాగేశ్వరరావును పిలిపించుకుని ఇంట్లో సంగీత కచేరీ పెట్టేవారు మధుసూదన రావు. అప్పటికే పెండ్యాల నాగేశ్వరరావు సినిమాల్లో సహాయ సంగీత దర్శకునిగా పనిచేసి ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మద్రాసు మీద బాంబుల వర్షం కురుస్తుందని పుకార్లు వ్యాపించటంతో మద్రాసు వదిలి స్వగ్రామమైన కాటూరు వచ్చారు పెండ్యాల. అలా ప్రారంభమైన పరిచయం వల్ల ఎక్సల్షియర్స్ క్లబ్బుకు పెండ్యాల నాగేశ్వరరావు అనే ఒక సంగీత దర్శకుడిని అందివ్వగలిగారు మధుసూదన రావు.
ఈ విధంగా ఎక్సెల్సియర్స్ క్లబ్ నాటక విభాగపు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, చురుకుగా పాల్గొంటూ సహకారాన్ని అందిస్తున్న మధుసూదన రావు పట్ల క్లబ్ మెంబర్స్ లో గౌరవం పెరిగింది. ఇంతగా ఇన్వాల్వ్ అయిన వారికే సారథ్యం అప్పగిస్తే!? అనే ఆలోచన స్పురించింది వారిలో.
ఆలోచన వచ్చిందే తడవుగా మధుసూదన్ రావు ఎక్సల్షియర్స్ క్లబ్ డ్రమెటిక్ వింగ్ సెక్రటరీని చేశారు. కోడూరి అచ్చయ్య గారు అధ్యక్షులు.

ఈ ఎన్నికే మధుసూధనరావు జీవితానికి ఒక గొప్ప మలుపుగా పరిణమించింది. తనలో దాగివున్న కళారాధనను, కళాతృష్ణను, విమర్శనాత్మక దృక్పథాలను, వామపక్ష భావజాలాన్ని, ఆధునిక ఆలోచనా విధానాలను నాటక ప్రక్రియ ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్లగల చక్కని అవకాశం ఇది.

సెక్రటరీగా ఎన్నికయ్యాక నాటక సమాజాన్ని ముందుకు నడిపించటానికి అవసరమైన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వసాగారు మధుసూదన రావు.
ఇప్పుడు ఆయన ముందున్న సమస్యల్లో మొదటిది హీరోయిన్ పాత్రధారి ఎవరు అన్నది. ఇప్పటివరకు జరిగిన ప్రదర్శనల్లో హీరోగా ప్రభాకరరావు అనే కుర్రాడు వేసేవాడు. హీరోయిన్ స్నేహలత వేషాన్ని జగన్నాథ రావు అనే ఆయన వేసేవాడు. అయితే వయసు పెరగడంతో వేషానికి కావలసిన కులుకు, ఉలుకు, లాలిత్యం, స్త్రీత్వం జగన్నాథరావులో కొరవడ్డాయి.

కొత్త హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభమైంది… తెలిసిన వాళ్ళందరి దగ్గర వాకబు చేయటం ప్రారంభించారు.
ఒకరోజు యాదృచ్చికంగా కొత్త హీరోయిన్ కావాలి.. ఎవరన్న తెలుసా? అని పెండ్యాల నాగేశ్వరరావును అడిగారు మధుసూదనరావు.
పెండ్యాల నాగేశ్వర్రావు మదిలో చప్పున ఒక కుర్రాడు మెదిలాడు.
ఆ కుర్రాడు గుడివాడలో బుద్ధిరాజు శ్రీరామమూర్తి గారు ఆడిస్తున్న “విప్రనారాయణ” నాటకంలో “దేవదేవి” పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడట… మనం ఒక రోజు ఆ ప్రదర్శనకు వెళ్దాం అని ప్రపోస్ చేశారు పెండ్యాల నాగేశ్వరరావు.

ఎక్సెల్సియర్స్ క్లబ్ డ్రమెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి అచ్చయ్య, కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావు, సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావులు విప్రనారాయణ లో దేవదేవిని చూడటానికి గుడివాడ బయలుదేరారు. ఆడపాత్రను అద్భుతంగా అభినయిస్తున్న ఆ కుర్రాడు ఎవరు.. ఏమిటతని కథ…?

(సశేషం)
ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి చదవండి …

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=03Mk3HEzRdM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here