బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, కింగ్ ఆఫ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ మ‌ణిశ‌ర్మ‌కు హ్యాపి బ‌ర్త్‌డే

Happy Birthday Melody Brahma Mani Sharma,Telugu Filmnagar,Telugu Movie News 2018,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Mani Sharma Latest News,Mani Sharma Upcoming Movie News,Mani Sharma Next Film Updates,Birthday Wihe To Music Director Mani Sharma,Mani Sharma Birthday Celebrations
Happy Birthday Melody Brahma Mani Sharma

బ్లాక్ బస్టర్ సినిమాలెన్నో ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మురిసిపోయాయి. మాస్ పాటలు కూడా మెలోడీతో జోడీ కట్టాయి. కొన్ని పాత పాటలైతే తన స్వరాలతో కొత్త సొబగులద్దుకుని రీమిక్స్ లుగానూ అలరించాయి. ఆయన బాణీల కోసం టాప్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు క్యూ కట్టేవారు. ఇంత నేప‌థ్యం ఉన్న ఆ సంగీత దర్శకుడే మెలోడీ బ్ర‌హ్మ‌ మణిశర్మ. పాటలకి పాటలు.. నేపథ్య సంగీతానికి నేపథ్య సంగీతం. ఈ రెండింటికి న్యాయం చేయగల సంగీత దర్శకులు కొంతమందే ఉంటారు. ఈ లిస్ట్‌లో స్వ‌ర‌బ్ర‌హ్మ మణిశర్మ పేరు తప్పక ఉంటుంది. మణిశర్మ 54వ పుట్టిన రోజు సందర్భంగా `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌.కామ్‌` అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం మీ కోసం..

కేరాఫ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌
‘ప్రేమించుకుందాం..రా!, చూడాలని ఉంది, సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, ఖుషి, ఇంద్ర, ఠాగూర్, పోకిరి’.. ఈ సినిమాలన్నీ కూడా వరుస ప్రకారం ఒక దాని రికార్డులను మరొకటి బద్దలు కొట్టినవే. అయితే వీటిన్నంటికి ఉన్న కామన్ పాయింట్ మాత్రం ఒకటే.. అదే మణిశర్మ అందించిన సంగీతం. అంటే.. మణి సంగీతమందించే సినిమాలే బ్లాక్ బస్టర్‌కి కేరాఫ్ అడ్రస్‌లుగా నిలుస్తాయన్నంతగా ఓ పీరియడ్ సాగిందన్నమాట. దటీజ్ మణిశర్మ.

ఆడియో సూప‌ర్ హిట్‌
హిట్ సినిమాల్లోనే మణి బాణీ మారుమ్రోగుతుందనుకుంటే పొరపాటే. స్వరమే అతని సర్వం. అందుకే ’రావోయి చందమామ‘, ’శీను‘, ’మనోహరం‘, ’దేవీ పుత్రుడు‘, ’మృగరాజు‘, ’సుబ్బు‘, ’టక్కరి దొంగ‘, ’అర్జున్‘, ’గుడుంబా శంకర్‘, ’బాలు‘, ’సుభాష్ చంద్రబోస్‘, ’జై చిరంజీవ‘, ’ఏక్ నిరంజన్‘, ఖలేజా‘, ’తీన్ మార్‘, ‘కృష్ణం వందే జ‌గద్గురుమ్‌’, ‘లై’ వంటి సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోవచ్చు. కానీ.. మ్యూజికల్‌గా మాత్రం సూపర్ హిట్టే.

మాస్ పాట‌ల్లోనూ మెలోడే..
మెలోడీ పాటల్లో మెలోడీ ఉండడం కామనే. కానీ పక్కా మాస్ సాంగ్ లోనూ మెలోడీని జోడించడమన్నది అరుదైన విషయం. అలాంటి క్రెడిట్ నీ మూటగట్టుకున్నారు మణిశర్మ. మాస్ సాంగ్ అంటే డ్రమ్ బీట్సే అనుకునేవారికి మెలోడియస్‌గా ఆన్సర్ ఇచ్చారు మణి.

కింగ్ ఆఫ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌
మాటలు లేని చోట కూడా మౌనానికి మాట కలిపి భావాలు పలికించగల నేపథ్య సంగీతానికి మణిశర్మ పెట్టింది పేరు. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా.. మణి రీరికార్డింగ్ నెవర్ ఫెయిల్స్. ఇప్ప‌టికీ మ‌ణిశ‌ర్మ గురించి మాట్లాడుకోవాలంటే.. మొద‌ట ఆయ‌న అందించిన అనేక చిత్రాల బ్రాగ్రౌండ్ స్కోర్ గురించే మాట్లాడుతారు. పాట‌క‌ర్త‌గా ఆయ‌న హ‌వా త‌గ్గిన రోజుల్లోనూ ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’, ‘టెంప‌ర్’ వంటి చిత్రాల‌కు మ‌ణి అందించిన నేప‌థ్య సంగీతం.. ఆయా సినిమాల‌కు బ్యాక్‌బోన్‌గా నిలిచింది.

మణిశర్మ అంటే సూపర్ హిట్ సాంగ్స్, అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్.. బ్లాక్ బస్టర్ సినిమాలే కాదు. సమ్ థింగ్ స్పెషల్ అనిపించే కొన్ని విషయాలు ఉన్నాయి.

రీమిక్స్ స్పెష‌లిస్ట్

‘ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే’.. 2001లో వచ్చిన ’ఖుషి‘ సినిమాలోని సూపర్ హిట్ పాట ఇది. నాటి ’మిస్సమ్మ‘ లోని మధుర గీతాన్ని న్యూ జనరేషన్‌కి దగ్గర చేయాలనే ప్రయత్నంగా వచ్చిన ఈ పాటని.. మణి ట్యూన్ చేసిన విధానం 100% సక్సెస్ అయ్యింది. దీంతో రీమిక్స్ కి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారారు మెలోడీ బ్రహ్మ. సంవత్సరానికొక రీమిక్స్ అయినా.. త‌న‌ ఖాతాలో ఉండాల్సిందే అన్నంత‌గా కొన్ని సంవ‌త్స‌రాలు పాటు రీమిక్స్ స్పెష‌లిస్ట్‌గా మారారు మ‌ణి. 2002లో వచ్చిన ’జోరుగా హుషారుగా‘లో టైటిల్ సాంగ్.. ’భార్యాభర్తలు‘ పాటకి రీమిక్స్ అయితే.. 2003లో విడుదలైన ’ఠాగూర్‘లోని ’నేను సైతం..‘ పాట పల్లవి ’రుద్రవీణ‘లోని సాంగ్ కి రీమిక్స్ గా వచ్చింది. 2004లో వచ్చిన ప్రభాస్ ’అడవి రాముడు‘ సినిమాలోనూ ’ఆరేసుకోబోయి‘ రీమిక్స్ ఉంది. నాటి ’అడవిరాముడు‘ లోని ’ఆరేసుకోబోయి‘ పాటకి న్యూ వెర్షన్ ఇది. అలాగే నాటి ’భలే తమ్ముడు‘లోని పాపులర్ సాంగ్ ’నేడే ఈనాడే‘.. 2005లో వచ్చిన ’అల్లరి పిడుగు‘లో రీమిక్స్ అయ్యింది. కృష్ణ నటించిన ’గౌరి‘ సినిమాలోని ఓ సాంగ్‌.. బ్లాక్ బస్టర్ మూవీ ’పోకిరి‘ (2006) కోసం ’గలగల పారుతున్న గోదారి‘ లా రీమిక్స్ అయ్యింది. 2007లో రిలీజైన ’లక్ష్యం‘లోని ’నిలువవే వాలుకనులదానా‘ కూడా నాటి ’ఇల్లరికం‘లోని పాటకు రీమిక్సే. ’ఛాలెంజ్ రాముడు‘ లోని ’పట్టుకో పట్టుకో పట్టుచీర‘ పాట కూడా 2008 నాటి ‘ఒక్క మగాడు’లో రీమిక్స్ గా అలరించింది. 2009 లో విడుదలైన ఏక్ నిరంజన్ లోనూ మైఖెల్ జాక్సెన్ పాట ఒకటి ’నర్తన తార‘ అంటూ రీమిక్స్ అయ్యింది. నాటి బందిపోటు చిత్రంలోని ఊహ‌లు గుస‌గుస‌లాడే పాట‌ని.. కోతి మూక (2010) కోసం రీమిక్స్ చేశారు. ’తీన్ మార్‘ (2011)లోనూ ’ఓహో బస్తీ దొరసానీ‘ అనే పాత పాట..రీమిక్స్ గా వచ్చింది. ఇక ’రచ్చ‘(2012)లోనూ ’వానా వానా వెల్లువాయే‘ అనే రీమిక్స్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఏ మ్యూజిక్ డైరెక్టర్ సొంతం చేసుకోని విధంగా రీమిక్స్ ల్లోనూ హిట్ లు పొంది.. రీమిక్స్ స్పెష‌లిస్ట్ అనిపించుకున్నారు మణిశర్మ.

అంద‌రు అగ్ర హీరోల‌తోనూ..

రెండు జనరేషన్ల టాప్ హీరోలందరితో పనిచేయడమే కాదు.. హిట్లను కూడా అందుకున్న ఘనత మణిశర్మది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ.. ఇలా అగ్ర కథానాయకులందరికీ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు మణి. అంతటితో సరిపెట్టుకోకుండా.. ఈ లిస్ట్ లోని కొందరికి వారి కెరీర్లోనే ఎక్కువ సినిమాలకు మ్యూజిక్ నందించిన క్రెడిట్ పొందారు.

భ‌క్తి గీతాల‌లోనూ..

ప్రత్యేకించి భక్తి ప్రధాన చిత్రాలకు పనిచేయకపోయినా.. ఆడపాదడపా కొన్ని సినిమాల కోసం డివోషనల్ సాంగ్స్ తో అలరించారు మణి. ’దేవీ పుత్రుడు‘లో ’కెరటాల అంచున‘, ’ఇంద్ర‘లో బంబం భోలే, ’రాఘవేంద్ర‘ లో ’నమ్మిన నా మది మంత్రాలయమేగా‘, ’శ్రీ ఆంజనేయం‘ లో హనుమంతుడిపై పాటలు, ’అర్జున్‘ లో ’మధుర మధురతమ మీనాక్షి‘, ’జై చిరంజీవ‘లో ’జై జై గణేశ‘, ’ఖలేజా‘లో ’సదాశివ సన్యాసి‘, ’శక్తి‘లో ’హై గిరి నందిని, ’తీన్ మార్‘లో ’శ్రీ గంగ‘.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని విధంగా భక్తి గీతాలందించారాయన. అలాగే ‘కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్’ కోసం ద‌శావ‌తారాలపైన సాగే పాట‌కు అద్భుత‌మైన బాణిని అందించారు.

సంక్రాంతి సెన్సేష‌న్‌
సంక్రాంతి సీజన్ అంటే బ్లాక్ బస్టర్ సినిమాలకు చిరునామా. ఈ సీజన్లోనే మణిశర్మ మ్యూజిక్ అందించిన ‘సమరసింహా రెడ్డి, అన్నయ్య, నరసింహ నాయుడు, ఒక్కడు, పెళ్లాం ఊరెళితే, లక్ష్మీ నరసింహ, స్టైల్’ వంటి సినిమాలు రిలీజై సంక్రాంతి హిట్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఓ టైంలో సంక్రాంతి అంటే మణిశర్మ సినిమా ఉండాల్సిందే అన్నంత పేరు వచ్చింది.

నంది అవార్డులు..
మణిశర్మ పాటలంటే రికార్డులకే పరిమితం అనుకుంటే పొరపాటే. అవార్డులు కూడా స్వరాభివందనం చేసాయి. ’చూడాలని ఉంది‘, ’ఒక్కడు‘ చిత్రాలకు ’ఉత్తమ సంగీత దర్శకుడు‘ గానూ మణి ’నంది‘ పురస్కరాలు అందుకున్నారు. 2000వ సంవత్సరం అయితే ’నంది‘ స్పెషల్ ఇయర్ గా నిలిచింది మణికి. ‘చిరునవ్వుతో, ఆజాద్, మనోహరం’ చిత్రాలు ఆ ఏడాదికి గానూ ఉత్తమ చిత్రం, ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ తృతీయ చిత్రం అవార్డులను అందుకోవడం విశేషం. ’గణేష్‘, ’మురారి‘, ’ఒక్కడు‘, ’లక్ష్యం‘, ’పరుగు‘, ’బాణం‘ వంటి సినిమాలు బెస్ట్ పిక్చర్ విభాగంలో నందిని అందుకున్నవే. కేవలం నంది అనే కాకుండా ఫిల్మ్ ఫేర్ తో పాటు పలు అవార్డులు మణిశర్మ పాటలకు దక్కాయి.

ప‌ర‌భాష‌లోనూ..
కేవ‌లం తెలుగులోనే కాదు.. త‌మిళ ప‌రిశ్ర‌మ‌లోనూ సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేశారు మ‌ణిశ‌ర్మ‌. చిరున‌వ్వుతో రీమేక్ యూత్‌, పోకిరి రీమేక్ పోక్కిరితో పాటు షాజ‌హాన్ చిత్రానికి ఆయ‌న స్వ‌ర‌ప‌రిచిన పాట‌లు.. ఆల్ టైమ్ హిట్సే. ఈ మూడు సినిమాల్లోనూ తమిళ స్టార్ హీరో విజ‌య్ హీరోగా న‌టించారు. వీటితో పాటు మ‌రికొన్ని హిట్ చిత్రాల‌కు ఆయ‌న సంగీత‌మందించారు.

పుత్రోత్సాహం..
ఈ ఏడాది మ‌ణిశ‌ర్మ‌కు ప్ర‌త్యేకం. ఎందుకంటే.. ఆయ‌న త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్‌కు ‘ఛ‌లో’ చిత్రంతో మంచి బ్రేక్ వ‌చ్చింది. ముఖ్యంగా అందులోని మెలోడీ సాంగ్‌.. ‘చూసీ చూడంగానే న‌చ్చేశావే’ పాట‌తో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నారు. అలాగే.. పుత్రోత్సాహాన్ని అందించారు.

పాట శాశ్వతంగా నిలిచి ఉండాలంటే మెలోడీ తప్పని సరి అని భావించడమే మణిశర్మ సక్సెస్ ఫార్ములా. ఆ బాటలోనే ఇప్పటికీ వెళుతున్న మ‌న‌ స్వరమణి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.



Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=P6Nf8RslUOM]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here