భారతావనిలో సమస్త సినీ ఘన పురస్కార గ్రహీత – స్వీయ లోప స్వీకర్త అక్కినేని

A Tribute to the Great ANR on His 95th Birth Anniversary,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu film Updates,Latest Telugu Movies 2018,ANR 95th Birth Anniversary,Akkineni Nageswara Rao 95th Birth Anniversary Special News,Tribute to Akkineni Nageswara Rao on His 95th Birth Anniversary,Akkineni Family Latest Updates,95th Birth Anniversary of ANR
A Tribute to the Great ANR on His 95th Birth Anniversary

“స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య ” అన్నది అక్కినేని వారు తరచుగా చెప్పే శుభాషితం.అయితే ఇది ఆయనేదో  సభాభిముఖంగా చెప్పే సాధారణ సూక్తి అనుకునేవాళ్ళు చాలామంది.  “ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..” అని ప్రేమనగర్ చిత్రంలోని ఆత్రేయ గీతంలోని నీతిసారం తనకు అంటకుండా స్వీయలోప స్వీకారానికి ఏ మాత్రం  వెనుకాడని పారదర్శక వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు మహానటులు    అక్కినేని నాగేశ్వరరావు. ఇంతకూ అక్కినేనిలోని స్వీయలోపాలు ఏమిటో …ఇతరులకంటే ముందుగా వాటిని గుర్తించి ఎలా అప్రమత్తమయ్యారో తెలుసుకుంటే  ఆ ఎరుక  ఎవరికైనా ఒక గొప్ప జీవిత పాఠం అవుతుంది.   ఆయన తన స్వీయలోపాలను గుర్తెరిగి వాటిని సవరించుకునే క్రమంలో తనపట్లతాను చాలా కఠినంగా వ్యవహరించేవారు.తనను పొగిడిన వాళ్ళను అనుమానంగా,విమర్శించిన వాళ్ళను అభిమానంగా చూసే ఒక విలక్షణ వైఖరిని అలవరచుకున్నారు అక్కినేని. ఇంతకూ అక్కినేని స్వీయలోప విశ్లేషణలోకి వెళ్లేముందు ఈ వ్యాస కర్తనైన నాకు (జర్నలిస్ట్ ప్రభు) అక్కినేని వారికి జరిగిన ఒక సంభాషణను మీ ముందు ఉంచుతాను.

ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఎన్నో సందర్భాలలో అక్కినేని వారిని చాలా తరచుగా కలుస్తుండేవాడిని.ఒక రోజు పిచ్చాపాటిగా మాట్లాడుతున్న సందర్భంలో    నా మీద ఆయన  హఠాత్తుగా ఒక ప్రశ్న సంధిచ్చారు .”ప్రభూ… నీవొక అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్ వు కదా …నాకూ యన్.టి. రామారావు గారికి ఉన్న తేడా ఏమిటో ఒక్క వాక్యంలో చెప్పు చూద్దాం” అన్నారు. ఇంత హఠాత్తుగా ఆ ఇద్దరు మహానటుల మధ్య వ్యత్యాసాన్ని ఎలా నిర్వచించాలి అన్న అయోమయంలోనే ఒక గొప్ప వ్యక్తీకరణ నా నోట వచ్చింది.అప్పుడు ఇలా చెప్పాను….” అన్నీ కూడిఉన్న మహానటులు రామారావు గారైతే…అన్నీ కూడదీసుకున్న మహానటులు నాగేశ్వరరావు గారు”అన్నాను.ఒక్క క్షణం నా వైపు అభినందపూర్వకంగా చూసి షేక్ హ్యాండ్  ఇస్తూ” వెల్ సెడ్” అన్నారు నాగేశ్వరరావు గారు.  అనూహ్యంగా   నా నోట వచ్చిన  ఆ విశ్లేషణలో అణు మాత్రమైనా అసత్యం గానీ,అతిశయోక్తిగానీ లేవు . నిజంగానే అక్కినేని నాగేశ్వర రావులో  నటుడికి  కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయా అని విశ్లేషిస్తే  రామారావు గారి కంపారిజన్ లో అయితే    లేవనే చెప్పాలి…  ఆ విషయాన్ని ఇతరుల కంటే ఎక్కువగా మాట్లాడిన గొప్ప “సెల్ఫ్ క్రిటిక్” అక్కినేని నాగేశ్వరరావు.

ఇంతకూ ఎన్టీఆర్ లో ఉన్నవి,ఏ. ఎన్.ఆర్. లో లేనివి ఏమిటో చూద్దాం… ఒకసారి కాలచక్రాన్ని వెన్నక్కి తిప్పి 1940 వ దశకం  ద్వితీయార్థం లోకి తొంగి చూస్తే ఎన్టీఆర్ చిత్రరంగ ప్రవేశం చేసేసరికే ఏ. ఎన్. ఆర్. ఒక సూపర్ స్టార్. 1944 లో “సీతా రామజననం”తో  హీరోగా కెరీర్ ప్రారంభించిన అక్కినేనికి మాయాలోకం, లైలామజ్ను,బాలరాజు,కీలుగుర్రం,పల్నాటి యుద్ధం వంటి వరుస విజయాలతో విపరీతమైన స్టార్ డమ్ వచ్చేసింది. తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటి గ్లామర్ స్టార్ అనే ఖ్యాతిని తన ఖాతాలో జమచేసుకున్న అక్కినేనికి 1949 లో “మనదేశం ” చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నందమూరి తారకరామారావు అనే యువనటుడు పెద్ద త్రెట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. ఆ భవిష్యవాణిని గ్రహించిన వ్యక్తులు ఇద్దరే…వారిలో ఒకరు స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు కాగా మరొకరు చక్రపాణి.

1953 లో ఎన్. టి. ఆర్.కు “పాతాలభైరవి ” అక్కినేనికి “దేవదాసు” చిత్రాల ఘన విజయంతో  వారి మధ్య ఏర్పడిన ప్రమేయ రహిత అంతర్యుద్ధంలో  విపరీతమైన అంతర్మథనంతో  నలిగిన వారు అక్కినేని నాగేశ్వరరావే. అప్పుడు ప్రారంభమైంది అక్కినేనిలో స్వీయలోప అన్వేషణ.ఆరడుగుల అందగాడు,ఆజానుబాహుడు,అరవింద దలాయతాక్షుడు ,గంభీర స్వరసాధకుడు ఏ విధంగా చూసుకున్నా తనకన్నా అన్నింటా అధికుడు అయిన రామారావును తట్టుకొని నిలబడాలంటే కావలసింది ఆత్మన్యూనత కాదు…ఆత్మ విశ్వాసం అని గ్రహించిన అక్కినేని తనను తాను నిర్మించుకున్న విధానం,తన లోపాలను కప్పిపుచ్చుకుంటూ ముందుగు సాగిన వైనం అద్భుతం. దీనికి కాలం కూడా కలిసొచ్చినట్టుగా పాతాలభైరవి-దేవదాస్ ఘన విజయాలతో వారిద్దరి నటజీవితాలలో ఒక చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. సీతారామాజననం,మాయాలోకం వంటి పౌరాణిక, జానపదాలతో హీరోగా కెరీర్ ప్రారంభించిన అక్కినేని నాగేశ్వరరావు “దేవదాస్” ఘన విజయంతో సోషల్ హీరో అయిపోతే….”మనదేశం” అనే సోషల్ సినిమాతో ప్రవేశించిన రామారావు “పాతాళ భైరవి”హిట్ తో ఫోక్లోర్ హీరోగా స్టాండ్ అయ్యారు. ఈ అనూహ్య పరిణామం ఆ ఇద్దరికీ ఉభయతారకంగా పరిణమించింది. అంతకు ముందు ఇద్దరూ రెండు జోనర్స్ చేసినప్పటికీ ఈ ల్యాండ్ మార్కింగ్ హిట్స్ తో వారు వీరయ్యారు…వీరు వారయ్యారు.సాహసించి రాజకుమారిని దక్కించుకున్న తోటరాముడిగా ఎన్. టి. ఆర్, సాహసించలేక ప్రేమను త్యాగం చేసిన భగ్నప్రేమికుడిగా    ఏ.ఎన్. ఆర్. ఇద్దరూ తెలుగువారి హృదయ పీఠాలను అధిష్టించారు.

ఇక ఇక్కడి నుండి సాగింది ఆ ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన వృత్తి వైరం .ఎన్టీఆర్ తో పోల్చుకుంటే తనలో  అందం తక్కువ , పొట్టి,గుంటకళ్లు ,పీలస్వరం అనే నాలుగు  ప్రధాన స్వీయలోపాలను గుర్తించారు  నాగేశ్వరరావు. ఇవి జన్మతః లోపాలు.వీటిని అధిగమించి ముందుకు వెళ్లాలంటే పాత్రల ఎంపికలో తన పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు నాగేశ్వరరావు. అందుకు అనువైనవి సాంఘీక పాత్రలే కావటంతో క్రమంగా సోషల్ పిక్చర్స్ మీద కాన్సంట్రేట్ చేశారు. అడపాదడపా పౌరాణిక, చరిత్రాత్మక చిత్రాలు చేసినా వాటిలో అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే తప్ప ఆహార్య ప్రాధాన్యత ఉన్న పాత్రల జోలికి పోకుండా  వాటికి ఎన్టీఆర్ పేరును సూచించారు. తనివి గుంటకళ్ళు అని తానే చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ ఆ కళ్లలోనే అనంతకోటి భావాలను పలికించగల అభినయ చాతుర్య సమర్ధతలను ప్రదర్శించారు అక్కినేని. తన సమీప ప్రత్యర్థి ఎన్టీఆర్ జానపద,పౌరాణిక చిత్రాల తిరుగులేని కథనాయకునిగా ఏదుగుతుంటే తాను సాంఘీక పాత్రల ద్వారా కాంటెంపరరీ యూత్ కు కనెక్ట్ అయ్యే ప్రయత్నాల్లో విజయాన్ని సాధించారు. ప్రేమ,త్యాగం,చిలిపితనం ,సుమసున్నిత శృంగారం ,కాలేజ్ లైఫ్,స్టైల్,ఫ్యాషన్ వంటి ఎలిమెంట్స్ తో సమకాలీన సమాజానికి చేరువవుతూ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు రోల్ మోడల్ అయ్యారు అక్కినేని. నటనలో ఓవర్ ప్లే- అండర్ ప్లే అనే రెండు ప్రక్రియలు ఉంటాయి. తన ఫిజిక్ కు,   తక్కువ పర్సనాలిటీకి ‘ఓవర్ ప్లే’ నప్పదు కాబట్టి ‘అండర్ ప్లే’ విధానానికి అనుగుణంగా ఉండే పాత్రలను ఎంపిక చేసుకుని  స్వీయలోప అవరోధాలను అవలీలగా అధిగమించారు అక్కినేని. Overplay actor is enjoyed whereas Underplay actor  is  admired and adored …అంటారు.

తన 7 దశాబ్దాల సుదీర్ఘ నటజీవిత ప్రస్థానంలో వందలాది చిత్రాలలో అలాంటి ఆరాధనార్హమైన అభినయాన్ని ప్రదర్శించిన అభినయ ఘనాపాటి అక్కినేనిని వరించని గౌరం లేదు…అవార్డ్ లేదు…రివార్డ్ లేదు…అందుకే ఆయన గౌరవ పురస్కారాల పూర్తి జాబితా మొత్తాన్ని పదేపదే రాయలేక ఏక వాక్యంగా “భారతావనిలోని  సమస్త సినీ ఘన పురస్కారాల గ్రహీత” – అని సంక్షిప్తీకరించి ఆ మహానటుడు, ఆ అభినయాచార్యుడు అక్కినేనికి 95వ జయంతి సందర్భంగా ‘జోహార్లు’ అర్పిస్తుంది తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=KvPue1s0r8Q]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here