ఆ ఎన్నికే ప్రారంభం – ఆ ఎన్నికే శుభారంభం – స్వర్ణయుగంలో అన్నపూర్ణ

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series – Part 2, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna - First Daily Web Article Series - Part 2

( రీ-క్యాప్)
(అవి 1920 దశకపు తొలి రోజులు…
అది కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని ఒక చిన్న గ్రామం. పేరు పెయ్యేరు.పెయ్యేరు కు అరగంట నడక దూరంలో ఉన్న ఊరు ముదినేపల్లి.)

(గతవారం తరువాయి)

భుజాలకు పుస్తకాల సంచులు తగిలించుకుని చేతిలో క్యారేజ్ లు పట్టుకుని పెయ్యేరులో ప్రారంభమయ్యేది నడక. ఫస్ట్ బెల్ కొడుతుండగా ముదినేపల్లి శ్రీహరి మిడిల్ స్కూల్ ఆవరణలో ప్రవేశించేది ఒక బాల దండు. అయితే వీరికంటే ముందే చేరేవి వీళ్ళ మీద ఫిర్యాదులు. ఈ బ్యాచ్ లో అందరికంటే ఎక్కువగా ఫిర్యాదులు మోపబడిన ఒక అల్లరి కుర్రాడు ఉండేవాడు.పెయ్యేరు- ముదినేపల్లి వాకింగ్ బ్యాచ్ లో మంచి టాకింగ్ పవర్ కలిగి అందరి అల్లరిని చక్కగా ఆర్గనైజ్ చేసే రింగ్ లీడర్ అతను. పాపం! తన సొంత అల్లరి తాను చేసుకుంటూనే తన మిత్రుల అల్లరిని కూడా ఆర్గనైజ్ చేసి పెట్టటంతో అతనిమీద ఫిర్యాదుల పుట్ట పేరుకుపోయేది.

అయితే ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా , అతను ఎంత అల్లరి చేసినా అటు తల్లిదండ్రులు గాని ఇటు స్కూల్లో ఉపాధ్యాయులు గాని అతన్ని పల్లెత్తు మాట అనేవారు కాదు.

దానికి కారణం ఒక్కటే.
అతను ఫస్ట్ క్లాస్ విద్యార్థి!
అతని పేరే దుక్కిపాటిమధుసూదనరావు.

ఆ ఫస్ట్ క్లాస్ విద్యార్థి పుట్టింది 1917 జూలై 27న కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా పెయ్యేరు గ్రామంలో. తల్లి గంగాజలం గారు.. తండ్రి సీతారామస్వామి గారు. ముగ్గురు అన్నదమ్ములలో మధ్యముడు మధుసూదన రావు. అమ్మ ఒడిలోని కమ్మదనాన్ని చవి చూడకముందే కన్నుమూశారు తల్లి గంగాజలం. చివరి సంతానంగా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చి కన్నుమూశారు ఆవిడ.
చిన్నపిల్లల ఆలనా పాలనా చూసుకోవటం కోసమే అంటూ పెద్దలు చేసిన ఒత్తిడికి సీతారామ స్వామి గారు తల వంచక తప్పలేదు. నలుగురు చిన్నపిల్లలు ఉన్న ఇంటికి రెండవ భార్యగా వచ్చారు అన్నపూర్ణమ్మ. ఆమెకు సంతానం కలగలేదు.
సవతి తల్లుల పట్ల లోకానికి ఉన్న అభిప్రాయాన్ని మార్చారు అన్నపూర్ణమ్మ. పేగు తెంచుకు జన్మనిచ్చిన కన్నతల్లినే మరపిస్తూ పిల్లలను మురిపిస్తూ సాగిన అన్నపూర్ణమ్మ పెంపకంలో మధుసూదన రావు మారాములు ఎక్కువే. అన్నపూర్ణమ్మ సవతి తల్లి అన్న విషయాన్ని ఆ ఊరి జనం, ఈ ముగ్గురు పిల్లలు, సీతారామ స్వామి గారు ఎప్పుడో మర్చిపోయారు. ఆ మరపులోనే తప్పటడుగుల బాల్యదశ బాలదశకు చేరుకుంది. చదువు వీధి బడి నుండి పొరుగూరు బడికి నడిచింది.

పేయ్యేరులో ప్రాథమిక విద్యను ముగించుకొని ముదినేపల్లి శ్రీహరి మిడిల్ స్కూల్ లో థర్డ్ ఫారం వరకు చదివాడు మధుసూదన రావు. ఫోర్త్,ఫిఫ్త్ ఫార్మ్స్ గుడివాడ బోర్డు హైస్కూల్లో, ఎస్.ఎస్.ఎల్.సి. మచిలీపట్టణం హిందూ హైస్కూల్ లో చదివి 1930 వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ కు నోబుల్ కాలేజీలో చేరాడు.1932 లో ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ సాధించిన మధుసూదన రావు కు మద్రాస్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ద్విగుణీకృత ఉత్సాహంతో మద్రాస్ ప్రయాణానికి సన్నాహాలు జరుపుకున్నారాయన. కానీ కుటుంబ పరిస్థితులు అందుకు అనుమతించలేదు. అన్నయ్య చదువు డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండటం, తమ్ముడు చేతికి అందిరాని వాడు కావటం, డయాబెటిస్ వ్యాధితో తండ్రిగారి ఆరోగ్యం క్షీణించటంతో మధుసూదన రావు తన ఆశయం పట్ల ఆశ వదులుకోక తప్పలేదు. తండ్రి గారి వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండవలసిన వాడు తానే అయ్యాడు.

స్టెతస్కోప్ పట్టవలసిన చెయ్యి నాగలి పట్టింది.

చిన్నతనం నుండి డాక్టర్ కావాలని కన్న కలలు కరిగిపోయాయి. పవిత్రమైన వైద్య వృత్తిలో ని సేవాతత్పరత పట్ల తనకు గల అపారమైన గౌరవం తన గుండెల్లో అలాగే మిగిలిపోయింది. ఆ సేవా గుణాన్ని అణచుకోవటం ఎట్లా?
అలా అణచుకోలేని ఉత్సాహంతో ఒకసారి ఊరు వెలుపల మాలపల్లి కి వెళ్లి అక్కడ కలరా తగిలిన వారికి ఏవో ఆయుర్వేద మందులు పంచాడు మధుసూదన రావు. అది తెలిసి తండ్రి చితకబాదాడు. ఏది ఏమైనా వైద్య వృత్తి పట్ల తనకు గల ఆపేక్షను చంపు కోక తప్పలేదు. అయితే తాను సాధించలేనిది తన కుమారుడు ద్వారా సాధించారు మధుసూదన రావు. ఆయన కుమారుడు దుక్కిపాటి స్వామి MD న్యూయార్క్ మహానగరంలో డాక్టర్ గా స్థిరపడ్డారు.

ఇక ప్రస్తుతానికి వస్తే వైద్య విద్యకు వెళ్లలేక వ్యవసాయం వైపు మరలటo మధుసూదన రావు జీవితంలో గొప్ప మలుపు.
వ్యవసాయంలోనే రెండేళ్ళు గడిచిపోయాయి . ఒకవైపు తండ్రిగారికి వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటూనే సహజ జిజ్ఞాసతో పల్లెవాసుల జీవన సరళిని, పల్లె పదాల్లోని మాధుర్యాన్ని, నూర్పిడి పాటల్లోని మెలోడీని అతి సన్నిహితంగా గమనించాడు మధుసూదన రావు. వ్యవసాయ కూలీల కూనిరాగాల్లో తన సంగీత పరిజ్ఞానానికి బీజాలు వేసుకున్నాడు. తను చదువుకున్న రైతు కావటంతో పల్లె జీవితాన్ని, ఆ వాతావరణాన్ని, ఆ సహజీవన సౌందర్యాన్ని విభిన్న కోణాల్లో దర్శించాడు. తాను నిర్మించిన చిత్రాల్లో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉండటానికి, దానికి అంత ప్రాచుర్యం లభించటానికి ఈ సమయంలో తాను అలవరచుకున్న సంగీత పరిజ్ఞానమే కారణం అంటారు మధుసూదన రావు.
రెండేళ్ల రైతు జీవితం తరువాత కుటుంబ పరిస్థితులు సానుకూల పడిన మీదట మరలా విద్యార్థి జీవితంలోకి అడుగుపెట్టాడు మధుసూదన రావు.

మరలా అదే మచిలీపట్నం..
అదే నోబుల్ కాలేజీ…
అదే సుపరిచిత వాతావరణం.
1934 లో బి.ఏ. లో చేరాడు. చేరిన సంవత్సరమే కాలేజీ డ్రమెటిక్ అసోసియేషన్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు.
ఈ ఎన్నికే ప్రారంభం..
ఈ ఎన్నికే శుభారంభం…
ఈ ఎన్నికే ఆయనలోని కళాత్మక, సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచనా విధానాలకు పునాది.
( సశేషం)
ఈ ధారావాహిక తదుపరి భాగం ఎల్లుండి(14 th అక్టోబర్) న చదవండి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=Y60jfGElQIY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here