ఎక్సెల్షియర్స్ క్లబ్ తో పరిచయమే ఆ మలుపు – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 3, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna - First Daily Web Article Series - Part 3

(రీ-క్యాప్)
ఈ ఎన్నికే ప్రారంభం..
ఈ ఎన్నికే శుభారంభం..
ఈ ఎన్నికే ఆయనలోని కళాత్మక, సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచనా విధానాలకు పునాది.

(గత భాగం తరువాయి)
1934లో మధుసూదన రావు మచిలీపట్నం నోబుల్ కాలేజీలో బి.ఏ. చదివేటప్పుడే ఎం. ఆర్. అప్పారావు గారు (ఉయ్యూరు కుమార రాజా) ఆయన క్లాస్ మేట్. కాలేజీ ఎలక్షన్స్ లో ఏర్పడిన పోటీని తొలగించి ఉద్రేకాలను చల్లబరచడం కోసం అందరికీ ఆమోదయోగ్యుడయిన ఎం. ఆర్. అప్పారావు గారిని స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు ప్రిన్సిపల్. అప్పటినుండే వీరిరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.( అప్పారావు గారు తరువాత కాలంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి, ఆంధ్రా యూనివర్సిటీ వైస్- ఛాన్స్ లర్ పదవులను అలంకరించారు)
కాలేజీ డ్రమెటిక్ అసోసియేషన్ సెక్రటరీగా కాలేజీ వార్షికోత్సవాలలోనూ క్రీడా పోటీల్లోనూ చురుకుగా పాల్గొనేవారు మధుసూదన రావు. ఆయనలో నాటకరంగం పట్ల ఆసక్తికి, ఆరాధనకు అంకురార్పణ జరిగింది ఈ సమయంలోనే. ఒకవైపు చదువు, మరొకవైపు నాటక విభాగపు కార్యదర్శి బాధ్యత, ఇంకొకవైపు తన సహజ సిద్ధమైన ఆకతాయితనం -మూడింటిని సమదృష్టితో పోషిస్తూ విద్యార్థి జీవితంలోని మాధుర్యాన్ని ఆసాంతం అనుభవించారు మధుసూదన రావు.
బి.ఏ. పూర్తయిన తర్వాత మధుసూదనరావు కు ఎందుకో పై చదువుల మీద ఆసక్తి సన్నగిల్లింది. ఈ అనాసక్తి కొత్తగా ఏర్పడినది ఏమీ కాదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి మద్రాస్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చినా మెడిసిన్ కు వెళ్లలేక పోయినప్పుడే ఈ అనాసక్తికి బీజం పడింది.
విద్యార్థి జీవితానికి తెరపడింది.. జీవితంలో ఒక మధురమైన అధ్యాయం ముగిసింది.
తనది సిల్వర్ స్పూన్ బర్త్ కాకపోయినా బతుకు తెరువు కోసం ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. సుక్షేత్రం లాంటి 60 ఎకరాల మాగానికి మధ్యమ వారసుడు మధుసూదన రావు.
మధుసూదన రావు ఎలాగూ ఉద్యోగం వేటలో లేడు కాబట్టి తండ్రి సీతారామస్వామి గారు సంబంధాల వేటలో పడ్డారు.
1937 లో కాటూరు గ్రామ వాస్తవ్యులైన సీతారామయ్యగారి కుమార్తె సుశీలాదేవితో మధుసూదన రావు పాణిగ్రహణం జరిగింది.
జీవితంలో మరొక మలుపు.. మరో దశ.
ప్రస్తుతానికి వృత్తి వ్యవసాయం. ప్రవృత్తులు మాత్రం ఎన్నో… పుస్తక పఠనం, వాలీబాల్, బ్యాడ్మింటన్, రచ్చబండ రాజకీయాలు.
అయితే విద్యార్థి జీవితంలోని ఆకతాయితనం పోయి ఆ స్థానంలో మెల్లిగా చోటుచేసుకున్నాయి హుందాతనం ,పెద్దరికం. సమకాలీన రాజకీయాల సమగ్ర పఠనం,పరిశీలన నిత్యకృత్యాలయ్యాయి. ముఖ్యంగా కమ్యూనిస్ట్ లిటరేచర్ ను ఆమూలాగ్రం చదివారు మధుసూదనరావు. చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, మద్దుకూరి చంద్రశేఖరరావు, చలసాని వాసుదేవరావు, కడియాల గోపాలరావు వంటి కమ్యూనిస్ట్ వాదుల పరిచయ సాన్నిహిత్యాలు మధుసూదనరావులో వామపక్ష భావాల పట్ల ఆసక్తిని పెంచాయి. అయితే తానెప్పుడూ కమ్యూనిస్టు భావాలకు సానుభూతిపరుడే తప్ప కమ్యూనిస్టు కాదు. కమ్యూనిజాన్ని చదివిన కాంగ్రెస్ వాది మధుసూదన రావు.
1929 లో లాహోర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పండిట్ జవహర్లాల్ నెహురు మోగించిన స్వాతంత్ర్య సమర శంఖారావం దేశమంతటా చండ ప్రచండంగా ధ్వనిస్తుంది. దానికి మధుసూదనరావు ప్రభావితులయ్యారు. సమాజంలో ఉన్న రుగ్మతలకు ఎదురీదటం కూడా మధుసూదన రావుకు అబ్బింది.
కాంగ్రెస్ ప్రభంజనం మధుసూదన రావుకూ ఆ వయసు యువకులకు ఉత్తేజాన్నిచ్చింది. విప్లవ జ్యోతి భగత్ సింగ్ ను ఉరి తీసినప్పుడు ఊరూరా పెల్లుబికిన నిరసన ఉద్యమాల్లోనూ, సమ్మెల్లోను నినదించింది మధుసూదన రావు కంఠం. విదేశీ వస్త్ర నిషేధ ఉద్యమంలో ఉన్న బట్టలన్నీ బహిరంగ దహనం గావించి ఒంటిమీద జతతో ఊర్లు తిరిగిన దేశభక్తి ఆయనది.
జీవితం అన్ని విధాలా నల్లేరు మీద బండి నడకలా సాఫీగా సాగిపోతున్న తరుణంలో దురదృష్టం తండ్రిగారి మరణం రూపంలో ఎదురైంది.
డయాబెటిక్ కోమాతో తనువు చాలించే ముందు తనయుని పిలిచి సీతారామ స్వామి గారు ఒక సందేశం ఇచ్చారు.
” నీ జీవితంలో చేతనైతే ఎవరికైనా సహాయం చెయ్యి.. ఏ నాడు ఎవరికి అపకారం మాత్రం చెయ్యకు”- ఇవే ఆయన చివరి మాటలు. తండ్రిగారి ఉద్బోధను మధుసూదనరావు తన జీవితంలో అక్షరాల పాటించారు.
కుడి చేయి చేసిన దానం ఎడమ చేతికి తెలియకుండా ఆయన చేసిన గుప్తదానాలు ఏమిటో వాటిని స్వీకరించిన వారికే తెలుసు.
పితృవియోగం భారంతో మధుసూదనరావును ఏదో తెలియని స్తబ్దత ఆవరించింది. అయితే” కాలం మారుతుంది.. చేసిన గాయాలు మాన్పుతుంది” అంటారు పెద్దలు.
జీవితం మరో మలుపు తిరిగింది.

ఆ మలుపు తన జీవిత గమనాన్ని నిర్దేశిస్తుందని ఆయన ఊహించలేదు.

ముదినేపల్లి ఎక్సెల్షియర్స్ క్లబ్ తో పరిచయమే ఆ “మలుపు”.

పెయ్యేరు – ముదినేపల్లి పక్క పక్క గ్రామాలే కావటంతో పగలంతా పొలం పనులు చూసుకుని సాయంత్రం కాగానే సైకిల్ ఎక్కి పావుగంటలో ముదినేపల్లి చేరుకునేవారు మధుసూదన రావు అండ్ బ్యాచ్.

ముదినేపల్లిలో ఉంది “ఎక్సెల్షియర్స్ క్లబ్”.

(సశేషం)

ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి మంగళవారం(16 th అక్టోబర్) చదవండి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=V3tzwCqtDLo]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here