మెలోడీ బాహుబ‌లి.. స్వ‌ర‌వాణి కీర‌వాణి

Melody King MM Keeravani Birthday special, Keeravani Birthday, Keeravani Hit Songs, unknown Facts about Keeravani, MM Keeravani Trivia, Keeravani Telugu Movie Songs, Telugu FilmNagar, Tollywood Latest News, Latest Telugu Movie News
Melody King MM Keeravani Birthday special

రాయినైనా కరిగించగల మ్యాజిక్ మ్యూజిక్‌కే సొంతం. అలాంటి మ్యూజిక్‌లో భాగ‌మైన‌ మెలోడీకి ఉండే ఇంపార్టెన్సే వేరు. ఏ తరంలోనైనా జన నీరాజనాలు దక్కేది ఎక్కువగా మెలోడీకే. ఓలలాడించే ఆ మెలోడీని తన జోడీగా చేసుకుని స్వరకర్తగా టాప్ రేంజ్‌కు చేరుకున్నారు స్వ‌ర‌వాణి ఎం.ఎం.కీరవాణి. ఆణిముత్యాల్లాంటి బాణీలతో మరకత మణి కీరవాణి `మెలోడీ బాహుబ‌లి`గా ఎదిగిన తీరు ప్రశంసనీయం. కీరవాణి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్, తనకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్‌తో ‘తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌. కామ్’ అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం ఇది.

స్వ‌ర ప్ర‌స్థానం

తెలుగు తెరపై ఎందరో స్వరకర్తలు తమ బాణీని చాటుకున్నారు. అయితే కొందరు మాత్రమే తెలుగు సినీ సంగీతాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అలాంటి వారిలో కీరవాణి ఒకరు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే.. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ప్రొడ్యూస్ చేసిన `మనసు మమత`తో ఈ మధుర స్వరకర్త కెరీర్ ప్రారంభమైంది. తొలి నాళ్లలోనే సంగీత ప్రాధాన్యమున్న సినిమాల్లో వర్క్ చేసే అవకాశం రావడంతో తనను తాను ఫ్రూవ్ చేసుకునే అవకాశం దక్కింది కీరవాణికి. అలా వాణి బాణిని తెలుగువారికి ఘనంగా చాటిన చిత్రమే ’సీతారామయ్య గారి మనవరాలు‘. ఏఎన్నార్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మ్యూజిక్ ఓరియెంటెడ్ మూవీ కావడం మరకత మణికి బాగా ప్లస్ అయ్యింది. అందులో ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. ఆడియోతో పాటు సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో కీరవాణి పేరు ఇంటింటా వినిపించడం మొదలైంది.

`సీతారామయ్య గారి మనవరాలు`, `క్షణక్షణం` వంటి చిత్రాలతో పాటు `మొండి మొగుడు పెంకి పెళ్లాం` వంటి సినిమాల కోసం కీరవాణి చేసిన స్వరవిన్యాసాలు.. సంగీతాన్ని కూడా గ్లామ‌ర‌స్‌గా ఉపయోగించుకోగల దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దృష్టికి తీసుకువెళ్లాయి. ఫలితంగా ఆ స్వరవాణికి దక్కిన అవకాశమే `ఘరానా మొగుడు`. అంతకుముందు వరకు లేని మాస్ ఇమేజ్‌ను కీరవాణికి అందించిన `ఘరానా మొగుడు`.. ఘనాతిఘన విజయం సాధించి అతని పేరుని తెలుగు నాట మారుమ్రోగేలా చేసింది.

`ఘరానా మొగుడు` తరువాత `అల్లరి మొగుడు`, `ప్రెసిడెంట్ గారి పెళ్లాం`, `సుందర కాండ`, `అబ్బాయిగారు`, `మిస్టర్ పెళ్లాం`, `రాజేశ్వరి కళ్యాణం`, `కొండపల్లిరాజా`, `వారసుడు`, `అల్లరి అల్లుడు` వంటి చిత్రాలు విడుదలై కీరవాణి రేంజ్ ని పెంచితే.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన `అల్లరి ప్రియుడు` జనాల జేజేలతో పాటు అవార్డులను సైతం తీసుకువచ్చింది. ఇందులోని ప్రతి పాటా నిత్యనూతనంగా ఉందంటే.. దానికి కీరవాణి స్వరాల పాత్ర ఎంతో ఉంది.

ఇక మాధవి ప్రధాన పాత్రలో రూపొందిన `మాతృదేవోభవ` అయితే కీరవాణిలోని సంగీత దర్శకుడుని మరింత ఎలివేట్ చేసింది. ఇందులోని `రాలిపోయే పువ్వా` పాటను తానే పాడి గాయ‌కుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పాటతోనే లెజెండ‌రీ లిరిక్ రైట‌ర్ వేటూరి సుందరరామ్మూర్తికి జాతీయ స్థాయిలో గీత రచయితగా పురస్కారం కూడా దక్కింది.
తరువాతి కాలంలో `అల్లరి ప్రేమికుడు`, `గాంఢీవం`, `బొబ్బిలి సింహం`, `క్రిమినల్`, `ముద్దుల ప్రియుడు`, `ఘరానా బుల్లోడు` వంటి చిత్రాలతో సంగీత ప్రియులను అలరించారు కీరవాణి. ఈ టైంలోనే సంగీతాభిరుచి ఉన్న విశ్వనాథ్, బాపు, వంశీ వంటి దర్శకులతోనూ పనిచేసే అవకాశం ద‌క్కింది. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన `శుభ సంకల్పం` సినిమాకి క‌ల‌కాలం గుర్తుండిపోయే బాణీలు ఇచ్చిన కీరవాణి.. ’మిస్టర్ పెళ్లాం‘ తరువాత బాపుతో ’రాంబంటు‘ అనే సినిమా చేశారు. వంశీ దర్శకత్వంలో ’వైవాఫ్ వరప్రసాద్‘ చిత్రం చేశారు. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా అలరించాయి.

ఇక కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిన్న సినిమాగా రూపొంది.. పెద్ద విజయం అందుకున్న `పెళ్లిసందడి`కి కీరవాణి చేసిన పాటల సందడి ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు. సాదాసీదా క‌థ‌తో రూపొందిన ఆ మూవీని కేవలం కీరవాణి బాణీలు, దర్శకేంద్రుడి చిత్రీకరణే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ దిశ‌గా తీసుకువెళ్లాయన్నది విమర్శకుల మాట. అలాంటి `పెళ్లిసందడి`.. కీరవాణికి రివార్డులతో పలు అవార్డులను తెచ్చిపెట్టింది.

`పెళ్లి సందడి` అనంతరం వచ్చిన `సాహసవీరుడు సాగరకన్య`, `పవిత్ర బంధం`, `బొంబాయి ప్రియుడు` వంటి సినిమాల కోసం గుర్తుండిపోయే ట్యూన్స్ నిచ్చిన కీరవాణికి తన స్వరప్రస్థానంలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది `అన్నమయ్య`. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. కీరవాణికి జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడుగా అవార్డును అందించింది. తను ఎలాంటి సినిమాలకైనా సంగీతమందించగలనని ఈ సినిమాతోనే చెప్పకనే చెప్పారు కీరవాణి.

`అన్నమయ్య` తరువాత కొంత కాలం వరకు కీరవాణికి గుర్తుంచుకోదగ్గ హిట్ అయితే లభించలేదు. తన స్థాయినే మార్చివేసిన కె.రాఘవేంద్రరావు కూడా `పరదేశి` అనే ఒకే ఒక సినిమానే కీరవాణి కాంబినేషన్ లో చేసి.. ఐదేళ్ల పాటు వచ్చిన పలు చిత్రాల కోసం వేరే సంగీత ద‌ర్శ‌కుల కాంబినేషన్‌లో పనిచేయడం అనేది ఒక మైనస్‌గా మారింది. అలాగే ఆ టైంలో వచ్చిన `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`, `సీతారామరాజు` వంటి సినిమాలు చెప్పుకోదగ్గ విజయం సాధిస్తే.. `పండగ`, `రాజహంస` వంటి సినిమాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. `బావనచ్చాడు`, `ఆకాశవీధిలో` వంటి సినిమాలు ఆశించిన విజ‌యం సాధించలేదు. తన పనితనంలో లోపాలు లేకపోయినా.. కీరవాణి తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా నాలుగేళ్లపాటు రేసులో వెనుకబడ్డారు.
ఇలా బ్యాడ్ డేస్‌ను ఫేస్ చేస్తున్న టైంలోనే కీరవాణికి హ్యాపీడేస్‌ను తీసుకువచ్చిన సినిమా `స్టూడెంట్ నెం.1`. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో.. కీరవాణి సోదరుడు ఎస్.ఎస్‌. రాజమౌళి దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ రూపొందించిన ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రం తరువాత మళ్లీ కీరవాణి మార్క్ పాటల హవా పెరిగింది.

`స్టూడెంట్ నెం.1` తరువాత `లాహిరి లాహిరి లాహిరిలో`, `ఒకటో నెంబర్ కుర్రాడు`, `సీతయ్య`, `గంగోత్రి` వంటి సినిమాలు మ్యూజికల్ హిట్స్‌ నిలిస్తే.. `సింహాద్రి` సినిమా కీరవాణికి రాఘవేంద్రరావు కాలం నాటి డిమాండ్‌ను మరోసారి తీసుకువచ్చింది. ఈ పరంపరలోనే `నేనున్నాను`, `నా ఆటోగ్రాఫ్`, `పల్లకిలో పెళ్లికూతురు`, `సై` వంటి మ్యూజిక్‌కు స్కోప్ ఉన్న సినిమాలు కీరవాణి నుంచి వచ్చాయి.

ఈ వరుసలోనే కీరవాణి ఇతర దర్శకులతో చేసిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్ అయినా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన `ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `యమదొంగ`, `మగధీర`, `మర్యాద రామన్న`,` ఈగ` వంటి చిత్రాలు.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన `శ్రీరామదాసు`, `పాండురంగడు`, `శిరిడి సాయి`, `ఝుమ్మంది నాదం`, `ఓం న‌మో వెంకటేశాయ‌` వంటి సినిమాలు ఆ మ్యూజిషన్ ప్ర‌తిభ‌ని చాటాయి. ఇక `బాహుబలి` సిరీస్‌తో అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కీర‌వాణి.

గాయ‌కుడిగా త‌న‌దైన ముద్ర‌

200కి పైగా చిత్రాలకి సంగీతమందించిన కీరవాణి కేవలం సంగీత దర్శకుడుగానే పరిమితం కాలేదు. పాట డిమాండ్ చేసిన ప్రతిసారీ గాయకుడు అవతారమెత్తారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన `ఈగ` మినహాయించి మిగిలిన అన్ని సినిమాలకూ తన గొంతుని సవరించి వినిపించే ప్రయత్నం చేసారాయన. గాయకుడుగా సరిపెట్టుకోకుండా.. సరదాగా లిరిక్స్ ని కూడా అందించే ప్రయత్నం చేసారు. అందమైన బాణిని ఇవ్వడమే కాకుండా.. దానికి మంచి సాహిత్యాన్ని కూడా రాబట్టుకోవడం అనే ఆర్ట్ ఏదైతే ఉందో అదే కీరవాణిలోని గీతరచయితని బయటకు తెచ్చి ఉంటుందన్నది ఆయన అభిమానుల మాట. ఇలా పాటకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, రైటర్.. ఇలా అన్ని యాంగిల్స్ ని టచ్ చేసి పాట పట్ల తనకున్న మమకారాన్ని చాటుకున్నారు మరకతమణి కీరవాణి.

మూడు త‌రాల వార‌ధి

కీరవాణికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. వాటిలో చెప్పుకోదగ్గది.. తన తరంలో ఏ స్వరకర్తకి దక్కని విధంగా మూడు జనరేషన్ హీరోల సినిమాల కోసం విడివిడిగా పని చేసి విజయాలను అందుకోవడం. మొద‌టి త‌రంలో మహానటుడు ఎన్టీఆర్ కాంబినేషన్ లో `మేజర్ చంద్రకాంత్`.. రెండో త‌రంలో బాలకృష్ణతో `బొబ్బిలి సింహం`, హ‌రికృష్ణ‌తో `లాహిరి లాహిరి లాహిరిలో`, `సీత‌య్య‌`.. మూడోత‌రంలో జూ. ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో `స్టూడెంట్ నెం.1`, `సింహాద్రి`, `యమదొంగ` వంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు స్వ‌రాలు అందించారాయన. అలాగే అక్కినేని కుటుంబంలోనూ.. మొద‌టి త‌రంలో ఏఎన్నార్‌తో ‘సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు’.. రెండో త‌రంలో నాగార్జున కాంబినేష‌న్‌లో ‘ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం, వార‌సుడు, అల్ల‌రి అల్లుడు, అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ దాసు’తో స‌హా ప‌లు విజ‌యవంత‌మైన సినిమాలు చేశారు. అలాగే ప్ర‌స్తుతం మూడో త‌రం క‌థానాయ‌కుడైన నాగ‌చైత‌న్య‌తో ‘స‌వ్య‌సాచి’ చేస్తున్నారు.

రీమిక్స్‌ల్లోనూ స్పెషాలిటీ

అలాగే తండ్రీ కొడుకులతోనూ వేర్వేరు సినిమాల కోసం హిట్లబాట పట్టిన ఘ‌న‌త కీర‌వాణికి ఉంది. ఎన్టీఆర్, బాలకృష్ణ లతో విడివిడిగా సక్సెస్లను చవిచూసిన కీరవాణి.. ఏఎన్నార్, నాగార్జునలతోనూ.. అలాగే చిరంజీవి, రామ్ చరణ్ లతోనూ.. అదే రూటులో విజయాలందుకున్నారు. తన పాటని తానే రీమిక్స్ చేసుకోవడం అనే కొత్త ఒరవడిని కూడా ఈ తండ్రీకొడుకుల సినిమాలకి పనిచేయడం అనే విభాగంతోనే తీసుకువచ్చారాయన. `ఘరానా మొగుడు`లోని `బంగారు కోడిపెట్ట`ని.. `మగధీర` చిత్రం కోసం రీమిక్స్ చేశారు. రెండు సందర్భాల్లోనూ ఘనవిజయాలనే అందుకున్నారు. ప్ర‌స్తుతం నాగార్జున ‘అల్ల‌రి అల్లుడు’ చిత్రంలోని `నిన్ను రోడ్డు మీద చూసినాది ల‌గ్గాయ‌త్తు` పాట‌ని.. ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య సినిమా ‘స‌వ్య‌సాచి’ కోసం రీమిక్స్ చేస్తున్నారు. త‌న పాట‌ని త‌నే రీమిక్స్ చేసుకోవ‌డం.. అన్న‌ది బ‌హుశా కీర‌వాణి విష‌యంలోనే సాధ్య‌మైంద‌నుకోవాలి.

‘స్టార్ సింగ‌ర్స్’ మేక‌ర్‌

పాత రోజుల్లో తమ పాటలని తామే పాడుకునేవారు మన స్టార్లు. ఆ తరువాత ఆ సంప్రదాయం రాన్రానూ తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు ఈ వాతావరణం అప్పుడప్పుడు కనిపిస్తోంది. అయితే ఇలా స్టార్ యాక్టర్లతో పాడించడం అనే విషయంలోనూ కీరవాణి తనవంతు ప్రయత్నం చేశారు. ఈ పర్వంలో భాగంగానే.. `క్షణక్షణం`లో `కో అంటే కోటి` అంటూ శ్రీదేవిలోని గాయనిని పరిచయం చేశారు. అలాగే `సీతారామరాజు`లో `వినుడు వినుడు` అంటూ సాగే సిగరెట్ పాటని నాగార్జునతో పాడించారు. ఇక జూ.ఎన్టీఆర్ లోని సింగ‌ర్‌ని `యమదొంగ` ద్వారా ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త కీర‌వాణిది.

‘నందీ’శ్వ‌రుడు

కీరవాణికి.. అవార్డులకి మంచి అనుబంధమే ఉంది. ముఖ్యంగా నంది పురస్కారంతో అయితే చక్కని చెలిమినే చేశారాయన. ‘రాజేశ్వరి కళ్యాణం, అల్లరి ప్రియుడు, పెళ్లి సందడి, ఒకటో నెంబర్ కుర్రాడు, ఛత్రపతి, వెంగమాంబ, బాహుబ‌లి’ సినిమాలకి ఉత్తమ సంగీత దర్శకుడుగా అవార్డులను పొందారాయన. ఆ సినిమాలకి ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా ఆ పురస్కారాలకు ఓ కారణంగా నిలిచింది. గాయకుడిగానూ కీరవాణి మూడు సార్లు నంది అవార్డులను అందుకున్నారు. ‘స్టూడెంట్ నెం.1’లోని `ఎక్కడో పుట్టి` పాట, ‘మర్యాద రామన్న’లోని `తెలుగమ్మాయి` , ‘బాహుబ‌లి’లో పాటలు సింగర్ గా కీరవాణికి పురస్కరాలు అందించాయి. గాయకుడిగా ఈ స్వరవాణికి దక్కిన మూడు అవార్డులు కూడా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమాలతో లభించడం విశేషం.

సంగీత దర్శకుడుగానూ, గాయకుడిగానూ కీరవాణి వ్య‌క్తిగ‌తంగా అవార్డులు అందుకున్నట్లే.. తను సంగీతమందించిన సినిమాలు చాలా వరకు ఉత్తమ చిత్రాల కేటగిరిలో అవార్డులు అందుకోవడం విశేషం. ‘సీతారామయ్య గారి మనవరాలు, అశ్వని, రాజేశ్వరి కళ్యాణం, ఆపద్బాంధవుడు, మిస్టర్ పెళ్లాం, మనీ, మాతృదేవోభవ, పవిత్ర బంధం, శ్రీకారం, అన్నమయ్య, వేదం, రాజన్న, ఈగ‌, బాహుబ‌లి’ వంటి కొన్ని ‘నంది’ ఉత్తమ చిత్రాలను ఈ జాబితాలో చేర్చుకోవచ్చు. తన తరంలోనే కాకుండా ఈ తరంలోనూ.. ‘ఉత్తమ సంగీత దర్శకుడు’ విభాగంలోనూ.. ‘ఉత్తమ చిత్రాల’ విభాగంలోనూ ఓ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఇన్నేసి సినిమాలు రాలేదనే చెప్పుకోవచ్చు.
ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ..

వరాల్లాంటి తన స్వరాలను కేవలం తెలుగుకే పరిమితం చేయలేదు కీరవాణి. తమిళంలో మరకద మణి పేరుతోనూ, హిందీలో ఎం.ఎం.క్రీమ్ పేరుతోనూ తన బాణీని రుచిచూపించారాయన. తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కిన ‘క్రిమినల్’ కోసం ‘తుమిలే’ అనే పాటతో హిందీనాట ఓ ముద్ర వేశారు కీరవాణి. `క్రిమినల్` తో పాటు ‘జఖ్మ్, జిస్మ్, పహేలీ’ వంటి మరికొన్ని హిందీ సినిమాల కోసం పనిచేశారాయన.

బాణీల విషయంలో తనకంటూ ఓ మార్క్‌ను సృష్టించుకున్న కీరవాణి.. విజయాలు, అవార్డులు, ప్రత్యేకతలు.. అనే అంశాల్లోనూ తన మార్క్ ని చాటుకున్నారు. రానున్న రోజుల్లోనూ ఈ `మెలోడీ బాహుబ‌లి` మ‌రిన్ని విజయాలను, అవార్డులను అందుకోవాల‌ని ఆశిస్తూ Wish You A Happy Birthday to Melody King M.M.Keeravani.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=9_QQZxACD-I]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here