చిన‌బాబుగా కార్తి అద‌ర‌గొట్టారు – చిన‌బాబు రివ్యూ

Chinna Babu Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Chinna Babu Movie Review,Chinna Babu Telugu Movie Review,Chinna Babu Movie Public Talk,Chinna Babu Telugu Movie Public Response,Chinna Babu Movie Story,Chinna Babu Telugu Movie Live Updates,Chinna Babu Movie Review & Rating,Latest Telugu Movie Reviews
Chinna Babu Review

చిత్రం: చినబాబు

నటీనటులు: కార్తి, సయ్యేషా సైగ‌ల్‌, సత్యరాజ్, భానుప్రియ, ప్రియ భవాని శంకర్, ఆర్తన బిను, సూరి, శ్రీమాన్, సౌందర్ రాజ, యువరాణి, అతిథి పాత్రలో సూర్య తదితరులు

ఛాయాగ్రహణం: వేల్‌రాజ్

కూర్పు: రుబెన్

సంగీతం: డి.ఇమాన్

నిర్మాణ సంస్థలు: 2డి ఎంటర్‌టైన్‌మెంట్, ద్వార‌క క్రియేష‌న్స్‌

నిర్మాతలు: సూర్య‌, మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పాండిరాజ్

విడుదల తేది: 13 జూలై 2018

 

వైవిధ్యభరితమైన సినిమాలను చేసే తమిళ హీరో కార్తి.. ఈసారి పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగే ఓ కుటుంబ కథా చిత్రంలో నటించారు. అదే `చిన‌బాబు`. ఇందులో.. కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిస్తూనే.. తన పేరు ముందు “ఫార్మర్” అని పెట్టుకోవడానికి అసలు మొహమాటం పడని పాత్రలో నటించారు. ‘పసంగ’ చిత్రంతో జాతీయ అవార్డును గెలుచుకున్న పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కార్తి అన్నయ్య సూర్య నిర్మించడం.. ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి ఈ అంచనాలను ఈ సినిమా అందుకుందా? రైతుగా, కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిచ్చే యువకుడిగా కార్తి ఎంత మేర ప్రేక్షకులను మెప్పించారు? ఈ సినిమాతో పాండిరాజ్ దర్శకుడిగా మరో మెట్టు ఎదగగలిగారా? వంటి విషయాలు తెలియాలంటే `తెలుగు ఫిల్మ్ నగర్. కామ్` అందిస్తున్న సమీక్ష చదవాల్సిందే.

కథాంశం
“అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పది” అని నమ్మే ఓ గ్రామ పెద్ద పెనుగుండ రుద్రరాజు (సత్యరాజ్). అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ అక్కచెల్లెళ్ళు. పెద్ద భార్య (పెండుగొండ మాధవి)కు ముగ్గురు ఆడపిల్లలు. ఇక మ‌గ పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో ఆమె చెల్లెలు భార్గవి (భానుప్రియ)ని పెళ్లి చేసుకుంటాడు రుద్ర‌రాజు. ఆమెకు తొలి సంతానంగా ఆడపిల్ల పుడుతుంది. ఈ క్రమంలో మ‌గ‌బిడ్డ కోసం మూడో పెళ్ళికి సిద్ధపడతాడు రుద్రరాజు. అయితే తన పెద్ద భార్య మాధవి కడుపుతో ఉందని తెలుసుకొని.. మూడో పెళ్లి వాయిదా వేస్తాడు రుద్రరాజు. పెద్ద భార్యతో పాటు పెద్ద కూతురు మంగమ్మ కూడా కడుపుతో ఉంటుంది. మంగమ్మకి మగ పిల్లాడు పుడతాడు. అతనికి నరసింహరాజు (సూరి)అని పేరు పెడతాడు. కాని మనవడు మనవడే.. తన రక్తం పంచుకు పుట్టిన వాడే కొడుకవుతాడు అని భీష్మించుకు కూర్చుంటాడు రుద్రరాజు. అయితే కొంతకాలం తర్వాత మాధవికి కొడుకు పుడతాడు. దీంతో.. రుద్రరాజు ఆనందానికి అంతే లేకుండా పోతుంది. అతనికి కృష్ణంరాజు (కార్తి)అని పేరు కూడా పెడతాడు రుద్రరాజు. ఐదుగురు అక్కల (మంగమ్మ రాణి, విజయలలిత రాణి, సంయుక్త రాణి, ఝాన్సీ రాణి, పద్మావతి రాణి) ముద్దుల తమ్ముడైన కృష్ణంరాజు రైతుగా జీవించడానికి గర్వపడుతాడు. అయితే.. కృష్ణంరాజుకి ఇద్దరు మేనకోడళ్ళు ఉంటారు. వారిలో ఎవరో ఒకరిని ఇచ్చి పెళ్లి చేయాలని ఈ ఐదుగురు అక్కలు ప్లాన్ చేస్తూ ఉంటారు. కాని కృష్ణంరాజు మాత్రం నీల నీరద‌ (సయ్యేషా) అనే అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఈ విషయం తండ్రి రుద్రరాజుకి చెబుతాడు. అయితే.. రుద్రరాజు అత‌ని ప్రేమ‌కు ఒప్పుకున్నా.. కుటుంబం మాత్రం చీలకుండా చూసుకోమంటాడు. అయితే.. గతంలో రుద్రరాజు మూడో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిన పెళ్ళికూతురు మేనకోడలే నీరద‌ కావడం.. నీరద‌ బావ సురేంద్ర రాజు(శత్రు)తో కృష్ణంరాజుకు శ‌తృత్వం ఉండ‌డంతో ఓ వైపు ఈ గొడవ.. మరోవైపు ఇంట్లో అక్కలను ఒప్పించాల్సిన బాధ్యత ప‌డుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు ప్రేమకథ ఏ తీరాలకు చేరుకుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

కుటుంబ బంధాలను.. రైతు గొప్పతనాన్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేసారు దర్శకుడు. భావోద్వేగ సన్నివేశాలతో పాటు సందర్భోచితంగా వచ్చే కామెడీ సీన్స్ కూడా డీల్ చేసిన విధానం బాగుంది. ఓ సినిమా కథలా కాకుండా.. మన ఊరి కథలా ఈ సినిమాని వెండితెరపై బాగా ఆవిష్కరించారు. అలాగే ఎవరైనా ఇంటికి వస్తే.. వారిని ఒట్టి చేతులతో పంపడం భారతీయ సంప్రదాయం కాదు. ఆ సంప్రదాయానికి విలువనిస్తూనే.. తన ఇంటికి వచ్చిన వారికి రుద్రరాజు చేత మొక్కలను ఇప్పించడం అనేది నేటి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకున్న దర్శకుడి మేధోతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. అలాగే మేనరికం పెళ్ళిళ్ళ గురించి.. వాటి ఇబ్బందుల గురించి కార్తి చేత చెప్పించిన సీన్ సినిమాకే హై లైట్‌గా నిలుస్తుంది. ఇక సూర్య అభిమానులను టార్గెట్ చేస్తూ ఎడ్ల పందానికి ముఖ్య అతిథిగా సూర్యని సీన్‌లో ఎంట్రీ చేయించడం కూడా బాగుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే.. పక్కింటి అబ్బాయి పాత్రల్లో ఇప్పటివరకు మెప్పించిన కార్తి.. రైతుగా, కుటుంబానికి విలువనిచ్చే యువకుడిగా మెప్పించారు. స‌ర‌దా స‌న్నివేశాల్లోనూ, భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ చ‌క్క‌గా రాణించారు. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఇక ప‌ల్లెటూరి అమ్మాయిగా సయ్యేషా చాలా క్యూట్‌గా ఉంది. అలాగే.. తండ్రి రుద్రరాజు పాత్రలో సత్యరాజ్ నటన బాగుంది. కార్తి, సత్యరాజ్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సత్యరాజ్‌కి బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పడం ప్లస్. భానుప్రియ‌తో స‌హా మిగతా నటీనటులంతా చాలా నేచురల్‌గా నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. డి.ఇమాన్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకు బాగా కలిసొచ్చింది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో అందంగా కళ్ళకి కట్టినట్టు చూపించిన సినిమాటోగ్రాఫర్ వేల్‌రాజ్ పనితనం బాగుంది. “తీయని” పాట విజువల్స్‌ పరంగా బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.

డైలాగ్స్ విషయానికొస్తే.. “ ఎవడి పనికైనా రిటైర్మెంట్ ఉంటుంది కాని.. ఒక్క రైతుకే రిటైర్మెంట్ లేదు. ఈ దేశం బతుకున్నది వ్యవసాయం మీద అన్నది అందరూ మరచిపోయినట్టు ఉన్నాం” అంటూ రైతు ఉద్యోగం గురించి చెప్పినా.. “పెద్దవాళ్ళు మడి, నుడి ఒకటే అంటారు. ఒక మంచి విత్తనాన్ని మడిలో నాటితే ఎంతటి ఫలితం ఉంటుందో.. ఒక మంచి మాటను మీలాంటి విద్యార్ధులకు చెప్తే కూడా అంతే ఫలితం ఉంటుంది. మన దేశంలో వ్యవసాయం వెన్నెముక అని చెబుతూ.. ముందు కనిపించకుండా వెనకే చేసి పడేసారు” అంటూ హృదయానికి హత్తుకునేలా వచ్చే డైలాగ్స్ వ్యవసాయం గురించి ఆలోచించేలా చేస్తాయి. అందులో భాగంగానే “వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో ఎన్ని మెడల్స్ గెలుస్తామన్నది కాదు వచ్చే ఏడాది ఎంతమంది రైతులుగా మారి వ్యవసాయం చేస్తాము అన్నది ఆలోచించండి” అని కార్తి చేత చెప్పించిన మాటలు గుర్తుండిపోతాయి. అలాగే బంధుత్వం గొప్పతనం గురించి “జమ చేసుకున్న డబ్బులు ఎప్పటికైనా ఖర్చైపోతుంది. ఖర్చు కాని జమ బంధుత్వమే” అనే మాటతో పాటు.. స‌త్య‌రాజ్ చెప్పే “మందు కొట్టేది మత్తు కోసమే.. నాకు కుటుంబమే మత్తు” అనే డైలాగ్ బంధుత్వం విలువ‌ల‌ను తెలిపేలా ఉన్నాయి. ఇక ప్రేమ గురించి చెప్పే “ఈ వయసులోనే కాదు వయసు మళ్ళాక కూడా ప్రేమించుకుందాం” వంటి మాటలు యువతను ఆకర్షిస్తాయి. ఆడ‌పిల్ల మ‌గ‌పిల్లాడు అని తేడాలు వ‌ద్దు.. పుట్టుక‌లో ఏముంది.. పెంప‌కంలోనే అంతా ఉంది అనే డైలాగ్ ఆలోచింప‌జేస్తుంది. వీటితోపాటు.. “ఆవు కడుపుతో ఉంది, దూడ కడుపుతో ఉంది” ఫన్నీ డైలాగ్ నవ్విస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

కార్తి న‌ట‌న‌

గ్రామీణ నేప‌థ్యం, క‌థ‌

నేపథ్య సంగీతం

సంగీతం

నిర్మాణ విలువలు

కార్తి, సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు

 

మైనస్ పాయింట్స్

తమిళ వాస‌న కాస్త ఎక్కువైంది

బాటమ్ లైన్:  చినబాబు అదరగొట్టాడు

Chinna Babu Review
  • Story
  • Screenplay
  • Direction
  • Performances
3.3

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=3wfIxrnLMGw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here