స్వర్ణయుగంలో అన్నపూర్ణ వెబ్ సీరియల్ – తొలి భాగం

#SwarnaYugamLoAnnapurna, Latest Telugu Movies News, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series – Part 1, Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website, Swarna Yugam Lo Annapurna Web Article Series, Swarna Yugam Lo Annapurna Web Series, Telugu Cinema Updates, Telugu Film News 2018, Telugu Filmnagar
Swarna Yugam Lo Annapurna - First Daily Web Article Series - Part 1

1952 అక్టోబర్ 2.. గాంధీ జయంతి. ఆ రోజుకు తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. నేటికి దాదాపు 66 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక గొప్ప చిత్ర నిర్మాణ సంస్థ తన ఉనికికి ఊపిరిపోసుకున్న రోజది. అప్పటికే గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన ఒక గొప్ప దర్శకునికి ఒక కొత్త నిర్మాత అడ్వాన్స్ ఇచ్చిన రోజది. ఆ అడ్వాన్స్ ఇచ్చిన కొత్త నిర్మాత ది నూతనోత్సాహం… ఆ అడ్వాన్సు స్వీకరించిన దర్శకునిది అనుభవంతో కూడిన ఆలోచన!. “ నా దర్శకత్వంలో సినిమా నిర్మించాలి అంటే ఇంకా రెండు సంవత్సరాలు ఆగాలి… ఆగ గలరా” అన్నారు ఆ దర్శకుడు. అది షరతు కాదు… అప్పటికి తను అంగీకరించిన చిత్రాన్ని పూర్తిచేసి కొత్త చిత్రాన్ని అన్ని విధాల పగడ్బందీగా ప్రారంభించడానికి కావలసిన మినిమం కాల గడువు అది. రెండేళ్ల నిరీక్షణ…? ఆ కొత్త నిర్మాత ఉత్సాహం నీరుకారి పోవలసిందే. కానీ అలా జరగలేదు. తీసేదేదో గొప్పగా తీద్దాం… మంచి చిత్రాన్ని తీద్దాం అన్నది ఆ దర్శకుడి ఆలోచన.

మొదటి చిత్రం హిట్ కావాలి… పేరు ప్రఖ్యాతులు రావాలి… సంస్థకు గుర్తింపు రావాలి. తన స్కూల్ డేస్ నుండి అన్నింటిలో ఫస్ట్ అనిపించుకుంటున్న తను చిత్ర నిర్మాణంలో కూడా ఫస్ట్ అనిపించుకోవాలి అన్నది ఆ కొత్త నిర్మాత ఆలోచన, ఆశయం. ఆ దర్శకునిపై ఆ కొత్త నిర్మాతకు ఉన్న అచంచలమైన నమ్మకం రెండేళ్ల కాలాన్ని రెండు నెలలే అన్నట్లుగా భ్రమింపజేసింది. రెండేళ్ల నిరీక్షణ పూర్తయ్యింది… చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. 1955 అక్టోబర్ 2 న ఆ చిత్రం విడుదలైంది. గొప్ప చిత్రాన్ని అందివ్వాలన్న ఆ దర్శకుని ఆశయం నెరవేరింది. తొలి చిత్రం పెద్ద హిట్ కావాలన్న ఆ కొత్త నిర్మాత కల ఫలించింది. – ఆ గొప్ప దర్శకుడు కె.వి.రెడ్డి. – ఆ కొత్త నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. – ఆ నూతన సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. – ఆ తొలి హిట్ చిత్రం” దొంగ రాముడు”. …that was the Great beginning of a Great concern called the Annapurna Pictures Private Limited . అలా ప్రారంభమైన ఆ సంస్థ చిత్ర నిర్మాణ జైత్రయాత్ర నిరాఘాటంగా, నిర్విరామంగా సాగింది. ఆ సంస్థ ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తుంది అంటే అది చిత్ర పరిశ్రమలో సంచలన వార్త. మద్రాసు సినీ జనారణ్యంలో ఆ సంస్థ కదలికలు, నిర్ణయాలు సంచలన కారకాలు, చర్చనీయాంశాలు. తొలి చిత్రం “దొంగ రాముడు ” విజయవంతమయ్యాక ద్వితీయ చిత్ర ప్రారంభానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. తొలి చిత్రం ‘హిట్’ అయింది…. రెండవది ‘ఫట్’ అవుతుందిలే అని ఎదురుచూశాయి తస్మదీయ వర్గాలు. రెండవ చిత్రం “తోడి కోడళ్ళు”..అట దర్శకుడు “ఆదుర్తి సుబ్బారావు” అట.. ఒకేసారి తెలుగు, తమిళ వర్షన్స్ తీస్తున్నారట… రెండవ చిత్రానికే ఇంత సాహసమా ? ఒక్క చిత్రం కూడా విడుదల కాని కొత్త దర్శకుడితో రెండు వర్షన్స్ షూట్ చేసే బదులు డబ్బింగ్ చేసుకోవచ్చు కదా! అంటూ అయాచిత సలహాలు, అనుమానాస్పదమైన నవ్వులు వినిపించాయి. ” నవ్విన నాపచేను పండింది” అన్న సామెత మరోమారు రుజువైంది. తెలుగులో “తోడి కోడళ్లు ” శతదినోత్సవ చిత్రం కాగా తమిళంలో “ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి” రజతోత్సవ సంరంభాన్ని చవిచూసింది. ‘కు’ విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. మూడవ చిత్రానికి కామెంట్స్ చేసే ధైర్యం సన్నగిల్లింది. ఏమోలే… ఈ పుట్టలో ఏ పాముందో వేచి చూద్దాం అనే ధోరణిలో పడిపోయారు పాండీ బజార్ పండితులు. ఇది సంస్థ సాధించిన ఘన విజయం. విమర్శించడానికి కూడా ధైర్యం చాలని స్థితికి ప్రత్యర్థిని తీసుకువెళ్ళడం తేలికైన విషయం కాదు. మరలా మూడవ చిత్రం కూడా ‘ఆదుర్తి సుబ్బారావు’ దర్శకత్వంలోనే.. పేరు “మాంగల్య బలం”. దీన్ని కూడా ద్విభాషా చిత్రంగానే నిర్మించారు.

తెలుగులో “మాంగల్య బలం” తమిళంలో “మంజల్ మహిమై” రెండూ నూరు రోజులు ఆడాయి. దీనితో అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మూడు ఘన విజయాలు చేకూరాయి. ప్రస్తుత బాక్సాఫీస్ పరిభాషలో దీన్ని ‘హ్యాట్రిక్’ అంటారు. అలాంటి హ్యాట్రిక్ ను అవలీలగా సాధించింది అన్నపూర్ణ సంస్థ. మూడు పువ్వులు ఆరు కాయలు కాయటానికి దర్శనంగా ఈ విజయాలను చెప్పుకోవచ్చు. ఎలాగంటే తొలి చిత్రమైన” దొంగ రాముడు” ను తమిళంలోకి “తిరుట్టు రామన్” పేరుతో డబ్ చేయగా అది పెద్ద హిట్ అయింది. ఈ విధంగా మూడు ప్రయత్నాలలో 6 చిత్రాల ఆర్థిక, హార్దిక లాభాన్ని చవిచూసి అన్ని విధాలా పరిపుష్టమైంది అన్నపూర్ణ సంస్థ. ఈ జిలుగు వెలుగుల సినీ గ్లామర్ ప్రపంచంలో నటీనటులకు లభించే గుర్తింపు, ఆదరణ ఆ రోజుల్లో సంస్థలకు కూడా లభించటం చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. అప్పటికే పేరుమోసిన సంస్థలైన సారథి, రోహిణి, వాహిని, భరణి, ఏ. వి. ఎం., జెమిని వంటి గొప్ప సంస్థల చిత్రాల కోసం ఎదురు చూసినట్టే అన్నపూర్ణ సంస్థ చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురుచూడటం ప్రారంభించారు. విడుదలయ్యే ఒక్కొక్క చిత్రం అటు ప్రేక్షక లోకంలోను ఇటు చిత్ర పరిశ్రమలోనూ సంస్థ ఇమేజిని ఇనుమడింపజేశాయి. ప్రామాణికతకు, పరిణితి చెందిన చిత్ర నిర్మాణ పద్ధతులకు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాలకు పట్టుకొమ్మగా భాసిల్లింది అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ. నటీనటులు, సాంకేతిక నిపుణులు అన్నపూర్ణ పిక్చర్స్ లో పనిచేసే అవకాశాన్ని పొందటం తమ అదృష్టంగా భావించే స్థాయికి సంస్థ ఎదిగింది.

ఎందరో నూతన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, దర్శకులకు, రచయితలకు, గాయకులకు ఇంకెందరో తెరవెనుక కథానాయకులకు అవకాశ కుసుమాలను అందించి ‘అన్నపూర్ణ’గా వెలుగొందింది అన్నపూర్ణ సంస్థ. అన్నపూర్ణ పిక్చర్స్ సాధించిన గొప్ప విజయం మరొకటుంది. చిత్ర నిర్మాణం అనేది కేవలం వ్యాపారం కాదు… వ్యాపార ధోరణి మాత్రమే చిత్ర నిర్మాణం యొక్క పరమావధి కాదు… కారాదు అని నిరూపించిన గొప్ప సంస్థలలో అన్నపూర్ణ ఒకటి. చిత్ర నిర్మాణం అనేది కళ ప్లస్ వ్యాపారం అనే జోడు గుర్రాల స్వారీ అయినప్పటికీ రెండింటిని సమ వేగంగా దౌడు తీయించి ప్రేక్షక అభిమాన తీరాలకు చేరిన సంస్థలలో అగ్రగామిగా నిలిచింది అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ. అన్నపూర్ణ వారి చిత్రాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు, లక్ష్యాలు, కొన్ని ప్రమాణాలు ఉంటాయనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఆ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ సమకాలీన సామాజిక జీవితానికి దర్పణాలుగా నిలిచేవి కావటం మొదటి లక్షణం. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, ముష్టి ఘాతాలు, మాయలు మంత్రాలు వంటి తాంత్రిక యాంత్రిక దృశ్యాలతో నిండి ఉండే పౌరాణిక, జానపద చిత్రాల జోరు హోరు ఎక్కువగా ఉన్న రోజుల్లో సమకాలీన, సామాజిక జీవన నేపథ్యాన్ని కథాంశాలుగా తీసుకుని సినిమా ప్రక్రియను జనానికి చేరువగా తీసుకువెళ్లిన సంస్థలలో అగ్రగామి అన్నపూర్ణ. సాంఘిక చిత్రాలలో కూడా ఉన్నత సాంకేతిక విలువలకు, సుమధుర సంగీతానికి ప్రాధాన్యతనిస్తూ ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రాలను అందించి ఉన్నత ప్రమాణాలకు ప్రామాణికంగా నిలిచింది అన్నపూర్ణ సంస్థ. ఇలాంటి పేరు ప్రఖ్యాతులు గడిస్తూ సాగించిన జైత్రయాత్రలో తొలి చిత్రం దొంగ రాముడు, ద్వితీయ చిత్రం తోడికోడళ్ళు, చిత్రం మాంగల్య బలం ఆ తరువాత వెలుగునీడలు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఆత్మగౌరవం, పూల రంగడు, విచిత్రబంధం, అమాయకురాలు, బంగారు కలలు, రాధాకృష్ణ అపురూప, అద్భుత చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక సంస్థకు ఇన్ని ఘన విజయాలు చేకూరటం సామాన్య విషయం కాదు. ఒక సంస్థ అద్భుత, అద్వితీయ, అపురూప, అనన్య సామాన్య విజయాలు విజయాలు సాధించింది అంటే దాని వెనుక కృషి, పట్టుదల, శ్రమ, పరిశ్రమ, లక్ష్యం వంటి ఎన్నెన్నో మహోదాత్తమైన లక్షణాలు ఉంటాయి. అన్నపూర్ణ సంస్థ సాధించిన విజయాల మాటున దాగి ఉన్నది మర్మం కాదు. ప్రతి విజయానికి కారకము, ప్రేరకము అయ్యే క్రమశిక్షణ, కృషి, పట్టుదల ఒంటి లక్షణాలే ఈ సంస్థ విజయానికి కూడా హేతువయ్యాయి .

ఒక సంస్థ విజయాన్ని ఒక వ్యక్తి విజయంగా పేర్కొనటం తప్పు కాదేమో! సంస్థలోని ఇతర వ్యక్తుల విధానాలను పద్ధతులను సంధాన పరిచి సమన్వయం చేసి సంస్థకు సారథ్యం వహించే సారథికి ఆ విజయాల క్రెడిట్ ను ఆపాదించటం అనౌచిత్యం కాదు…. అదే అసలు ఈ ఔచిత్యం!! ఒక సంస్థ విజయం సంస్థలోని వ్యక్తులందరి సమిష్టి విజయమే అయినప్పటికీ ఆ విజయానికి మూలకారకుడు, కేంద్ర బిందువు అయిన వ్యక్తి ఒకరు ఉంటారు. అలాంటి ఒకరు పూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కూడా ఉన్నారు… ఆయనే దుక్కిపాటి మధుసూదనరావు. మధుసూదన రావు దృష్టిలో చిత్ర నిర్మాణం అనేది ఒక పవిత్ర యజ్ఞం. నిర్దిష్టమైన అంచనాలు, నిశిత పరిశీలన ఉంటే చిత్ర విజయం విచిత్రం ఏమీ కాదు అంటారు మధుసూదన రావు. చిత్ర విజయాలకు దోహదపడే సమగ్ర పరిశీలనాత్మక, విమర్శనాత్మక శక్తి, అంచనాలు వేయగల నేర్పు మధుసూదన రావుకు ఎలా వచ్చాయి? నిర్మాతగా అనన్య సామాన్య విజయాలు సాధించటానికి దోహదపడిన ఆయన అసలు నేపథ్యం ఏమిటి? అసలు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆవిర్భావానికి పూర్వాపరాలు ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లే వెళ్లాలి… అవి 1920 దశకపు తొలిరోజులు… అది కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని ఒక చిన్న గ్రామం… పేరు పెయ్యేరు. పెయ్యేరుకు అరగంట నడక దూరంలో ఉన్న ఊరు ముదినేపల్లి. (సశేషం) తరువాయి భాగం ఎల్లుండి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=nmrQ78dtr1E]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here